Print this page..

డ్రాగన్ ఫ్రూట్ పండ్ల సాగు -మెళకువలు

మన రాష్ట్రంలో ముఖ్యంగా సాగు చేసే పంటలు మామిడి,జామ,బత్తాయి,నిమ్మ,దానిమ్మ మరియు అరటి మొదలైనవి.ఇవే కాకుండా ఈ మధ్యకాలంలో నూతనంగా సాగుచేస్తున్న ఫలాల్లో డ్రాగన్ ఫ్రూట్ చాలా ముఖ్యమైనది.మన దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో సాగుచేస్తున్నారు.ఈ మధ్యకాలంలో తెలంగాణలో రంగారెడ్డి,సిద్దిపేట,సంగారెడ్డి,ప్రాంతాలలో దీన్ని సాగుచేస్తున్నారు. మొదటి సంవత్సరంలో అయితే పెట్టుబడి ఒక ఎకరానికి 4 లక్షల వరకు ఉండి ఆ తరువాత సంవత్సరానికి 50 వేలు ఖర్చు అవుతుంది.ఈ పండ్లను గులాబి పండుగా పిటాయ పండుగా పిలుస్తారు.
ఈ విధేశీ ఫలాన్నీ తెలంగాణ రైతులకు పరిచయం చేసే ఉద్దేశ్యంలో భాగంగా జీడిమెట్లలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వారు ప్రయోగాత్మకంగా దీన్ని సాగు చేస్తున్నారు.ఈ మొక్కలు కత్తిరింపుల ద్వారా మనకు భువనేశ్వర్ లోని ఇండియన్ ఇన్సిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రీసెర్చ్ లో మరియు మిజోరాం లోని డైరెక్టరేట్ ఆఫ్  హార్టికల్చర్ రీసెర్చ్ లో అందుబాటులో ఉన్నాయి.కానీ రైతులు ఈ మొక్కలను అక్కడ నుండి తెచ్చుకోవడం ఇబ్బందికరం  కావున ఔరంగాబాద్ మరియు జడ్చర్ల వంటి కొన్ని ప్రైవేట్ సంస్థల నుండి మొక్కలు కొనుగోలు చేసుకోవచ్చును.
అనుకూల వాతావరణం :
డ్రాగన్ పండ్లు సమశీతోష్ణ మండల వాతావరణంలో బాగా పండుతాయి.దీని సాగుకు సాధారణ ఉష్ణోగ్రతలు 20-30 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు అనుకూలం.సూర్యరశ్మి కూడా తక్కువగా అవసరం.అధిక వర్షపాతం ఇ పంటకు మంచిది కాదు.మొక్కలు మురిగిపోయే ప్రమాదం ఉంది.
నేలలు:ఈ పండ్ల పెంపకానికి అన్నీ రకాల నేలలు అనుకూలం.మన తెలంగాణ భూములు డ్రాగన్ ఫ్రూట్ సాగుకు అనువైనవి .ఉదజని సూచిక 5.5 నుండి 6.5 ఉన్న అధిక సేంద్రియ పదార్దం గల నేలలు మొక్కల పెరుగుదలకు అనుకూలమైనవి.
డ్రాగన్ ఫ్రూట్ గల రకాలు:
సాధారణంగా డ్రాగన్ ఫ్రూట్ రెండు రకాలు.
1.స్టెలో కొరియన్(పులుపు)
2హైలో సెరస్(తీపి):ఈ తీపి డ్రాగన్ ఫ్రూట్లో 3 రకాలు కలవు.
A.తెల్లని కండ కలిగి పైన తోట ఎరుపు లేదా గులాబి రంగులో ఉంటుంది.ఇది సాధారణంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్ .
B.ఎరుపు కండ కలిగి ,పైన తోట కూడా ఎరుపు రంగు కల్గిన పండ్లు వీటిని రెడ్ ఫ్లెష్డ్ డ్రాగన్ అంటారు.
C.ఈ రకం పండ్లలో లోపలి భాగం తెల్లటి కండ కలిగి ఉండి పైన తోలు పసుపు రంగులో ఉంటుంది.
వీటిలో ఎక్కువగా తెలుపు కండ కలిగి పైన తోలు ఎరుపు లేదా గులాబి రంగు మరియు రెడ్ ఫ్లెష్డ్ డ్రాగన్  ఫ్రూట్ ని  సాగుచేస్తున్నారు. 
మొక్కల సాంద్రత :
2*2 మీ దూరంలో మొక్కలు నాటుకుంటే ఒక ఎకరాకు 1700 మొక్కలు వస్తాయి.
మొక్కలు నాటిన తర్వాత కత్తిరింపులను మొక్కలు నిటారుగా పెరిగేలా చూసుకోవాలి. 
డ్రాగన్ ఫ్రూట్ ప్రవర్ధనం:
ఈ ఫ్రూట్ ను విత్తనాల ద్వారా లేదా కత్తిరింపుల  ద్వారా ప్రవర్ధనం చేస్తారు.కానీ బాగా ప్రాచుర్యంలో ఉన్న పద్దతి మరియు అధిక దిగుబడులు పందేది మాత్రం కత్తిరింపుల ద్వారానే సాధ్యం.అధికంగా ప్రాచుర్యం పొందిన పద్దతి కత్తిరింపులు మాత్రమే. 40-45 సెం,మీ పొడవు గల కత్తిరింపులు నాటుటకు అనువైనవి.నాటే 2 రోజుల ముందు కత్తిరింపులుకు ఎన్నుకొని  బంక కారిపోయే వరకు ఆరబెట్టాలి.
ప్రధాన పొలం తయారి మరియు మొక్కలు నాటు పద్దతి:
ముందుగా నేలను 3-4 సార్లు బాగా దుక్కి దున్నుకుని చదును చేసుకోవాలి.3*3 మీ లేదా 2*2 మీ దూరంలో మొక్కలను నాటుకుంటే గాలి ,వెలుతురు బాగా తగిలి మొక్క పెరుగుదలకు దోహదపడుతాయి.60 సెం.మీ (60*60*60) పరిమాణం గల గుంతలు తీసుకుని వాటిని పై మట్టితో పాటుగా 100గ్రా సూపర్ ఫాస్ఫేట్ మరియు పశువుల ఎరువు ఇసుకతో కలిపి నింపుకోవాలి.గుంత అడుగు భాగంలో కనుక ఇటుక మొక్కలు లేదా ఇసుక వేసుకుంటే అధిక నీరు ఇంకిపోవటానికి వీలుంటుంది.మొక్కలు నాటటానికి జూన్ - జూలై మాసాలు అనుకూలం .ఈ డ్రాగన్ ఫ్రూట్ ఊతం సహాయంతో పైకి పెరిగే మొక్క కావున దీన్ని పెంచడానికి ముందుగానే సిమెంట్ స్థంబాలను తీగలతో కట్టి పైకి ప్రాకించే విధంగా తయారు చేసుకోవాలి.ఈ స్థంభాలను 2 అడుగుల లోతులో భూమిలో అమర్చుకోవాలి.ఈ స్థంబాల క్రింద నుండి పైన వరకు మొక్కలకు ఊతం ఇచ్చేలా తీగలతో అల్లిక తయారు చేసుకోవాలి.ఈ విధంగా తయారు చేసుకున్న తరువాత లేదా 3 సంవత్సరాలు గల ఆరోగ్యవంతమైన మొక్కలు లేదా 6 నెలలు పాలీబ్యాగ్లలో పెంచిన కత్తిరింపులు,40-45 సెం.మీ పొడవు కలిగి ,ఆరోగ్యవంతమైన కత్తిరింపులను ఎన్నుకొని ప్రధాన పొలంలో ముందుగా తయారు చేసుకున్న గుంతలలో ఒక సిమెంట్ పోల్ 4వైపులా నాలుగు కత్తిరింపులు నాటుకోవాలి.
ఎరువుల యాజమాన్యం:
1-2 సంవత్స్రాల వయస్సుగల మొక్కలను 10 నుండి 15 కిలోల పశువుల ఎరువు, 200గ్రా యూరియా,50గ్రా సింగిల్ సూపర్ పాస్ఫేట్ మరియు 50గ్రా,మ్యూరేట్ ఆఫ్ పొటాష్ లను 3 సమపాళ్ళుగా చేసుకొని 3 సార్లు వేసుకోవాల్సి ఉంటుంది.
మొక్కల శిక్షణ:
డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు పెరిగి మొదటి దశలోనే లావుపాటి కొమ్మలను ఏర్పరచుకొనే తత్వం కలది.ప్రక్క నుండి వచ్చే కొమ్మలు తొలగిస్తు ఉండాలి.2-3 ప్రధాన కాడాలను మాత్రమే స్థంబం మొదలు నుండి పైన అల్లిక తీగలకు చేరుకునే వరకు భూమి నుండి ఎటువంటి ప్రక్క కొమ్మలను లేకుండా చూసుకోవాలి.ఈ కొమ్మలను అప్పటికప్పుడు కత్తిరింపులు చేస్తు ఉన్న యెడల గానీ వెలుతురు బాగా తగిలి చీడ పీడలను తెగుళ్ళను రాకుండా నివారించవచ్చును.
నీటి యాజమాన్యం:
మొక్క నాటిన తర్వాత నీటిని అందించాలి.మొక్కలు నాటిన వెంటనే,పూత సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
లుపు నివారణ మరియు అంతరకృషి: 
ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు తీసివేయాలి.మల్చింగ్ చేయడం ద్వారా కలుపు సమస్య కొంతవరకు తగ్గి,నీరు ఆవిరైపోకుండా ఉంటుంది.
పూత మరియు కాత:
వీటి పుష్పాలు పెద్దవిగా ఉండి ఆకర్షణీయమైన రంగులో సువాసన వెదజల్లుతాయి.ఈ పుష్పాలు సాయంత్రం నుండి రాత్రి వేళల్లో విచ్చుకుంటాయి.పగటి సమయంలో వికసించవు.పూత మొదలై పండుగా మారడానికి 15 రోజుల సమయం పడుతుంది.పండ్లు ఏర్పడిన తరువాత 30-50రోజులకు పండ్లు పెరిగి పక్వానికి వస్తాయి.కాత దశ 3-4 నెలల వరకు కొనసాగుతుంది.
దిగుబడి:
మొదటి సంవత్సరంలో 8-9 క్విటళ్ళు ఎకరానికి,2 వ సంవత్సరంలో 9-10 క్విటళ్ళు,3-5 సంవత్సరల వయస్సు గల మొక్కలు 5 టన్నుల ఒక ఎకరానికి దిగుబడిస్తాయి.
5 సంవత్సరాలు  పైబడిన మొక్కలకు యాజమాన్య పద్దతులు సరిగ్గా పాటిస్తే 8 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చును.5 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు నిలకడగా కాపునిస్తుంది. ఒక్క కిలో డ్రాగన్ ఫ్రూట్ ధర సుమారుగా 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంటుంది.దీని ఖర్చులన్నీ పోగా నికరాధాయం ఒక ఎకరానికి 3 నుండి 4 లక్షల వరకు రైతుకు వస్తుంది.

రచయిత సమాచారం

డి.శైలజ, శ్రీ కొండాలక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయం ,హైదరాబాద్ -రాజేంద్రనగర్. ఫోన్ నంబర్- 8179088347.