Print this page..

మిడతా మిడతా ఊచ్‌....

ఒక రైతు తన పంటను వేసినప్పటి నుంచి ఆ పంట చేతికొచ్చేదాకా కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఎందుకంటే అనేక మార్గాల్లో ప్రమాదాలు పొంచి ఉంటాయి. అందులో కీటకాల వలన కలిగే నష్టం చెప్పుకోదగినది. పంటకు నష్టం కలిగించే కీటకాలు ఎన్నో రకాలు ఉన్నప్పటికీ మనం ఇటీవల కాలంలో మిడతల గురించి తరచుగా వింటున్నాం. ప్రభుత్వం మరియు ప్రభుత్వ సంస్థలు మీడియా ద్వారా రైతులను అప్రమత్తం చేయడం ఈ సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయి. 

అసు ఏమిటీ మిడతు ?
ఎడారి మిడత యొక్క శాస్త్రీయ నామం Schistocerca gregaria ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ వీటిని అత్యంత ప్రమాదకరమైన వస కీటకాలుగా పేర్కొంది. వీటి వలన ఆహార సంక్షోభ ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన కూడా వ్యక్తం చేసింది.
ఈ మిడతలు పొడి వాతావరణంలో ఎక్కువగా తిరుగుతాయి. ఎడారి మిడత సాధారణ జీవిత కాలం 90 రోజులు. ఈ కాలంలో అవి రెండు సార్లు గుడ్లు పెడతాయి. ఆరు వారాల్లో అవి పెరిగి పెద్దవుతాయి. అవి నెలరోజుల్లో మళ్ళీ గుడ్లు పెడతాయి. అలా వాటి జనాభాను పెంచుకుంటూ పోతాయి.
వర్షాలు పడగానే వీటి సంతానోత్పత్తి పెరిగి తీవ్రదశకు చేరుతాయి. వీటి సంతానోత్పత్తి గణనీయంగా ఉంటుంది. మూడు నెలల్లో ఇవి 20 రెట్లు పెరుగుతాయి. ఆరు నెలల్లో 400 రెట్లకు మరియు 9 నెలల్లో 8 వేలరెట్టకు ఇవి పెరిగిపోతాయి.

ఎందుకంత ప్రమాదకరం?
ఈ మిడతలు విపరీతంగా తింటూ రోజుకు సుమారుగా తమ శరీర బరువంత ఆహారం తీసుకోగలవు. మొక్కలోని అన్ని భాగాలను తింటూ పంట నష్టం కలిగిస్తాయి. ఇవి గుంపులుగా చెట్ల మీద వాలినప్పుడు, వాటి బరువుకు చెట్లు కూడా విరిగి పోగలవు.
వీటి జన సాంధ్రత ఎక్కువ అయినప్పుడు ‘సెరటోనిన్‌’ అనే హార్మోన్‌ విడుదలయి ఇవి గుంపుల్లో వేగవంతమైన కదలికను కనబరుస్తాయి. గాలి వాటంతో రోజుకు 150 కి.మీ. దాకా గుంపుల్లో ప్రయాణం చేస్తాయి. అలా ప్రయాణం చేస్తూ దారిలో పచ్చగా కనిపించిన ఆహారాన్ని మొత్తం తినివేస్తాయి. ఒక చదరపు కి.మీ. గుంపులో 80,000 పెద్ద మిడతలు ఉంటాయి. ఇవి రోజుకు సుమారుగా 35,000 మంది జనాభాకు సరిపడా ఆహారాన్ని తీసుకుంటాయి. పచ్చని పొలాన్ని నాశనం చేసి, బీడు భూములుగా మారుస్తాయి. పొలంపై పడితే రైతు ఆ పంటపై ఆశలు వదుకోవాల్సిందే...

ఈ మిడతను ఎవరు కనిపెట్టుకొని ఉంటారు?
1939లో ఏర్పాటు చేయబడిన మిడత హెచ్చరిక సంస్థ (LWO) ఈ మిడతని మానిటర్‌ చేస్తూ ఎప్పటికప్పుడు నియంత్రణ చర్యలు చేపడుతూ ఉంటుంది. 1946లో దీనిని డైరక్టరేట్‌ ఆఫ్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ క్వారంటైన్‌ అండ్‌ స్టోరేజ్‌ (DPPQS) లో విలీనం చేశారు. మిడతల వలన కలిగే నష్టం అంచనా వేస్తూ, దాన్ని నియంత్రించడం లేదా తగ్గించడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ సంస్థలో మిడతల మీద పరిశోధనలు కూడా జరుగుతూ ఉంటాయి.

కట్టడి ఎలా?
మిడతల దండును మట్టుబెట్టడానికి ప్రభుత్వం ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచిస్తుంది. ఇందులో భాగంగా ఆర్గానోఫాస్ఫేట్‌ రసాయనాలను స్వల్ప గాఢత కలిగిన డోసుల్లో పిచికారి చేస్తున్నారు. ఇందుకుగాను ప్రత్యేకమైన స్ప్రేయర్లు, డ్రోన్లు ఉపయోగిస్తున్నారు. రిమోట్‌ పైలటెడ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ను ఉపయోగించే విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫైర్‌ బ్రిగేడ్‌ యంత్రాలు, సర్వే వాహనాలు, ప్రత్యేక స్ప్రే వాహనాలు, ట్రాక్టర్లను నివారణ కోసం ఉపయోగిస్తున్నారు.

నియంత్రణే శ్రీరామరక్ష :

  • మిడతల దండు పొలంలోకి ప్రవేశిస్తే, అక్కడ ఏమీ మిగలదు. గంట వ్యవధిలోనే అక్కడ ఇంతకుముందు పంట ఉందా? అనేంతలా పంటను సర్వనాశనం చేస్తాయి. కనుక మిడతల దండును ఈ దశలోనే నియంత్రించకపోతే విలువైన పంటను నాశనం చేసి రైతుకు నష్టాన్ని మరియు కన్నీటిని మిగుస్తాయి.
  • ఇందుకుగాను రైతులు ఈ క్రింద పేర్కొన్న యాజమాన్య పద్ధతలు పాటించాలి.
  • మిడతలు గుడ్డు పెట్టిన స్థలాలను దున్నడం ద్వారా వాటిని నాశనం చేయాలి.
  • మిడతల దండు వాలిన చోట వాటిని కర్రతో కొట్టి, కుప్పులుగా చేసి, కాల్చివేయాలి.
  • మిడతలు సాధారణంగా రాత్రి మరియు తెల్లవారుజామున మగతగా ఉంటాయి. రైతు ఆ సమయాల్లో వాటిని కాల్చివేయాలి.
  • 45 సెం.మీ. x 30 సెం.మీ.  గుంతలు తీసి వాటిని లిండేన్‌ లేదా క్లోరిఫైరిఫాస్‌తో డస్ట్‌ వేసి ఉంచాలి. పిల్ల మిడతలు ఇందులో పడి చిక్కుకుంటాయి.
  • పెద్ద పెద్ద శబ్దాలను చేస్తూ మిడతలను పారద్రోలవచ్చు.
  • మిడత సమూహాల మీద లిండేన్‌ లేదా క్లోరిఫైరిఫాస్‌ లేదా మాథయాన్‌ స్ప్రే చేయడం.
  • గ్రద్దలు, కాకులు, మైనాలు మిడతలను ఆహారంగా తీసుకుంటాయి.

ఎన్నో దేశాలకు తలనొప్పిగా మారిన ఈ మిడతలను సాధ్యమైనంత వరకు నియంత్రించుకునే ప్రయత్నం చేద్దాం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా కంటికి రెప్పలా కాపాడుకున్న పంట మిడతకు ప్రసాదంగా మారిపోతుంది.

రైతన్నా.... జర భద్రం 

రచయిత సమాచారం

కీసం మానస, M.Sc., (Agriculture) విస్తరణ విభాగం, బనారస్‌ హిందూ యూనివర్సిటీ, మంచా సంతోష్‌ కుమార్‌, (Ph.D., Scholar), HAU