Print this page..

రైతులను ఉత్తేజ పరచిన నోవా కిసాన్‌ సేవా బృందం పర్యటన

కేవలం వ్యాపార ప్రయోజనం తప్ప, రైతుల సర్వతోముఖాభివృదికీ, సాగు యాజమాన్యానికీ ఏరకంగానూ తోడ్పడని కంపెనీలు అనేకంగా ఉన్న సమయంలో నోవా అగ్రిటెక్‌ కంపెనీ తన సామాజిక బాధ్యతను నెరవేర్చేందుకు 2011లో నోవా రైతు సేవా కేంద్రాన్ని కంపెనీ ప్రారంభించింది. కంపెనీ దార్శనిక యాజమాన్యం దాని అధినేత ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో ఈ సంస్ధను ప్రారంభించారు. అప్పట్లో కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రైతు సేవకే పరిమితమైన ఈ సేవా కేంద్రం ప్రస్తుతం భారతదేశంలోని 11 రాష్ట్రాలకు తన సేవలను విస్తరించింది. కేవలం ముగ్గురు వ్యవసాయ నిపుణులతో ప్రారంభమైన ఈ సేవా కేంద్రంలో ప్రస్తుతం 18 మందికి పైగా వ్యవసాయ పట్టభద్రులు నిరంతరం తమ సేవలను అందిస్తున్నారు. తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళ, మరాఠీ భాషల్లో రైతులతో నేరుగా మాట్లాడి వారి వ్యవసాయ సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలోనే మెరుగైన సాగు పద్ధతులను, ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న గుడ్‌ అగ్రికల్చరల్‌ ప్రాక్టీసెస్‌(గ్యాప్‌)ను, ఖచ్చిత వ్యవసాయ పద్ధతులను వివరిస్తూ, ప్రభుత్వాలు, బహుళజాతి సంస్థలు నిర్వహించలేని వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలను వినూత్నంగా చేపడుతున్నారు. 

జిల్లా, మండల స్థాయిల్లోని క్లస్టర్లు, చౌపాల్‌ల వ్యవస్థ ద్వారా వ్యవసాయ విస్తరణ జోరుగా నిర్వహిస్తూ, దేశం లోని వ్యవసాయ, అనుబంధ రంగాల మహత్తర ప్రస్థానంలో నోవా కిసాన్‌ సేవా కేంద్రం సంచలనాత్మక కార్మక్రమాలు నిర్వహిస్తూ, వినూత్నమైన ప్రక్రియల ద్వారా ప్రకంపనాలు సృష్టిస్తున్నారు. ఇప్పటి వరకు కనివిని ఎరుగని రీతిలో నోవా కిసాన్‌ సేవా కేంద్రం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలోని 5 లక్షల మంది రైతుల వివరాలను ఇంటర్నెట్‌లో నిక్షిప్తం చేసి వారితో వివిధ మార్గాల ద్వారా అందుబాటులో ఉన్నారు. ఒక నెలలో సుమారు 40 వేల మంది రైతులతో సంక్షిప్త సమాచార సందేశాలు, నేరుగా సంభాషణ, వీడియో కాలింగ్‌, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా సందేశాలు, మార్కెటింగ్‌ సిబ్బంది, డీలర్ల ద్వారా విజ్ఞాన అనుసంధానం కార్యక్రమాలను నిర్వహిస్తూ వినూత్నమైన సాంకేతిక విప్లవ ఫలితాలను రైతులకు అందచేస్తున్నారు. ఈ ప్రక్రియ వల్ల సెకన్లు, నిమిషాల్లో విజ్ఞాన సమాచారం రైతులను చేరడం, వారు దాన్ని అందుకొని సస్యవిప్లవ మార్గంలో పయనించడం జరిగిపోతున్నాయి. అంతేకాకుండా కంపెనీ, గ్రూపు సంస్థలు, అగ్రిక్లినిక్‌ మాసపత్రిక నిర్వహిస్తున్న వివిధ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వెబ్‌సైట్‌లలో వెలువడే సమాచారాన్ని సమూలాగ్రంగా సేకరించి రైతులకు అందచేయడం కర్తవ్యంగా నోవా కిసాన్‌ సేవా కేంద్రం పనిచేస్తుండడం కేవలం ఒక్క ఈ గ్రూపు సంస్థలకే కాకుండా యావత్‌ రైతాంగానికి వ్యవసాయం దండగ కాదు, పండగని నిరూపించే యజ్ఞంలో నోవా మొక్కల వైద్యులు (ప్లాంట్‌ డాక్టర్స్‌) విజయవంతంగా తమ విధులను నిర్వహిస్తూ కొత్త అధ్యాయానికి తెరలేపారు. 

నోవా కిసాన్‌ సేవా కేంద్రం కో-ఆర్డినేటర్లు చేస్తున్న ఈ కృషి కొనసాగించడంలో భాగంగా ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లోని గ్రామాల వ్యవసాయ క్షేత్రాలను ఈ బృందం సందర్శించింది. నిన్నటి వరకు వ్యవసాయ విద్యలో నిమగ్నమై కేవలం తరగతి రూములు, గ్రంధస్థ పఠనకు మాత్రమే పరిమితమైన వ్యవసాయ విద్యార్ధినులు నేడు ఒక బాధ్యతాయుత రూపంలో గ్రామాలకు తమ సేవలను విస్తరింప చేయడం, నేరుగా రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనుభవాలకు పదునుపెడుతున్నారు. నోవా అగ్రిటెక్‌ కంపెనీ కల్పించిన ఈ మహత్తర అవకాశంతో వ్యవసాయ నిపుణులు ద్విగుణీకృత ఉత్సాహంతో తమ సేవలను, విస్తరణ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ సందర్భంగా రైతులు, మార్కెటింగ్‌ సిబ్బంది, ఉపకరణాల అమ్మకందారులు వారి వారి అనుభూతులను పంట చేలలో ఒకరికొకరు పంచుకున్నారు. 

నోవా విత్తనోత్పత్తి - ముందడుగు : 

చాలా కాలంగా విత్తన రంగంలోకి అడుగిడి రైతులకు నాణ్యమైన విత్తనాలను సరఫారా చేయాలనే ఆకాంక్షతో నోవా అగ్రిటెక్‌ కంపెనీ నోవా గ్రూపు సంస్థలు చేస్తున్న ప్రయత్నాలకు ఈ సీజన్‌లో శ్రీకారం చుట్టడం జరిగింది. వాస్తవానికి మొదటి సస్యవిప్లవంతో ప్రభుత్వ ప్రోత్సాహంతో విత్తనోత్పత్తి జరిగి రైతులకు మేలు జరిగే సమయంలో సంస్కరణల యుగం ముందుకొచ్చింది. ఈ సంస్కరణల చాటున బహుళజాతి కంపెనీలు విత్తన రంగంపై తమ ఆధిపత్యాన్ని చాటుకొని కేవలం వాణిజ్య సరళిలోనే విత్తనోత్పత్తిని జరిపి రైతులకు తీరని అన్యాయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బిటి కాటన్‌ విత్తన రంగంలో జన్యుమార్పిడి తరువాత బహుళజాతి కంపెనీల ఆధిపత్యానికి అంతే లేకుండా పోయింది. ఇప్పటికే పలు వ్యవసాయ ఉపకరణాలు, ఎరువులు, పురుగు మందులు, సేంద్రియ ఉత్పాదనల ద్వారా రైతులను ఆకట్టుకొని పెను సంచలనం సృష్టించిన నోవా గ్రూపు సంస్థలు ఇకపై విత్తనోత్పత్తిపై దృష్టి సారించాయి. ఈ సీజన్‌లో మొక్కజొన్నలో ఆరు హైబ్రీడ్‌ రకాలు, పత్తిలో నాలుగు హైబ్రీడ్‌ రకాలను ప్రయోగాత్మకంగా పంట చేలలో నాటారు. 

ఇవన్నీ మంచి నాణ్యమైన దిగుబడులు లభించే విధంగా పంట చేలలో లక్షణాలను నోవా పరిశీలకులు గమనించారు. మొక్కజొన్న ముదురు ఆకుపచ్చ రంగులో బలమైన కాండంతో అత్యధిక కాపుతో చూడముచ్చట గొలుపుతుంది. అంచనా ప్రకారం ఈ విత్తనాల మొలక శాతం కూడా అధికంగా ఉండి, అత్యంత రోగనిరోధక శక్తిని పెంపొందించుకొని రైతుల పాలిట కల్పతరువుగా మారనున్నదని భావించడం జరుగుతుంది. 

పత్తిలో మొక్క అధికమైన కొమ్మలతో గుబురుగా పెరుగుతూ ఆకర్షణీయమైన అధిక పూతతో కనువిందు చేయడాన్ని గమనించారు. కామారెడ్డిలోని రైతు బాలిరెడ్డి నోవా కిసాన్‌ సేవా కేంద్రం బృందానికి స్వాగతం పలికి పత్తి రకాల ప్రగతి పట్ల హర్షం వ్యక్తం చేశారు. అలాగే ప్రయోగాత్మకంగా కంపెనీ అందచేసిన మొక్కజొన్న రకాన్ని అత్యుత్తమమైన విత్తన రకంగా పేర్కొంటూ తన క్షేత్రంలోకి స్వాగతం పలికారు. ఇతర హైబ్రీడ్‌ రకాలను ఇన్నేళ్ళుగా పంటపొలాల్లో చూసిన వాటి కంటే మెరుగైన మొలకశాతాన్ని గమనించి ఆనందించినట్లు తెలిపారు. అదేవిధంగా మెరుగైన రీతిలో ఇతర రకాల కంటే చీడపీడలను తట్టుకునే శక్తి, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొక్క జొన్నను పీడిస్తున్న కత్తెర పురుగు ప్రభావాన్ని అరికట్టగలిగినట్లుగా ఆయన భావించారు. ఇతర రకాలతో పోల్చుకుంటే నోవా అగ్రిటెక్‌ వారు విడుదల చేసిన పత్తిరకాల్లో రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగుల తాకిడి తక్కువగా ఉన్నట్లు గమనించారు. 

అనంతరం నోవా కిసాన్‌ సేవా కేంద్ర బృందం ఆర్మూరు మండలంలోని ప్రతిష్టాకరమైన వినూత్న వ్యవసాయానికి పేరెన్నికగన్న అంకాపూర్‌ గ్రామానికి చేరుకుంది. భారతదేశంలోనే రైతులు సంఘటితపడి వినూత్నమైన వ్యవసాయ ప్రక్రియల ద్వారా వ్యవసాయం దండగకాదు-పండుగని నిరూపించిన చోటకు అధ్యయన బృందం తరలివెళ్లింది. 

దేశంలోని రైతులను పట్టిపీడిస్తున్న వ్యవసాయ సంక్షోభాన్ని సహకార వ్యవస్థ ద్వారా సంఘటితపడి ఎలా నివారించుకున్నారో ఆ గ్రామ రైతుల అనుభవాల ద్వారా బృందం సభ్యులు గమనించడం జరిగింది. ప్రతి రైతు పొలంలోనూ పంట కుంటలు (ఫాంపాండ్స్‌) ద్వారా జరుగుతున్న నీటి యాజమాన్య పద్ధతులు విశేషంగా ఆకర్షించాయి. బిందు, తుంపర్ల సేద్యం ద్వారా విలువైన పంటలను ఎలా పండించుకోవచ్చో, నీటి ఆదా, ఖర్చు ఆదాలతో వ్యవపాయాన్ని  ఎలా అభ్యుదయ పథంలో ముందుకు తీసుకు వెళ్ళవచ్చో ఈ గ్రామం వెళ్లిన ప్రతి ఒక్కరూ తెలుసుకొని ఈ స్పూర్తిని ప్రచార సాధనాల ద్వారా మిగిలిన దేశానికి వ్యాపింప చేయడానికి కృతకృత్యులయ్యారు. 

ఇప్పటికే నోవా గ్రూపు సంస్థల కార్యకలాపాలు, ఆ సంస్థ గత 10 ఏళ్ళుగా ప్రచురిస్తున్న వినూత్న విజ్ఞాన హరివిల్లు అగ్రిక్లినిక్‌ మాసపత్రిక ద్వారా  స్పూర్తి పొంది వైద్యుడిగా ఉన్న గంగా మోహన్‌ అనే వ్యక్తి సంపూర్ణ వ్యవసాయ విజయ లక్ష్యంతో ముందుకు దూసుకువెళుతూ తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపద్యంలో నోవా కిసాన్‌ సేవా బృందానికి ఘనస్వాగతం పలికారు. 

మొక్కజొన్న, సోయా, వేరుశెనగ, వరి, పసుపు వంటి పంటలను పండిస్తూ వంగ, బెండ వంటి కూరగాయల సాగులో తనదైన శైలిలో సాగు బాగు కొరకు కృషి చేస్తూ వ్యవసాయానికి కొత్త శోభను కొనితెస్తున్నారు. పంటల్లో ఫిరమోన్‌ ట్రాప్స్‌ వినియోగం ద్వారా పురుగులు, తెగుళ్ళను నివారిస్తూ రసాయన రహిత ఆహారాన్ని ప్రజలకు అందచేస్తున్న ఆయన ఈ గ్రామంలో పలు పంటల ద్వారా విశేష ప్రాముఖ్యాన్ని పొందుతున్నారు. అదే విధంగా నీటి యాజమాన్య పద్ధతిలోనూ తన శైలిని ప్రదర్శించి అందరి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంకాపూర్‌ వ్యవసాయ ఉత్పత్తుల్లో కోడిమాంసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అంకాపూర్‌ బ్రాండు చికెన్‌కు రాజధాని హైదరాబాదులోనూ, జాతీయ స్థాయిలోనూ విశేష ఆదరణ లభించడం అక్కడి రైతుల వినూత్నమైన కృషి పుణ్యమే. 

నోవా బృందం పర్యటన సందర్భంగా నోవా మార్కెటింగ్‌, విస్తరణ సిబ్బంది తమ అంకాపూర్‌ రైతులకు చేస్తున్న విశిష్ట సేవలను రైతులు ప్రస్తుతించారు. ఈ అనుబంధాన్ని కొనసాగించేందుకు మరిన్ని సేవల తోడ్పాటుకు వారు అభ్యర్థించారు. ముఖ్యంగా ఆర్మూరు కేంద్రంగా పనిచేస్తున్న మార్కెటింగ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ తమకు తలలోని నాల్కలా అన్ని విధాలా తోడ్పడుతూ సహకరించడాన్ని వారు ప్రస్తావించి అభినందించారు. అంకాపూర్‌ పర్యటనకు ముందు నోవా కిసాన్‌ సేవా కేంద్ర బృందం సభ్యులు సదాశివనగర్‌లోని ధర్మారావుపేట గ్రామంలో వరి పంట క్షేత్రాలను సందర్శించారు.

తెగుళ్ళు, పురుగుల బెడద లేకుండా ఆహ్లాదకరంగా ఉన్న పంటను చూసి రైతులను అడిగినప్పుడు నోవా వారి ఓం-కె వినియోగం వల్ల తాము మంచి ఫలసాయాన్ని పొందగలమని పంట తీరును విశ్లేషించడం ద్వారా తమ అభిప్రాయాలను తెలియచేశారు. అదే విధంగా జిల్లాలోని తిమ్మాజివాడలో నోవా కంపెనీ ప్రయోగాత్మకంగా అందచేసిన ఎన్‌ఎఎస్‌సి - 9999 రకం పంట తీరును పరిశీలించారు. విస్తృతమైన కాత, పూతతో పచ్చగా ప్రకాశిస్తున్న పంట రైతుల కళ్ళల్లో ఆనందాన్ని నింపింది. 

ఉన్నత చదువరులు, మేధావులు, స్వయంగా వ్యవసాయం వృత్తిగా బ్రతికి దూరమైన వాళ్లు ఇన్నేళ్లుగా గ్రామ సీమలను, రైతులను, పంటలను పట్టించుకోకపోవడం, నగరాల్లో విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి కన్నతల్లిని, ఉన్న ఊరును మర్చిపోయిన నేటి యువతరం విద్యాధికులు నోవా కిసాన్‌ సేవా కేంద్రం బృందంగా తమ ప్రాంతాలకు తరలిరావడం గ్రామస్తులను, రైతులను ఎంతో ఆకట్టుకుంది. క్షామానికి నిలయమైన కామారెడ్డి ప్రాంతం ఇటీవల కురిసిన భారీవర్షాలతో మొలకెత్తిన పచ్చదనంతో ఆకుపచ్చ తివాచీలా మారిపోవడం, అందమైన పచ్చని పైరు పంట క్షేత్రాల్లోకి సీతాకోక చిలుకల్లా నోవా కిసాన్‌సేవా కేంద్ర బృంద సభ్యులు తరలిరావడం, పంటల యోగ క్షేమాలతోపాటు రైతుల స్థితిగతులు, పర్యావరణ పరిస్థితులు కనుగొని తిరిగి తమ కార్యాలయాలకు తరలివెళ్ళడం అటు రైతులను ఇటు వ్యవసాయ శ్రేయోభిలాషులను ఆకట్టుకుంది. తాము చదువుకున్న విద్యను సుసంపన్నం చేస్తూ ఇటువంటి పంట క్షేత్రాలలో సంచరించడానికి అనుమతిచ్చిన నోవా కంపెనీ యాజమాన్యానికి బృంద కో-ఆర్టినేటర్‌ ఉమామహేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తమ ప్రాంతంలో ఉన్న అంకాపూర్‌ రైతుల విజయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చినా తాము చూడలేకపోయామని ఇప్పుడు ప్రత్యక్షంగా తమ గ్రామాల్లో ఒక వ్యవసాయ నిపుణుల ¬దాలో పంటల పరిశీలనకు రావడం ఎంతో గొప్ప అనుభూతినిచ్చిందని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాకు చెందిన నోవా కిసాన్‌ సేవా కేంద్ర బృంద సభ్యులు కె. సంధ్య, కె. మౌనిక, సంధ్య కరుపాకుల సంతోషం వ్యక్తం చేశారు. అదేవిధంగా కళాశాల క్లాసు రూమ్‌లలో గ్రంధాల నుండి నేర్చుకున్నదానికంటే ఇటువంటి క్షేత్రప్రదర్శనలు తమ వృత్తికి చిరకాల గుర్తుగా మిగిలిపోతాయని మళ్ళీ గ్రామాల్లోని పాఠశాలలు, హైదరాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుభూతులు చిరకాలం గుర్తుండిపోయేలా ఇటువంటి మరిన్ని క్షేత్ర ప్రదర్శనలను ఆశిస్తున్నామని నవ్యశ్రీ తెలిపారు. అంకాపూర్‌ విజయగాధలు, ఉత్తర తెలంగాణ ప్రజల జీవన విధానంలో భాగమైన వరి, పత్తి, సోయా పంటల ప్రదర్శన తమను ఎంతో ఆకట్టుకున్నాయని సుష్మ, వెన్నెల తెలిపారు. 

భవిష్యత్‌లో నోవా గ్రూపు సంస్థలు అఖిల భారత స్థాయిలో చిరయసస్సును పొందడానికి మరిన్ని క్షేత్రప్రదర్శనలు అఖిల భారత స్థాయిలో నిర్వహించాలని వాటితోపాటు సమగ్ర గ్రంధాలయం, పరిశోధనల పత్రాలను, రైతుల విజయగాథలను తెలిపే వివరాలను అంతర్జాలంలో ఉంచి ఒక ఎన్‌సైక్లోపీడియాగా తీర్చిదిద్దేందుకు యువతరం ప్లాంటు డాక్టర్లుగా కృషిచేస్తామని స్వాతి, భవ్య, అఖిల, పి. మౌనిక, ఎల్‌. మౌనిక, హరిణి, సంజన తమ అనుభవాలను వ్యక్తంచేశారు. 

పర్యటించిన ప్రతి గ్రామంలో ప్రతి పంట స్థితిగతులను నిశితంగా పరిశీలించి అనంతరం వాటిపై కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్‌, మార్కెటింగ్‌ డైరెక్టర్‌ శ్రీకాంత్‌ సమీక్షలు నిర్వహించారు. ఇప్పటి వరకు సమాచార సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మాత్రమే సమాచారాన్ని రైతులకు చేరవేసే నోవా ప్లాంటు డాక్టర్ల బృంద సభ్యులు రైతులతో నేరుగా ముచ్చటించి ఉత్పాదకాల పనితీరును స్వయంగా అధ్యయనం చేయడానికి, మరింత మెరుగ్గా సేవలను అందించడానికి ఈ కార్యక్రమాన్ని వేదికగా మలచుకున్నారు. రైతులు, వర్తకులు, నిపుణులు ఒకే వేదిక పంచుకొని సమగ్ర సస్యయాజమాన్యం గురించి ఒక అవగాహనకు వచ్చి భవిష్యత్‌లో నోవా ప్రతిష్టాకరమైన              ఉత్పాదకాల నాణ్యతను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ఈ కార్యక్రమం నాంది పలికింది. కామారెడ్డి జిల్లాలోని వివిధ గ్రామాల్లో పంటలపై కనుగొన్న వివిధ చీడపీడల వివరాలు ముఖ్యంగా మొక్కజొన్నలో కత్తెర పురుగు, లద్దె పురుగు, పత్తిలో రసం పీల్చు పురుగులు, గులాబి రంగు పురుగు, పచ్చదోమ, పేను, తామర పురుగులను కనుగొన్నారు. అదేవిధంగా పసుపులో శనగపచ్చ పురుగు, బెండలో పచ్చపురుగులను కూడా కనుగొని వాటి నివారణకు, రైతులకు ముఖాముఖిగా వివరణ ఇచ్చారు. అదే విధంగా మిరపలో అత్యున్నత సమగ్ర సస్య యాజమాన్యానికి కావలసిన సూచనలను రైతులకు అందచేశారు. నోవా వారి ప్రతిష్టాకరమైన మిత్ర్‌, స్నైపర్‌, స్నాషర్‌, అజాద్‌, ఓం-కె, నోవా వండర్‌, నోవా ప్రోమ్‌, నోవా న్యూట్రిబూస్ట్‌, టెర్మినేటర్‌, కాస్మోప్లస్‌, ఫామ్‌జైమ్‌, ఫ్లై-ఎన్‌, ఎన్‌-కరేజ్‌ గోల్ట్‌, డిసైడర్‌ వంటి ఉత్పాదకాల వాడకాన్ని ప్రత్యక్షంగా వివరించారు. భవిష్యత్‌లో సస్యయాజమాన్యాన్ని సృజనాత్మకంగా, మరింత ఆచరణాత్మకంగానూ తీర్చిదిద్దేందుకు ఈ సదవకావాన్ని వినియోగించుకుంటున్నట్లు నోవా నిపుణుల బృందం ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. 

భవిఫ్యత్‌లో మరిన్ని క్షేత్రప్రదర్శనలు : 

- మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ. కిరణ్‌కుమార్‌

బహుళజాతి కంపెనీలకు ధీటుగా నోవా కిసాన్‌ సేవా కేంద్రాన్ని స్థాపించి, నవ్యవ్యవసాయ విజ్ఞానాన్ని అన్నదాతలకు చేరవేయడానికి నిరంతరం కృషి చేస్తున్న నోవా గ్రూపు సంస్థల చైర్మన్‌ ఏలూరి సాంబశివరావు దార్శనికతను ఈ సందర్భంగా కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎ. కిరణ్‌కుమార్‌ ప్రస్తుతించారు. నాణ్యమైన వ్యవసాయ  ఉపకరణాలను, ప్రతిష్టాకరమైన బ్రాండింగ్‌ మందులను రైతులకు అందచేస్తూ, పాలకులు, ప్రముఖ బహుళజాతి కంపెనీలు వదలివేసిన విస్తరణ బాధ్యతలను చేపట్టి కిసాన్‌ సేవా కేంద్రాన్ని నిర్వహించడం, దానికి సహకరిస్తూ, అగ్రిక్లినిక్‌ లాంటి ప్రతిష్టాకరమైన వ్యవసాయ మాసపత్రికను 10 ఏళ్ళుగా నిర్వహిస్తూ రైతులకు వెన్నుముఖగా నిలవడం సంతోషకరమని, లక్షల మంది రైతుల డేటాను నిక్షిప్తం చేసి నిరంతరం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రైతులకు మేలురకమైన వ్యవసాయ పద్ధతులను తెలియచేయడం గర్వకారణమని పేర్కొన్నారు. వ్యవసాయాన్ని పండుగలా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా చదువరులైన తమ మొక్కల వైద్యులను మరింత నిపుణులుగా తయారుచేసి, మెరుగైన వ్యవసాయ పద్ధతులను రైతులకు అందచేసేందుకు బాసటగా నిలబడతామని కిరణ్‌ తెలిపారు. 

ఈ ప్రదర్శనలో నోవా అగ్రిటెక్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ యెనిగళ్ళ శ్రీకాంత్‌, ప్రాంతీయ మేనేజర్‌ ఎస్‌. సాయిలు, ప్రొడక్ట్‌ మేనేజర్‌ పి. వెంకటనారాయణ మరియు ఇతర సిబ్బంది, పలు గ్రామాల రైతులు విస్తృతంగా పాల్గొన్నారు.

రచయిత సమాచారం

- వై.వి. నరసింహారావు, అసోసియేట్‌ ఎడిటర్‌