Print this page..

పంట పొలాల్లో అడవి పందుల యాజమాన్యం

ప్రస్తుత వ్యవసాయ సాగులో చీడపీడలు,వ్యాదులతో,వాతావరణ సమస్యలు,ఇలా పంట దిగుబడికి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి.ఇలాంటి క్రమంలో ప్రధాన పంటలైన మొక్కజొన్న,చెరకు,వేరుశనగ పంటలకు అడవి పందుల బెడదతో మరింత పంట నష్టం జరిగి దిగుబడిలో మార్పులను చవిచూస్తున్నారు నేటి రైతులు ముఖ్యంగా ఈ అడవి పందుల నష్టం పంట పక్వానికి వచ్చిన తర్వాత జరగడం వలన రైతులు ఆందోళన చెందుతున్నారు. 
అడవి పందుల ఉద్రుతి ఎక్కువగా గడ్డి ప్రాంతాలు,అడవులు,నదీ పరివాహక వ్యవసాయ క్షేత్రాల్లో అధికంగా ఉంటుంది అడవి పందులు చూడటానికి నల్లగా వుండి ఒంటి నిండా బూడిద,గోదుమ మరియు తెల్లటి వెంట్రుకలు కలిగి వుంటాయి.వీటి మూతి పొడవుగా వుండి నిక్కపొడిచిన చెవులు, పొడవైన కుచ్చుతోక కలిగి ఉంటాయి. మగ పందులు దాదాపుగా 90-100 సేం.మీ ఎత్తు మరియు 135-235 కేజీల బరువు ఉంటాయి. అడవి పందులు ముఖ్యంగా వాసన పసిగట్టే ఆధికంగాను, వినికిడి చూపు చాల తక్కువగా వుంటాయి.  వర్షాకాలంలో ఎక్కువగా సంతాన ఉత్పత్తి చేస్తాయి.ఇవి 4-12 పిల్లలను ఉత్పత్తి చేసే సమర్థ్యం కలిగి వున్నాయి.ఇవి గుంపులు గుంపులుగా దాదాపు 15-35 వరకు వుంటాయి. ఆడపందులు గుంపులకు నాయకత్వం వహిస్తాయి. అడవి పందుల ఆహారం వ్యవసాయ పంటలు,దుంపలు, పురుగులు ,చిన్నపాటి జంతువులను తింటాయి. 
అడవి పందుల వలన లాభ - నష్టాలు :
-అడవి పందుల మూతి గట్టి ఎముకతో వుండటం వలన ఇవి నేలను చదును చేస్తాయి. అలాగే నేలను గుంతలుగా చేసి వ్యర్థ పదర్థాలను కుళ్ళే ప్రక్రియకు దోహదపడతాయి. అలాగే నీరు ఇంకే స్వభావమును  పెంచి, ముఖ్యమైన కలుపు,(గడ్డి జాతులను ) మొక్కలను నిర్మూలిస్తాయి.    
-ఇవి అనేక పంటలను నష్టం చేస్తూ,వైరస్ పంట రోగాలను ఇతర జంతువులకు వ్యాప్తి చేస్తాయి,ముఖ్యంగా మనుషులకు కూడా వీటి ద్వారా గాయాలు జరుగుతాయి.
-ముఖ్యంగా అడవి పందుల వెంట్రుకలు సన్నాగా,గట్టిగా ఉండటం  వలన, వీటి వెంట్రుకలను బ్రష్ల నిర్మాణానికి ఉపయోగిస్తున్నారు. 
అడవి పందుల ద్వారా జరిగే నష్ట పరిమాణం:

 పంట పేరు              

నష్ట శాతం

 మొక్కజొన్న

   23-47%

వేరుశనగ  

   20-48%

 చెఱకు

   18-36%

 వరి   

   11-30%

జొన్న

   10-20%

 కూరగాయలు  

  5-10%

 గడ్డి జాతులు

   5-10%

 

అడవి పందుల నిర్మూలన :

పంట రక్షణ చర్యలు
1.భౌతిక పద్ధతులు
2.రసాయనిక పద్ధతులు
3.సంప్రదాయ పద్ధతులు
1.భౌతిక పద్ధతులు
-ఇనుప తీగలు (గి.ఐ.వైర్) పొలానికి చుట్టూ నేల నుండి అడుగు ఎత్తులో 2-3 వరసలలో చుట్టడం ద్వారా పంట పొలాలలోనికి అడవి పందులు రాకుండా నిరోధించవచ్చు.  
-వేరుశనగ చుట్టూ కుసుమ పంటను 4-5 వరుసలలో లేదా మొక్కజొన్న చుట్టూ ఆముదమును 4-5 వరుసలలో  వేసి పంట నస్టాన్ని తగ్గించుకోవచ్చు.
-పంట చుట్టూ ముళ్ళ పొదలను లేదా వాక్కాయ చెట్లను దగ్గర దగ్గరగా పొలం చుట్టూ నాటడం ద్వారా అడవి పందుల నుండి పంటను రక్షించవచ్చు.
-పంట చుట్టూ రెండు అడుగుల వెడల్పులతో గుంతలు ఏర్పాటు చేసి చొరబడకుండా పంటను కాపాడుకోవచ్చు.
2.రసాయనిక పద్ధతులు
*కోడి గ్రుడ్ల ద్రావణం 1  లీటరు నీటికి 20 మీ.లీ చొప్పున పిచికారి చెయ్యాలి.ఈ వాసనకు పంటలోనికి రకుండా దూరంగా పారిపోతాయి.ఈ ద్రావణాన్ని పొలం చుట్టూ పిచికారి చేయాలి
*ఒక కిలో ఇసుక,పావు కిలో థిమ్మెట్ గుళికలను కలిపి ఒక మూతలో కట్టి,పొలం చుట్టూ ఒక మీటరు ఎత్తులో అక్కడక్కడ  వ్రేలాడదియ్యాలి.దాని నుండి వచ్చే వాసనకు అడవి పందులు తట్టుకోలేక పారిపోతాయి  
*విషపు ఎర ఉల్లి మరియు వెల్లుల్లి చూర్ణము గోధుమ పిండిలో కలుపుకొని,ఉండలుగా  చేసి పొలం గట్లపైన అక్కడక్కడ ఎరగా 3-5 రోజులు పెట్టాలి.ఆ తర్వాత జింక్ ఫాస్ఫైడ్ 10 గ్రా. కలిపిన ఉండలను పంట పరిసర ప్రాంతాల్లో ఉంచడం వలన వాటిని తిన్న అడవి పందులకు అజీర్ణం కలిగి మరళ పొలల్లోకి రాకుండా వెళ్ళిపోతాయి    
*ఒక లీటరు ఎకోడాన్ మందును 100 లీ.నీటిలో కలిపి తడిసిన నేలపై పంట పొలం చుట్టూ పిచికారి చెయడం వలన ఎకోడాన్ నుండి వచ్చే వింత వాసనను తట్టుకోలేక పొలాల్లోకి ప్రవేశించవు.
3.సంప్రదాయ పద్ధతులు :
-క్షౌరసాలలో దొరికే వెంట్రుకలను  పొలం చుట్టూ రెండు అడుగుల వెడల్పుతో అక్కడక్కడ  వేయడం వలన పొలంలోకి అడవి పందులు చొరబడకుండా అరికట్టవచ్చు.
-25-30 మీ.లీ ఊర పందుల పెంటను 100 లీటర్ల నీటిలో కలిపి, ఆ మిశ్రమాన్ని ఒక అడుగు వెడల్పుతో శుభ్రం చేసి తడిచిన నేలపై పిచికారి చెయ్యాలి.ఆ మిశ్రమం నుండి వెలువడే వాసనకు అడవి పందులు పొలంలోకి రావు    
-గొనాడోట్రాపిన్, హార్మోను అడవి పందుల ఆహారంలో కలిపి వాటికి పెట్టడం వలన అవి తిన్న వాటికి అడవి పందుల పునరుత్పత్తిని చాలా వరకు అరికట్టవచ్చును  
-అడవి పందులు రాత్రి వేళల్లో పంట వద్దకు వస్తాయి.కనుక వాటిరాకపై నిఘా ఉంచి రైతులు సాముహికంగా శబ్ద ప్రాయోగాలు అనగా టపాసులు కాల్చడం,కేకలు వేయటం,ఖాళీ డబ్బలతో శబ్దాలు చేయటం,వీటి వలన అవి భయాందోళనకు చెంది పారిపోతాయి. 
- ముఖ్యంగా అడవి పందులు అధికంగా వున్న చోట వేట కుక్కలను పెంచడం వలన కొద్ది వరకు వాటి బెడదను అరికట్టవచ్చు.
-రేడియో ఎఫ్.ఎం.ప్రసార కార్యక్రమాలు 24 గంటలు ప్రసారం అవుతాయి. రేడియో ట్రాన్సిస్టరు ఉపయోగించి పంట పొలాల సమీపం ఉండి బిగ్గరగా శబ్దాలను ఉత్పత్తి చేయ్యాలి. ఇలా చేసినందువలన  మనుషులు వున్నారనే భ్రమకులోనై భయపడి పంట పొలాల సమీపం నుండి దూరంగా పారిపోవును.   
పంది కొవ్వు,గంధకం మిశ్రమం పద్దతి :
-ఈ పద్దతిలో పంది కొవ్వు మరియు గంధకం మిశ్రమన్ని కొబ్బరితాడుకు పూసి అది ఆరిన తర్వాత దానిని పంట పొలం చుట్టూ భూమి నుండి ఒక అడుగు ఎత్తులో రండు వరసలుగా చుట్టుకోవాలి.ఈ విధంగా చుట్టిన తాడు నుండి వెలువడే  వాసనకు పందులకు చికాకు గురై పంట పొలంలోకి రాకుండా పారిపొతాయి. 
-వన్యప్రాణుల చట్టం ప్రకారం అడవి పందులను వేటాడుట చంపుట చట్టరిత్యా నేరం.కాబట్టి వాటిని వీలైనంత వరకు పైన తెలిపిన పద్దతులను పాటించి చేస్తే,దాదాపుగా వాటి నిర్మూలన సాధ్యమౌతుంది.  
-ఒకవేళ అడవి పందుల ద్వారా వ్యవసాయ రైతులకు,కూళీలకు ఆటంకంగా మారితే,వాటిపై దాడి చెయ్యకుండా, వెంటనే డివిజినల్ అటవి శాఖ అధికారి (డి.ఎఫ్.ఓ) కు సమాచారం అందించి వాటి నుండి రక్షణ పొందాలి. 
  

రచయిత సమాచారం

జి.శివ కుమార్( వ్యవసాయ పాలిటెక్నిక్ ) ఎల్. రాంచందర్ (పి.హెచ్ డి - ప్లాంట్ బ్రీడింగ్ ) ప్రోఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం