Print this page..

పుచ్చకాయ సాగులో మెళకువలు మొక్క ప్రాముఖ్యత పోషక విలువలు

పరిచయం:
పుచ్చకాయను సాధారణంగా మన తెలంగాణ ప్రాంతంలో కర్బూజా అని కూడా పిలుస్తుంటారు. ఇది తీగజాతి పంట. ఇది అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో బాగా దిగుబడి వస్తుంది. సాధారణంగా తక్కువ ఉష్ణోగ్రత (18°C) ఉన్న ప్రాంతాల్లో దీన్ని సాగు చేయలేము. మన తెలంగాణ ప్రాంతంలో దీన్ని ఫిబ్రవరి మాసంలో సాగుచేసినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు.మన తెలంగాణ ప్రాంతంలో ఫిబ్రవరి మాసం నుండి ఉష్ణోగ్రతలు పుచ్చకాయ సాగుకు అనుకూలంగా ఉంటాయి.

సాగుకు అనుకూలమైన నేలలు:
ఉదజని సూచిక 6,7 కల్గియున్న ఇసుక నేలలు,మురుగు నీటి వసతితో   ఒండ్రు కలిగిన ఇసుక నేలలు సాగుకు అనుకూలం. నీటి వసతి కలిగిన నేలలో బోదెలు ఏర్పాటు చేసి  విత్తనాలను బోదె పైబాగాన విత్తుకోవాలి.

కావాల్సిన వాతావరణం :
28-32°C పొడి వాతావరణం సాగుకు అనుకూలం. అంకురోత్పత్తికి మాత్రం 25°C నుంచి 30°C ఉష్ణోగ్రత కావలసి ఉంటుంది.  తేమతో కూడిన వాతావరణంలో బూడిద తెగులు, బూజు తెగులు, పక్షి కన్ను తెగులు, పండు ఈగ ఉధృతి ఎక్కువగా ఉంటుంది. చల్లని రాత్రులు మరియు వెచ్చని పగలు పుచ్చ యొక్క తీయదనాన్ని పెంచడానికి తోడ్పడుతాయి. పుచ్చకాయ పక్వానికి వచ్చే దశలో అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే అది చాలా ప్రయోజనకరం.

విత్తన మోతాదు, విత్తే విధానం: 
బోదెలను ఏర్పాటు చేసుకుని విత్తనాలను బోదె పైబాగాన విత్తుక్కోవాలి. బోదె బోదెకు మద్య 2.5 నుండి 3.0 మీటర్ల దూరం ఉండాలి. మొక్కకు మొక్కకు మధ్య 90-120 సెంటీ మీటర్లు ఉండేలా విత్తుకోవాలి.

విత్తే విధానం రెండు రకాలు:
నేరుగా విత్తనాన్ని బోదెల పైన విత్తుకోవచ్చు.
ప్లాస్టిక్ సంచులలో (6X4 సైజు) విత్తుకొని మొలకెత్తిన తర్వాత 2 నుంచి 3 ఆకుల దశలో ముందుగా తయారు చేసుకున్న బోదెల  పైన నాటుకోవాలి.

గమనిక:
ప్లాస్టిక్ సంచులని 1 భాగం ఇసుక, 2 భాగాలు ఎరువు చొప్పున మట్టితో నింపాలి.
నేరుగా విత్తనాన్ని భూమిలో విత్తే ముందు దానిని కాఫ్టన్ లేదా  తైరామ్ తో విత్తనశుద్ధి చేయాలి.
ఒక ఎకరం సాగు చేయడానికి ఇంచుమించుగా 1.5 నుండి 2.0 కిలోల విత్తనం అవసరం అవుతుంది.
విత్తేటప్పుడు ప్రతి గుంతలో నాలుగు నుంచి ఐదు విత్తనాలు విత్తాలి.అవి మొలకెత్తి  తీగపారేటప్పుడు కేవలం 2 మొక్కలే ఉంచి మిగతావి తీసివేయాలి.

విత్తే సమయం :
దక్షిణ భారతదేశంలో పుచ్చకాయను జనవరి, ఫిబ్రవరి మాసంలో సాగు చేస్తారు. ఎందుకంటే పుచ్చ సాగుకు అనుకూలమైన ఉష్ణోగ్రతలు ఈ మాసం నుండి  అందుబాటులో ఉంటాయి ( 28‌‌‌-32°C).

ఎరువుల యాజమాన్యం :
ఒక ఎకరానికి 4 -5  టన్నుల పశువుల ఎరువు వేసి బాగా దుక్కిలో కలిపి. తరువాత బోదెలు తయారుచేసుకోవాలి.  ఒక ఎకరానికి 30  -40  కిలోల భాస్వరం, 40 కిలోల నత్రజని మరియు16-24  కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేసుకోవాలి. నత్రజని మాత్రం రెండు దఫాలుగా  నాటేటప్పుడు మరియు  నాటిన 25 రోజుల తర్వాత వేసుకోవాలి.

నీటి యాజమాన్యం :
విత్తేటప్పుడు ,మొక్కలను నాటేటప్పుడు,కాయ ఎదిగేటప్పుడు  వాతావరణాన్ని బట్టి నీటిని ఇవ్వాలి. పుచ్చకాయ చాలా తక్కువ నీరును ఉపయోగించుకుంటుంది. కాబట్టి కాయలు పక్వానికి వచ్చిన తర్వాత నీరు పెట్టడం వలన కాయలు పగిలిపోయి నాణ్యత తగ్గి అధిక లాభాలు పొందలేరు.

పోషకాల పాత్ర
రెండు నుంచి నాలుగు ఆకుల దశలో టిఐబిఏ 25-250 పిపిఎం పిచికారి చేయడం ద్వారా ఎక్కువ పూత మరియు దిగుబడి లభిస్తుంది. అలాగే  పోషకాలు అయినటువంటి మూడు నుంచి నాలుగు గ్రాములు మాలిబ్డనం 3-4గ్రా. లీటరు నీటికి కలిపి 2-4 ఆకుల దశలో పిచికారి చేసినట్లయితే అధిక దిగుబడి లభిస్తుంది.

తీగశిక్షణ, కత్తిరింపు
అధికంగా పెరిగిన తీగను కత్తిరించడం వలన  శాఖీయ పెరుగుదలను నిలువరించి అధిక  స్త్రీ: పురుష  పూల నిష్పత్తిని పెంచి ఎక్కువ దిగుబడిని పొందవచ్చు.  ఒక తీగ పై కేవలం 2 పుచ్చకాయలను మాత్రమే ఉంచి మిగతావి తీసివేయడం వల్ల  పుచ్చకాయ యొక్క పరిమాణం మరియు నాణ్యత పెరుగుతుంది.

కోత సూచికలు:
రైతుల స్థాయిలో
 పుచ్చకాయను చేతితో తట్టినప్పుడు  భారీగా నీరగు  ధ్వని రావడం,  టెండ్రిల్  ఎండటం. భూమికి ఆనుకున్న భాగం తెలుపు నుండి పసుపుపచ్చ రంగులోకి మారడం.  సాధారణంగా పుచ్చకాయ  విత్తిన తరువాత90-120 రోజులకు కోత దశకు వస్తుంది.

సస్యరక్షణ చర్యలు :
తెగుళ్ళు
బూజు తెగులు :
ఆకుల పైభాగాన పసుపు రంగు మచ్చలు, అడుగుభాగాన ఉదా రంగు మచ్చలు, బూజు వంటి పదార్థం ఏర్పడుతుంది. ఆకులు పండు భారీ ఎండిపోతాయి.
నివారణ :
మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా మెటలాక్సిన్ ఎమ్.జడ్ 2 ్రగా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బూడిద తెగులు :
ఆకుల పైభాగాన తెల్లని బూడిద పదార్ధం ఏర్పడుతుంది. ఆకులు పండుబారి రాలిపోతాయి. 20 రోజుల వయసున్న ఆకులను ఇది ఎక్కువగా ఆశిస్తుంది.
నివారణ :
1 మి.లీ. డినోకాప్ లేదా 0.5 మి.లీ. ప్రొపికొనజోల్ లేదా 1 మి.లీ. ట్రెడెమార్ఫ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఫ్యూజ్జేరియం వేరుకుళ్ళు తెగులు :
దీన్ని ఎండు తెగులు అని కూడా అంటారు. ఈ శిలీంద్రం భూమి నుండి వ్యాపిస్తుంది తెగులు సోకిన తీగలు ఆకస్మాత్తుగా ఎండిపోతాయి.
నివారణ :
పంటమార్పిడి చేయాలి. కాపర్ ఆక్సిక్లోరైడ్ లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున వేసి ద్రావణాన్ని మొక్క మొదలు చుట్టూ పాదు తడిచేలా పోయాలి. 10 రోజుల వ్యవధిలో2-3 సార్లు చేయాలి.   

వెర్రితెగులు:
ఆకులు గిడసబారిపోయి, పూత పిందె ఆగిపోతుంది. ఇది పేనుబంక ద్వారా వ్యాప్తి చెందుతుంది. 
నివారణ:
తెగులు సోకిన మొక్కను పీకి నాశనం చేయాలి.
తెగులుకు కారణమైన పేనుబంక పురుగులను లీటరు నీటికి 2 మి.లీ చోప్పున మిథైల్‌డెమాటాన్‌ లేదా 2.మి.లీ ఫిప్రొనిల్‌  లేదా 1.5 గ్రా. ఎసిపేట్‌ కలిపి పిచికారి చేయాలి. 

పక్షికన్ను తెగులు (ఆంత్రక్నోస్) :
ఆకులపై, కాయలపై గుండ్రటి చిన్న మచ్చలు ఏర్పడి ఎండి రాలిపోతాయి. పిందె దశలోనే కాయలు రాలుతాయి.
నివారణ:
కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బండైజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజులకు ఒకసారి చొప్పున 2 సార్లు పిచికారి చేయాలి.

పురుగులు :
పండు ఈగ :
పూత దశళో తల్లి ఈగలు పువ్వులపై గుడ్లను పెడతాయి. ఇవి పూత పిందెలోకి చేరి కాయలను తిని నష్టపరుస్తాయి.
నివారణ : 
15 మి.లీ. సైపర్ మెత్రిన్ లేదా 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్ లీటరు నీటికి కలిపి పిందె దశలో పిచికారి చేయాలి.

పొట్ల ఆకు పురుగు :
గొంగలి పురుగులు పంట పెరుగుదల దశలో మరియు పూత దశలో ఆకులను కొరికి తినేస్తాయి.
నివారణ :
క్వినాల్ ఫాస్ 2 మి.లీ. లేదా క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

పుచ్చకాయ యొక్క ప్రాముఖ్యత మరియు పోషక విలువలు :
పుచ్చకాయలు తక్కువ కాలరీలు, ఎక్కువ విటమిన్ ‘ఎ’ మరియు ‘సి’ని కలిగియుండటమే కాకుండా దాహాన్ని తీర్చే గుణాన్ని కూడా కలిగి ఉంటాయి.
పుచ్చపండు శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది.
పుచ్చకాయలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. అనగా....
      i)  జ్వరాన్ని తగ్గించే గుణం
      ii)  మన శరీరంలో ఉన్న వ్యర్ధాలను మలం ద్వారా తొలగించే గుణం
      iii)  గ్యాస్ట్రిక్ సమస్యలను నయం చేసే గుణం
      iv) జీర్ణకోశమునకు సంబంధించిన సమస్యలను నయంచేసే గుణం
పుచ్చకాయలను తినటం వలన రక్తహీనతను తగ్గించవచ్చును. ఎందుకంటే పుచ్చకాయలో ఐరన్ (Fe) ఎక్కువగా ఉంటుంది.
పుచ్చకాయ 95% నీటిని కలిగి ఉండడం ద్వరా దాహాన్ని త్వరగా తీరుస్తుంది. దీనితో పాటుగా పుచ్చలో ప్రోటీన్లు 0.2%, మినరల్స్ 0.3% మరియు కార్బోహైడ్రేట్లు 7% ఉంటాయి.
కండరాల నొప్పి నుండి విశ్రాంతిని కలిగిస్తుంది.
మూత్రపిండ లోపాలను సవరిస్తుంది.
క్యాన్సర్ ను నివారించడానికి తోడ్పడుతుంది.
రక్తపోటును తగ్గిస్తుంది మరియు హృదయానికి చాలా మేలు కల్గిస్తుంది.

రచయిత సమాచారం

కె మధుసూదన్ రెడ్డి, పి హెచ్ డి ఇన్ హార్టికల్చర్, బీహార్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆర్. రవితేజ పి.హెచ్ డి ఇన్ స్కాలర్ వెజిటేబుల్ సైన్స్,