Print this page..

కోకో వివిధ రకాల కాయకుళ్ళు తెగుళ్ళు - యాజమాన్య పద్ధతులు

కోకో పంట వృక్షజాతికి చెందిన ''స్టెర్క్యూలియేసి'' కుటుంబానికి చెందినది. దక్షిణ అమెరికాలో గల అమెజాన్‌ నదీ తీరాన దీని జన్మస్థలంగా భావించబడుతుంది. మనదేశంలో కోకో 20వ శతాబ్దపు తొలిదశలో ప్రవేశపెట్టబడింది. భారతదేశంలో కోకో సుమారుగా  46,300 హెక్టార్లలో సాగుచేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 14,000 హెక్టార్లలో ప్రదానంగా కోస్తా జిల్లాలోని కొబ్బరి, ఆయిల్‌పామ్‌ మరియు వక్క తోటల్లో శాశ్వత అంతర పంటగా సాగుచేయబడుతుంది. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాల కొబ్బరి తోటల్లో కోకో అత్యంత లాభదాయకమైన అంతరపంటగా గుర్తించడమైంది. 

కోకోను ఆశించే ప్రధాన తెగులు కాయకుళ్ళు వివిధ రకాల శిలీంద్రాల వల్ల కలిగి ఈ కాయకుళ్ళు తెగుళ్ళు కోకో కాయలను ఆశించి దిగుబడి తగ్గడానికి కారణవుతున్నాయి. వాటిలో అతిముఖ్యమైనది పైటోఫ్త్తోరా కాయకుళ్ళు, పైటోఫ్త్తోరా పామివోరా అనే శిలీంధ్రం ఆశించడం వల్ల కలుగుతుంది. 

నల్లకాయ తెగులు (పైటోఫ్త్తోరా పామివోరా) : 

కోకో సాగు చేస్తున్న అన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో బ్లాక్‌పా అనే ఈ తెగులు ఎక్కువగా వ్యాపించును జులై-ఆగష్టులో  ఉదృతి అధికంగా ఉంటుంది. కాయపై ముదురు గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆపై పెరిగి కాయంతా వ్యాపించి నలుపుగా మారుతుంది. కాయలోపలి కణాలు మరియు గింజలు రంగుమారి, దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. పక్వానికి వచ్చిన కాయలపై ఈ తెగులు కనిపించిన వెంటనే కాయని కోసి గింజలను వేరుచేయడం ద్వారా నష్టాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. 

నివారణ : 

ఈ తెగులు సోకిన కాయలను ఎప్పటికప్పుడు తొలగించి కాల్చివేయాలి. దట్టంగా ఉన్న తోటల్లో నీడ ఎక్కువగా ఉండకుండా ప్రూనింగ్‌ చేపట్టి తద్వారా చెట్టులోపలి భాగాలకు గాలి, వెలుతురు సోకేటట్లు చేయాలి. 1 శాతం బోర్డో మిశ్రమాన్ని తొలకరికి ముందు ఒకసారి తరువాత ఉధృతిని బట్టి రెండవసారి పిచికారి చేయాలి. రాగి ధాతు శిలీంద్ర నాశినులైన కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌, కుప్రిక్స్‌ ఆక్సైడ్‌, కాపర్‌ హైడ్రాక్సైడ్‌ ఈ తెగులు నివారణకు ఉపయోగపడతాయి. 

కొల్లిటొట్రైకమ్‌ కాయకుళ్ళు 

(కొల్లిటోట్రైకమ్‌ గ్లియొస్పొరాయిడిన్‌ కె. ధియోబ్రోమ్‌) :

కాయ ఉపరితలంపైన, కాడ వైపు నుండి లేదా కొనవైపు నుండి వ్యాధి ప్రారంభమవుతుంది. మచ్చలు ముదురుగోధుమ వర్ణంతో ప్రారంభమై పసుపు రంగు వలయాన్ని కలిగి ఉంటాయి. ఈ తెగులు కాడభాగానికి అక్కడి నుండి కుషన్‌ భాగానికి వ్యాపిస్తుంది. అంతఃకణజాలం వివర్ణమవుతుంది. కొన్ని సందర్భాల్లో కాయ ఇతర భాగాల నుండి కూడా వ్యాధి ప్రారంభమవుతుంది. అనంతరం ముదురుగోధుమ రంగు మచ్చలు కలసిపోయి కాయలు ఇతర భాగాలకు వ్యాపిస్తాయి. వ్యాధి తీవ్రమైన సమయాల్లో మొత్తం కాయ ఉపరితలం అంతా తెగులు బారిన పడుతుంది. కాయ సంకోచం చెందడం వల్ల రూపం మారిపోతుంది. దీని నివారణకు కార్బండిజమ్‌ 1 గ్రా. / 1 లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 

చార్‌కోల్‌ కాయకుళ్ళు / బొట్రియో డిప్లొడియా కాయకుళ్ళు (లాసియోడిప్లొడియా థియోబ్రొమ్‌ / బొట్రియో డిప్లొడియా ధియోబ్రోమ్‌) : 

ఈ తెగులు పొడిగా ఉన్న సీజన్లో తరచుగా ఆశిస్తుంది. మొదట కాయలపై లేత పసుపురంగులో మచ్చలు ఏర్పడి పెరిగి పెద్దవై చాక్‌లెట్‌ గోధుమ రంగులోకి మారతాయి. సాధారణంగా ఈ తెగులు కాడ దగ్గర మొదలై కియ కొనభాగానికి పాకుతుంది. కొన్ని సందర్భాల్లో మచ్చలు కాయపై ఇతర భాగాల నుండి కూడా వ్యాపిస్తుంది. చాలా సందర్భాల్లో కాయ అంతా నల్లగా మారి శిలీంద్ర బీజాలపై జిగురు వంటి పొరను ఏర్పరుస్తుంది. తెలుగు సోకిన కాయలు రూపం మారి మొక్కపై అతుక్కుని ఉంటాయి. లేత కొమ్మలపై కూడా ఈ తెగులు ఆశించి తలమాడు తెగులును కలిగిస్తుంది. గాయపడ్డ కాయలను, ఒత్తిడికి గురైన మొక్కలపై ఉన్న కాయలను ఈ తెగులు ఆశిస్తుండడం వల్ల మొక్క యాజమాన్యం పట్ల తగిన జాగ్రత్త వహించడం ద్వారా తెగులు వ్యాప్తిని అరికట్టవచ్చు. గాయాలపై ఆశించే శిలీంద్రం కావడం వల్ల 1 శాతం బోర్డో మిశ్రమం, క్రిమ సంహారక రసాయనంతో కలిపి పిచికారి చేయాలి. 

కోకోలో వివిధ రకాల తెగుళ్ళను సమర్థవంతంగా అరికట్టడానికి తీసుకోవలసిన సమగ్ర సస్యరక్షణ పద్ధతులు : 

  • ఎల్లప్పుడూ ఆరోగ్యవంతమై తెగుళ్ళు ఆశించని మొక్కలను మాత్రమే ఎంచుకోవాలి. 
  • భూసార పరీక్షలను అనుసరించి పోషకాలను అందిస్తూ ఉండాలి. 
  • కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు నివారించుకోవాలి.
  • సరైన సమయంలో కొమ్మలను కత్తిరించి నీడను క్రమబద్దీకరించు కోవాలి. 
  • తేమను తగ్గించి తగినంత గాలి, వెలుతురు మొక్కలకు తగిలేలా చూడాలి.
  • తెగులు ఆశించిన చెట్లను, కొమ్మలను, కాయలను ఎప్పటికప్పుడు తీసివేసి తగులబెట్టాలి.
  • వర్షాకాలం ప్రారంభ సమయానికి 15 రోజుల ముందుగా 1 శాతం బోర్డోమిశ్రమాన్ని గాలి ఏదైనా రాగిధాతు శిలీంధ్ర నాశినులుగాని పిచికారీ చేయాలి.
  • కొమ్మ కత్తిరింప చేపట్టిన తరువాత లేక చెట్టుకు గాయాలైనప్పుడు బోర్డోమిశ్రమం పిచికారి లేదా బోర్డోపేస్టు పూతగా వేయాలి.

రచయిత సమాచారం

- బి. నీరజ, సైంటిస్టు (ప్లాంట్‌ పాథాలజీ), డా|| జి. రామానందం, ప్రిన్సిపల్‌ సైంటిస్టు (హార్టికల్చర్‌ మరియు అధిపతి), డా|| ఎన్‌.బి.వి చలపతి రావు, ప్రిన్సిపల్‌ సైంటిస్టు (ఎంటమాలజీ), ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట,ఫోన్‌ : 9441474967, 7382633653