Print this page..

వానాకాలం కంది సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు

ఖమ్మం జిల్లాలో సాగు చేసే అపరాల పంటలలో కంది ముఖ్యమైనది. వర్షాధార తేలిక భూములలో కందిని మించిన పంట లేదని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. 
కంది లెగ్యూమినేసికి చెందిన పంట కావడంతో వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణంలోని నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తుంది. తద్వారా భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేలపై పడి సేంద్రియ పదార్ధంగా మారడం వలన భూ, భౌతిక రసాయన లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మ జీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకొనే సామర్ధ్యం పెరుగుతుంది.
కందిని ఏక పంటగా లేదా సహ పంటగా ప్రత్తి, పెసర, వేరుశనగతో కలిపి నిర్ధిష్ట పద్ధతిలో సాగు చేసుకోవచ్చు. 
సాగు ఖర్చు చాలా తక్కువ. 
విత్తనం నుంచి కోత వరకు పూర్తిగా యాంత్రీకరణ పద్ధతిలో కంది పంటను సాగు చేసుకోవచ్చు.
రెండు / మూడు తడులు ఇచ్చినట్లయితే వాణిజ్య పంటలతో సమానంగా దిగుబడులు / లాభాలు పంచే పంట.

నేలలు మరియు నేల తయారీ :
ఎర్ర చల్కా మరియు నల్ల రేగడి నేలలు, మురుగు నీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలం.
తొలకరిలో కురిసే వర్షం ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలిక పాటి నేలల్లో 60 మి.మీ. మరియు బరువైన నేలల్లో 75 మి.మీ. వర్షపాతం నమోదైన తరువాత లేదా దుక్కి 15-20 సెం.మీ. లోతు తడిసిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి.

విత్తే సమయం :
జూన్ 15 నుండి జూలై 15 వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో ఆగష్టు 15 వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు.

రకాలు :
ఎల్.ఆర్.జి.-41 : 180 రోజుల పంట కాలం కలిగి ఎకరానికి 8-10 క్విం. దిగుబడినిస్తుంది. శనగ పచ్చపురుగును తట్టుకొంటుంది. నల్లరేగడి భూములకు అనుకూలం. నీటి వసతి గల తేలిక భూముల్లో సాగు చేయవచ్చు.
ఐ.సి.ఫి.ఎల్ - 87119 (ఆశ) : 170-180 రోజుల పంట కాలం కలిగి, ఎకరానికి 7-8 క్విం. దిగుబడినిస్తుంది. ఎండ తెగులు మరియు వెర్రి తెగులును తట్టుకుంటుంది.
డబ్ల్యు.ఆర్.జి - 65 (రుద్రేశ్వర) : 160-180 రోజుల పంట కాలం కలిగి, ఎకరానికి 8-10 క్విం. దిగుబడినిస్తుంది. ఎండు తెగులు మరియు శనగ పచ్చ పురుగును కొంత వరకు తట్టుకొంటుంది. నల్ల రేగడి భూములకు అనుకూలం.
పి.ఆర్.జి  176 (ఉజ్వల) : 130-135 రోజుల పంటకాలం కలిగి, ఎకరానికి 7-8 క్విం. దిగుబడినిస్తుంది. మధ్యస్థ నేలలు, తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతాలకు అనువైన రకం.
పి.ఆర్.జి - 158 (పాలెం కంది) : 150-155 రోజుల పంటకాలం కలిగి, ఎకరానికి 6-7 క్విం. దిగుబడినిస్తుంది. ఫ్యుజేరియం ఎండు తెగులును తట్టుకొంటుంది. 
టి.డి.ఆర్.జి-4 (హనుమ) : 160-180 రోజుల పంటకాలం కలిగి, ఎకరానికి 8-10 క్విం. దిగుబడినిస్తుంది. ఫ్యుజేరియం ఎండు తెగులును పూర్తిగా తట్టుకొంటుంది. వెర్రి తెగులు మరియు శనగ పచ్చ పురుగును కొంత మేరకు తట్టుకొంటుంది.
డబ్ల్యు.ఆర్.జి.ఐ. - 93 (తెలంగాణ కంది - 1) : 150-165 రోజుల పంటకాలం కలిగి, ఎకరానికి 7-8 క్విం. దిగుబడినిస్తుంది. మధ్యస్థ నేలలు, తక్కువ వర్షపాతం గల ప్రాంతాలలో సాగుకు అనుకూలం. ఎండు తెగులును కొంత వరకు తట్టుకొంటుంది.
డబ్ల్యు.ఆర్.జి.ఐ. - 97 (వరంగల్ కంది - 1) : 150-160 రోజుల పంట కాలం కలిగి, ఎకరాకు 7-8 క్విం. దిగుబడినిస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకొంటుంది.

విత్తన మోతాదు :
ఒక ఎకరాకు 2-3 కిలోల విత్తనం సరిపోతుంది.

విత్తన శుద్ధి :
విత్తనం లేదా భూమి ద్వారా సంక్రమించే తెగుళ్ళను అరికట్టడానికి థైరమ్ లేదా కాప్టాన్ 3 గ్రా. మందును ఒక కిలో చొప్పున విత్తనానికి పట్టించాలి. విత్తుకునే ముందు 200 నుండి 400 గ్రా. రైజోబియంను ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి. అలాగే ట్రైకోడెర్మ విరిడిని 8 గ్రా. చొప్పున కిలో విత్తనానికి పట్టించినచో ఎండు తెగులు మరియు భూమి ద్వారా సంక్రమించ తెగుళ్ళ నుండి అరికట్టవచ్చును.

విత్తేదూరం :
నల్ల రేగడి భూమిలో సాలుకు సాలుకు మధ్య 150 లేదా 180 సెం.మీ. ఎర్ర చల్కా భూములలో సాలుకు సాలుకు మధ్య 90 లేదా 120 సెం.మీ. మొక్కల మధ్య 20 సెం.మీ. ఉండేలా విత్తుకోవాలి.

విత్తే పద్ధతి : 
నాగలి వెంబడి గానీ, సాళ్ళలో గొర్రుతో గానీ విత్తుకోవాలి. యాంత్రికంగా సీడ్ కమ్ ఫర్టిడ్రిల్తో బోదె కాలువలు పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. 
కంది సాళ్ళ మధ్య మరియు మొక్కల మధ్య 90 సెం.మీ. సమదూరంలో అచ్చు పద్ధతిలో కూడా విత్తుకోవచ్చు. ఇరు వైపుల అంతరకృషికి దోహదపడే ఈ విధానంలో మంచి దిగుబడులు సాధించవచ్చును.

అంతర పంటలు :
కందిని అంతరపంటగా పండించినప్పుడు ఖచ్ఛితమైన నిష్పత్తిని పాటించాలి.
కంది + మొక్కజొన్న / జొన్న / సజ్జ - 1:4
కంది + పెసర / మినుము - 1:7 / 1:8
కంది + ప్రత్తి - 1:4 లేదా 1:6

ఎరువుల యాజమాన్యం :
ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి.
ఎకరానికి 18 కిలోల యూరియా 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డి.ఎ.పి.ని వేసుకోవాలి.

కలుపు యాజమాన్యం :
పెండిమిథాలిన్ కలుపు మందును ఎకరానికి 1.3 - 1.6 లీ. చొప్పున 200 లీ. నీటికి కలిపి విత్తిన వెంటనే గానీ, మరుసటి రోజు గానీ పిచికారి చేయాలి.
పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫిర్ 300 మి.లీ. ఒక ఎకరాకు పిచికారి చేయాలి.
గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజాల్ఫాప్ - పి - ఇథైల్ 5% ఇ.సి. 400 మి.లీ. లేదా ప్రొపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250 మి.లీ. కలుపు మందును కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో లేదా విత్తిన 25 రోజుల లోపల 200 లీ. నీటికి కలిపి పిచికారి చేయాలి.

నీటియాజమాన్యం :
వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు. నీటి వసతి ఉన్న చోట పూతకు ముందు మరియు కాయ తయారయ్యే దశలలో ఒకటి లేదా రెండు తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు.

పంట కోత మరియు నిల్వ :
కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45-60 రోజులలో పంట పరిపక్వతకు వస్తుంది.
కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ ఫాస్ 25 ఇ.సి. 2 మి.లీ. 1 లీ. నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిడ్స్ ఆశించకుండా కాపాడవచ్చు.
కంది పంట 45 రోజుల దశలో 10 సెం.మీ. పొడవు చిగుర్లు త్రుంచితే పక్క కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత, కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15 శాతం మేర అధిక దిగుబడి సాధించవచ్చు.

రచయిత సమాచారం

డా. పి. శ్రీ రంజిత, డా. జె. హేమంత కుమార్, కృషి విజ్ఞాన కేంద్రం, వైరా