Print this page..

వరి మాగాణుల్లో లాభసాటి నువ్వుల సాగు

ఖరీఫ్ వరికోత అనంతరం రెండవ పంటగా జనవరి మాసంలో విత్తుకొని అతి తక్కువ సమయంలో ,తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని ఆర్జించేందుకు  ,నువ్వుల పంట పండించుకోవచ్చును.మార్కెట్ లో నువ్వులకు మంచి డిమాండ్ కూడా ఉంది.అంతే కాకుండా దీని సాగు ఖర్చు చాలా తక్కువ.పంట కాలం 90రోజులు మాత్రమే .సెసమోలిన్ మరియు సెసమిన్ అనే ఆంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఎక్కువకాలం నిల్వ ఉండి ,మనకు వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వడమే కాక నూనే శాతం 45 నుండి 55 వరకు మరియు ప్రోటీన్ల శాతం 25 వరకు కలిగి ఫాటి అన్శాచురేటెడ్ ఆంలాలు సమృద్దిగా ఉంటాయి.
నేలలు:
మురుగు నీరు నిల వని తేమ నిలిచే తేలికైన నేలలకు శ్రేష్టం.నీరు నిలిచే ఆంల,క్షార గుణాలు కలిగిన నేలలు పనికిరావు.
విత్తే సమయం:
జనవరి రెండవ వారం నుండి పిబ్రవరి నెల మొదటి వారం వరకు విత్తే సమయం తప్పని సరిగా పాటించాలి.లేని పక్షంలో ఫిల్లోడి అనే వెర్రి తెగులు ఆశించి పూర్తి నష్టం కలుగజేస్తుంది.కనుక విత్తే సమయం చాలా ముఖ్యం.
విత్తన మోతాదు:
ఎకరాకు 2.0-2.5 కిలోల విత్తనం సరిపోతుంది.విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో వరుసల్లో విత్తుకోవాలి.

రకాలు 

1.శారద(వై.ఎల్.ఎం-66) - లేత గోధుమ రంగు విత్తనం, బూడిద ఆకుమచ్చ తెగులు తట్టుకుంటుంది.పంట కాలం -75 రోజులు,దిగుబడి - 4-5 క్వి/ఎకరాకు
2.రాజేశ్వరి -తెల్ల గింజ రకం, కాండం కుల్లు, బూడిద తెగులు తట్టుకుంటుంది కోస్థా ప్రాంతనికి బాగా అనుకూలం. పంట కాలం -80 రోజులు,దిగుబడి - 3-4 క్వి/ఎకరాకు
3.శ్వేతాతిల్ - తెల్ల గింజ రకం తెలుగు రాష్ట్రాలకు అనుకూలం,వెర్రి తెగులు తట్టుకుంటుంది.ఎగుమతి ప్రాదాన్యం కలదు.పంట కాలం -80 రోజులు,దిగుబడి - 4-5 క్వి/ఎకరాకు
4.హిమా జె.సి.యస్ 9496 - స్వల్ప కాలిక తెల్ల గింజ రకం కాయలు పొడవుగా ఉంటాయి ,వెర్రి తెగులు తట్టుకుంటుంది.ఎగుమతి ప్రాదాన్యం కలదు.పంట కాలం -75-80 రోజులు,దిగుబడి - 4-8 క్వి/ఎకరాకు
5.ఎలమంచిలి - 75 - లేత గొధుమ రంగు విత్తనం కోస్థా ప్రాంతనికి బాగా అనుకూలం.  ఆకుమచ్చ తెగుళ్ళను కొంత వరకు తట్టుకుంటుంది.పంట కాలం -75-80 రోజులు,దిగుబడి - 3-4 క్వి/ఎకరాకు
విత్తనశుద్ధి - కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం/కాప్టాన్ 
విత్తేదూరం - వరసల మద్య 30 సేం.మీ మరియు మొక్కల మద్య 15 సేం.మీ 
ఎరువుల యాజమాన్యం - ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువు, 14 కిలోల నత్రజని (52 కిలోల యూరియా ) 8 కిలోల భాస్వరం (20 కిలోల సూపర్ ఫాస్ఫేట్ ) 8 కిలోల పొటాష్ ( 13 కిలోల ఎం.ఒ.పి ) ఆకరి దుక్కిలో వేసుకోవాలి.  నత్రజని ఎరువు ఆకరి దుక్కిలో సగం , మిగిలిన సగం విత్తిన నెల రోజులలో అందించాలి 
కలువు యాజమాన్యం : 
పెండిమిథాలిన్ 30 ఇ.సి ఎకారానికి ఒక లీటరు చొప్పున విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు పిచికారి చేయాలి.మొక్కలు మొలచిన 15 రోజులకు అదనపు మొక్కలను తీసివేయాలి.విత్థిన 20,25 రోజులప్పుడు గొర్రుతో అంతరకృషి   చేయాలి వత్తుగా ఉన్న నువ్వు మొక్కలను చేతితో ఎరివెయాలి , లేని పక్షంలో కొమ్మలు లేక దిగుబడి తగ్గే అవకశాలు ఎక్కువ కాబట్టి " మొక్కలు పలుచన చేయటం " కూడ ప్రధానమైన  అంశం     
నీటి యాజమాన్యం: 
రభీ మరియు వేసవిలో విత్తినపుడు, పొడి దుక్కిలొ విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ది, గింజ కట్టు దశలలో తడులు ఇవ్వాలి. విత్తిన 35-40 రోజుల నుండి 65-70 వరకు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి    
సస్యరక్క్షణ చర్యలు :
 రసం పీల్చే పురుగులు (తెల్ల నల్లి, తామరపురుగులు మరియు పచ్చదోమ )
పిల్ల, తల్లి పురుగు ఆకుల అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీల్చివెస్తాయి. పురుగులు ఆశించిన ఆకులు ముందుగా పాలిపోయి తరువాత దశలో ఎండిపొతాయి. తెల్ల నల్లి ఆశిస్తే ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి, ఈనెలు పొడవుగా సాగి క్రింది వైపుకు ముడుచుకొని పోయి దోనె అకారంగా మారి పాలిపోతాయి.    
నివారణ :
మోనోక్రోటోఫాస్ @ 1.6 మీ.లీ లేదా డైమిథోయేట్ @ 2 మీ.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి 
ఆకు ముడత మరియు కాయ తొలుచు పురుగు : 
తొలి దశలో చిన్న గొంగలి పురుగులు రెండు, మూడు లేత ఆకులను కలిపి గూడుకత్తి లోపలి నుండి ఆకులలోని పచ్చని పదార్థాన్ని గోకి తినుట వలన ఆకులు ఎండిపోతాయి. పురుగులు ఎదిగిన కొలది ఎక్కువ ఆకులను కలిపి గూడుగా చేసుకోని ఆకులను తింటాయి. మొగ్గ ఎర్పడే దశలో మొగ్గలను పూతను కాయలోని లేత గింజలను తింటూ పంటకు నష్టం చేస్తాయి.  
నివారణ : 
మోనోక్రోటోఫాస్ @ 1.6 మీ.లీ లేదా క్వినాల్ఫోస్ @ 2.0 మీ.లీ.లేదా క్లోరోపైరిఫాస్ @ 2.5 మీ.లీ.నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఆశించిన ఆకులను పురుగులతో సహా ఏరి నాశనం చెయాలి
కోడుఈగ : 
చిన్న పురుగులు లేత మొగ్గ పూత తిని వేయడం వలన మొగ్గలు ఆశించిన మొగ్గ మరియు పూత వాడి రాలిపోతుంది.

నివారణ: పురుగు ఆశించిన మొగ్గల్ని,తాలు కాయల్ని ఏరి నశనం చేయాలి.మొగ్గ దశలో డైమిథోయేట్ 2.0మి.లీ లేదా మోనోక్రొటోఫాస్ 1.6మి.లీ లేదా ఎసిఫేట్ 1.0గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వేరు కుళ్ళు,కాండం కుళ్ళు తెగులు : ఎండు తెగులు సోకిన మొక్కల ఆకులు పసుపు వర్ణానికి మారి వ్రేలాడుతుంటాయి. తదుపరి ఆకులు అంచులు లోనికి ముడుచుకోని రాలిపోతాయి. కాండం మీద నల్లని చారలేర్పడతాయి. వేర్లను చీల్చి పరిశీలిస్తే గోదుమ రంగు చారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా లేదా పాక్క్షికంగా కుళ్ళిపొతాయి. ఎండు తెగులు సోకిన కాండం మీద కాయలు మీద గులాబి రంగు శిలీంద్రం భూమిలోను విత్తనాలు మరియు పంట అవశేషాలపై జీవిస్తుంది.భూమిలో అధిక ఉష్ణోగ్రత తెగులు వృద్దికి దోహదపడుతుంది.
నివారణ: 
పంట మార్పిడి తప్పకుండా చేయాలి.పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా. థైరాం లేదా కాప్టాన్ లేదా కార్బండజిం 3 గ్రా.లీటరు  నీటికి కలిపి పిచికారీ చేయాలి     
వెర్రి తెగులు (ఫిల్లోడి):
ఈ తెగులు పూత సమయంలో ఆశిస్తుంది.సాదారణంగా ఆలస్యంగా వేసిన పంటలో ఎక్కువగా వస్తుంది.తెగులు సోకిన మొక్కలలో ఆకులు చిన్నవయి పువ్వులోని భాగాలన్ని ఆకులు మాదిరిగా మారిపోయి కాయలు ఏర్పడవు.మొక్కలు ఎదుగుదల తగ్గి పై భాగంలో చిన్న చిన్న ఆకులు గుబురుగా ఉండి వెర్రితల మాదిరిగా ఉంటుంది. ఈ తెగులు దీపపు పురుగుల ద్వారా వ్యాప్తి చెందుతుంది.
నివారణ : 
రాజేశ్వరి , చందన ,ఎలమంచిలి -66 వంటి రకాలు ఈ తెగులును తట్టుకుంటాయి. తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగులబెట్టలి.పైరుపై మిథైల్ డెమోటన్ 1 మి.లీ లేదా డైమిథోయేట్ 3  మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసి దీపపు పురుగులను అరికట్టాలి.
పంట కోత :
ఆకులు పసుపు రంగుకు మారి రాలటం ప్రారంభమయినపుడు , 75% కాయలు లేత పసుపు వర్ణానికి వచ్చి నప్పుడు పైరును కోయాలి.కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి.5-6 రోజుల ఎండిన తరువాత   కట్టెలతో  కొట్టి నూర్పిడి చేయాలి.
నిల్వ చేయటం:
గింజల్లో తేమశాతం 8 కి తగ్గేవరకు ఎండలో ఆరబెట్టాలి.గోనె సంచుల్లో నిల్వ చేయాలి .నిల్వ ఉంచిన సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి మధ్యలో పురుగు పట్టకుండా ఎండలో ఆరబెట్టాలి. వేపనూనె 25 మిలీ లేదా బూడిద 25 గ్రాములు   కిలో విత్తనానికి కలిపిన పురుగు పట్టదు. 

రచయిత సమాచారం

శ్రీ.పి.జోగా రావు , శాస్త్రావేత్త (మృత్తిక శాస్త్ర విభాగం ) , వ్యవసాయ పరిశోధనా స్ఠానం , సీతం పేట. డా.పి.ఉదయి బాబు , శాస్త్రావేత్త (కీటక శాస్త్ర విభాగం )& అధిపతి వ్యవసాయ పరిశోధనా స్ఠానం , సీతం పేట. డా.జి .రామా రావు , ఏ.డి.ఆర్.ఎత్థయిన పర్వత శ్రేణి , గిరిజన మండలం , ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్ఠానం , చింతపల్లి. శ్రీ.ఎన్.లక్ష్మీ నారాయణ ,శాస్త్రావేత్త (వ్యవసాయ విస్తరణ విభాగం ).