Print this page..

జీవాల పెరుగుదలలో పరాన్నజీవుల బెడద

గొర్రెలలో మేపు అలవాటు వలన  గొర్రెలు తరచూ పరాన్నజీవుల బారిన పడుతూ ఉంటాయి.  కనుక వీటిని పరాన్నజీవుల మ్యూజియం అంటారు.  కొన్ని రకాల పరాన్న జీవులు జీవాల పెరుగుదలపై ప్రభావం చూపగా మరికొన్ని జీవాల మరణాలకు కూడా కారణం అవుతుంటాయి. ఇటీవల కురిసిన వర్షాల వల్ల రాష్ట్రంలో చాలా చోట్ల నీటి గుంటలలో నీరు నిల్వ ఉంది. ఇటువంటి నీటిని జీవాలు తాగినప్పుడు,అక్కడ మొలిచిన గడ్డిని తిన్నప్పుడు జీవాలలోనికి పరాన్నజీవులు ప్రవేశించి, జీవాల పెరుగుదల,ఉత్పత్తులపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి.  లక్షణాలను గమనించిన వెంటనే చికిత్స చేయకుంటే అధిక మరణాలు సంభవించి  రైతులు ఆర్థికంగా నష్టపోతారు.  పరాన్నజీవుల ఉనికిని కేవలం లక్షణాలు, సీజన్ లో మార్పులు మరియు పేడ పరీక్ష ద్వారా మాత్రమే గుర్తించవచ్చు.  

జీవాలకు నష్టం కలిగించే పరాన్నజీవులలో ముఖ్యమైనవి 
రక్త నులిపురుగులు(హిమాంకస్), పొట్ట జలగలు (ఆంఫిస్టమ్స్),కార్జపు జలగలు(లివర్ ఫ్లూక్స్), బద్దెపురుగులు (టేప్ వార్మ్స్) ముఖ్యమైనవి.
రక్త నులిపురుగులు- ఇవి సన్నగా, తెల్లగా, గుండ్రంగా, నూలి పొగువలె ఉంటాయి. ఇవి జీవాల పొట్ట(అబోమజమ్)లో నివసిస్తూ ఉంటాయి.  ఒక్కో నులిపురుగు రోజుకు దాదాపుగా 0.02 మిల్లీల రక్తం త్రాగుతుంది.  ఒకవేళ ఇవి 1000 పురుగులు ఉన్నచో రోజుకు 20 మిల్లీల రక్తం త్రాగుతుంది.  కొన్ని సందర్భాలలో వీటి సంఖ్య దాదాపు 50 వేల వరకు ఉండే అవకాశం ఉంది.

లక్షణాలు:
ఆకలి మందగించడం, రక్తహీనత, కంటిలోని పొర పాలిపోయినట్లుఉండడం(అనీమియా), దవడ కింద మరియు పొట్ట కింద నీరు చేరడం, మలబద్ధకం వల్ల పారుడు లక్షణాలు ఉండవు. చనిపోయిన గొర్రెల పొట్టలో ముఖ్యంగా అబోమేసంలో తెలుపు, ఎరుపు రంగు నూలు పోగు వంటి నులిపురుగులు తిరుగుతూ ఉంటాయి.

చికిత్స:

రక్త నులిపురుగులు నిర్మూలించుటకు లెవమిజోల్ ( 7.5mg/kg), 
ఆల్బెండజోల్ (5mg/kg), 
ఐవర్మేక్టీన్ (0.2mg/kg), 
క్లోజాన్టల్ (10mg/kg), 
రఫక్సనైడ్ (45mg/kg) 
వంటి మందులు బాగా పనిచేస్తాయి.
చికిత్సలో భాగంగా పెరుగు(నట్టల నివారణ) మందులు తాపించడంతో పాటు అప్పటివరకు జీవాలు కోల్పోయిన రక్తంను శక్తిని తిరిగి పొందుటలో సహాయం చేయాలి. అందుకుగాను వాటికి ఐరన్ టానిక్ లను 5-10 రోజుల వరకు తాపించాలి.  అవసరమైన వాటికి లక్షణాలను బట్టి యాంటీబయాటిక్ లతో పాటు  ఇతర మందులు కూడా ఇవ్వాలి.

పొట్ట జలగలు:
ఇవి పెద్దవి, పిల్లలు అని రెండు రకాలుగా జీవాలలో పెద్ద పొట్టలో మరియు చిన్న ప్రేగు మొదటి భాగంలో వరుసగా నివాసం ఏర్పరుచుకుని ఉంటాయి.  పెద్ద పొట్టలో చూసినట్లయితే దానిమ్మ గింజల మాదిరిగా ఉండే జలగలను వందల సంఖ్యలో పొట్ట గోడలకు అతుక్కొని ఉండడాన్ని గమనించవచ్చు. 
కార్జపు జలగలు: 
ఇవి ముఖ్యంగా జీవాలకు కాలేయంలోకి చేరి నివాసం ఏర్పరుచుకుం టాయి. కామెర్లు వంటి లక్షణాలు గమనించినప్పుడు వీటిని అనుమానించవచ్చు. జీవాల కాలేయం (లివర్)కోసినప్పుడు  పసుపు రంగు ఆకు ఆకారంలో గల పురుగులు గమనించవచ్చు. 
జలగలు జీవాలలోకి ఎలా వస్తాయి.
నీటి నిల్వ ప్రాంతాలలో ఉండే నత్తలలో జలగలు నివాసం ఏర్పరుచుకుంటాయి.  జీవాలు మేపుకు వెళ్ళినప్పుడు వాటి పేడలో జలగ గుడ్లను విడుదల చేస్తాయి. ఈ గుడ్లు నీటినిల్వ ప్రాంతాలలో గల నత్తలలోకి ప్రవేశించి వాటిలో అభివృద్ధి చెందుతాయి.  నత్తలు గడ్డి పైన సంచరించున్నప్పుడు వాటి నుంచి జలగల లార్వాలు గడ్డిని అతుక్కుంటాయి. అటువంటి గడ్డిని జీవాలు తిన్నప్పుడు, నత్తలు సంచరించు కుంటలలోని నీటిని తాగినప్పుడు జలగల లార్వాలు జీవాల లోనికి ప్రవేశిస్తాయి.
జలగ పోటు లక్షణాలు:
పలుచని వాసనతో కూడిన విరేచనాలు, గొంతు కింద నీరు చేరి వాపు రావడం (ఉదయం పూట ఎక్కువగా కనిపించును),  ఆకలి మందగించడం, బరువు తగ్గిపోవటం, రక్తహీనత, తల్లి గొర్రెలలో పాలు తగ్గిపోవడం వలన పిల్లలు కూడా నీరసించి చనిపోవటం జరుగుతుంది.
చికిత్స:
పిల్ల జలగలు, పెద్దవి రెండింటినీ  నిర్మూలించుటకు ఆక్సీక్లోజనైడ్ (15mg/kg) బాగా పనిచేస్తాయి.  నిక్లోజమైడ్ (100mg/kg) పిల్ల జలగలను నిర్మూలించును. వీటితో పాటు పెద్ద జలగల నిర్ములనకు క్లోజాన్టల్ (10mg/kg), రఫక్సనైడ్ (15mg/kg) కూడా పనిచేస్తాయి. జలగల నిర్మూలనతో పాటు వివిధ లక్షణాలకు సంబంధించిన యాంటీబయోటిక్ మందులు, నీరసానికి సెలైన్లు రక్తహీనతకు ఐరన్ టానిక్ లు, లివర్ టానికులు వాడుకుంటూ,మంచి పోషక విలువలు కలిగిన దాణాలు లేదా మాంసకృత్తులు పుష్కలంగా ఉన్న ఉలవలు/ శనగలు /పెసలు వంటివి మొలకెత్తిన గింజలు రోజు పిడికెడు దాణా గా ఇస్తే  పెరుగుదల ఆశించిన విధంగా ఉంటుంది. 
బద్దె పురుగులు: 
ఇవి జీవాల ప్రేగులలో నివాసం ఏర్పరుచుకుని జీవాల పెరుగుదలను దెబ్బతీస్తాయి. ఇటువంటి జీవాలు పలుచగా తీగలుగా పారుతూ ఉంటాయి. పేడలో ఉడికించిన బియ్యం మాదిరిగా, గుడ్ల లాగా ఉంటాయి.లేదా తీగ లాగా/ రిబ్బను లాగా పొడవుగా ఉండే బద్దె పురుగులు జీవాల పేడలో గమనించవచ్చు.  బద్దె పురుగులు జీవాల ప్రేగులలో అడ్డుపడి  జీవాలు పేడ పెట్టుటకు కూడా కష్ట పడుతూ ఉంటాయి. కడుపునొప్పి ఉంటుంది. బాగా నీరసించి రక్తహీనత వలన చనిపోతాయి. 
బద్దె పురుగులు జీవాలలోకి ఎలా వస్తాయి.  

జీవాలు మందలో కలిసి ఉన్నప్పుడు కానీ మేత మేసేటప్పుడు కానీ వాటి పెంటికలలో బద్దె పురుగుల గుడ్లను విసర్జిస్తాయి.  ఇటువంటి గుడ్లు కలిగిన మట్టిని లేదా గడ్డిని, నీటిని తీసుకున్నప్పుడు మరల ఈ గుడ్లు జీవాల పేగులలోనికి చేరి  పెద్దవవుతాయి.

చికిత్స:
బద్దెపురుగులు  నిర్మూలించుటకు 
ప్రజిక్విన్టల్ (5-10mg/kg), 
నిక్లోజమైడ్ (50-100mg/kg), ఆల్బెండజోల్ (10mg/kg), 
ఫెన్బెన్డజోల్ (10mg/kg)  
వంటి మందులు బాగా పనిచేస్తాయి. వీటితో పాటు మంచి పోషకాలు కలిగిన దాణా, నీరసానికి సెలైన్లు, లివర్ టానిక్ మందులు వాడినచో జీవాలు మరల వృద్ధిలోకి వస్తాయి.

ముఖ్య సూచనలు
పరాన్న జీవుల గుడ్లతో కలుషితమైన నీటి కుంటల్లో నీరు తాపడం, అక్కడ మొలిచిన గడ్డిని జీవాలకు మేపడం చేయకూడదు.
నత్తలు ఉండే ప్రదేశాలలో జీవాలను మేపకూడదు.
షెడ్ లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
ప్రతి రోజు ఒకే ప్రదేశంలో జీవాలను మేపకూడదు.
తొలకరి చినుకులు లేదా మంచు-బిందువులు ఉన్న ఆకుల మీద పరాన్న జీవుల లార్వాలు ఉండే అవకాశం ఉంది  కనుక ఉదయం ఎండ వచ్చిన తర్వాతనే జీవాలను మేతకు తీసుకొని పోవాలి.
వీలైనంత వరకు జీవాలకు మేపు సమయంలో నీటిని త్రాపకుండా ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే పరిశుభ్రమైన తాగునీటిని అందించాలి. 
తరచూ జీవాల పేడను పశు వైద్యశాలలో పరీక్ష చేయించి, ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పనిసరిగా పశు వైద్యుని సలహా మేరకు తగిన పెరుగు మందును తాపించుకోవాలి. 
ప్రతిసారి ఒకే పెరుగు మందును తాపించుట వలన  ఆ మందులు తర్వాత పనిచేయవు (పారసైటిక్ రెసిస్టన్స్),కనుక పెరుగు మందును వాడు ప్రతిసారి పశు వైద్యుల సలహా మేరకు మాత్రమే తగిన మందులు వాడుకోవాలి.
 మంచి పోషకాలు కలిగిన గడ్డి మరియు దాణాను అందించాలి.
 వీలైనంతవరకు పారుతున్న జలాశయాల వద్ద, మలమూత్రాలతో కలుషితం అవ్వని నీటిని మాత్రమే అందించాలి.

రచయిత సమాచారం

డాక్టర్ శ్వేత కాంతి, డాక్టర్ శోభ- పశు వైద్య కళాశాల, ప్రొద్దుటూరు, కడప జిల్లా డాక్టర్ యశిత ప్రియ- పశు వైద్యులు, చిత్తూరు జిల్లా