Print this page..

కోత అనంతరం మామిడి కాయల్లో తెగుళ్ళు

తెలుగు రాష్ట్రాల్లో పండించే వివిధ పండ్లలో మామిడి ముఖ్యమైనది. దేశంలో సగటున 25-40 శాతం నష్టం కోత అనంతరం వాటిల్లుతుంది. మామిడిలో కోత అనంతరం వచ్చే తెగుళ్ల నియంత్రణ క్షేత్రంలోనూ, పంట కోత అనంతరం శిలీంద్రనాశనులు ఉపయోగించడం ద్వారా, తోటల పరిశుభ్రత, కోతల తర్వాత ఉష్ణోగ్రత నిర్వహణ ద్వారా సాధించవచ్చు. 

తొడిమ చివర కుళ్ళు :

తొడిమ చివర కుళ్ళు వల్ల పండ్ల కోత తర్వాత పక్వదశలో కాండం చివర నుంచి నల్లని మచ్చలు ఏర్పడతాయి. మచ్చ ఏర్పడిన ప్రాంతంలో గుజ్జు మెత్తగా మారి కుళ్ళిపోతుంది. 

ఆంత్రాక్నోస్ పక్షి కన్ను తెగులు :

ఆంత్రాక్నోస్ అనేది మామిడిలో వచ్చే ప్రధాన శిలీంద్ర వ్యాధి. పూత దశలో నుంచి కాయ ఏర్పడే దశ వరకు పంట కోసిన తరువాత ఈ తెగులు ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. పక్వ దశలో పండు ఉపరితలంపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. తోట దశలో పిందె రాలడం, పూగుచ్చం మగ్గిపోవడం, మచ్చలు వంటి లక్షణాలు, కాయ పక్వ దశలో తొడిమ భాగానికి దగ్గరగా మచ్చలను గమనించవచ్చు. మచ్చ ఉన్న ప్రాంతంలో గుజ్జు గట్టిగా తయారవుతుంది. తర్వాత ఆ ప్రాంతంలో పగుళ్ళు ఏర్పడటం, కుళ్ళడం వంటి లక్షణాలు గమనించవచ్చు. ఈ వ్యాధి తడి వాతావరణంలో త్వరగా అభివృద్ధి చెంది, ఒక కాయ నుండి మరొక కాయకు వ్యాపించి పండ్లు కుళ్ళిపోతాయి. 

నల్లబూజు కుళ్ళు : 

ముందుగా కాయలపై లేత గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తర్వాత మచ్చలు కలిసిపోయి కృంగి, కుళ్ళిపోతాయి. తర్వాత ఆ భాగమంతా నల్లని శిలీంద్ర బీజాలతో కప్పి ఉంటుంది. 

యాజమాన్యం :

>  తోటలో లీటరు నీటికి మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కార్బెండాజిమ్ 1 గ్రా. చొప్పున కలిపి చెట్లపై పిచికారి చేయాలి. 

>  తొడిమ చివరి కుళ్ళును నియంత్రించేందుకు పక్వానికి వచ్చిన కాయలను 0.3 శాతం కార్బెండాజిమ్ + 0.25 శాతం ఇథరిల్ కలిపిన ద్రావణంలో ముంచాలి. 

>  కోత సమయంలో కాయకు ఒక అంగుళం తొడిమ ఉండేలా కోసుకోవాలి. 

>  కాయలను 6 శాతం మైనపు ద్రావణంలో ముంచి తీయడం వల్ల 2-4 రోజులు ఆలస్యంగా పండుతాయి. రోగాలను కూడా అరికడుతుంది. 

>  కాయలకు అంటుకొని ఉన్న మట్టిని శుభ్రపరిచి నీడలో ఆరబెట్టాలి. 

>  0.025 శాతం కార్బెండాజిమ్ 52° సెం.గ్రే. ఉష్ణోగ్రత వద్ద ఉన్న వేడి నీటిలో కలిపిన ద్రావణంలో కాయలను 10 నిమిసాలు ఉంచాలి. 

>  35% కార్బన్‌ డయాక్సైడ్ ఉన్న గదుల్లో కోసిన కాయలను 24 గంటల పాటు 20° సెం.గ్రే. వద్ద ఉంచితే తెగులును కలుగజేసే శిలీంద్రాన్ని అదుపులో ఉంచే రసాయనాల గాఢత తగ్గిపోకుండా కొన్ని రోజుల వరకు కాపాడవచ్చు. తద్వారా కుళ్ళును కలుగజేసే శిలీంద్రాలు అభివృద్ధి చెందకుండా నియంత్రించవచ్చు. 

  

రచయిత సమాచారం

జి. శైలజ, ఎం. ఎస్సీ, (హార్టికల్చర్), శ్రీ కొండా లక్షణ్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ : 8179088347