Print this page..

తొలకరికి సన్నాహాలు

ఖరీఫ్ 2020-21 త్వరలోనే మొదలవుతుంది. గత అనుభవాలను, మన ఆర్థిక మరియు వ్యవసాయ వనరుల ను దృష్టిలో ఉంచుకుని గతంలో చేసిన పొరపాట్లను తిరిగి చేయకుండా ఈ తొలకరిలో సరైన సన్నాహాలను చేసుకొన్నట్లయితే లాభసాటి వ్యవసాయం సాధ్యమే. అలా చేయకపోతే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంది. 

మనకు ఉన్న నేల రకం, నీటి వసతి, పెట్టుబడి లభ్యత మరియు కుటుంబ పరిస్థితి వంటి విషయాలను దృష్టిలో ఉంచుకొని పంటలను మరియు రకాలను ఎన్నుకోవాలి. మన పరిస్థితులకు అనుగుణంగా మన వ్యవసాయ ప్రణాళిక ఉండాలి. ఎప్పటికీ వేరే వాళ్ళను అనుకరించరాదు. కొన్ని దీర్ఘకాలిక, మరికొన్ని స్వల్పకాలిక ఆదాయ వనరులను సృష్టించే విధంగా ఉండాలి.

మొదటగా నేల సారవంతంగా బాగా అభివృద్ధి చేయాలి. 

వీలున్నంత మేరకు చెరువు మట్టిని పంట పొలాలకు వేసవిలో తోలుకోవాలి. 

పశువుల ఎరువు లేదా కోళ్ళ ఎరువు లేదా గొర్రెల ఎరువును తప్పకుండా వ్యవసాయంలో వాడాలి. గొర్రెల మందలను పొలంలో కట్టాలి. 

ఒకటి లేదా రెండు నీటి తడులు ఇచ్చే అవకాశం ఉన్న చోట వేసవిలో పచ్చి రొట్ట ఎరువులను (జీలుగ | పెసర , జనుము) వేసి అవి పూత దశకు చేరుకునే ముందే రోటోవేటర్ సహాయంతో నేలలో కలియదున్నాలి.

కేవలం స్థూల పోషకాలే కాకుండా సూక్ష్మ పోషకాలకు సంబంధించిన ఎరువులను కూడా నేలలో వేయాలి.

పంటల ఎన్నిక :
ఏక పంటకు బదులుగా బహుళ పంటల పద్ధతిని ఎన్నుకోవాలి. దీర్ఘకాలిక పంటలకు బదులుగా 2-3 స్వల్పకాలిక పంటలు, తక్కువ పెట్టుబడి అవసరమున్న పంటలను ఎన్నుకోవాలి.

అంతర పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. పంటల మార్పిడి లేదా రకాల మార్పిడి చేయాలి.

పంటలలో మన పరిస్థితులకు అనువైన రకాలను, అలాగే మన ప్రాంతంలో వచ్చే చీడపీడలను తట్టుకునే రకా లను ఎంచుకోవాలి.

ఎండా కాలంలో మట్టి నమూనా పరీక్షలు చేయించాలి. మట్టి నమూనాలలో వచ్చిన ఫలితాలకు సమతుల్యమైన ఎరువులను శాస్త్రీయ పద్ధతిలో వాడాలి.

వాతావరణ సూచనలు, భూగర్భజలాల వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటికి అనుగుణమైన పంటలు

సాగు చేయాలి. తరచుగా కిసాన్ కాల్ సెంటర్ లేదా ఏరువాక కేంద్రాలను లేదా మండల వ్యవసాయ అధికారులను సంప్రదిం చాలి. వ్యవసాయశాఖ చేపడుతున్న వ్యవసాయ పథకాలను తెలుసుకొని వాటిని చక్కగా వినియోగించాలి.

ప్రభుత్వం ఏర్పాటుచేసిన రైతు సమన్వయ సమితుల సహాయాన్ని ముఖ్యంగా మార్కెటింగ్, గిడ్డంగులు, మరియు పంట రుణాలు వంటి వాటిని రైతులు వినియోగించుకోవాలి. విత్తనాలను ఆధీకృత డీలర్ల దగ్గరనే కొనాలి.

అలాగే రశీదును తీసుకొని భద్రపరచుకోవాలి. సమగ్ర సుస్థిర వ్యవసాయంలో భాగంగా పందిరి కూరగాయలు, పెరటి కోళ్ళ పెంపకం, పాడి గేదెల పెంపకం మొదలైనవి చేపట్టాలి.

ఈ విధంగా సరైన ప్రణాళికలను ఖరీఫ్ కు ముందుగా రూపొందించుకొని, పంటలపై పెట్టుబడిని తగ్గించుకొని పంటల ఉత్పత్తి మరియు ఉత్పాదకతను పెంచుకొని, వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై కూడా దృష్టిని సారించి వ్యవసాయాన్ని ఈ ఖరీఫ్ సీజన్లో పండుగలాగా చేసుకోవాలి.

రచయిత సమాచారం

జి. శైలజ, ఎం.ఎస్సీ (హార్టికల్చర్), శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయము, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ : 8179088347