Print this page..

వివిధ పంటల్లో ఉప మరియు సూక్ష్మపోషకాల లోప లక్షణాలు - నివారణ చర్యలు

మొక్కలు ఆహారాన్ని ధాతువుల, పోషకాలు, సమ్మేళనాల రూపంలో తీసుకుంటాయి. మొక్కలు పెరగడానికి, ప్రత్యుత్పత్తికి 18 పోషకాలు తప్పనిసరిగా అవసరమని శాస్త్రజ్ఞులు నిర్థారించారు. కార్బన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌ ధాతువులను మొక్క సహజంగా గాలి నుండి, నీటి నుండి తీసుకుంటుంది. నత్రజని, భాస్వరం, పొటాష్‌ ముఖ్యపోషకాలుగాను, కాల్షియం, మెగ్నీషియం, గంధకం ఉపపోషకాలుగాను, జింకు, రాగి, ఇనుము, మాంగనీసు, బోరాన్‌. మాలిబ్డినంక్లోరిక్‌, సోడియం, కోబాల్డ్‌ సూక్ష్మపోషకాలుగాను విభజించారు. ఇది నేల నుండి, సాగు నీటి నుండి కొంత మేరకు అందుతున్నప్పటికీ ఆశించే దిగుబడులు పొందడానికి సరిపోవు. 

రైతులు సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టక సాంధ్ర వ్యవసాయ ఫలితంగా పోషక అవసరాలకు నేలపై ఒత్తిడి పెరిగింది. సేంద్రియ ఎరువుల వాడకం తగ్గి, క్రమేణ నేలలోని నిల్వలు తగ్గిపోయి ఉప పోషకాలు, సూక్ష్మపోషకాల లోపాలు ఒక్కొక్కటి క్రమంగా కనిపించ సాగాయి. ఇవి కొద్ది పరిమాణంలో కావల్సినప్పటికి వీటి ప్రాధాన్యం తక్కువ కాదని దిగుబడిపై వీటి ప్రభావం గణనీయంగా ఉంటుందని ఆవశ్యకతలో మిగతా పోషకాలకు ఏ మాత్రం తక్కువ, ఎక్కువ కాదని పరిశోధన ఫలితంగా తెలిసింది. ఏ ఒక్క ఉప, సూక్ష్మపోషక లోపమున్నప్పటికి ముఖ్యపోషకాలు మొక్కకు ఎంత పరిమాణంలో అందించినప్పటికీ సరైన ఫలితానివ్వక దిగుబడి తగ్గుతుంది. కాబట్టి వీటిని రసాయనాల ద్వారా మరియు సరైన సమగ్రపోషక యాజమాన్యం ద్వారా భర్తీ చేయవలసిన అవసరం ఏర్పడింది. 

పోషక లోప లక్షణాలు : 

కాల్షియం : 

మొక్క కాల్షియం (జaంం) ధాతు రూపంలో తీసుకుంటుంది. ఇది లోపించినప్పుడు లేత ఆకులు ముడుచుకొని వంకరలు తిరుగుతాయి. ఆకుల కొనల నుండి అంచుల వెంబడి ఎండిపోతుంది. వేరుశనగలో తప్పకాయలు ఏర్పడతాయి. వేరు పెరగదు. కాండం బలహీనంగా ఉంటుంది. కాల్షియం ఆవశ్యకత ఆమ్ల నేలల్లోను, క్షార నేలల్లోను అధికంగా ఉంటుంది. 

పోషక లోప నివారణ : 

ఆమ్ల భూముల్లో కాల్షియం అందించడానికి లైమ్‌ (కాల్షియం కార్బోనేట్‌) క్షార భూముల్లో జిప్సమ్‌ (కాల్సియం సల్ఫేట్‌) వాడాలి. నూనె గింజల పైర్లకు పప్పుధాన్యాలకు, పండ్ల తోటలకు కాల్షియం, గంధకం చౌకగా అందించే జిప్సం వేసి మంచి ఫలితాలు పొందవచ్చు. కాల్షియం, అమ్మోనియం నైట్రేట్‌లో 20 శాతం, సూపర్‌ఫాస్ఫేట్‌లో 21 శాతం కాల్షియం ఉంది. 

మెగ్నీషియం : 

మొక్క మెగ్నీషియం (వీస్త్రంం) ధాతు రూపంలో తీసుకుంటుంది. ఈ పోషకం లోపించినప్పుడు ప్రారంభంలో ముదురు ఆకులు అంచులు, అంచుల సమీపంలో ఈనెల మధ్యభాగం పాలిపోయి ఈనెలు ఆకుపచ్చగానే ఉంటాయి. లోపం తీవ్రంగా ఉన్నప్పుడు ఆకులోని మచ్చలు పసుపు రంగుకు మారి పండిపోయినట్లు కనిపిస్తాయి. పత్తిలో ఆకులు ఎర్రబడడం లేదా ఊదా రంగుకు మారతాయి. తేలిక నేలల్లో తక్కువగా, బరువు నేలల్లో అవసరమైనంతగానూ ఉంటుంది. 

పోషక లోప నివారణ : 

మెగ్నీషియం లోప సవరణకు లీటరు నీటికి  10 గ్రా. మెగ్నీషియం సల్ఫేట్‌ పైరు వేసిన 45 మరియు 90 రోజుల తరువాత మూడుసార్లు పిచికారి చేయాలి. డోలమైటు మాగ్నసైటు రసాయనాలు కూడా వాడవచ్చు. 

గంధకం : 

మొక్క గంధకం సల్ఫేటు 504 రూపంలో తీసుకుంటుంది. సాధారణంగా నీటిలో కొట్టుకుపోయే స్వభావం కలది. గంధకం లోపించినప్పుడు లేత ఆకులు, ఆకుపచ్చ రంగు కోల్పోయి పాలిపోయినట్లు కన్పిస్తాయి. కాండం సరిగా పెరగదు. మొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది. పూత రావడం ఆలస్యమవుతుంది. పప్పుజాతి పైర్లు వేర్లకు ఉండే బుడిపెల సంఖ్య తగ్గిపోతుంది. 

పోషక లోప నివారణ : 

గంధకం లోపించిన నేలలకు గంధకం ఉన్న ఎరువులను ఎంపిక చేసుకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. అమ్మోనియం సల్ఫేట్‌-24 శాతం,  సూపర్‌ ఫాస్ఫేట్‌-12 శాతం, పొటాషియం సల్ఫేట్‌-18 శాతం, అమ్మోనియం ఫాస్ఫేట్‌సల్ఫేట్‌-15 శాతం, జిప్సమ్‌-18 శాతం, డిఎపి-3 శాతం, టన్ను పశువుల ఎరువు-1.5 కిలోలు.

జింకు : 

మొక్కలు జింకు ్గఅంం ధాతు రూపంలో తీసుకుంటాయి. జింకు లోపం వల్ల లేత ఆకుల్లో ఈనెలు మధ్య భాగాలు పసుపు రంగుకు మారడం కొన్ని సందర్భాల్లో కణజాల క్షయం (నెక్రోసిస్‌) జరగడం, ఆకుల చివర్లలో ఈనెలకిరువైపులా తుప్పు మచ్చలు ఏర్పడడం మొక్కలు గిడసబారి ఎదుగుదల తగినంతగా లేకపోవడం, కణుపుల పొడవు తగ్గి ఆకులు గుబురుగా ఉండడం పూత ఆలస్యం కావడం జరుగుతుంది.

పోషక లోప నివారణ : 

జింకుసల్ఫేటు నేలకు వేసి గాని, ద్రావణాన్ని పైరుపై పిచికారి చేసి గాని లోపాన్ని నివారించవచ్చును. నేలలో వేసిన జింకు పోషకానికి కదలిక చాలా తక్కువ. నీటిలో కొట్టుకుపోయే స్వభావం లేదు. సాధారణ నేలలకు ఎకరానికి 20 కిలోల జింక్‌ సల్ఫేట్‌ వేయాలి. ఇది 2-3 పంటలకు సరిపోతుంది. పైరుపై లోప లక్షణాలు గుర్తించినట్లయితే 0.2 శాతం ద్రావణాన్ని 4-5 రోజుల తేడాతో 2-3 సార్లు మొక్క బాగా తడిసేటట్లు పిచికారి చేయాలి. చెట్టు వయసును బట్టి పండ్ల తోటలకు చెట్టుకు 150-200 గ్రా. జింక్‌ సల్ఫేట్‌ను చెట్టు పొదల్లో వేసి నీరుపెట్టాలి. 

ఇనుము : 

మొక్కలు ఇనుము ఖీవంం ధాతువు రూపంలో తీసుకుంటాయి. ఇనుము లోపించినప్పుడు ఆకులోని పచ్చని పదార్ధం (పత్రహరితం) కోల్పోతుంది. ఈనెల మద్యభాగం పసుపుగా మారుతుంది. దీన్ని ఐరన్‌క్లోరోసిస్‌ అంటారు. లోపం తీవ్రమయ్యే కొద్ది క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఆకుల కొనలు ఎండిపోతాయి. లేత ఆకుల్లో లోపలక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. 

పోషక లోప నివారణ : 

ఇనుము లోపనివారణ ఆకులు పూర్తిగా తెల్లగా మారిన తరువాత సాధ్యం కాదు. అన్నబేధి (ఫెర్రస్‌ సల్ఫేటు) నేలకు వేసి గాని, ద్రావణాన్ని పైరుపై పిచికారి చేసిగాని నివారించవచ్చు. 5 గ్రా. అన్నబేధి, 1 గ్రా. నిమ్మఉప్పు (సిట్రిక్‌ ఆమ్లం) లీటర నీటిలో కలిపిన ద్రావణాన్ని వాడాలి. 

బోరాన్‌ : 

మొక్కలు బోరాన్‌ (న3దీూ3) బోరేట్‌ రూపంలో తీసుకుంటాయి. పత్తి, వేరుశెనగ, పండ్లతోటల్లో లోపం కనిపిస్తుంది. లేత చిగురు ఆకులు మెలితిరిగి చనిపోవడం, ఎదుగుదల సరిగాలేకపోవడం,            వేళ్ళు వృద్ధి చెందకపోవడం, ఆకులు మందంగా, ఈనెలు లావుగా, పూత, పిందె రాలిపోవడం, కాయలు పగుళ్ళు బారడం, వేరుశనగలో తక్కువ ఊడలు దిగడం, కాయలు డొల్లగా తయారై పప్పు నల్లగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

పోషక లోప నివారణ : 

బోరాన్‌ నేలకు వేసిగాని, పైరుపై పిచికారి చేసిగాని లోపం నివారించవచ్చు. ఎకరానికి 4 కిలోల బోరాక్స్‌ (సోడియం టెట్రా బోరేట్‌) నేలకు వేసి లోపం రాకుండా చేయవచ్చు. మొక్కలపై 0.1 నుండి 0.15 శాతం బోరాక్స్‌ లేదా బోరిక్‌ యాసిడ్‌ ద్రావణాన్ని పిచికారి చేసి లోపాన్ని సరిదిద్దవచ్చు.

మాలిబ్డినం : 

మొక్కలు మాలిబ్డినంను (వీ0ూ4)రూపంలో తీసుకుంటాయి. మొక్క సరిగా ఎదగక పసుపురంగుకు మారి నత్రజని లోప లక్షణాలు పోలిఉంటుంది. ఆకుల్లో ఈనెల మధ్య పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకుల అంచుల్లో కణజాలక్షయం ఏర్పడుతుంది. ఆకులు గోధుమ రంగుకు మారడం కంకుల్లో తాలు గింజలు ఏర్పడడం జరుగుతుంది. కాలిఫ్లవర్‌లో ఆకులు ఎండిపోయి తోకగా (విప్‌టెయిల్‌) మారడం జరుగుతుంది. 

పోషక లోప నివారణ : 

ఎకరాకు 400 గ్రా. సోడియం మాలిబ్డేట్‌ లేదా అమ్మోనియం మాలిబ్డే నేలకు వేసి లోపాన్ని సరిదిద్దవచ్చును. పైరుపై 0.05 నుండి 0.1 శాతం ద్రావణాన్ని పిచికారి చేసి లోపాన్ని సవరించవచ్చు.

సూక్ష్మ పోషక లోప నివారణలో పాటించాల్సిన అంశాలు :

  • పైరులో సూక్ష్మపోషకాల లోపాన్ని సవరిస్తేనే, మిగిలిన పోషకాలను పైరు సమర్ధవంతంగా తీసుకోగలదు. 
  • మట్టి నమూనాల విశ్లేషణ, మొక్క ఆకు భాగాల విశ్లేషణ చేసిన పిదప ఖచ్చితమైన లోప నిర్ధారణ చేసి అవసరమైన నివారణ చర్యలు చేపట్టవలయును. 
  • ముఖ్య పోషకాల సిఫారసులతో పాటు సూక్ష్మపోషకాలను కూడా ఎరువుల ప్రణాళికలో చేర్చాలి. 
  • సూక్ష్మ పోషకాల లోపాన్ని సవరించని పరిస్థితుల్లో కలిగే నష్టం కన్నా, అనవసరంగా వేసినప్పుడు కలిగే నష్టం ఎక్కువ. 
  • సూక్ష్మపోషకాల లోపాలను సవరించడానికి లవణాలను (ఇన్‌ఆర్గానిక్‌ సాల్ట్స్‌) లేదా చీలేట్లను ఆర్గానిక్‌ మాలిక్యూల్‌తో కలసిన పోషకాలను ఉపయోగించవచ్చు. ఇవి నేలకు పైరుపై పిచికారికి పనికివస్తాయి. 
  • రైతులు సూక్ష్మపోషకాలు వాడే విధంగా చైతన్యపరచాలి.
  • జింకు, ఇనుము పోషకాలను సాధారణంగా ఈ.డి.టి.ఏ (ఎథిలీన్‌ డై అమైన్‌ టెట్రా అసిటిక్‌ యాసిడ్‌) ఆర్గానిక్‌ రసాయనంతో కలిపి చీలేట్లను తయారుచేస్తారు. 
  • సూక్ష్మపోషకాల వాడకంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు స్థానిక వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలి. 
  • సాధ్యమైనంత వరకు సేంద్రియ ఎరువులను వాడినట్లయితే సూక్ష్మపోషకాల లోపాలు పంటలపై రాకుండా చూసుకోవచ్చు.

రచయిత సమాచారం

డా|| యస్‌. జాఫర్‌బాష, యస్‌ బాలాజి నాయక్‌, యమ్‌. సుబ్బారావు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, నంద్యాల, కర్నూలు