Print this page..

ఖరీఫ్‌ వరి నాట్లు - యాజమాన్య పద్ధతులు

తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను ఉపయోగించుకొని రైతులు నాటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం వరి నాట్లు వేసే ప్రధాన పొలం తయారీ మరియు తదనంతరం చేపట్టవలసిన యాజమాన్య పద్ధతుల గురించి వివరించడం జరిగింది.

ప్రధాన పొలం తయారీ : 

నాట్లు వేయడానికి 15 రోజుల ముందుగానే గట్ల మీద ఉన్న కలుపు మొక్కలను ఫారాక్వాట్‌ అనే కలుపు మందును 8-10 మి.లీ. ఒకలీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. దీనివల్ల కలుపు ద్వారా వ్యాపించే తెగుళ్లను అరికట్టవచ్చు. సుమారు 10 రోజుల ముందుగానే పొలాన్ని దమ్ము చేయుట ప్రారంభించాలి. 1-2 దఫాలు మురగ దమ్ము చేసుకోవాలి. చివరి దఫా దమ్మును నాట్లు వేసుకునే ముందు రోజు గాని లేదా అదే రోజు గాని చేసుకోవాలి. వరి మాగాణుల్లో వేసిన జిలుగ లేదా జనుము లేదా పెసర లాంటి పచ్చిరొట్ట పైరులను 35-40 రోజుల తరువాత భూమిలో కలియదున్నాలి. ఈ పచ్చిరోట్టపైర్లు మురగడానికి పూర్తీ భాస్వరం ఎరువును (125 కిలోలసింగిల్‌ సూపర్‌ ఫాస్పేట్‌) దుక్కిలోనే వేసుకోవడం వాళ్ళ భూసారం పెరిగే అవకాశం ఉంది. నల్ల రేగడినెలల్లో పూర్తి పొటాష్‌ ఎరువును (30 కిలోల మ్యూరేట్‌ అఫ్‌ పోటాష్‌ ) వేసుకోవాలి. నత్రజని మూడు సమ దఫాలుగా వేయాలి. మొదటి దఫా నత్రజని ఎరువును కాంప్లెక్సు ఎరువుల రూపంలో లేదా యూరియా రూపంలో (35 కిలోలు) వేసుకోవాలి.

నాట్లు :

నాలుగు నుండి ఆరు ఆకులు గల 25-30 రోజుల వయసున్న నారును నారుకొనలను తుంచివేసి పైపైన నాటుకోవాలి. పైపైన నాటుకోవడం వల్ల పిలకలు పెరిగే అవకాశం ఉంది. నాటిన తరువాత లేదా నాటేటప్పుడు ప్రతి 2 మీటర్లకు 30 సెం.మీ. కాలిబాటలు తీయడం వల్ల పైరుకు గాలి, వెలుతురు బాగాతగిలి చీడపీడల ఉధృతి తగ్గేఅవకాశం ఉంటుంది.

కొన్ని ప్రాంతాల్లో కూలీల కొరత ఉండడం వల్ల సకాలంలో నాటు వేసుకోకపోతే నారు ముదిరిపోయే అవకాశం ఉంది. ఈ ముదిరిన నారును నాటే సందర్భంలో కుదుళ్ళ సంఖ్యను పెంచి కుదురుకు 4-5 మొక్కలు నాటుకోవాలి. అలాగే నత్రజని ఎరువును సిఫారసు కంటే 25 శాతం పెంచి ( అదనంగా 25 కిలోల యూరియా పెంచి) రెండు దఫాల్లో (దమ్ములో మరియు దుబ్బు చేసేదశలో) వాడుకోవాలి.

ఎరువుల యాజమాన్యం :

రెండవ దఫా నత్రజనిని దుబ్బు చేసే దశలో (35 కిలోల యూరియా) మరియు మూడవ దఫా నత్రజనిని అంకురం ఏర్పడే దశలో (35 కిలోల యూరియా) పూర్తిగా నీటిని తీసివేసి బురద పొలంలో సమానంగా వెదజల్లుకోవాలి. చల్కా (తేలిక) నెలల్లో15 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పోటాష్‌ను దమ్ములో మరొక 15 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పోటాష్‌ను అంకురం ఏర్పడే దశలో యూరియాతో కలిపి చల్లుకోవచ్చు.

ప్రస్తుతం నెలకొన్న మబ్బు వాతావరణం లోపం వల్ల జింక్‌ లోప లక్షణాలు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల ఆకుల మీద తుప్పు రంగు మచ్చలు ఏర్పడడం వల్ల మొక్క ఎదుగుదల లోపించే అవకాశం ఉంది. దీని నివారణకుగాను జింక్‌ సల్ఫేట్‌ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసుకోవాలి.

కలుపు యాజమాన్యం :

వరి నాటిన 4-6 రోజుల్లో పెటిలాక్లోర్‌ (0.5 లీ.) లేదా ఆక్సాడయార్జిల్‌ 35-40 గ్రాములు కలుపు మందును 20 కిలోల ఇసుకలో కలిపి లేదా పెటిలాక్లోర్‌ + పైరజోసల్ఫ్యూరాన్‌ ఇథైల్‌ 4 కిలోల గుళికలను చల్లుకోవాలి. 

వరి నాటిన 15-20 రోజుల్లో ఉదా, తుంగ, వెడల్పాటి కలుపు మొక్కలు నివారణకు గాను మెటా సల్ఫ్యూరాన్‌ మిథైల్‌ + క్లోరి మ్యూరన్‌ మిథైల్‌ (ఆల్‌ మిక్స్‌) 16 గ్రాములు 200 లీటర్ల  కలిపి లేదా బెన్‌ సల్ఫ్యూరాన్‌ మిథైల్‌ (లొండాక్స్‌) 40 గ్రాములు కలుపు మందును 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలి  లేదా సైహాలో ఫాప్‌-పి-బుటైల్‌(క్లించర్‌) 250 మి.లీ. మందును 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.

వరినాటిన 25-30 రోజులకు 2, 4- డి సోడియం సాల్ట్‌ (ఫెర్నాక్సోన్‌) అనే కలుపు మందును 500-600 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారి చేసుకోవాలి.

నీటి యాజమాన్యం :

నాట్లు వేసేటప్పుడు నీరు పలుచగా ఉండాలి. ఏనుకున్న రోజునుండి పైరు దుబ్బు చేయడం పూర్తియ్యే వరకు పొలంలో పలుచగా అంటే 2-3 సెం.మీ., చిరు పొట్ట దశ నుండి గింజ గట్టిపడే వరకు సుమారు 5 సెం.మీ నీటి మట్టం ఉండేటట్లు చూసుకోవాలి. కోతకు 10 రోజుల ముందుగ నీటిని నెమ్మదిగా తగ్గించి ఆరబెట్టాలి.

సస్యరక్షణ చర్యలు :

చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యంగా పూర్తవుతున్నాయి. దీనివల్ల వరిలో ఉల్లికోడు  మరియు కాండం తొలిచే పురుగు ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కాండం తొలుచే పురుగు మరియు ఉల్లికోడు నివారణకు గాను పిలకల నుండి దుబ్బుచేసే దశలో ఉన్న వరి పైర్లలో తప్పనిసరిగా నాటిన 25-30  రోజుల్లోపు ఎకరానికి కార్భోఫ్యూరాన్‌ 3జి 10 కిలోలు లేదా కార్టాప్‌ హైడ్రో క్లోరైడ్‌ 4జి 8 కిలోలు లేదా క్లోరాన్తానిలిప్రోల్‌ 0.4 జి గుళికలు 4 కిలోలు నీరు పలుచగా ఉంచి పొలం అంతట సమానంగా చల్లుకోవాలి. 

40-45 రోజులు దాటినా పైర్లలో అంకురం నుండి చిరుపొట్ట దశలో ఉన్న చోట ఆకుముడుత లేదా కాండం తొలిచే పురుగు గమనిస్తే  కార్టాప్‌ హైడ్రో క్లోరైడ్‌ 2 గ్రాములు లేదా క్లోరాన్తానిలిప్రోల్‌ 20 ఎస్‌.పి. 0.3 మి.లీ  ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

సుడిదోమ : 

నాటిన 45-50 రోజులప్పుడు కనిపించే అవకాశం ఉంది. పిల్ల మరియు తల్లి పురుగులు గుంపులు గుంపులుగా నీటి మట్టం పై భాగంలో దుబ్బుల నుండి రసాన్ని పీల్చుతాయి. దీని నివారణకు గాను పొలాన్ని ఆరబెట్టి ఎకరానికి ఇతోపెన్‌ ప్రాక్స్‌ 2 మి.లీ. లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా బ్యుప్రోఫేజిన్‌ 1.6 మి.లీ. లేదా డైనోటేఫ్యూరాన్‌ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 

తొలిదశలో దోమ ఉదతికి దోహదపడే పురుగు మందులైన క్లోరిఫైరిఫాస్‌, ప్రాఫినోఫాస్‌ మరియు సింథటిక్‌ పైరిథ్రాయడ్‌ను, సిఫారసు చేయని బయో మందులను ముఖ్యంగా సెప్టెంబర్‌లో వాడకూడదు.

అగ్గితెగులు :

ఈ తెగులు నివారణకు ఐసోప్రోథయోలిన్‌ 300 మి.లీ. ఎకరాకు లేదా కాసుగా మైసిన్‌ 500 మి.లీ. ఎకరాకు పిచికారి చేయాలి.

రచయిత సమాచారం

డి. అనీల్‌, శాస్త్రవేత్త (అగ్రనామి), డా|| శ్రీధర్‌ సిద్ది, శాస్త్రవేత్త (ప్లాంట్‌ బ్రీడింగ్‌), వ్యవసాయ పరిశోదనస్థానం, కూనారం,  జి. రంజిత్‌ కుమార్‌ (సాయిల్‌ సైన్స్‌), నార్మ్‌, హైదరాబాద్‌.