Print this page..

మునగ ఆకు - మంచి లాభాలు

దక్షిణ భారతదేశంలో పెరటిలో పెంచే బహువార్షిక మొక్కగా మునగ ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంది. దక్షిణ భారతదేశంలో మునగ ఒక ముఖ్యమైన కాయగూర పంట. వాటి కాయలు, ఆకులను ఎక్కువగా వంటకాల్లో వాడటం వలన మన తెలుగు రాష్ట్రాలలో ఆనవాయితీ. ఇతర ఆకు కూరలతో పాటు మునగాకును కూడా వాడాల్సిన అవసరం ఎంతో ఉంది. వీటి కాయల కన్నా అధిక పోషకాలు అందించేది మునగాకు. మన రాష్ట్రాలలో మునగ ఆకు గురించి సరైన అవగాహన లేక ఆహారంలో వీటి వాడుక వెనుకబడి ఉన్నది. మునగ ఆకు 300 రకాల జబ్బులను నివారిస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది. వారానికి ఒకసారి లేదా కనీసం నెలకొకసారైనా తింటే మంచిది. 

మునగ ఆకు తింటే...:

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి జీవ రక్షక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో కణ నిర్మాణాన్ని క్రమబద్ధం చేస్తుంది. క్యాన్సర్ వ్యాధి రాకుండా నిరోధిస్తుంది. ఇందులో విటమిన్ 'ఎ' పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కంటికి పోషణనిస్తుంది. మెదడు తీరును చురుకుగా ఉంచుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను సమన్వయం చేస్తుంది. అధికంగా చేరిన చక్కెర నిల్వలను నియంత్రిస్తుంది. యాంటి ఆక్సిడెంట్లను ఎక్కువగా కలిగి ఉండి చర్మాన్ని ముడతలు లేకుండా మృదువుగా మారుస్తుంది. లివర్, కిడ్నీల పనితీరును మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీళ్ళ వాతము, వాపుల నొప్పులను తగ్గిస్తుంది. గాయాలు, అల్సర్లు, ట్యూమర్లు వంటివి తగ్గడానికి మందులా పనిచేస్తుంది. ఆహారం ద్వారా, ఇతరత్రా శరీరానికి విషతుల్యమైన పదార్థాలు కడుపులోకి చేరినపుడు వాటిని వెంటనే బయటకు పంపిస్తుంది. నీటిని కూడా శుభ్రం చేస్తుంది. నీటిని కాచి వడ పోయటం వంటి పనులకు బదులుగా నీటిలో మునగాకును వేస్తే కొద్ది సేపటికి శుభ్రపడి స్వచ్ఛమైన నీరు సిద్ధమవుతుంది. 

100 గ్రాముల మునగ ఆకులో ఉండే పోషకాల సమాచారాన్ని మరియు రోజుకు అవసరమయ్యే వివిధ పోషకాలను అందించే విలువలను ఈ క్రింది పట్టికలో చూపబడింది.

పేరు

 

దానిలో అందించే శాతం

శక్తి

64 కిలో కేలరీలు

3.2% 

పిండి పదార్థాలు

8.3 గ్రాములు

3%

పీచు పదార్ధం

2 గ్రాములు

8%

మాంసకృతులు

9.4 గ్రాములు

19% 

క్రొవ్వు

1.4 గ్రాములు

2%

ఐరన్

4 గ్రాములు

22%

కాల్షియం

185 మి.గ్రా.

18%

మెగ్నీషియం

42 మి.గ్రా.

10% 

ఫాస్పరస్

112 మి.గ్రా.

11% 

పొటాషియం

337 మి.గ్రా.

7% 

విటమిన్ 'బి5'

0.125 మి.గ్రా.

1% 

విటమిన్ 'బి3'

2.220 మి.గ్రా.

11% 

విటమిన్ 'బి2'

0.66 మి.గ్రా.

30%

విటమిన్ 'బి1

0.257 మి.గ్రా.

17% 

విటమిన్ 'ఎ'

7564 I.U.

15% 

విటమిన్ 'బి6'

1.2 మి.గ్రా.

60%

విటమిన్ 'సి'

51.7 మి.గ్రా.

80%

మధుమేహంను నియంత్రిస్తుంది : 

రక్తంలో అధిక రక్త చక్కెర శాతం మధుమేహం మరియు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మునగ ఆకులో ఐసోథియోసైనైట్స్ (Isothiocyanates) అనే పదార్ధం కలిగి ఉండటం వలన మధుమేహంను తగ్గించే గుణాన్ని కలిగి ఉంది. 2014లో జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ టెక్నాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనంలో మునగ ఆకు పౌడర్ రోజుకు 7 గ్రాముల చొప్పున 30 నెలల పాటు తీసుకున్నపుడు 30 నుండి 45 సంవత్సరాల వయసులో ఉన్న మహిళలల్లో రక్తంలో చక్కెర స్థాయిలను 30.5% తగ్గిస్తుందని కనుగొన్నారు.

కొలెస్ట్రాలను నియంత్రిస్తుంది :

రక్తంలో అధిక రక్త కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదానికి దారి తీస్తుంది. మునగ ఆకు ఇతర మొక్కల ఆహారాలు లాగానే కొలెస్ట్రాల్ ను తగ్గించే ప్రభావాలను కలిగి ఉంది. ఉదాహరణకి 2008లో జర్నల్ ఆఫ్ ఎథ్నో ఫార్మాకాలజీలో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, అధిక కొలెస్ట్రాల్, రక్తపోటు మరియు హృదయ సంబంధ వ్యాధులను నివారించే గుణం మునగ ఆకు కలిగి ఉన్నదని తెలిపినది. మునగ ఆకు శరీరంలోని తాపజనక ఎంజైములను మరియు ప్రోటీన్లను అణచివేయడం ద్వారా వాపులను తగ్గిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ మరియు గుండె జబ్బుల్లో దీర్ఘకాలిక మంట లేదా బాధలను మునగ ఆకు తగ్గిస్తుంది. మునగ ఆకులోని ఐసోథియో సైనైట్స్ వలన ఇది సాధ్యపడుతుందని బెస్ట్ మరియు జంతు అధ్యయనాలు రెండూ కూడా నిర్ధారించాయి. 

కలుషితాన్ని నిర్మూలిస్తుంది : 

నీరు మరియు ఆహారంలో ఆర్సెనిక్ కలుషితం ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రధాన సమస్యగా పరిగణించబడుతుంది. కాలక్రమేనా, ఆర్సెనిక్ విషపూరితం గుండె జబ్బు మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. 2014లో ట్రాపికల్ బయోమెడిసిన్ ఆసియా పసిఫిక్ జర్నల్ ప్రచురించిన ఒక అధ్యయనం కూడా మునగ ఆకు సహ విషపూరిత రక్షిత ప్రభావాలను కలిగి ఉన్నారని తెలిపినది. ఆహారంలో మునగ ఆకు కూరను చేర్చటం మంచి ఆహార సంబంధ ఆరోగ్య లాభాలను పొందవచ్చు. ఆహారంలో మునగ ఆకు కూర - ఆహార వైవిధ్యానికి మంచి బాట.

రచయిత సమాచారం

జి. శైలజ, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర విశ్వ విద్యాలయం, రాజేంద్రనగర్ హైదరాబాద్, ఫోన్ : 8179088347