Print this page..

పసుపులో కోత,కోతానంతరం నిల్వలో జాగ్రత్తలు

ప్రస్తుతం తెలంగాణలోని వివిధ జిల్లాలోని పండిస్తున్న పసుపు కోత దశలో ఉంది.పసుపు మొక్కల ఆకుల ఎండి వాలిపోయినట్లైతే దుంపలు పక్వానికి వచ్చినట్లు గుర్తించి నీరు ఆపివేయాలి.
పసుపు కోత తవ్వకం:
సాగు చేసే రకాన్ని బట్టి పసుపు కాలం 7-9 నెలలు ఉంటుంది.పంట పక్వానికి వచ్చినప్పుడే కోత కోయడం ప్రారంబించాలి.పక్వ దశకు రాక ముందే పంట కోత చేపడితే దిగుబడి తగ్గడంతోపాటు కర్కుమిన్ శాతం కూడా తక్కువగా ఉండటం వల్ల నాణ్యత లోపిస్తుంది.కొంత మంది రైతు సోదరులు పసుపు తర్వాత సజ్జ,నువ్వులు టమాట సాగు చేయాలనే ఉద్దేశంతో పంట కాలం పూర్తి కాకముందే తవ్వకాలు ప్రారంబిస్తున్నారు.ఈ పద్దతి సరైనది కాదు.పంట కాలం పూర్తి అయినప్పుడు  మొక్కల ఆకులు పాలిపోయి తర్వాత నేలపై పడిపోతాయి.ఈ దశలో దుంపలను,కొమ్ములను తవ్వి తీయాలి.పసుపు తవ్వే 2రోజుల ముందు మొక్క ఆకులు,కాండాలను భూమట్టానికి కోసివేయాలి.తర్వాత తేలికపాటి నీటి తడి ఇచ్హి 2 రోజుల తర్వాత పసుపు తవ్వకం ప్రారంబించాలి. భూమిలో మిగిలి పోయిన దుంపలను నాగలితో దున్ని ఏరివేయాలి తర్వాత పసుపు దుంపలను అంటిఉన్న మట్టిని తొలగించి శుభ్రపరచాలి.
పసుపు ఉడకబెట్టడం:
పసుపుకు ఆకర్షణీయమైన పసుపు రంగును ప్రత్యేకమైన సువాసనను మరియు నాణ్యత పెంచడానికి పసుపు దుంపలను,కొమ్ములను పొలంలోనే రాశిగా పోసి 2 రోజుల తర్వాత 7 రోజుల్లోగా ఈ క్రింది పద్దతిలో ఉడికిస్తే అధిక నాణ్యమైన పసుపును పొందవచ్చును.
సాంప్రదాయ పద్దతిలో ఉడికించడం:
ఈ పద్దతిలో పసుపు ఉడికించడానికి గాల్వనైజ్డ్ ఇనుపరేకుతో ప్రత్యేకంగా తయారు చేసిన పాత్ర ,ద్ద్నిలో అమర్చడానికి రంధ్రాలతో కూడిన 4 చిన్న పాత్రలు ఉపయోగిస్తారు.పెద్ద పాత్రల్లో నీరు పోసి కొంద వేడిచేయడానికి ఏర్పాటు చేస్తారు.నాలుగు చిన్న పాత్రల్లో పసుపు కొమ్ములు లేదా దుంపలతో నింపి పెద్ద పాత్రల్లో అమర్చి,పైన మూత పెట్టి పైన ఎండిన పసుపు ఆకులు,ఇతర వ్యర్ధ పధార్దాలతో వేడి చేయాలి.45-60 నిమిషాలలో మంచి పసుపు వాసనతో కూడిన నురగతో పొందు వస్తుంది.అప్పుడు కొమ్ములతో ఉన్న చిన్న పాత్రలను వెలుపలికి తీసి టార్పాలిన్ పట్టాలపై పోసి ఆరబెట్టాలి.అయితే ఈ పద్దతిలో ఉడకబెట్టంకు అహిక కూలీలు మరియు ఎక్కువ సమయం పడుతుంది.దుంపలు ఎక్కువ సమయం ఉడకడం వల్ల నాణ్యత తగ్గి ధర పలకదు.
నీటి ఆవిరి యంత్రంతో ఉడికించడం :
నీటి ఆవిరితో ఉడికించే బాయిలర్లు (స్టీం బాయిలర్లు) అందుబాటులోకి వచ్చిన తరువాత పసుపును ఉడికించడం తేలికైంది.ప్రస్తుతం 2 లేదా 4 డ్రమ్ములు అందుబాటులో ఉన్నాయి.ఇదులో నీరు నింపడానికి ట్యాంకు ,కింద వేడి చేయడానికి చిమ్మి,వేడి చేసిన తరువాత ఉత్పత్తి అయిన నీటి ఆవిరిని డ్రమ్ముల్లోకి పంపడానికి పైపులు,దుంపలు ఉడికిన తరువాత సుళువుగా సేకరించడానికి కింద స్లైడింగ్ డోర్ ఉంటుంది.అవసరమైన పొలానికి ట్రాక్టరు సహాయంతో తీసుకెళ్ళడానికి అనువుగా ట్రాలీపై ఏర్పాటు చేసి ఉంటుంది.
ట్యాంకుల్లోకి మంచి నీటిని పంపి ఎండిన పసుపు,పసుపు ఆకులు,పొలంలో లభించే ఇతర వ్యర్ధాలను కలిపి వేడి చేయాలి.డ్రమ్ములో దుంపలు వేసి మూత పెట్టిన తరువాత నీటి ఆవిరిని పంపాలి.డ్రమ్ముల్లో నీటి ఆవిరి పూర్తిగా చేరిన తరువాత ప్రక్క డ్రమ్ముల్లోకి నీటి ఆవిరి పంపాలి.నీటి ఆవిరి ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెంటిగ్రేడ్ పైగా ఉండటం వల్ల కేవలం 10-15 నిమిషాల్లో దుంపలు ఉడికిపోతాయి.ఉడికిన తరువాత డ్రమ్ము కింద ఉన్న స్లైడింగ్ డోరు ద్వారా లాగితే దుంపలన్ని క్రింద పెట్టిన ట్రాలిలోకి సుళువుగా సేకరించవచ్చును.ఉడికిన దుంపలను టార్పాలిన్ పట్టాలపై పోసి ఎండబెట్టాలి.ఒక్కో డ్రమ్ములో 350కిలోలు చొప్పున 4 డ్రమ్ములో 1400 కిలోలు ఒకే దఫా ఉడికించి ఒక ఎకర పొలం నుండి లభించే 12 నుంచి 16 టన్నుల పచ్చి పసుపును ఒకే రోజులో ఉడికించవచ్చును.దుంపలు ఆవిరి వేడికి ఉడకడం వల్ల త్వరగా కూలీల అవసరం సాంప్రదాయ పద్దతి కంటే చాలా తక్కువ.
పసుపు ఆరబెట్టడం:
ఉడకబెట్టిన పసుపును చదునైన,శుభ్రమైన నేల లేదా టార్పాలిన్ షీట్ లేదా సిమెంట్  ప్లాట్పారంపై కుప్పగా పోయాలి.24 గంటల తర్వాత 2,3 అంగుళాల మందం ఉండేలా పరచాలి.పలుచగా పరిస్తే ఎండిన పసుపు రంగు చెడిపోతుంది.పసుపును అప్పుడప్పుడు తిరగబెట్టాలి.మధ్యాహ్నం పూట తిరగబెడితే సమానంగా ఎండుతుంది.ఒక క్రమ పద్దతిలో ఆరబెట్టడం అన్నది జరగాలంటే పసుపును,దుంపలను,కొమ్ములను రాత్రిపూట కుప్పగా చేసి వాటిని కుప్పవేసి ఉంచాలి.మరల ఉదయం పూట నేర్పాలి.కొమ్ములను విరిస్తే కంచు శబ్ధం వచ్చే వరకు ఎండబెట్టాలి.ఈ స్థితి రావడానికి సాధారణంగా  18-20 రోజులు పడుతుంది.పసుపు ఆరబెట్టినప్పుడు వర్షానికి తడపరాదు.ఉడికిన పసుపు తడిస్తే పసుపు రంగు కోల్పోయి నారింజ రంగు వస్తుంది.కాబట్టి ఆకస్మాత్తుగా వచ్చే వర్షాలకు పసుపు తడవకుండా పాలిథీన్ షీట్లు లేదా టార్పాలిన్ లు సిద్దంగా ఉంచుకోవాలి.మంచు ఎక్కువగా పడే చోట రాత్రివేలళ్ళో పసుపును పసుపును కప్పడం మంచిది.ఎండిన పసుపు పచ్చి పసుపులో సుమారు 20 శాతం తూకం ఉంటుంది.
పసుపు పాలిషింగ్:
ఎండిన పసుపు కొమ్ములు,పైనున్న ముడతలు,పొలుసులు,చిన్న వేర్లు వంటివి తొలగించి ఆకర్షణీయంగా మెరుగుపరిస్తే మార్కెట్లో మంచి ధర వస్తుంది.మెరుగైన పసుపు పొందడానికి విధ్యుత్ మోటార్లతో నడిచే పాలిషింగ్ యంత్రాలు.అందుబాటులో ఉన్నాయి.వీటిలో ఒకసారి 1000 కిలోల దుంపలను మెరుగుపరచవచ్చు.వీటిని ఉపయోగించినప్పుడు 6-7 శాతం పాలిషింగ్ జరిగి ,ముదురు గోదుమ రంగు నుంచి ఆలివ్ పసుపు రంగుకు మారి ఆకర్షణీయంగా నునుపుగా ఉంటాయి.
పసుపు గ్రేడింగ్:

పాలిష్ చేసిన కొమ్ములను,దుంపలను,సైజును బట్టి గ్రేడింగ్ చేసి మార్కెట్ కు పంపితే మంచి ధర రావడమే కాకుండా ఎగుమతులకు అవకాశం ఉంటుంది.
ప్యాకింగ్:స్థానిక మార్కెట్ లేదా ఎగుమతులకు అనుగుణంగా శుభ్రమైన గోనే సంచులు లేదా పాలిథీన్ సంచుల్లో నింపి నిల్వచేయాలి.
నిల్వ చేయడం:
తేమ తగలని ప్రాంతంలో సంచుల కింద చెక్కలు లేదా మందపాటి ఈత చాపలు లేదా వరిగడ్డి పరచి దానిపై సంచులు అమర్చాలి. ప్రక్క గోడలకు కూడా సంచులు తాకకుండా చెక్కలు లేదా ఈత చాపలు పెట్టాలి.
నిల్వ సమయంలో చీడలు:దుంపలు,కొమ్మలు,సక్రమంగా ఉడికించకపోవడం ,తేమ శాతం ఎక్కువగా ఉండటం పురుగు పట్టిన బస్తాలలో నిల్వ చేయడం వల్ల నిల్వ సమయంలో పలురకాల పురుగులు నష్టపరుస్తాయి.దుంపలు డొల్లలుగా మారి నుసిపడుతుంది.ఈ పురుగు విసర్జించిన పదార్ధాలు పసుపుతో కలిసి కలుషితం చేస్తాయి.
నివారణ చర్యలు:
నిల్వ సమయంలో బూజు పట్టడానికి ,ముక్కు పురుగులు ఆశించడానికి ప్రధాన కారనం సరిగ్గా ఎండకపోవడం.కాబట్టి పుసుపు కొమ్ముల్లో తేమ 8 శాతం వచ్చేవరకు ఎండ బెట్టాలి.మలాథియాన్ 2 మి.లీ లీటరు నీటరు నీటికి కలిపి తయారు చేసుకున్న ధ్రావణంలో గోనె సంచులను ముంచి ఎండబెట్టి వాటిలో కొమ్ములు పోసి నింపాలి.
పసుపు నిల్వ చేసే గదులు గోదాముల గోడలు నేల కప్పులను కూడా మలాథియాన్ 10 మి.లీ లీటరు నీటిలో కలిపిన ధ్రావణంతో పిచికారి చేయాలి.
గాలి సోకని గోదాముల్లో నిల్వ చేసేటప్పుడు అల్యూమినియం ఫాస్ఫైడ్ తో 2-3 రోజులు పొగబెట్టాలి.
ఈ విధమైన కోత,కోతానంతరం నిల్వలో జాగ్రత్తలు పాటించినట్లైతే నాణ్యమైన కొమ్ములకు మార్కెట్లో అధిక ధరను పొందవచ్చును. 

రచయిత సమాచారం

బి.మాధవి(సేధ్య విభాగ శాస్త్రవేత్త) ఎన్.నవత(సేధ్య విభాగ శాస్త్రవేత్త ) బి.రాజు(మృత్తిక విభాగ శాస్త్రవేత్త) పి.మధుకర్ రావు(సేధ్య విభాగ శాస్త్రవేత్త) యం.రాజేంద్రప్రసాద్(ప్లాంట్ పాథాలజి శాస్త్రవేత్త). డి.ఎ.రజనీ దేవి(ఆర్ధిక శాస్త్రవేత్త) ఆర్.ఉమా రెడ్డి(సహ పరిశోధన సంచాలకులు) పి.సాధ్వి(విస్తరణ శాస్త్రవేత్త) ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం-జగిత్యాల.