Print this page..

సేంద్రీయ పద్ధతిలో ఖరీఫ్‌లో ఉల్లి సాగు

ఉల్లిగడ్డ ముఖ్యమైన సుగంధ ద్రవ్యాల్లో ఒకటి. ఉల్లిసాగులో మనదేశం ప్రధమ స్థానంలో ఉన్నప్పటికీ దిగుబడిలో చైనా దేశం తరువాత రెండవ స్థానంలో ఉంది. మనదేశంలో పండించే ఉల్లిలో అధిక భాగం మహారాష్ట్రలో నాసిక్‌ నుండే వస్తుంది. దీన్ని కూరగాయగా లేక ఇతర కూరగాయల్లో కలిపి వాడతారు. ఉల్లిలో ఘాటువాసన దానిలో ఉన్న ప్రొపైల్‌ డై సల్ఫేడ్‌ అనే పదార్ధం వల్ల వస్తుంది. ఎరుపు రంగు అంథోసమానిన్‌ వల్ల పసుపు రంగు క్వర్సిటిన్‌ అనే పదార్ధం వల్ల కలుగుతుంది. ఉల్లిలో ఉన్న రసాయనాలు, విటమిన్‌ ''సి'' రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తాజా ఉల్లిపాయలు రక్తంలో కొలస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. 

నేలలు : 

నీరు నిలవని అన్ని రకాల సారవంతమైన నేలలు అనుకూలం. ఇసుకతో కూడిన ఒండ్రు నేలలు, ఎర్ర దుబ్బు నేలలు మిక్కిలి అనుకూలం.

రకాలు : 

ఉల్లిలో ముఖ్యంగా ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి మరియు పసుపు పచ్చ ఉల్లి రకాలు కలవు.

ఎర్ర ఉల్లి రెడ్‌ రకాలు : 

ఎన్‌-53, పూసారెడ్‌, నాసిక్‌ రెడ్‌, హిస్సార్‌-2, పంజాబ్‌ సెలక్షన్‌

తెల్ల ఉల్లి రకాలు : 

పూసా తెల్ల ఫ్లాట్‌, పూసా వైట్‌ రౌండ్‌, పంజాబ్‌-48,ఉదయ్‌పూర్‌-102

పసుపు ఉల్లి రకాలు : 

ఎర్లిగ్రానో, బెర్ముడా ఎల్లో, ఆర్కా పీతాంబర్‌ యూరప్‌ దేశాలకు అనువైనది. తక్కువ ఘాటు కలిగి సలాడ్‌గా ఉపయోగిస్తారు.

విత్తన మోతాదు : 

ఎకరాకు 3-4 కిలోల విడిపాయలు అవసరం.

విత్తన శుద్ధి : 

2 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో పశువుల పేడ, 1 కిలో గట్టు మట్టి లేదా పుట్ట మట్టి, 150 గ్రా. ఇంగువను 100 లీటర్ల నీటిలో కలిపి ఉల్లిగడ్డలను, ఉల్లిగడ్డి నారును ఆ ద్రావణంలో 15-20 నిమిషాలు ముంచి నాటుకోవాలి. కిలో విత్తనానికి 8 గ్రా. ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తన శుద్ధి చేయాలి. 

విత్తే కాలం : 

ఖరీఫ్‌ కాలంలో జూన్‌-జులై నుండి అక్టోబరు వరకు రబీ కాలంలో నవంబరు-డిసెంబరు నుండి ఏప్రిల్‌ వరకు, వేసవి పంటగా జనవరి-ఫిబ్రవరిలో నాటుకోవచ్చు.

నారు పెంచడం : 

నేలను బాగా దున్ని ఆఖరి దుక్కిలో అధిక మోతాదులో పశువుల ఎరువు లేదా కంపోస్టు ఎరువు. ఘనజీవామృతం వేసి కలియదున్నాలి. కంపోస్టు ట్రైకోడెర్మావిరిడి, సూడోమోనాస్‌ కలిపి మగ్గించి ఎరువును వెదజల్లాలి. 120 సెం.మీ. వెడల్పు,  3 మీ. పొడవుగల నారుమళ్ళను తయారు చేసుకోవాలి. 2-2.5 కిలోల విత్తనాన్ని 200-250 చ.మీ. నారుమడిలో పెంచిన నారు ఒక ఎకరాల్లో నాటడానికి సిద్ధమవుతుంది. విత్తనశుద్ధి తప్పక చేయాలి. 4-6 రోజుల్లో విత్తనం మొలకెత్తుతుంది. నారు వారం రోజులు పెరిగిన తరువాత తొలిసారి వేపగింజల కషాయం పిచికారి చేయాలి. తరువాత నారు ఎదుగుదల కోసం వారానికొకసారి 3 శాతం పంచగవ్య, చేపలమినో యూసిడ్‌ ద్రావణం పిచికారి చేయాలి. 40-45 రోజుల్లో ఎదిగిన నారును ప్రధాన పొలంలో నాటాలి. 

ప్రధాన పొలం తయారీ : 

ప్రధాన పొలంలో అవకాశముంటే ముందుగా పచ్చిరొట్ట ఎరువు వేసి కలియదున్నాలి. ఎకరాకు 200కి. ఘనజీవామృతం 2500 కి. నాడెప్‌ కంపోస్టు ఎరువులో కలిపి ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. దుక్కిలో వరి ఊకను కాల్చిన బూడిద ఎకరాకు 2-3 టన్నులు వేసుకుంటే ఉల్లి దుంప ఊరడానికి అవసరమైన భాస్వరాన్ని అందించగలుగుతుంది. నీటిపారుదల వసతిని బట్టి బోదెలు లేదా మడులు కట్టుకోవాలి. స్ప్రింక్లర్లు లేదా మైక్రోస్పింక్లర్ల ద్వారా నీటిపారుదల సౌకర్యం కల్పించే వారు మీటరు నుండి రెండు మీటర్ల వెడల్పుతో బోదెలు తోలుకోవాలి. డ్రిప్పు ద్వారా నీరు పారించేవారు మడులు కట్టుకొని సాగు చేసుకోవాలి. 

నారు నాటడం : 

40-45 రోజులు ఎదిగిన నారును నారుమడి నుండి పీకి వేరు కొనలు కత్తిరించి బీజామృతం లేదా 5 శాతం పంచగవ్య ద్రావణంలో శుద్ధి చేసి ప్రధాన పొలంలో నాటుకోవాలి. ఎకరానికి 600 ఉల్లి గడ్డలను కూడా బోదెలు, సాళ్ళ పద్ధతిలో 40I15 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. నాటిన 10-20 రోజుల నుండి 200-400 లీటర్ల జీవామృతం 15 రోజుల వ్యవధిలో సాగు నీటి ద్వారా అందించాలి. మొక్కలు 15 రోజుల వయసులో ఉన్నప్పుడు పులిసిన చేపద్రావణాన్ని పిచికారి చేయాలి. 

నీటి యాజమాన్యం : 

నాటిన 60 రోజుల వరకు 12 నుండి 15 రోజుల వ్యవధిలో 4-5 తడులివ్వాలి. గడ్డి ఊరే దశలో 6-7 రోజుల వ్యవధిలో 7-8 తడులు ఇవ్వాలి. కోతకు 15 రోజులు ముందుగా నీరు పెట్టడం ఆపాలి.

అంతర పంటలు : 

ఉల్లి పంటలో మొక్కజొన్న అంతర పంటగా సాగు చేయవచ్చు. మడుల గట్లు వెంట కంది వేసుకోవచ్చు ఆవాలు, ధనియాలు, మెంతులు వంటి పంటలను అంతర పంటలుగా సాగు చేసుకుంటే ఉల్లి పంట మీద ఆశించే రసం పీల్చు పురుగులు సమర్థవంతంగా అరిక్టబడతాయి.

కోతలు : 

కూరగాయగా ఉపయోగించుటకు గాను కాడలు పెన్సిల్‌ మందంతో చిన్న గడ్డ కలిగి ఉన్నప్పుడు కోయాలి. ఇక ఉల్లి గడ్డల కోసం నాటిన 4 నెలలకు కోతకు వస్తుంది. కోత దశలో కాడలు పసుపు రంగుకు మారును మరియు ఉల్లిగడ్డపై పొలుసులు కొద్దిగా వదులుగా ఏర్పడడం జరుగుతుంది. పొలంలో త్రవ్వి గడ్డలను సేకరించాలి. సేకరించిన ఉల్లిని నీడలో 4-5 రోజులు ఆరనివ్వాలి. 

సరా సరి దిగుబడి : 

ఖరీఫ్‌ : 80-100 ట/ ఎకరం

రబీ : 120-140 ట / ఎకరం

సస్యరక్షణ : 

పురుగుల నివారణ : 

ఉల్లి పంట 15 రోజుల వయసులో ఉన్నప్పుడు మొక్కల ఆకులతో తయారు చేసిన పురుగు వికర్షిణి ద్రావణాన్ని పిచికారి చేయాలి. 

రసం పీల్చే పురుగులు : 

 • పంట చుట్టూ రక్షణ పంటగా జొన్న, మొక్కజొన్న లేదా సజ్జ పంట వేసుకోవాలి.
 • వేపగింజల కషాయం, కానుగ గింజల కషాయం లేదా ఉమ్మెత్త ఆకుల కషాయం పిచికారి చేయాలి. 
 • తామర పురుగు నివారణకు వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు వావిలాకు కషాయం పిచికారి చేయాలి. 
 • ఎకరాకు జిగురు పూసిన పసుపు, తెలుపు పళ్లాలను 15-20 వరకు అమర్చాలి. 
 • పేనుబంక నివారణకు 5 శాతం వేప గింజల కషాయం లేదా నామాస్త్రం పిచికారి చేయాలి. 

శనగపచ్చ పురుగు : 

 • ఎకరాకు 15 నుండి 20 వరకు పక్షిస్ధావరాలను ఏర్పాటు చేయాలి. 
 • ఎర పంటలుగా బంతి, ఆవాల మొక్కలను అక్కడక్కడా పొలంలో వేయాలి. 
 • పచ్చ పురుగు నివారణకు దశపత్ర కషాయం సమర్థవంతంగా పనిచేస్తుంది.

నులి పురుగులు : 

 • ఎకరాకు 80 కిలోల వేపపిండి వేయడం వల్ల నేలలో ఉన్న నులి పురుగులు, శిలీంద్రాలు నాశనం చేయబడతాయి.
 • ఉల్లి పంట వేయడానికి ముందుగా వేసే పచ్చిరొట్ట ఎరువుల పంటల్లో నువ్వు కలిపి సాగు చేసి దుక్కిలో కలియదున్నాలి. 
 • ఉల్లి సాగు చేసే క్రమంలో నువ్వు, బంతి మొక్కలు పెంచుకోవాలి. 

తెగుళ్ళ నివారణ : 

 • నారుకుళ్ళు తెగులు నివారణకు కిలో విత్తనాలను బీజామృతం / బీజరక్ష / పంచగవ్యతో శుద్ధి చేసి తరువాత 5 గ్రా. సుడోమోనాస్‌ లేదా ట్రైకోడెర్మా విరిడితో శుద్ధిచేయాలి. 
 • లీటరు నీటికి 2.5-3.0 గ్రా. వ్యామ్‌ కలిపి మొక్క చుట్టూ ఉన్న భూమిపై చల్లాలి.
 • బూడిద తెగులు నివారణకు 6 లీ. పుల్లటి మజ్జిగను 100 లీ. నీటిలో కలిపి ఎకరా పైరుపై పిచికారి చేయాలి. 
 • ఉల్లి పంటను తెగుళ్ళ బారి నుండి రక్షించడానికి కలబంద, దేశవాళీ వెల్లుల్లిలను నూరి నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టాలి. ఈ ద్రావణాన్ని 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి. నాటిన 15 నుండి 20 రోజుల వ్యవధిలో ఈ ద్రావణాన్ని పిచికారి చేయాలి.

రచయిత సమాచారం

బానోతు రాంబాబు, టీచింగ్‌ అసోసియేట్‌,  ఏకలవ్య ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌, పాలిటిక్నిక్‌, జింగుర్తి, వికారాబాద్‌, ఫోన్‌ : 8008866517