Print this page..

ఆరోగ్యదాయిని కాకరకాయ

పందిరి జాతి కూరగాయల్లో కాకరకు విశిష్టస్థానం ఉంది. కాకరకాయ ఆసియా, తూర్పు ఆఫ్రికా మరియు సౌత్‌ అమెరికాల్లో పెరుగుతంది. మనదేశంలో ఎక్కువగా కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు మరియు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండిస్తున్నారు. కాకరకాయను ఇంగ్లీష్‌లో ''బిట్టర్‌మెలోన్‌'', బిట్టర్‌ స్క్వాష్‌'' అని, హిందీలో ''కరేలా'' అని పిలుస్తారు. మంచి పోషక విలువలు మరియు పీచు పదార్థం కలిగిన కూరగాయగా కాకరకాయను చెప్పవచ్చు. పూర్వకాలంలో కాకరకాయను ఆయుర్వేదిక ఔషధంగా, మదుమేహం (డయాబెటిస్‌), ఇతర రోగాలకు నివారణిగా ఉపయోగించేవారు. ఇంకా రక్తపోటు హెచ్చుతగ్గులను సమన్వయ పరచటంలో శరీర బరువును సమతుల్యం చేయటంలో దీని పాత్ర శాస్త్రీయంగా నిరూపితమైంది.

కాకరకాయ అంటే చిన్న, పెద్ద అందరికీ చిరాకే. చేదుగా  ఉంటుందని ఎవరూ దీన్ని తినడానికి ఇష్టపడరు. కాని దీనిలో వుండే పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే కష్టమైనా, ఇష్టంలేకపోయినా తినేస్తారు. రోజువారీ ఆహారంలో పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు, త్రుణధాన్యాలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. వీటి ద్వారా ఖనిజ లవణాలు, మాంసకృత్తులు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి. అయితే వీటిలో కాకరకాయను కొందరు తీసుకోవడానికి ఇష్టపడరు. దీని శాస్త్రీయ నామం మొమోర్డికా చరన్షియా. ఇది కుకుర్చిటీసి కుటుంబానికి చెందినది.

కాకరకాయ వల్ల కలిగే లాభాలు :

మదుమేహం : కాకర రసంలో హైపోగ్లసమిక్‌ అనే రసాయనం శరీరంలోని ఇన్సులిన్‌ స్థాయిలను నియంత్రిస్తూ రక్తంలోని చక్కెర శాతాన్ని అదుపుచేస్తుంది. అలాగే రక్తంలోని గ్లూకోజ్‌ను నియంత్రించే చారటిన్‌ అనే ఇన్సులిన్‌ లాంటి  పదార్థం కాకరకాయ గింజల్లో ఉంటుంది. ఇందువల్ల కాకరకాయ రసం 2వ రకం మదుమేహ వ్యాదిని అధిగమించడానికి అత్యంత సాధారణ నివారణ మార్గంగా చెప్పబడుతుంది.

రక్తశుద్ధి : ఔషద గుణాలున్న కాకరను తరచూ స్వీకరించడంవల్ల రక్తశుద్ధి జరుగుతుంది. బాక్టీరియా ఉత్పత్తిచేసే విషపదార్థాల నుంచి రక్తాన్ని శుద్దిచేసి దురద మరియు వేడిని తగ్గిస్తుంది.

మలబద్దకం : బిట్టర్‌మెలెన్‌లో సెల్యులోజ్‌ వంటి పీచుపదార్థాలు అధికంగా ఉండటం వల్ల తేలికగా అరుగుతుంది. ఈ ఆహారం అరుగుదలకు, మలబద్దకం, అజీర్తి సమస్యల నివారణలో సహాయపడి శరీరం నుండి చెత్తను తొలగిస్తుంది.

బరువును తగ్గించడంలో : కాలేయం నుండి అధికంగా పైత్యరసాలను ఉత్పత్తిచేసే యాంటీ ఆక్సిడెంట్లు కాకరలో ఉన్నాయి. ఇవి జీవక్రియను అభివృద్ధి చేస్తూ, కొవ్వును కరిగించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడతాయి.

మొలల నివారణలో : తాజా కాకరకాయ రసం మరియు మజ్జిగ కలిపిన మిశ్రమాన్ని ఒక నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయం సేవంచడం వల్ల మొలల బాద పడేవారికి ఉపశమనం కలుగుతుంది.

గుండెజబ్బులు : గుండెపోటుకు ఒక కారణం కొలెస్ట్రాల్‌. కాకర రక్తపోటును నియంత్రిస్తుంది. ఇది ధమని గోడలను ఆటంకపరిచే చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించ డానికి సహాయపడుతుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. రక్తంలో చెక్కెర స్థాయిలను తక్కువగా ఉంచడం వల్ల కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి సహాయపడుతుంది.

చర్మవ్యాధులు : అలర్జీ, సోరియాసిస్‌ మరియు దురద వంటి చర్మవ్యాధులను నయం చేయడానికి కాకర ఉపయోగపడుతుంది.

వ్యాది నిరోదక శక్తి : కాకరకాయను నీళ్ళలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకొని తాగితే ఎన్నో ఇన్ఫెక్షన్స్‌ నుంచి బయటపడొచ్చు. ఇది రోగ నిరోదక శక్తిని పెంపొందించడానికి సహాయపడుతుంది.

శ్వాస రుగ్మతలు : తాజాకాయలు అస్లమా, జలుబు మరియు దగ్గు మొదలైన శ్వాస సంబంధిత సమస్యల నివారణకు అద్బుతమైన చికిత్స. ఈ లక్షణాలతో బాధపడేవారు కాకరకాయ రసం తాగితే మరింత మంచిది.

కంటి సమస్యలు : కాకరలో బీట కెరోటిన్‌ ఉండడం వలన కంటి సమస్యలను నయం చేస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.

కాకరలో వుండే మోమార్డిసిన్‌, యాంటివైరస్‌ మరియు క్రిమిసంహారిణిగా ఉపయోగ పడును. కడుపులో వుండే నులిపురుగులను నాశనం చేస్తుంది.

కాకర ఇమ్మునో మాడ్యులేటర్‌గా పనిచేయడం వల్ల కాన్సర్‌, ఎయిడ్స్‌ వ్యాదిగ్రస్తులకు మంచిది.

కొందరు కాకరాకు రసమును కుక్కకాటుకు విరుగుడుగా వాడతారు.

కాకరలోని పోషక విలువలు :

 

పదార్ధం మోతాదు
నీరు 83-20 గ్రా.
పిండి పదార్థాలు 08-22 గ్రా.
పీచు 01-70 గ్రా.
ప్రోటీన్లు 02-06 గ్రా.
కాల్షియం 23 మి.గ్రా.
ఫాస్పరస్‌ 53-08 మి.గ్రా.
పొటాషియం 164-71 మి.గ్రా
సోడియం 10-88 మి.గ్రా
ఐరన్‌ 02-00 మి.గ్రా
కాపర్‌ 34-39 మి.గ్రా.
మాంగనీస్‌ 27-85 మి.గ్రా.
జింక్‌ 75-46 మి.గ్రా.
బీట-కెరోటిన్‌ 140 మై.గ్రా.
విటిమిన్‌-సి 98-02 మి.గ్రా.
ఫోలిక్‌ ఆమ్లం  00-10 మై.గ్రా.

 

మధుమేహం తగ్గించటంలో ప్రదానపాత్ర :

రక్తంలో అధికంగా గ్లూకోజ్‌స్థాయిలు ఉండటాన్ని మదుమేహం అని అంటారు. మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మదుమేహవ్యాధి అధికంగా ఉంది. మదుమేహాన్ని అంత సులువుగా తగ్గించలేము. దీన్ని నియంత్రణలో ఉంచడానికి ఆహారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. కాకరకాయ రసం మదుమేహానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది. కాకరకాయల్లో ఉండే ''చెరాటిన్‌'' అనే పదార్థం రక్తంలో ఉండే గ్లూకోజ్‌ శాతాన్ని తగ్గిస్తుంది. అద్యయానాల ప్రకారం రక్తంలోని చెక్కెర్లను / గ్లూకోజ్‌ను జీవక్రియలో అధికంగా పాల్గనేలా చేసి గ్లైకోజన్‌ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తుంది.  ఈ ఎంజైమ్‌ శరీర రక్తంలోని చక్కెరస్థాయిలను క్రమంగా తగ్గిస్తుంది. ఇలా మదుమేహం అదుపులో ఉంటుంది. ఇలా మార్చబడిన గ్లైకోజన్‌ కాలేయంలో నిల్వ ఉంచబడి శక్తి విడుదలకు వినియోగించబడుతుంది. అంతేకాకుండా రక్తంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తుంది.

జాగ్రత్తలు :

  • ఖాళీ కడుపుతో కాకరకాయను సేవించరాదు.
  • అధిక మోతాదులో కాకరకాయను తీసుకోకూడని వారు
  • రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిలు తక్కువగా ఉన్నవారు
  • గర్భవతి స్త్రీలు మరియు పాలు ఇచ్చే స్త్రీలు
  • చిన్న పిల్లలు
  • నోటిద్వారా ఔషధ చికిత్స పొందుతున్న మదుమేహరోగులు.

కాకరకాయ మీద జరుగుతున్న పరిశోధన :

ఎ.వి.ఆర్‌.డి.సి. ప్రపంచ కూరగాయల కేంద్రం వారు ఇండియా, తైవాన్‌, టాంజానియా దేశాల భాగస్వాములతో కలిసి కాకరకాయతో టైపు-2 మధుమేహంను నియంత్రించేందుకు మరియు మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుటకు అద్యయనాలు చేస్తున్నారు.
 

రచయిత సమాచారం

డి. త్రివేణి, జి. క్రాంతిరేఖ, ఉద్యాన పరిశోధనా స్థానం, వెంకట్రామన్నగూడెం, పశ్చిమగోదావరి జిల్లా, ఫోన్‌ : 95506910469