Print this page..

సూక్ష్మ సేద్య పరికరాల నిర్వహణ - యాజమాన్యం 

బిందు సేద్య పద్ధతి - సంరక్షణ :
ఏదైనా ఒక యంత్రము కాని, పనిముట్టును కాని దీర్ఘకాలం ఉపయోగించుకోవాలంటే వాటి యొక్క సంరక్షణ మరియు నిర్వహణ చాలా అవసరము. అదే విధంగా బిందు సేద్య పద్ధతి కూడా నీటి సౌకర్యమును చేకూర్చే యంత్ర సాధనం. కాబట్టి యంత్రం విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తామో బిందు సేద్య పద్ధతిలో కూడా అంత శ్రద్ధతో నిర్వహించినట్లయితే ఎటువంటి సమస్యలు తలెత్తవు. 

బిందు సేద్యములో సాధారణంగా నీరు కారడం, డ్రిప్పర్లలో ఉప్పు పేరుకొని లవణాలు మూసుకుపోవడం, ఎలుకలు మరియు ఉడతలు పైపులను కొరకడం సాధారణంగా జరుగుతుంది. 

బిందు సేద్య పద్ధతిలో ముఖ్యంగా భాగాలను ఈ క్రింది విధంగా సంరక్షించుకోవచ్చు :
1. శాండ్ /  గ్రావెల్ / ఇసుక ఫిల్టరును శుభ్రపరచడం :   
నీ
టి మడుగు లేక బావులలోని నీరు లేక చెరువులలోని నీరు ప్రధాన పి.వి.సి. పైపు (మెయిన్లైన్) గూండా శాండ్/ గ్రావెల్ ఫిల్టర్ లోనికి వస్తుంది. శాండ్ ఫిల్టర్ లో ఒక ప్రత్యేకమైన ఇసుక / గ్రావెల్ ఉంటుంది. అంటే నీరు వీటి గూండా ప్రవాహించినప్పుడు చెత్త, చెదారము, నాచు ఈ ఇసుక / గ్రావెల్ పైన ఉండిపోతాయి. శుభ్రమైన నీరు ముందుకు సాగిపోతుంది. చెత్త, చెదారము సరిగే వేరు చేయకపోతే నీటి ఒత్తిడి తగ్గిపోతుంది. అందుచేత ప్రతి వారము శాండ్ ఫిల్టర్‌ను శుభ్రపరుచుకోవడం ఎంతైనా ముఖ్యం. ఈ ఫిల్టర్‌ను శుభ్రపరచడానికి ఈ క్రింది పద్ధతులు పాటించాలి. 

ఎ) బ్యాక్ వాష్ పద్ధతి : బ్యాక్ వాష్ వాల్వు తెరచుకొని ఉంటే నీటి ప్రవాహంపై పద్ధతి మూలంగా ఫిల్టర్ లోకి తిరిగి ప్రవహించేటప్పుడు ఇసుకలో ఇమిడివున్న చెత్త, చెదారము ఎదురు నీటి ప్రవాహం పైన తేలుతాయి. తేలిన చెత్త, చెదారము బ్యాక్ వాష్ వాల్వు గూండా బయటకు వెళ్ళుతుంది. ఈ విధంగా 1-2 నిమిషాలు బ్యాక్ వాష్ వాల్వును తెరచి ఉంచినట్లయితే ఇసుక శుభ్రపడుతుంది. ఇసుక శుభ్రమైన వెంటనే బ్యాక్ వాష్ వాల్వును మూసివేయాలి. మూయకపోతే లేటరల్స్ లోకి అపరిశుభ్రమైన నీరు ప్రవహించి డ్రిప్పర్స్ లోని అతి సన్నని రంధ్రములలో మురికి పేరుకుపోతుంది. అందువలన డ్రిప్లర్లు మూసుకుపోయే అవకాశం ఉంటుంది. 

బి) చేతితో శుభ్రం చేసే పద్ధతి : ఈ పద్ధతిలో ప్రతి వారమునకు ఒకసారి ఫిల్టరు మూత తెరచి లోపల ఉన్న ఇసుకను చేత్తో నలుపుతూ చెత్త, చెదారము బయట పారేయాలి. ఇలా చేయునప్పుడు లోపల ఉన్న ఎలిమెంట్సకు చేయి తగలకుండా జాగ్రత్త పడాలి. లేకపోతే ఫిల్టర్ లోని ఇసుక స్క్రీన్ ఫిల్టర్ లోకి ప్రవేశిస్తుంది. సాధారణంగా శాండ్ ఫిల్టర్ లో 3/4 భాగం వరకు ఇసుక ఉండాలి. ఒకవేళ ఈ పరిమాణం తగ్గితే, తగ్గిన మేరకు ఇసుక నింపాలి. 

సి) రసాయనిక పద్ధతి : పైన చెప్పినటువంటి రెండు పద్ధతులు కాకుండా యాసిడ్, క్లోరిన్, మైలతుతత్తం లాంటి రసాయనిక పదార్ధములను ఉపయోగించి కూడా శాండ్ ఫిల్టర్ లోకి ప్రవేశపెడతారు. అవి నీటిలో కరిగి కార్బోక్లోరిక్ యాసిడ్, క్లోరిన్ లాంటి రసాయనాలను వెంచురి పద్ధతి ద్వారా ఫిల్టర్ లోకి ప్రవేశపెడతారు. అవి నీటిలో కరిగి కార్బోనేట్ల లోహ పదార్ధాలు, క్షార తత్వాలను నిర్మూలించడంలో ఉపయోగపడతాయి. ఈ రసాయనిక పద్ధతి ద్వారా మరియొక లాభం ఏమిటంటే నీటిలో ఉత్పన్నమయ్యే అతి సూక్ష్మ క్రిములను ఈ పద్ధతి ద్వారా నాశనము చేయవచ్చును. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమి అనగా మొలుతుత్తం విష పదార్ధం కాబట్టి ఆ నీటిని మనుషులు త్రాగుటకు ఉపయోగించకూడదు.

2. జల్లెడ ఫిల్టర్‌ను శుభ్రపరచడం : 
శాండ్ ఫిల్టర్ జల్లెడ / స్క్రీన్ ఫిల్టర్ శుభ్రం చేయుటకు మొదటగా జల్లెడ మూత తెరచి లోపలి ఫిల్టర్‌ను ఎలిమెంట్ ను శుభ్రం చేయాలి. శాండ్ ఫిల్టర్ నుంచి వచ్చిన సన్నని మట్టి కణాలు, ఇసుక రేణువులు, మురికి స్క్రీన్ ఫిల్టర్ లోనికి ప్రవేశిస్తూనే ఆగిపోతుంది. నెమ్మది, నెమ్మదిగా గోళాకారపు ఫిల్టర్ ఫిలమెంట్ దగ్గర ఒక దుమ్ము పొర ఏర్పడుతుంది. అందుచేత దీనిని సరైన సమయంలో శుభ్రం చేయకపోతే నీటి ప్రవాశం ఆగిపోతుంది. స్క్రీన్ ఫిల్టర్ లోని ఎలిమెంటును రెండు వైపులా ఉన్న రబ్బరు రింగులోంచి తీసి ఎలిమెంట్ ను తెరవాలి. తర్వాత జల్లెడను రబ్బరు సీళ్ళను బాగా శుభ్రపరచి తిరిగి జాగ్రత్తగా గట్టిగా బిగించాలి. ప్రతిరోజు సిస్టంను ఆన్ చేసినప్పుడు స్క్రీన్ ఫిల్టర్ ఉన్నటువంటి డ్రైన్ వాల్వు కొద్ది సేపు తెరచి ఉంచినట్లయితే, ఫిల్టరు వెలుపల ఉన్నటువంటి మురికి నీరు బయటకి వెళ్ళిపోతుంది. 

3. వివిధ భాగాలు గల పి.వి.సి. పైపును శుభ్రపరచడము :
శాండ్ ఫిల్టర్, స్క్రీన్ ఫిల్టర్ ఉన్నప్పటికీ, చాలా సన్నని మట్టి కణాలు, ఇతర సేంద్రియ పదార్ధాలు వివిధ భాగాలు గల పి.వి.సి. పైపులలో చేరి స్థిరపడతాయి. పి.వి.సి. పైపు లైనుకు చివరలో ఒక ప్రత్యేకమైన ప్లష్ వాల్వ్ బిగించబడి ఉంటుంది. ఈ ప్లష్ వాల్వు తెరచి ప్రతి వారమునకు ఒకసారి పూర్తి స్పీడుతో నీటిని ఒకటి నుంచి రెండు నిమిషములు వదిలినట్లయితే లోపల పేరుకున్న మొత్తం చెత్త, చెదారము నీటి ప్రవాహంతో బయటకు వస్తాయి. శుభ్రమైన నీరు బయటకు వచ్చిన తర్వాత ఫ్లష్ వాల్వు మూసివేయాలి.

4. లేటరల్స్ శుభ్రపరచుట :
లేటరల్స్ ట్యూబులను శుభ్రం చేయుట చాలా అవసరం. ఒక వేళ లేటరల్స్ ట్యూబులను శుభ్రం చేయకపోతే నీటిలో వచ్చే చెత్త, చెదారం సూక్ష్మమైన ఇసుక రేణువులు డ్రిప్ప లోని రంద్రాల్లో నిండిపోతాయి. అప్పుడు మొక్కలకు ఖచ్చితమైన నీరు అందడం ఆగిపోతుంది. లేటరల్ ట్యూబులు శుభ్రం కోసము, ప్రతి ట్యూబ్ చివరన ఒక ఎండ్ క్యాప్ లేక ప్లగ్ అమర్చబడి ఉంటుంది. దీనిని ప్రతి వారం లేదా ప్రతి 15 రోజులకొకసారి తెరచినట్లయితే మురికి చెత్త, చెదారము, ట్యూబ్ ద్వారా ప్రవహించే నీటితో తెరచి ఉన్న ఎండ్ ప్లగ్ ద్వారా బయటకి వచ్చేస్తాయి. లేటరల్స్ ద్వారా మురికి నీరు వస్తున్నంత సేపు వాటిని తెరచి ఉంచాలి. స్వచ్ఛమైన నీరు వస్తున్నప్పుడు ఎండ్ ప్లగ్ క్యాపును తిరిగి బిగించాలి. లేటరల్స్ పైన ఏదైనా కన్నం పడితే వాటిని గూఫ్ ప్లగ్ సహాయంతో నీరు కారడాన్ని ఆపవచ్చును.

5. డ్రిప్లర్లు - శుభ్రత :
లేటరల్స్ పైన అమర్చిన డ్రిప్పర్ల ద్వారా నీరు రాకపోతే లేదా ఎక్కువగా కారుతుంటే డ్రిప్పరును తెరచి లోపల డయాఫ్రమును శుభ్రపరచి తిరిగి ఇంకోసారి సరిగ్గా అమర్చాలి. అప్పుడు డ్రిప్పర్లలో ఏ ఇబ్బంది ఉండదు. నాచు, లవణాలు, బ్యా క్టీరియా మొదలైనవి, ఫిల్టర్లను శుభ్రపరిచేటప్పుడు నీటి ప్రవాహంతో కొట్టుకుపోవును. కాని పాచి, లవణాలు డ్రిప్పలో పేరుకుపోయి డ్రిప్పర్ల రంధ్రాల చివర్లలో చేరి నీటిని సరిగ్గా బయటకు రానీయవు. డ్రిప్పర్లు లవణాలు, పాచి ద్వారా మూసుకుపోయినప్పుడు ఆమ్లంతో (2-4 ఉదజని సూచి) లేదా క్లోరిన్ (20 మి.గ్రా. / లీటరు నీటికి) బ్లీచింగ్ ద్వారా శుభ్రపరచాలి. బ్లీచింగ్ లేదా ఆమ్లంతో చికిత్స చేసినప్పుడు 24 గంటల పాటు ఆ నీటిని పైపులలో నిల్వ ఉండేటట్లు చూడాలి. మరుసటి రోజు వాల్వులన్నీ తెరచి క్రొత్త నీటితో ప్లష్ చేయాలి. 

ఇతర జాగ్రత్తలు :
పంటలను కోసిన తర్వాత డ్రిప్ లేటరల్స్ పైపులను తీసి గట్ల మీద పరిచి, దుక్కి చేసుకోవాలి. అలాగే పంటలో అంతరకృషి చేసేటప్పుడు లేటరల్ పైపులను మలిచి ప్రక్కన పెట్టుకొని చేసుకోవాలి. వేసవిలో ఎలుకలు | ఉడతలకు నీటి వసతి కల్పించనచో వాటి బెడద కొంత వరకు తగ్గించవచ్చును. పైపులను, డ్రిప్పర్లను, లేటరల్స్ పైపులను మంటల నుంచి కాపాడుకోవలెను.
డిప్పర్ మరియు లాటరల్ పైపు సరియైన పీడనము ఉన్నదో లేదో పరీక్షించుకోవాలి. . పీడన మాపకాలను ప్లాస్టిక్ తో కప్పి ఉంచాలి. భూమిపైకి ఉన్న కవాటాలను, పైపులను సూర్యరశ్మి నుండి కాపాడుటకు జనపనార బస్తాలతో కప్పి ఉంచాలి. . డ్రిప్పరు నీటి పారుదల సామర్థ్యాన్ని పరిశీలించుకోవాలి.

డ్రిప్పరు నీటి విడుదల సామర్ధ్యాన్ని పరిశీలించుట : 
కావలసిన పరికరాలు : 1. కొలజారు, 2. గడియారం, 3. ప్లాస్టిక్ బకెట్. కొలజారును డ్రిప్పరు కిందగా పెట్టి ఒక లీటరు నీరు నిండటానికి పట్టిన సమయాన్ని గడియారంతో తెలుసుకోవాలి. ఆ విధంగా ఆ డ్రిప్పరు గంటకు ఎంత నీరు విడుదల చేస్తుందో తెలుసుకోవచ్చు. కావలసిన పరిమాణం కన్నా తక్కువ విడుదల చేస్తే సబ్ మెయిన్ మీద ఉన్న కవాటాన్ని నియంత్రించి నీటి ప్రవాహ పీడనాన్ని ఎక్కువ చేయాలి. ఉదాహరణకు మొదటి డ్రిప్పరు గంటకు 4 లీటర్ల నీటిని విడుదల చేస్తే - అదే లేటరల్ మీద 100 మీటర్ల దూరంలో ఉన్న డ్రిప్పర్లు కనీసం గంటకు 3-6 కన్నా ఎక్కువ లీటర్లు విడుదల చేయగలిగి ఉండాలి. తేడా ఎక్కువగా ఉంటే ఆమ్ల చికిత్స చేయాలి. 

నిర్వహణ :
స్ప్రింక్లర్లు పనిచేసేటప్పుడు, కొన్ని సమయాల్లో గొట్టాలలో పీడనం తగ్గిపోవడం జరగవచ్చును. కావున సక్షన్ పైపులో గాలి చొరబడటము, పంపు ఇంపేల్లరులో లేదా ఫుట్ వాల్వ్ వద్ద చెత్త చేరడం లేదా నీటి వనరులలో నీటి మట్టం తగ్గడం వలన పీడనం సంభవించవచ్చును. పంపు లేదా మోటారు బేరింగులు అరిగిపోయిన్పుడు లేదా పంపింగ్ హెడ్, దనాన్ని డిజైన్ చేసిన ఎత్తు కంటే తక్కువగా ఉన్పుప్పుడు మోటార్ వేడెక్కకుండా సంభవిస్తుంది. కనుక ఈ విషయంలో తగిన శ్రద్ధ వహించి స్ప్రింక్లర్లను మంచి సమర్ధతతో పని చేయించినప్పుడు మంచి ఫలితము ఉంటుంది. 

జల్లెడ ఫిల్టర్‌ను శుభ్రపరచుట :
ఫిల్టర్ పై మూతను తీసి, జల్లెడను బయటకు తీసి, పైన మరియు క్రింద ఉన్న రబ్బరు సీళ్ళ పై జల్లెడ నుంచి వేరు చేయాలి. జల్లెడను, రబ్బరు సీల్లపై పేరుకు పోయిన మట్టిని వేగంగా పారే నీటితో కడగాలి. తర్వాత జల్లెడను రబ్బరు సీలు వాటి స్థానములో అమర్చి ఫిల్టరులో బిగించాలి.
జల్లెడను బ్రష్ తో రుద్దరాదు. సాధారణంగా మురికి మరియు ఇతర పదార్థాల అడుగున ఉన్న ఫ్లష్ అవుట్ గేట్ వాల్వును ఉపయోగించి తీసివేయవచ్చును. ప్రతి సారి నీరు పెట్టేటప్పుడు, జల్లెడ ఫిల్టరు యొక్క డ్రైన్ వాల్వు కొద్ది సేపు తెరిచి ఉంచినట్లయితే ఫిల్టర్ లో ఉన్నటువంటి మురికి నీరు బయటకు వెళ్ళిపోతుంది.

పైపులు మరియు అమరికలు : 
తరచూ పైపులను మరియు క్లస్టర్లను శుభ్రపరచుకోవాలి. రబ్బరు వాషర్ పనితీరును గమనించి మార్చుకోవలెను. నలు మరియు బోలను టైట్ గా బిగించాలి.

స్ప్రింక్లర్ హెడ్ :
స్ప్రింక్లర్ పరికరాలను అటు ఇటు కదల్చినపుడు స్ప్రింక్లర్ హెడ్ పాడవకుండా జాగ్రత్త వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో స్ప్రింక్లరకు నూనె, గ్రీజు మరియు ఇతర లూబ్రికెంట్లు వాడరాదు. అరిగిపోయిన వాచర్లను ఎప్పటికప్పుడు మార్చాలి. స్ప్రింగ్ టెన్షన్ తగ్గిన ఎడల పెంచేందుకు స్ప్రింగ్ ఆర్మ్ ను గట్టిగా బిగించి స్ప్రింగ్ చివరలను పైకి లాగి వంచాలి. మూసుకుపోయిన నాజిల్స్ ను శుభ్రపరిచేందుకు ఇనుప చువ్వలకు బదులుగా సన్నని పుల్లలను వాడాలి. పైపులను నేల మీద లాగకుండా మనుషులచే మోసుకుపోవాలి. స్ప్రింక్లర్ల నాజిల్, పంపు, ఇంపెల్లర్ మొదలగునవి సాధారణంగా అరుగుదలకు లోనవుతాయి. ప్రతి పంట అయిపోయిన తర్వాత వీటిని పరీక్షించి అవసరమైతే కొత్త భాగాలను మార్చుకోవాలి. పంట అయిపోయిన తర్వాత పైపులను క్లస్టర్స్ ను, స్ప్రింక్లర్‌ను పొడి ప్రదేశాలలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. రబ్బరు, ప్లాస్టిక్ పైపులు వాటి వాషరను ఎలుకల భారి నుండి రక్షించుకోవాలి.
కొన్ని సార్లు స్ప్రింక్లర్ల నాజిల్ తిరగకపోవడం జరుగుతుంది. ఇది పీడనము తగ్గినప్పుడు, పైపులలో లీకేజీలు మరియు నట్లు వదులుగా ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ లోపాలను సరిచేసి పీడనం ఉండునట్లు చూడాలి. స్ప్రింక్లర్ రంధ్రాలు మూసుకొని పోకుండా చూసుకోవాలి. పీడనము సరిగా ఉండునట్లు చూడాలి. నీటి యొక్క విస్తరణ పద్ధతిని మరియు పరిమాణమును పరిశీలించాలి. ఈ విస్తరణ గుణకము 0:83 కంటే ఎక్కువగా ఉన్నచో తుంపర వ్యవస్థ పనితీరు బాగున్నదని నిర్ధారించుకోవాలి.

రచయిత సమాచారం

శ్రీ కె. చైతన్య, డా. మహ్మద్, లతీఫ్ పాషా, డా. టి.ఎల్.నీలిమ మరియు డా. ఉమాదేవి, నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్