Print this page..

పంట అవశేషాల దహనం ఎంతవరకు సమంజసం….???

అభివృద్ధి చెందుతున్న దేశాలలో పెరుగుతున్న ఆహార డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా మరియు భారతదేశంలో కూడా ఆహార ఉత్పత్తి పెరుగుదలకు దారితీసింది. అందువల్ల,అభివృద్ధి చెందుతున్న మరియు అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ-ఆధారిత కార్యకలాపాలు లాభదాయకమైన వ్యాపారాలుగా మారిపోయాయి.  అధిక ఆహార ఉత్పత్తి అధిక మొత్తంలో పంట అవశేషాల ఉత్పత్తికి కారణం అవుతుంది.  పంట అవశేషాలను సమర్ధవంతంగా వినియోగించకకుండా  తగలబెట్టడం పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది. పంట అవశేషాలను తగలబెట్టడం వల్ల ఎక్కువగా ఉత్తర భారత రాష్ట్రాలు (ఢిల్లీ, హర్యానా, పంజాబ్ మొదలైనవి ...) ప్రభావితమవుతున్నాయి.

భారతదేశంలో, ఇండో-గంగా మైదానాలలోని సుమారు 2.5 మిలియన్ల మంది రైతులు సంవత్సరానికి రెండు (వరి, గోధుమ) పంటలను పండిస్తారు. గోధుమ పంట కోసం వరిపొలాలు కోత తరువాత 10 నుండి 20 రోజుల స్వల్ప వ్యవధిలో క్లియర్ చేయబడతాయి. వరి సాగు ద్వారా మిగిలిపోయిన 23 మిలియన్ మెట్రిక్ టన్నుల గడ్డి మరియు ఎండుగడ్డిని వదిలించుకోవడానికి రైతుల ముందున్న  సాంప్రదాయకమైన మార్గం వాటిని కాల్చడం. నూతన మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ నిర్వహించిన అధ్యయనంలో, ఏటా 500 మిలియన్ టన్నుల పంట అవశేషాలు ఉత్పత్తి అవుతున్నాయని అంచనా. యుఎస్ మరియు భారతదేశంలో పనిచేస్తున్న శాస్త్రవేత్తల మరో అధ్యయనం ప్రకారం, భారత దేశ వాయువ్య ప్రాంతంలో పంట అవశేషాలు అధికంగా దహనం చేయడం వల్ల మధ్య మరియు దక్షిణ రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్  మరియు ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు కూడా వ్యాపించగలదని కనుగొన్నారు. విస్మరించలేని మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, పంట అవశేషాల దహనం జరిగే ప్రాంతాలు దేశ  రాజధానితో సహా  కొన్ని పెద్ద నగరాలకు దగ్గరగా ఉన్నాయి.

 

సాధారణంగా ఇక్కడ వేలాది వాహనాల నుండి వెలువడే ఉద్గారాల కారణంగా పర్యావరణంపై ఇప్పటికే ఒత్తిడి నెలకొని ఉంది. అక్టోబర్-నవంబర్సమయంలో పంజాబ్, హర్యానా తదితర ప్రాంతాలలో రైతులు తాము పండించిన పంట అవశేషాలను కాల్చేస్తారు. దీనివల్ల విపరీత వాతావరణ మార్పులకు మరియు  అనారోగ్య సమస్యలకు కారణం అయిన కర్బన  ఉద్గారాలు విడుదల అవుతాయి.

క్షిణిస్తున్న గాలి నాణ్యత సూచిక మరియు నేల నాణ్యత :

పంజాబ్ మరియు హర్యానాలోని వరి పొలాలలో పంట అవశేషాలు కాల్చడం వల్ల  రోజురోజుకు దేశ రాజధాని లో గాలి నాణ్యత సూచిక పడిపోతుంది. దాదాపు 48% ఉద్గారాలకు పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాలలోని పంట అవశేషాలు తగలపెట్టడమే కారణం. పంట అవశేషాలను కాల్చడం వల్ల నేల యొక్క  భౌతిక,  జీవ రసాయన లక్షణాలలో తీవ్రంగా మార్పులు సంభవిస్తాయి. , ఇందులో ముఖ్యంగా పిహెచ్, సాయిల్ ఆర్గానిక్ కార్బన్, పోషక లభ్యత,  మరియు సూక్ష్మజీవుల కార్యకలాపాలు నశిస్తాయి.  మార్పులు పంట దిగుబడులపై చాల ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.

 

భారతదేశంలో పంట అవశేషాలను కాల్చడానికి ప్రత్యామ్నాయాలు

శాస్త్రవేత్తల  అధ్యయనం ప్రకారం "హ్యాపీ సీడర్" పద్ధతి ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులలో పోలిస్తే మరింత లాభదాయకంగా ఉంటుంది. హ్యాపీ సీడర్ మెషీన్ ట్రాక్టర్ కి  అమర్చబడి పంట కోత  తరవాత మిగిలిన వరి గడ్డిని కత్తిరించివేస్తుంది, విత్తనాన్ని విత్తి, ఆపై విత్తిన ప్రదేశంలో వరిగడ్డిని గడ్డిని విత్తనం పైన కప్పివేస్తుంది. ఇది రైతులకు మరింత లాభదాయకం మరియు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలపడం ద్వారా ఉద్గారాలను తగ్గించి  పర్యావరణహితానికి దోహదపడ్డవాళ్లమవుతాం.హ్యాపీ సీడర్ పద్ధతి హెక్టారుకు వ్యవసాయ హరిత  ఉద్గారాలను 78% తగ్గిస్తుంది.

 తొలగించబడిన జీవపదార్థం (వరిగడ్డి) నేల పై పరచడం  వల్ల నేల తేమను మెరుగుపరిచి  నేల దీర్ఘకాలిక ఆరోగ్యానికి కారణమవుతుంది.ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులతో పోలిస్తే, హ్యాపీ సీడర్ పద్ధతి ద్వారా రైతులు 10 - 20% ఎక్కువ లాభాలను పొందవచ్చు.  

 

పంట అవశేషాలను తగలబెట్టకుండా మరొక ప్రత్యామ్నాయ పద్ధతి బెయిలింగ్ (పొలంలో మిగిలిన వరి గడ్డిని  కత్తిరించి కుదించి యంత్రం సహాయం తో గుండ్రంగా చుట్టడం ) , ఇది హ్యాపీ సీడర్ పద్ధతి కంటే తక్కువ లాభదాయకం. కానీ పశువులు ఉన్న రైతులకి పశుపోషణకి చుట్టబడిన వరిగడ్డి ఉపయోగపడుతుంది.నేల తేమను కాపాడటానికి రైతులు పంట అవశేషాలను మల్చింగ్గా ఉపయోగించవచ్చు. అవి అవశేషాలను బయోచార్గా మార్చగలవు, ఇది నేల భౌతిక స్థితిని మెరుగుపరుస్తుంది మరియు మట్టికి కార్బన్ వనరుగా ఉపయోగిస్తుంది.

ముగింపు

భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పంట అవశేషాల నిర్వహణ ప్రస్తుతం గొప్ప సవాలుగా మారింది. ప్రధాన ఆహార పంటలైన వరి మరియు గోధుమ పంటలు ఎక్కువ మొత్తం లో పంట అవశేషాలను ఉత్పత్తి చేస్తాయి. ఇలా ఉత్పత్తి చేసిన పంట వ్యర్ధాలను ఇష్టారీతిన కాల్చకుండా ప్రభుత్వం రైతులలో నిపుణుల ఆధ్వర్యంలో సామాజిక అవగాహన కల్పించాలి. సాంకేతిక సహాయంతో ప్రత్యామ్నాయ, లాభదాయకమైన పద్ధతులను వారికీ అందుబాటులోకి తీసుకురావాలి. వీటిని  రైతులందరూ అనుకరించేలా ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడితే  పంట అవశేషాల నిర్వహణ సమస్య కానేకాదు.  

రచయిత సమాచారం

డి. అనిల్ (శాస్త్రవేత్త:AGRONOMY) జి.రంజిత్ కుమార్ MSc (Soil science & agricultural Chemistry) వ్యవసాయ పరిశోధన స్థానం, కూనారం జాతీయ వ్యవసాయ పరిశోధన మరియు నిర్వహణ సంస్థ, హైదరాబాద్