Print this page..

భూసార సంరక్షణలో పచ్చిరొట్ట  ఎరువుల ఆవశ్యకత

భూసార సంరక్షణలో పచ్చిరొట్ట  ఎరువుల ఆవశ్యకత

పంటకు కావలసిన 16 రకాల పోషకాలు మొక్కలు భూమి నుండి గ్రహిస్తాయి.నేలకు స్వతహాగా 16 రకాల పోషకాలు అందజేయగల శక్తి ఉన్నా,కొన్ని సంవత్సరాలుగా సాగుచేయడం వలన వాటి కొరత ఏర్పడింది.కావున వీటి లభ్యత కోసం రైతులు సేంద్రియ ఎరువులైన పశువుల పెంట,వర్మి కంపోస్ట్ మరియు చెరువు మట్టి వంటి వాటిని వేస్తుంటారు.
నానాటికి పెరిగిపోతున్న రసాయన ఎరువుల ధరలు,పశుసంపద తరిగి యాంత్రీకరణ వలన ,తరిగిపోతున్న సహజ వనరుల నేపథ్యంలో ధీర్జకాలికంగా సుస్టిర దిగుబడులు సాదించాలంటే నేలసారాన్ని కాపాడుకోవాలి.ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో చాలా సులభంగా నేలకు సేంద్రియ పదార్థం అందించే పచ్చిరొట్ట ఎరువులు పెంచుకోవాలి.కొన్ని రకాల (జనుము,జీలుగ,పిల్లి పెసర మరియు అలసంద మొదలగునవి)పప్పుజాతి,అతి త్వరగా కుళ్లిపోయే,అధిక మోతాదులో ఎరువులను ఇవ్వగల పంటలను సాగుచేసి 40-50 రోజుల తర్వాత పంటలను పొలాల్లో కలియదున్నినేల సారవంతత,భౌతిక లక్షణాలను పెంపొందించే ప్రక్రియను పచిరొట్ట ఎరువులు అంటారు
పచ్చిరొట్ట ఎరువుల వలన లాభాలు:
పచ్చిరొట్ట ఎరువుల వాడకం వలన నేలలు భూ భౌతిక లక్షణాలు,నీటి ధారణ సామర్థ్యం,నీరు మరియు గాలి ప్రసరణతత్వం ,నేలక్షయన్ని నిరోదించేతత్వం పెరిగి నేల బాగా గుళ్ళ బారుతుంది.
పచ్చిరొట్ట ఎరువులు సరైన సమయంలో నేలలో కలియదున్నటం వల్ల నేలల్లో నత్రజనిని స్థీరికరించడమే కాకుండ భాస్వరం,పొటాష్ లభ్యమయ్యే రూపాల్లోకి మారతాయి.
పచ్చిరొట్ట ఎరువులు వాడకం వలన ఉదజని సూచిక మార్పుచెంది,తద్వార సమస్యాత్మక నేలలు సాగులోకి వస్తాయి.
సేంద్రియ తత్వం పెరగడం వలన మేలు చేసే సూక్ష్మజీవులు స్థాయి పెరుగుతుంది.తర్వాత వేర్ల ఆరోగ్యం,పటుత్వం మరియు నీరు,పోషకాల గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది.
సూక్ష్మపొషకాలు అందుబాటులోకి వచ్చి పంట దిగుబడి నాణ్యత పెరుగుతుంది.
పచ్చిరొట్ట ఎరువులుగా పప్పుజాతి పంటలైన పెసర ,పిల్లిపెసర,జీలుగ లాంటివి సాగు చేసుకున్నప్పుడు వాటి వేరు బొడిపెల ద్వారా నత్రజని స్థిరీకరణ జరిగి నత్రజని ఆదా మరియు వినియోగ సామర్థం పెరుగుతుంది.

పచ్చిరొట్ట పైర్ల కు ఉండాల్సిన  లక్షణాలు:

  • పచ్చిరొట్ట పైర్లు అధిక ఆకులు కలిగి ఉండాలి.
  • పంట తొలిదశలో త్వరగా,ఏపుగా పెరిగే విధంగా ఉండాలి.
  • పూత దశ చేరుకొనేటప్పటికి కాండం మెత్తగా ఉండి తేమ శాతం ఎక్కువగా ఉండాలి.
  • ఎతువంతి నేలల్లో అయినా పెరిగే స్వభావం ఉండాలి.
  • పైర్ల వేర్లు చాలా లోతుగా చొచ్చుకొనిపోయే స్వభావం కలిగి ఉండాలి.
  • పప్పు జాతి మొక్కల వేర్లలో బుడిపెలు ఉండి వాతావరణంలో నత్రజని స్థిరీకరణ చేసేవిగ ఉంటే మరీ మంచిది.
  • తక్కువ వనరులు వినియోగించుకొంటు సాదారణ యాజమాన్యంలో త్వరగా పెరిగి అధికంగా పచ్చిరొట్ట అందించేవిగా ఉండాలి.

పచ్చిరొట్ట రకాలు:
పచ్చిరొట్ట ఎరువుల్లో పచ్చిరొట్టలు,పచ్చిఆకు ఎరువులు అని రెండు రకాలు.
జనుము,జీలుగ ,పెసర,అలసంద లాంటి పంటలను పూత దాక పెంచి నేలల్లో కలియ దున్నడాన్ని పచ్చిరొట్ట ఎరువులు అంటారు.కాని గ్లైరిసిడియా,అవిస,జిల్లేడు,కానుగ,సీమ తంగేడు,వెంపలి లాంటి మొక్కల ఆకులను కోసుకొచ్చి పొలంలో తొక్కి వేయడాన్ని పచ్చి ఆకు ఎరువులు అంటారు.
పచ్చిరొట్ట ఎరువుల వాడకం వలన నేలకు పోషక తత్వాలు లభించడమే కాకుండా ఎంతో విలువైన పచ్చిరొట్ట సేంద్రియ పదార్థం అందుబాటులోకి వస్తాయి.
పచ్చిరొట్ట ఎరువుల వాడకంలో సూచనలు:
పచ్చిరొట్ట ఎరువులను పూతదశలో కలియ దున్నాలి.
నేలలో కలియదున్నే నాటికి పైర్లలో 70-80శాతం తేమ,అలాగే నేలలో కూడా తగినంత నీరు ఉన్నట్లైతే వేగంగా మురుగుతుంది.
పైరు అంతా మురిగిన తర్వాత నీటిని తీసివేసి వేరే నీరు పెట్టాలి.
పచ్చిరొట్ట పంటలు సాగు చేసే నేలల్లో నత్రజని  తక్కువ ఉన్నట్లైతే ఎకరాకు 8కిలోలు నత్రజని వేయడం వల్ల అవి ఏపుగ పెరిగి రొట్ట దిగిబడి అధికంగా ఉంటుంది.వేరు బుడిపెలు పెరిగి ,కలియ దున్నేటపుడు పొషకాల శాతం పెరిగి తర్వాత పంటలకు చక్కగా ఉపయోగపడతాయి.

రచయిత సమాచారం

పి.జోగారావు శాస్త్రవేత్త (మృత్తిక శాస్త్రం ) వ్యవసాయ పరిశోదనా స్టానం,సీతంపేట.