Print this page..

వేసవిలో నువ్వుల పంట సాగు యాజమాన్యం

మన రాష్ట్రంలో  నువ్వు పంటను 48,000 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నువ్వు పంట కరీంనగర్, జగిత్యాల, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ మరియు మహబూబ్ నగర్ జిల్లాలలో ప్రథానంగా సాగులో ఉంది. 
నువ్వు పంట ఉత్తర తెలంగాణ ప్రాంత జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయబడుతోంది. అధికదిగుబడులనిచ్చు శ్వేతాథిల్, హిమ మరియు జగిత్యాల తిల్-1 వంటి మేలైన తెల్లగింజ రకాలు రైతులకు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానము, పొలాస, జగిత్యాలలో అందుబాటులో ఉన్నాయి.

రైతులు ప్రథానంగా పాటించవలసిన పద్దతులేమనగా... :-
అనువైన రకాలు :

అధిక దిగుబడి సాధించాలంటే అనువైన రకాల ఎంపిక చాలా అవసరం. ఇందుకుగాను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పొలాస, జగిత్యాల నుండి విడుదల చేసిన తెల్ల నువ్వు రకాలు వేసవి కాలంలో విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
1. రాజేశ్వరి :
విడుదలైన సంవత్సరం : 1988. 
దిగుబడి : వేసవి 800 కి/హె.
గింజ రకం : తెల్ల గింజ రకం
సాగుకు అనువైన ప్రాంతాలు : తెలంగాణ జిల్లాలు
కాలపరిమితి : వేసవి 85-90 రోజులు
నూనె శాతం : 50%
ప్రత్యేక లక్షణాలు : కాండం తొలచు పురుగు, కాండం కుళ్ళు తెగుళ్ళను కొంతవరకు తట్టుకుంటుంది. ఎగుమతి ప్రాధాన్యత కలదు.

2. శ్వేత (జె.సి.యస్ 96) :
విడుదలైన సంవత్సరం : 1996
దిగుబడి : వేసవి 950-1000 కి./హె.
గింజ రకం : తెల్లగింజ రకం
సాగుకు అనువైన ప్రాంతాలు : తెలంగాణ జిల్లాలు
కాలపరిమితి : లేట్ ఖరీఫ్ 90-95 రోజులు, వేసవి 85-90 రోజులు
నూనె శాతం : 46-48%
ప్రత్యేక లక్షణాలు : కాండం తొలుచు పురుగు, కాండం కుళ్ళు తెగుళ్ళను కొంతవరకు తట్టుకొంటుంది. ఎగుమతి ప్రాధాన్యత కలదు.

3. హిమ (జె.సి.యస్ 9426) :
విడుదలైన సంవత్సరం : 206
దిగుబడి : వేసవి 1000-1050 కి./హె.
గింజ రకం : తెల్లగింజ రకం, కాయలు పొడుగ్గా ఉంటాయి.
సాగుకు అనువైన ప్రాంతాలు : తెలంగాణ జిల్లాలు.
కాలపరిమితి : లేట్ ఖరీఫ్ 90-95 రోజులు, వేసవి 80-85 రోజులు
నూనె శాతం : 46-48% 
ప్రత్యేక లక్షణాలు : వెర్రితెగులును కొంతవరకు తట్టకుంటుంది.

4. జగిత్యాల తిల్ - 1 (జె.సి.యస్ 1020) :
విడుదలైన సంవత్సరం : 2019
దిగుబడి : వేసవి 1050-1100 కి/హె.
గింజ రకం : జడకాతతో కూడిన తెల్ల గింజ రకం
సాగుకు అనువైన ప్రాంతాలు : తెలంగాణ జిల్లాలు
కాలపరిమితి : లేట్ ఖరీప్ 90-95 రోజులు, వేసవి 85-90 రోజులు
నూనె శాతం : 46-49%

పొలాల ఎంపిక :
పసుపు, మిరప మరియు ప్రత్తి పండించిన ప్రాంతాలలో కూడా పంట తీసిన తరువాత నువ్వు పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చదునుగా ఉన్న పొలాన్ని పొడి దుక్కి చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. పొడి దుక్కిలో విత్తనాలు బాగా మొలకెత్తుతాయి. నీటి వసతి ఉన్న పొలాలను ఎంచుకోవడం వల్ల పంట వివిధ కీలక దశలలో బెట్టకు గురికాకండా చూడవచ్చు. డ్రిప్ పద్ధతిలో నువ్వు సాగు వలన అధిక దిగుబడులు సాధించవచ్చు.

భూసార పరీక్షల ఆధారంగా సమగ్ర ఎరువులను వేసుకోవాలి :
తమకు అందుబాటులో ఉన్నంతమేర సేంద్రియ ఎరువులను బాగా మాగిన 4 టన్నుల పశువుల ఎరువు లేదా 1 టన్ను వర్మి కంపోస్టు లేదా 1 టన్ను గొర్రెల ఎరువు లేదా 1టన్ను కోళ్ళ ఎరువు వేసి కలియదున్నాలి.  సేంద్రియ ఎరువులు వాడుట వలన మంచి దిగుబడి సాధించవచ్చు. ప్రథాన పోషకాలను నత్రజని 16 కిలోలు, 8 కిలోల పొటాష్ మరియు 8 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. విత్తిన  30 రోజులకు నీటితడి పెట్టుకుని ఎకరానికి మరో 18 కిలోల యూరియా పై పాటుగా మొక్కల మొదల్లో వేయాలి.

విత్తన సేకరణ : 
మోతాదు - సమయం, విత్తు పద్ధతి :
విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనాస్థానములు / తెలంగాణ సీడ్స్/యన్.యస్.సి./నమ్మకమైన విత్తన రైతుల నుండి మాత్రమే సేకరించాలి.
విత్తన మొలకశాతం కనీసం 80 శాతానికి పైగా ఉండాలి.  విత్తు సమయం, విత్తన మోతాదు వేసవి (జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు 2.5 కిలోల విత్తనం విత్తుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎకరాకు 2.5 కిలోల విత్తనానికి 7 కిలోల పొడి ఇసుకలో కలిపి వేసుకోవాలి. విత్తనాని్న 2.5 సెం.మీ. లోతు మించకుండా వరుసలలో విత్తుకోవాలి.
పంటను వరుసలలో గొర్రు / ట్రాక్టరు నడిచే సీడ్ డ్రిల్ తో విత్తడం వల్ల వరుసల మధ్య దూరం (30 సెం.మీ) వరుసలో మొక్కల మధ్య దూరము (15 సెం.మీ.)గా నియంత్రించవచ్చు. రైతు స్థాయిలో పొడి దుక్కిలో విత్తనాని్న సమంగా చల్లుకుని గొర్రు తోలుకుంటారు.

విత్తనశుద్ధి చేయుట :
నేల నుండి సంక్రమించు తెగుళ్ళను నివారించుటకు కిలో విత్తనానికి 3 గ్రాముల మాంకోజెబ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.

కలుపు నివారణ : 
విత్తిన 20 రోజులకు అదనపు మొక్కలను తొలగించి పుచన చేయాలి. చేయని ఎడల మొక్క ఎత్తు బాగా పెరుగుతుంది. మరియు ఆకులు మాత్రమే ఏర్పడి పూత మరియు కాత ఎక్కువగా రాక దిగుబడి తగ్గిపోతుంది. విత్తిన 30 రోజులకు మనుషులతో ఒకసారి కలుపు తీయించాలి.

నీటితడులు :
విత్తనాలు మొలకెత్తుటకు నేలలో సరిపడా తేమ ఉండాలి. అలా లేని పక్షంలో విత్తిన వెంటనే అదే రోజు నీటి తడిని ఇవ్వాలి లేని ఎడలలో మొలకశాతం దెబ్బతింటుంది. విత్తిన 4వ రోజు తేలికపాటి నీటి తడి ఇవ్వాలి. దీని వలన మంచి మొలకశాతం వస్తుంది. 
విత్తిన 12-15 రోజులకు నీటితడి తప్పకుండా ఇవ్వాలి. పంట చివరి వరకు 10-12 రోజుల వ్యవధితో నీటితడులు ఇవ్వాలి.
విత్తిన 30 రోజులకు మొదటి కలుపు తీసిన తర్వాత నీటితడి పెట్టుకోవాలి. విత్తిన 30-40 రోజుల నుండి 65-70 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. ఎందుకంటే ఈ సమయంలో పూత, కాతతో పాటు గింజలు నిండటం జరుగుతుంది.

పంట కోత మరియు నూర్పిడి :
నువ్వులలో నాణ్యమైన మరియు అధిక మొలకశాతం కలిగిన విత్తనాని్న పొందాలంటే పంటను సకాలంలో కోయాలి. విత్తనపంటను సరైన పక్వదశలో కోసినట్లయితే విత్తనాన్ని పొందవచ్చు. త్వరగా లేదా ఆలస్యంగా కోయటం మరియు కోసిన తర్వాత ఎక్కువ రోజులు ఎండనివ్వటం చేయకూడదు 75-80 శాతం కాయలు లేత పసుపు రంగుకి మారి క్రింది 1-2 కాయలు పగిలి ఉండాలి. కాయల్లో తేమ 50-60 శాతం విత్తనాలలో తేమ 25-30 ఉండాలి. కోత ఆలస్యం చేసిన కాయలు పగిలి విత్తనాలు రాలిపోయి దిగుబడి తగ్గుతుంది. మొక్కలను కోసి పైకి కాయలు వచ్చేలాగా తిరిగి నిలబెట్టాలి. ఇలా చేయడం వలన పూర్తిగా పక్వం కాని కాయలు కూడా పక్వానికి వస్తాయి. ఇలా 5-7 రోజులు ఉంచిన తేమ శాతం 15-18%కు తగ్గుతుంది. పంటను నూర్చే సమయంలో విత్తన కవచం దెబ్బతినకూడదు, విత్తనం ఎండబెట్టే సమయంలో నేరుగా సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్త పడాలి. లేని యెడల ఆ వేడికి విత్తన పొర దెబ్బతింటుంది.

విత్తన నిల్వలో తీసుకోవాలసిన జాగ్రత్తలు :
విత్తనము నిల్వ చేయు గోదాములు భూమి నుండి కనీసం ఒక మీటరు ఎత్తులో ఉండి కేవలం ఒకే ఒక ద్వారంను కలిగి ఉండాలి. గోదాములలో కొత్త విత్తనాలను నిల్వ చేసే ముందు అందులోనున్న పాత విత్తన సంచులను మరియు పురుగు ఆశించిన విత్తనాలను తీసివేసి గోదాములను శుభ్రపరచాలి. విత్తనాలను సాధ్యమైనంత వరకు కొత్త గోనె సంచులలోనే నిల్వ చేయాలి. విత్తనాలను గోదాము లోపల నేలపై కాకుండా చెక్క బల్లలపై 5-7 వరుసలకు మించకుండా క్రొత్త సంచులలోనే నిల్వ ఉంచాలి. విత్తన నిల్వ కాలంలో తరచుగా విత్తన పరీఓ చేసుకుంటూ విత్తన నాణ్యత సరిచూసుకోవాలి.

చీడపీడల యాజమాన్యం :
గడ్డి చిలుక : 
విత్తిన 20 రోజుల లోపు గడ్డి చిలుక మొలకెత్తే  మొక్కల మొదళ్ళను / మొగిని కొట్టివేయడం వలన మొక్క ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. గడ్డి చిలుక నివారణకు రక్షక పంటగా జొన్న వేయడంతో పాటు గట్లు / పరిసరాలు శుభ్రంగా ఉంచాలి. ఉధృతి ఎక్కువైన పరిస్థితులలో 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 2.0 మి.లీ. ప్రొఫినోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 
రసం పీల్చే పురుగులు :
విత్తిన 20-25 రోజుల దశలో పంటను రసం పీల్చు పురుగులు (తామర పురుగులు, ఆకు నల్లి మరియు పేనుబంక) ఆశిస్తాయి. వీటి వలన ఆకులు ముందుగా ముడుచుకుపోయి, పాలిపోయి తర్వాత దశలో ఎండిపోతాయి. తామర పురుగులు మరియు పేనుబంక నివారణకు లీటరు నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. డైమిథోయేట్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ మరియు ఆకు నల్లి నివారణకు 5.0 మి.లీ. డైకోఫాల్ కలిపి పిచికారి చేయాలి.
 
ఆకు గూడు పురుగు మరియు కాయ తొలుచు పురుగు : 
ఆకు గూడు పురుగు ఆకులతో గూడు కట్టి పచ్చని పదార్ధాన్ని గీకి తినడం వలన ఆకులు ఎండిపోతాయి మరియు మొగ్గ ఏర్పడే దశలో మొగ్గలను, పువ్వులను, కాయల్లోని లేత గింజలను తింటాయి. వీటి నివారణకు 2.0 మి.లీ. క్వినాల్ ఫాస్ లేదా 2.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. లేత మొగ్గలను తినివేయడం వలన మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది. లేదా పువ్వులు గింజ కట్టక గ్రుడ్డి పువ్వులుగా మారుతాయి. నివారణకు మొగ్గ దశలో 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2.0 మి.లీ. ప్రొఫినోఫాస్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 
కాండం / వేరుకుళ్ళు తెగులు :
పంట తొలిదశలో కాండం / వేరుకుళ్ళు తెగులు ఆశించి మొక్క పూర్తిగా ఎండిపోవడం జరుగుతుంది. భూమి ద్వారా సంక్రమించే శిలీంధ్రాల వలన ఈ ఎండు తెగులు వ్యాపిస్తుంది. వీటి వ్యాప్తిని అరికట్టడానికి 1.0 గ్రా. కార్బండాజిమ్ లేదా 3.0 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందులను ఒక లీటరు నీటికి కలిపి వేర్లు తడిచేలా మొక్కల మొదళ్ళలో పోయాలి.
 
బూడిద తెగులు :
వాతావరణంలో ఎక్కువ చలి వలన పంటకు బూడిద తెగులు ఎక్కువగా ఆశించే ఆస్కారం ఉంటుంది. ఈ తెగులు వల్ల ఆకులు మరియు కాయలపై బూడిద రంగు పదార్ధం ఏర్పడి కిరణజన్య సంయోగక్రియ తగ్గిపోతుంది. తద్వారా మొక్కల ఎదుగుదల తగ్గటం మాత్రమే కాకుండా దిగుబడితో పాటుగా గింజనాణ్యత కూడా తగ్గిపోవును. ఈ తెగులు నివారణకి లీటరు నీటికి 3 గ్రా. నీటిలో కరిగే గంధకం లేదా 1.0 గ్రా. కార్బండాజిమ్ లేదా 1.0 గ్రా. మైక్లోబుటానిల్ కలిపి పిచికారి చేయాలి.
 
వెర్రి తెగులు : 
సాధారణంగా ఆలస్యంగా వేసిన పంటలో పూత సమయంలో వెర్రితెగులు (ఫిల్లోడి) ఎక్కువగా వస్తుంది. మొక్కలో ఆకులు చిన్నవిగా మారి పూత ఏర్పడదు. ఈ తెగులు సోకిన మొక్కలని పీకి కాల్చివేయాలి. మరియు పచ్చదోమను అరికట్టడానికి 2.0 మి.లీ. డైమిథోయేట్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 
ఆల్టర్నేరియా మరియు సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు :
ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు పంట 20-25 రోజుల సమయంలో వలయాకారపు గోధుమ రంగు మచ్చలు ఏర్పడటం ద్వారా మొదలవుతుంది. ఈ మచ్చలు మొదట కింది ఆకులపైన ఏర్పడి లేత ఆకులకి వ్యాపించడమే కాకుండా కాండంపైన కూడా కనిపిస్తాయి. సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు వలన ఆకుల అడుగు భాగంలో తుప్పు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు ఎండిపోతాయి. దీని నివారణకు 2.5 గ్రా. కార్బండిజమ్ మరియు మాంకోజెబ్ కలిపిన మందు ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

రచయిత సమాచారం

డా. డి. పద్మజ, శాస్త్రవేత్త, ఎమ్. రాజేంద్రప్రసాద్, శాస్త్రవేత్త, పి. మధుకర్ రావు, శాస్త్రవేత్త, ఎస్. ఓంప్రకాశ్, శాస్త్రవేత్త, పి. జగన్ మోహన్ రావు, సహ పరిశోధన సంచాలకులు.