Print this page..

ఆధునిక సాగుతోనే ఉత్పత్తులు మెండు

తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడిని అందించేందుకు ఆధునిక సాగు ఎంతో తోడ్పడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. జీడిమెట్లలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను ఆయన సందర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మోడల్‌ ఉద్యాన సాగు విధానానికి శ్రీకారం చుట్టిందని దానిలో భాగంగానే జీడిమెట్ల ప్రాంతంలో రూ. 20 కోట్లతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సాగు విధానాలను ఒక మోడల్‌గా చూపెట్టేందుకు ఈ ఎక్స్‌లెన్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగానికి ఎంతో దోహదపడుతుందని గడచిన 5 సంవత్సరాల కాలం నుండి ప్రయోగాత్మకంగా చేపట్టిన పంటల సాగు విధానం రైతులకు ఉపయోగకరంగా ఉందని భాగ్యనగర సమీపంలో ఉన్న రైతాంగానికి ఈ సాంకేతిక సాగు విధానం నేడు ఎంతో లాభసాటిగా మారిందని ఇప్పటికే పట్టణప్రాంత ప్రజలకు తాజా కూరగాయలను అందించేందుకు ఈ విధానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. 

తక్కువ సమయంలో తాజా ఉత్పత్తులను అందించగలిగే సాంకేతికత పరిజ్ఞానం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో పురుడు పోసుకుంటుందని ఈ విధానం పట్టణ ప్రాంతంలో నివశిస్తున్న ప్రజలకు కూడా ఉపయోగపడుతుందని నిత్యం అవసరమయ్యే కూరగాయలను స్వతాగా ఎవరి ఇళ్ళ వద్ద వారే ఉత్పత్తి చేసుకునే విధంగా సాగు విధానం అతి సులభపద్ధతిలో తీసుకురావడం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ యొక్క ముఖ్య ఉద్ధేశంగా పనిచేస్తుందని వివరించారు. 50 శాతం మంది పట్టణ ప్రజలు ఇప్పటికే వారి వారి ఇళ్ళ దగ్గర వారికి సరిపడా నిత్యం కూరగాయలను పండిస్తున్నారని ఇదే ఒరవడి భాగ్యనగర వాసులందరికీ వర్తించే విధంగా చేపడుతున్నట్లు వివరించారు. నేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పంట  ఉత్పత్తులు పెరగడంలేదని ఇప్పటికే పూలు, పండ్లు, కూరగాయలు సైతం ఇతర రాష్ట్రాల నుండి ఉత్పత్తి చేసుకుంటున్నామని తెలిపారు. నిత్యం మహానగరానికి రోజుకు 2-3 లక్షల మంది సందర్శకులు వస్తున్నారని వీరికి కావలసిన పండ్లు, కూరగాయలు అందించేందుకు మన ఉత్పత్తులు సరిపోవడం లేదని ఇంకా సాగు విధానం పెంచుకోవలసిన అవసరం ఉందని ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడే పండ్లు, పూలు సాగుపై దృష్టి సారించామని రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రం నుండే పూలు, పండ్ల ఎగుమతి చేపట్టే విధంగా సాగు పద్ధతులను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. 

ప్రతి 500 మంది రైతులకు ఒక క్లస్టరు ఏర్పాటు చేసి ఒకే రకమైన దిగుబడులను సాధించకుండా ఒక్కొక్క క్లస్టరుకు ఒక్కొక్క రకం పంటసాగు చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. తద్వారా రైతులందరికీ ఆదాయం సమకూర్చే విధంగా ఉంటుందని పట్టణ ప్రాంతానికి సమీపంలోని రైతాంగాతనికి ఈ విధానం ఎంతో మేలు చేకూర్చే విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సుమారు 300 పైగా పాలిహౌస్‌లలో పూల సాగు , కూరగాయలసాగు కొనసాగుతుందని అన్నారు. ఈ పాలిహౌస్‌ల ద్వారా రైతులకు లాభదాయకంగానే ఉంటుందని మంత్రి అన్నారు.

రైతులకు సబ్సిడీపై మొక్కలు : 

సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో సుమారు ఎకరం విస్తీర్ణంలో మేలైన వంగడాలతో పెంచిన వివిధ రకాల పూలు, కూరగాయల మొక్కలను రైతులకు 90 శాతం రాయితీతో అందచేయడం జరుగుతుంది. ఈ మొక్కలు ఇతర సాధారణ మొక్కలతో పోలిస్తే 30-40 శాతం అధిక దిగుబడిని ఇస్తుంది. సబ్సిడీపై నారు మొక్కలు అవసరమైన రైతులకు 10 పైసల చొప్పున ఒక్కొక్క మొక్కకు చెల్లించాలని రైతులు తమకు కావలసిన మొక్కల కోసం ముందుగానే పేర్లను నమోదు చేసుకోవలసి ఉంటుంది. రైతు తయారు చేసుకునే నారుకంటే సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను తయారుచేసే మొక్కలకు ఎక్కువ దృఢత్వంగా ఉండి త్వరగా నాటుకొని కాపుకువస్తుందని ఇటువంటి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకొని ఎక్కువ దిగుబడులను సాధించుకొని ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి తోడ్పాటుగా ఉండడం కోసం ఈ వెసలుబాటు రైతులకు ఎంతో దోహదపడుతుందని మంత్రి వివరించారు. సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో వివిధ నూతన పద్ధతుల్లో సాగుచేస్తున్న పంటలను ఆయన పరిశీలించారు. 

సాగుచేస్తున్న పంటలు : 

గులాబి, ఆర్చిడ్‌, కట్‌ఫ్లవర్స్‌, జర్బేరా, కీరదోస, క్యాప్సికం, చెర్రీ, టమాట, ఆకుకూర పంటలను పరిశీలించారు. వాటి యాజమాన్య పద్ధతులను అక్కడ సాగు చేస్తున్న ఉద్యానవన అధికారులను అడిగి తెలుసుకున్నారు. 560 చ.మీ. విస్తీర్ణంలో సాగుచేస్తున్న ఆకుకోరల తోటలను పరిశీలించారు. న్యూట్రిక్లినిక్‌తో పాటు సోలార్‌, పోర్టబుల్‌, కోల్డ్‌ స్టోరేజిలు, మిద్దె తోటలను మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు  ఉద్యానవన శాఖ కమీషనర్‌ వెంకట్రామిరెడ్డి, డిప్యూటి కమీషనర్‌ మధుసూదన్‌, ఇన్‌ఛార్జ్‌ లత, కమలాకర్‌, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. 

రచయిత సమాచారం

 ఇ. రాంబాబు, అగ్రిక్లినిక్‌ ప్రతినిధి