Print this page..

గొర్రెల్లో పొట్ట జలగలు

పొట్ట జలగలు (ఆంఫీ స్తోమ్స్‌) అనే నత్తలు ముఖ్యముగా పశువుల్లో, గొర్రెల్లో ఉంటాయి. వీటిలో రెండు రకాల జలగలు  ఉంటాయి అవి పెద్ద పొట్ట జలగలు, పిల్ల పొట్ట జలగలు. పెద్ద జలగలు నెమరు వేసే పొట్టలో ఉండును. పిల్ల జలగలు చిన్న ప్రేగుల మొదటిభాగంలో ఉండును. పిల్ల పొట్ట జలగలు వల్ల ఎక్కువగా జీవాల ఆరోగ్యంను దెబ్బతీస్తాయి. రైతులు పట్టించుకోకపోతే 10 రోజులలోపు మరణాలు వచ్చే అవకాశం ఉంది.

జలగల వ్యాప్తి :

ముఖ్యంగా ఈ జలగల జీవితం నత్తల పైన ఆధారపడి ఉంటాయి. నత్తలు ఎక్కువగా నీరు నిల్వ ఉండే ప్రదేశాల్లో నీటి పారుదల ఉండే కాలవల్లో, తడి నేలలో, వంతెన చివరల్లో మరియు గుంతల్లో ఉండి మొక్కలకు అతుక్కుని జీవిస్తూ ఉంటాయి. పెద్ద జలగలు నెమరు పొట్టలో ఉండి వాటి గుడ్లను పేడ ద్వారా విడుదల చేస్తాయి. తడిగా ఉండే వాతావరణం ఉన్నప్పుడు అవి పురుగులుగా మారి నత్తల్లోకి చేరతాయి. తరువాత ఈ పురుగులు పెద్దవిగా మారి నత్తలు అంటుకునే మొక్కలకు ఇవి కూడా అంటుకుని ఉంటాయి. ఎప్పుడయితే ఈ మొక్కలను జీవాలు తిన్నప్పుడు అవి మొదటగా చిన్న ప్రేగుల్లోకి చేరి పెరిగి ఆ తరువాత నెమరు పొట్టలోకి చేరి పెద్దవిగా మారి గ్రుడ్లను పేడలోకి విడదల చేస్తాయి. 

జలగలు జీవాల శరీరంలోకి చేరినప్పుడు కనిపించే లక్షణాలు :

 • నిరంతరంగా పారడం.
 • భరించలేని వాసనతో కూడిన విరేచనాలు కావడం.
 • గొంతు క్రింద నీరు చేరినట్లు ఉండే వాపును గమనించడం.
 • ఆకలి మందగించడం, బరువు తగ్గడం మరియు నీరసంగా మారడం.

శవపరీక్ష చేసినప్పుడు కనిపించే లక్షణాలు :

 • కోసినప్పుడు చర్మం క్రింద నీరు ఎక్కువగా చేరి ఉండడం మరియు శరీరం లోపల ఉండే గుండె, ఊపిరితిత్తుల మరియు ఇతర గదుల్లో కూడా నీరు ఉండడం.
 • జిగురుతో లేదా చీముతో కలసిన క్రొవ్వును లోపల అవయవాల పైన ఏర్పడడం 
 • చిన్న ప్రేగు మొదటి భాగము లావుగా మారి  పసుపు రంగుతో లేదా రక్తంతో కలసిన జిగురు ఎక్కువగా ఉండును. ఆ ప్రదేశంలో చిన్న ప్రేగు పొరలు ఎర్రగా మారి రక్తపు స్రావపు చారలు లేదా చుక్కలు కనిపించును. అలాగే అక్కడ జిగురును లేదా పొరలను పరీక్ష చేస్తే మనకు చిన్న జలగలు కనిపిస్తాయి. 
 • నెమరు వేసే పొట్టను కోసినట్లయితే జలగలు దానిమ్మ గింజల మాదిరిగా ఎరుపుగా ఉండి లోపల పొట్టకు వందల సంఖ్యలో అతుక్కుని ఉంటాయి.

జలగల నిర్ధారణ :

 • గొర్రెలను మేపే ప్రదేశాలను గురించి రైతులను అడగడం. 
 • పేడలో చిన్న జలగల గ్రుడ్లను పేడపరీక్ష ద్వారా తెలుసుకోవడం.
 • పైన చెప్పిన లక్షణాలను గమనించడం.

చికిత్స :

 • ఆక్సీక్లోజనైడ్‌ ఏ 15 మి.గ్రా. ఒక కేజీ బరువునకు రెండు రోజులు ఇస్తే చిన్న జలగలను పూర్తిగా తొలగించవచ్చును. లేదా నిక్లోజమైడ్‌ ఏ 100 మి.గ్రా. ఒక కేజీ బరువునకు ఒక్కసారి ఇవ్వాలి.
 • నీరసాన్ని తగ్గించే విధంగా రింగర్‌ లాక్టేట్‌ మరియు గ్లూకోస్‌ సలైనులను రక్తంలోకి ఇవ్వాలి మరియు ఎలెక్ట్రోలైట్లపౌడర్‌లు నీటిలో కలిపి రోజుకు మూడు సార్లు ఇవ్వాలి .
 • గొంతు క్రింద వాపు తగ్గించడానికి ఇంజక్షన్లు ఫ్యురోసమైడ్‌ను ఇవ్వాలి లేదా సున్నపు తేటను పూయాలి.
 • రక్త లోపం ఉన్నచో ఐరన్‌ను కలిగిన ఫెరిటాస్‌ ఇంజక్షన్లు లేదా శార్కొఫెరోల్‌ ద్రావణాన్ని లేదా బెల్లం పానకాన్ని తయారుచేసి రోజుకు 3 సార్లు ఇవ్వాలి.

నివారణ చర్యలు :

తడి నేలలు మరియు వరద వచ్చిన ప్రాంతాల్లో 2-3 నెలల వరకు జలగలు ఎక్కువగా మొక్కలకు అతుక్కుని ఉంటాయి. అటువంటి ప్రదేశాల్లో మేపకూడదు.

నత్తలు ఉండే ప్రదేశాల్లో మేపకూడదు మరియు నత్తలు లేకుండా నీటి కుంటలను, డ్రైనేజిలను మూసివేయాలి.
 

రచయిత సమాచారం

డా|| జి.రాంబాబు, పశువైధ్యాధికారి, కడప, ఫోన్‌ : 9618499184