Print this page..

వంగసాగులో అనుసరించాల్సిన మెళకువలు

వంకాయ రుచికి రాజు, దీన్ని కూరలలో రాజుగా పిలుస్తారు....అలాంటి  గుత్తి వంకాయ లేని పెళ్లి భోజనాలు ఉండవనడంలో అతిశయోక్తి లేదు.. వారానికి సరిపడా కొనే కురగాయాల్లో వంకాయ లేకుండా  సంచి నిండదు. అలాంటి వంకాయకి పురుగు , తెగుళ్ళు మందులు విపరీతంగా వాడటం  కొనే వాళ్ళు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ లాంటి ప్రస్తుత  పరిస్థితిలో రైతులు కొన్ని మెళకువలు పాటించి దిగుబడి తగ్గకుండా పెట్టిబడి ని అదుపులో పెట్టుకుంటూ లాబాలు ఆర్జించి, మన కర్నూలు జిల్లా పోలూరు వంకాయ నుండి పశ్చిమ గోదావరి జిల్లా పెన్నాడ వంకాయ వరకు కూడా మన రాష్ట్రంలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలకు వంకాయ రుచిని అందిచి మన రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించవచ్చు.

నారుమడి పెంపకం:
 నారుమడిలో పొలానికి అనువయునట్లు ఎత్తైన మడులలో (6 అంగుళాలు ఎత్తు ఉండే 4x1 మీ. సైజుగల) నారుమళ్ళను తయారుచేసుకోవాలి.  ఎకరాకు 10-12 నారుమళ్ళ నారు సరిపోతుంది. ఎంచుకున్న 260 గ్రా. సూటి విత్తనాన్ని (సంకర విత్తనం ఐతే 120 గ్రా) 10 సెం.మీ. వరుసల్లో విత్తుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి, నీడలో ఆరనివ్వాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రా. చొప్పున థైరామ్ లేదా మాంకోజెబ్ అనే మందుతో విత్తనశుద్ధి చేయాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 4 గ్రా.ల చొప్పున ట్రైకోడెర్మా విరిడి కల్చర్‌ను కూడా పట్టించి విత్తుకోవాలి. 
విత్తిన తరువాత మాగుడు తెగులు/ నారు కుళ్ళు కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధి ఇస్తూ 2-3 సార్లు నారుమడిని బాగా తడపాలి. నారును పీకటానికి వారం రోజుల ముందు 250 గ్రా. కార్బోఫ్యూరాన్ గుళికలను 100 చ.మీ. నారుమడికి వేయాలి. ప్రోట్రేలలో పెంచుకున్న నారు బాగా శ్రేయస్కరం. 
ఎకరాకు 200 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వేసుకోవాలి. బాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడిని వేసుకోవాలి. రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను నాటే ముందు వేసుకోవాలి. 

ఎరువులు:
ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్ ఫాస్పేట్), 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్) చివరి దుక్కిలో వేయాలి. 40 కిలోల నత్రజనిని, (200 కిలోల అమ్మోనియం సల్ఫేట్ లేదా 85 కిలోల యూరియా), 3 సమభాగాలుగా చేసి నాటిన 30వ, 60వ మరియు 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50% అధికం చేసి వేయాల్సివుంటుంది. 
కలుపు నివారణ, అంతరకృషి: విత్తిన లేదా నాటిన 24-48 గంటలలో అలాక్లోర్ 1.0 లీ. (తేలిక నేలలు), 1.5 లీటర్లు చొప్పున (బరువు నేలలకు) ఎకరాకు పిచికారీ చేయాలి. నాటిన 25, 30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పైపాటు ఎరువులు వేసే ప్రతిసారి గొప్పు త్రవ్వి బోదెలు సరిచేస్తే పంట బాగా పెరుగుతుంది.

సస్యరక్షణ -పురుగులు: 
మొవ్వు మరియు కాయతొలు చు పురుగు: 
నాటిన 30-40 రోజుల నుండి ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగచేస్తుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మల చివర్లు త్రుంచి వేసి నాశనం చేసి ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా సైపర్ చిత్రిన్ 1 మి.లీ. లీటరు నీటిలో కలిపి రెండుసార్లు 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి. లిమ్గాకర్షణ బుట్టలను పెట్టి పురుగు ఉద్రుతిని తెలుసుకుని మందులు పిచికారి చేసుకోవడమే కాకుండా ఎక్కువ సంక్యలో బుఉఅలు పెట్టి పరుగుల సంక్యను కూడా తగ్గించ వచ్చు.

రసం పీల్చే పురుగులు (దీపపు పురుగులు, పేనుబంక, తెల్లదోమ): 
ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయటం వలన ఆకులు పసుపు రంగుకు మారి పైకి ముడుచుకొని ఎండిపోతాయి. వీటి నివారణకు డైమిథోయేట్ లేదా ఫిప్రొనిల్ లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తెల్లదోమ అధికంగా ఉన్న ఎడల ఎసిఫేట్ 1.5 గ్రా. చొ॥న లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 
ఎర్రనల్లి: 
ఆకుల అడుగుభాగాన చేరి రసం పీల్చటం వలన ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలె గూడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రా. లేదా డైకోఫాల్ 5 మి.లీ. లేదా స్పైరోమెసిఫెన్ 3 మి.లీ. లేదా ప్రొపర్ గైట్ 3 మి.లీ. చొప్పున కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. 
 

నులి పురుగులు (రూట్ నాట్ నెమటోడ్స్):
ఈ పురుగులు ఆశించిన పంట వేర్లపై వేరు బుడిపెలు కనపడతాయి. ఇవి ఆశించిన మొక్కలు తక్కువగా పెరిగి పేలగా, తక్కువ కాయలు కాస్తాయి. భారతదేశంలోని అన్ని ప్రాంతాల్లో వంగను ఆశిస్తాయి. వీటిని తట్టుకొనే రకాలను సాగుచేయాలి. పొలంలో నులి పురుగుల సంతతిని తగ్గించటానికి తప్పనిసరిగా అన్ని పొలాల్లో ఒక ఏడాదిపాటు బంతిపూల పంటతో పంటమార్పిడి చేయాలి. 

తెగుళ్ళు: 
ఆకుమాడు తెగులు: 

నారును పొలంలో నాటిన తర్వాత సుమారుగా 30 రోజులకు ఆశిస్తుంది. ఆకులన్నీ మాడిపోయినట్లుగా కనిపిస్తాయి. ఈ తెగులు ఆశించినపుడు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత పసుపురంగుకు మారి వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లని వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కన్పిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బెండజిమ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుమాడు మరియు కాయకుళ్ళు తెగులు: ఆకుల మీద అక్కడక్కడ గోధుమ రంగుతో కూడిన మచ్చలు కన్పిస్తాయి. తెగులు ఉధృతమైతే ఆకులు మాడి రాలిపోతాయి. తెగులు సోకిన కాయలు పసుపురంగుకు మారి, కుళ్ళిపోతాయి. దీని నివారణకు నారుమడిలో విత్తే ముందు 50° సెల్సియస్ ఉష్ణోగ్రత గల నీటిలో విత్తనాలను 30 ని|| పాటు నానబెట్టి విత్తుకోవాలి. తెగులు ఆశించిన పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ మందును లీటరు నీటికి 3 గ్రా. చొప్పున కలిపి పైరుపై 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు ఉదయం లేదా సాయంకాల సమయంలో పిచికారీ చేయాలి.

వెర్రితెగులు (లిటిల్ లీఫ్): 
ఆకులు సన్నగా మారి, పాలిపోయిన ఆకుపచ్చని రంగు కల్గి ఉంటాయి. మొక్కలు గుబురుగా, చీపురు కట్టలా కనపడతాయి. పూత, కాత లేకుండా మొక్కలు గొడ్డు బారిపోతాయి. ఇది వైరస్ తెగులు. ఈ వైరస్ ని బ్రౌన్ లీఫ్ హైపర్ (దోమ) వ్యాపింపచేస్తుంది. దీని నివారణకు మిథైల్ డెమటాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నివారించాలి. తెగులు ఆశించిన మొక్కలను ఎప్పటికప్పుడు గుర్తించి నాశనం చేయాలి. నారుమడి దశలో నాటటానికి వారం రోజుల ముందు 250 గ్రా. కార్బోఫ్యూరాన్ 3 జి గుళికలను 100 చ.మీ. నారుమడికి వేయాలి. నాన 2 వారాల తర్వాత 2వ దఫాగా ఎకరాకు 8 కిలోల చొప్పున ఇవే గుళికల మందును వేయాలి. నాటేముందు నారువేళ్ళను 1000 పి.పి.యమ్. టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకొని, నాటిన 4-5 వారాల తర్వాత 7-10 రోజుల వ్యవధిలో డైమిథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి 3 సార్లు పిచికారీ చేయాలి. పొలంలో వెర్రి తెగులు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకివేసి జిబ్బరిల్లిక్ ఆమ్లం 50 మి.గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినచో కొంత వరకు తెగులు ఉధృతి తగ్గుతుంది. 

ఎండు తెగులు (బాక్టీరియల్ విల్ట్): 
ఈ తెగులుకు తగిన నివారణ చర్యలు లేవు. ఈ తెగులును తట్టుకొనే పూసాపర్పుల్ క్లస్టర్ లేదా పూసా క్రాంతి రకాలను ఎన్నుకొని తప్పని సరిగా పంట మార్పిడి పద్ధతి అవలంభించాలి. కాలీఫ్లవర్ పంటతో పంట మార్పిడి చేసుకోవాలి. నారు మడి నుండి నారును తీసిన తర్వాత స్ట్రెప్టోసైక్లిన్ 0.5 గ్రా./ లీ. నీటికి కలిపిన ద్రావణంలో అరగంట సేపు ముంచి నాటుకోవాలి. 

వంగలో సమగ్ర సస్యరక్షణ:
పురుగు ఆశించిన కాయలను, కొమ్మలను తుంచి నాశనం చేయాలి. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలను వేసుకోవాలి.
లింగాకర్షక బుట్టలు ,ఎకరాకు 4 చొప్పున పెట్టాలి. నీలం మరియు పసుపు రంగు జిగురు అట్టలను పెట్టి రసం పీల్చే పురుగుల ఉద్రుతిని గమనించాలి. 
తలనత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి ఒక అంగుళం క్రిందికి తుంచి నాశనంచేయాలి. 
అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి.
ట్రైకోగ్రామా బదనికలను ఎకరాకు 20,000 చొప్పున విడుదల చేయాలి.
బి.టి. మందులను లీటరు నీటికి ఒక గ్రాము చొప్పున కలిపి పూత దశలో పిచికారి చేయాలి. 
ఎకరాకు 200 కిలోల చొ॥న వేపపిండిని దుక్కిలో వేయాలి. 
బాక్టీరియా ఎండుతెగులు వున్న ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్ పొడి మందును వేసుకోవాలి.
జీవ శిలింద్ర నాసినులు ట్రైకోడెర్మా మరియు సూడోమోనాస్ లను వాడటం వలన మొక్కలకు హాని కలిగించే సేలింద్రలను అరికట్టవచ్చు. ట్రైకోడెర్మా విరిడి కల్చరు ఎకరాకు 2-3 కిలోల చొప్పున దుక్కిలో వాడాలి. అయితే ఒక కిలో ట్రైకోడెర్మా విరిడి కలలను 10 కిలోల వేపపిండి, 90 కిలోల పశువుల ఎరువుతో కలిపి 10-15 రోజులు నీడలో ఉంచి అప్పుడప్పుడు నీరు చల్లుతూ ఉంటే ఈ శిలీంధ్రం దానిలో బాగా అభివృద్ధి చెందుతుంది. దీని వాడకం వలన భూమి నుండి ఆశించే ఎండు, కుళ్ళు తెగుళ్ళను నివారించవచ్చు. 
రసం పీల్చు పురుగులు ఆశించకుండా ఎకరానికి 10 కిలోల చొప్పున కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవాలి. 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 0.5 మి.లీ. సైపర్మె న్ లేదా 2 మి.లీ. ప్రొఫెనోఫాస్ లేదా థయోడికార్బ్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి కాయతొలుచు పురుగులను నివారించుకోవాలి.
పంట పూత, కాత దశలో 2, 4-డి (10 మి.గ్రా. లీటరు నీటికి) లేదా నాఫ్తలీన్ అసిటికామ్లం 1 మి.లీ. 4 లీటర్ల నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేస్తే 15-20% అధికోత్పత్తి పొందవచ్చు.  

రచయిత సమాచారం

ఆర్.బిందు ప్రవీణ ఉద్యాన శాస్త్రవేత్త , డా. ఎన్.ఎం.రావు, ప్రోగ్రాం కో ఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఉండి.