Print this page..

వేసవిలో రాగి పంట సాగు మరియు యాజమాన్యం

రాగిని (తైదలు )తెలంగాణ ప్రాంతాలలో చాలా జిల్లాలలో యాసంగిలో చాలా విస్తీర్ణంలో సాగుచేస్తున్నారు .ముఖ్యంగా నీటి సదుపాయం   తక్కువగా ఉన్న ప్రాంతంలో ఇది చాలా భాగా అనుకూలం మరియు చిరు ధాన్యాలలో రాగి ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.
ఉపయోగకరమైన పోషకవిలువలు కలిగి "వేసవిలో" కూడా పండించుటకు రాగి పంట బాగా అనుకూలం.
ముఖ్యంగా రాగిని ఖరిఫ్ లో వర్షాధారంగా ,యాసంగిలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకోవచ్చును.నీటి లభ్యత తగ్గినప్పుడు మరియు కొద్ది పాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితులలో రాగి పంటను సాగుచేసుకొని మంచి దిగుబడులు పొందవచ్చును.రాగి లో పోషకవిలువలు అనగా అథ్యధికంగాను కాల్షియం ఉండి క్రొవ్వు పధార్దాలు తక్కువగా ఉంటాయి.
నేలలు(సాగుకు అనువైన):
రాగిని తేలికరకం ఇసుక నేలలు,బరువైన నేలలు మరియు చౌడు సమస్య ఉన్న భూముల్లో కూడా సాగుచేసుకోవచ్చును.
విత్తేసమయం:
రాగిని ఖరిఫ్ లో జూలై మొదటి వారం నుండి ఆగష్ట్ చివరి వారం వరకు విత్తుకోవచ్చును.రబీలో అక్టోబర్ చివరి వారం వరకు మరియు వేసవిలో ఫిబ్రవరి నెలలో విత్తుకోవచ్చును.
విత్తన మోతాదు:
విత్తనమును వెదజల్లే పద్దతిలో ఏకరాకు 3-4 కిలోల విత్తనం సరిపోతుంది.అలాగే రాగిని నారు పెంచి నాటే విధానంతో కూడా వేయవచ్చు అనగా 2 కిలోల విత్తనముతో 5 సెంట్లలో పెంచిన నారు ఒక ఎకరా పొలంలో నాటడానికి సరిపోతుంది.
విత్తన శుద్ది:
కిలో విత్తనానికి 3గ్రా థైరం లేదా 2గ్రా కార్బెండజిం విత్తన శుద్ది చేయాలి.ఈ విధంగా చేయడం ద్వారా విత్తనం నుంచి మరియు మరియు నేల నుంచి సంక్రమించు వివిధ రకాల తెగుళ్ళ నుంచి రక్షించుకొని మొలక శాతం పెంచుటలో తోడ్పడుతుంది.
విత్తే విధానం మరియు నారు నాటే విధానం:
వెదజల్లే పద్దతిద్వారా  బాగా దుక్కి చేసిన నేలల్లో రాగిని 1:3 నిష్పత్తిలో విత్తనము మరియు సన్నని ఇసుక కలిపి నేరుగా కూడా విత్తుకోవచ్చును. నారుమడికి తేలికపాటి దుక్కి చేసి తగిన జాగ్రత్తలు పాటించి నారుపెంచి 85-90 రోజుల స్వల్పకాలిక రకాలకు 21రోజుల వయసు కలిగిన మొక్కలను 105-120 రోజుల దీర్ఘకాలిక రకాలకు 30 రోజుల వయసుగల మొక్కలను నాటాలి.
విత్తే దూరం :
రాగి పంటకి వరుసల మధ్య 30 సెం.మీ.మొక్కల మధ్య 15 సెం.మీ దూరం పాటించి విత్తాలి.
రాగి పంటలో ముఖ్యమైన రకాలు 
మారుతి: ఖరీఫ్ మరియు వేసవి కలాలకు అనుకూలం ,పంట కాలం 85-90 రోజులు,దిగుబడి 9-10 క్విటాళ్ళు, బెట్టను మరియు అగ్గి తెగులును తట్టుకుంటుంది .
భారతి:అన్నీ కాలాలకు అనుకూలం ,పంట కాలం 105-110 రోజులు, దిగుబడి 10-12 క్వింటాళ్ళు ,వెన్నులు పెద్దవిగా ముద్దగా ఉంటాయి.అగ్గితెగులును కొంతవరకు తట్టుకుంటుంది.
శ్రీ చైతన్య:ఖరీఫ్ కి అనుకూలం ,పంటకాలం 110-120 రోజులు,దిగుబడి 10-12 క్వింటాళ్ళు,పైరు ఎత్తుగా పెరిగి పిలకలు ఎక్కువగా వేస్తుంది.
వఖుల :ఖరీఫ్ కి అనుకూలం ,పంట కాలం 105-110 రోజులు ,దిగుబడి 10-12 అగ్గి తెగులును కొంత వరకు తట్టుకుంటుంది.
హిమ:రబీ కి అనుకూలం ,పంటకాలం 105-110 రోజులు, దిగుబడి 10-12 క్వింటాళ్ళు ,తెల్ల గింజ రాగి రకము,అగ్గితెగులును తట్టుకుంటుంది.
ఎరువుల యాజమాన్యం:
నాటే ముందు ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు ఆఖరు దుక్కిలో వేసి కలియదున్నాలి.ఎకరాకు 25-30 కిలోల డి.ఎ.పి ,15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ నాటేటప్పుడు వేయాలి.
నాటిన 30రోజులకు 25 కిలోల యూరియా పై పాటుగా వేసుకోవాలి.
కలుపు నివారణ :
విత్తిన 30రోజుల తర్వాత అంతర సేధ్యం దంతెలతో చేసుకుని కలుపు నివారణ చేపట్టాలి. 
నీటి యాజమాన్యం :
ముఖ్యంగా తేమ పంట సున్నిత దశలో ఇవ్వాలి.అనగా పూత దశ,గింజ పాలు పోసుకునే దశలో ఇవ్వాలి.అలాగే పైరు నీటి ఎద్దడికి గురి కాకుండా చూడాలి.
సస్య రక్షణ(రాగి పంటను ముఖ్యమైన తెగుళ్ళు ,కీటకాలు):
ముఖ్యంగా రాగి పంటలో అగ్గితెగులు మరియు గులాబి రంగు పురుగుల బెడద ఎక్కువగా ఉంటుంది.
అగ్గితెగులు:
ఆ తెగులు ఆశించినప్పుడు ఎదిగిన మొక్కల ఆకులు ,కణుపులు,వెన్నుల పైన దారపు కండే అకారపు మచ్చలు ఏర్పడుతాయి.కణుపులపై తెగులు ఆశిస్తే కణుపులు విరగడం ,వెన్నుపై ఆశిస్తే గింజలు తాలుగా మారుతాయి.మొక్కలపై ఈ తెగులును గమనించినప్పుడు క్రింది నివారణ చర్యలు చేపట్టాలి.
నివారణ :
మాంకోజెబ్ 2.5గ్రా లీటరు నీటికి లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ లేదా ట్రై సైక్లజోల్ 0.6 గ్రా.లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
గులాబి రంగు పురుగు:
బాగా ఎదిగిన లార్వాలు గులాబి రంగులో ఉండి కాండాన్ని తొలచి లొపలి భాగాలను తినడం వలన మొవ్వు చనిపోతుంది .పంటను కంకి దశలో ఆశిస్తే తెల్ల కంకులు ఏర్పడతాయి.పొలంలో ఈ పురుగులను గమనించిన వెంటనే క్రింది నివారణ చర్యలు తీసుకోవాలి.
నివారణ:
క్లోరిపైరిపాస్ 2.5మి.లీ ఒక లీటరు నీటికి లేదా మొనోక్రోటొఫాస్ 1.6 మి.లీ లీటరు నీటికి పిచికారి చేయాలి.
పంట కోత నూర్ఫిడి :
గింజలు ముదురు గోధుమ రంగులో ఉన్నప్పుడు,వెన్నుల దగ్గర ఆకులు పండినట్లుగా ఉంటే పంటను కోయవచ్చును.పిలక కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తుంది.కాబట్టి 2 దశల్లో కంకులను కోయాలి.పొలంలోనే చొప్పకోసి 2-3 రోజులు ఆరిన తర్వాత వెన్నులను విడదీయాలి.బాగా ఆరిన వెన్నులను కర్రలతో కొట్టిగానీ,ట్రాక్టరు నడపడం ద్వారా గానీ గింజలను వేరు చేయవచ్చును. 
అలా వేరు చేసి సేకరించాలి.తూర్పారబట్టి నాణ్యమైన గింజలను తీసి తగ్గిన తేమ వచ్చు వరకు ఎండబెట్టి సరైన పద్దతిలో నిల్వ ఉంచుకోవాలి.
 

రచయిత సమాచారం

శ్రీకాంత్ భోగ్యం (వ్యవసాయ డిప్లమా) ఎల్.రాం చందర్ (ప్లాంట్ బ్రీడింగ్ మరియు జెనిటిక్స్ ) ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవ్యసాయ విశ్వవిధ్యాలయం -రాజేంద్రనగర్