Print this page..

వెర్రినువ్వులు –యాజమాన్యపద్ధతులు

వెర్రి నువ్వులు/ఒడిసలు/గడ్డి నువ్వులు లేదా ఆంగ్లంలో Niger seed అని పిలువబడే ఈమొక్క, ఒక రకమైన నూనె గింజల పంట. ముఖ్యంగా దీని నూనె చాలా విలువైనది మరియు నాణ్యమైనది. గింజలో 32-40% వరకు నూనె మరియు 18- 24% మాంసకృత్తులు వుండును. దీని గింజల నుండి నూనె తీయగా మిగిలిన పొట్టును పశువుల దాణాగా ఉపయోగించుకోవచ్చు. దీని గింజల్లో ఎటువంటి హానికారక రసాయనాలు ఉండవు కావున మిగిలిన నూనె గింజల పంటలతో పోల్చుకుంటే శ్రేష్ఠమైనవి. యూరోపియన్ దేశాలకు పక్షి దాణాగా ఎగుమతి ప్రయోజనం కోసం కూడ దీనిని పండిస్తారు. భారతదేశంలో ఈ పంటసాగు చేయు రాష్ట్రాలు: కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్ మరియు ఒడిషా. ఆంధ్ర ప్రదేశ్లో విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతంలో ఈపంటను బాగా సాగుచేస్తారు. నీటి వసతి సరిగా లేని మరియు చౌడు నెలల్లో కూడా ఈ పంట మంచి దిగుబడులు ఇస్తుంది. ఈ పంటను ఇతర పంటలలో అంతర పంటగా కూడ వేసుకోవచ్చు.

పంటకు అనువైన నేలలు:

ఈ పంటను ఇసుక, ఒండ్రు, గరప మొదలగు ఎటువంటి నేలలోనైనా వేసుకోవచ్చు. కొండవాలులలోని రాతి నేలలలో కూడా పండించ వచ్చును. కానీ, నల్ల రేగడి నేలలు అంతగా అనువైనవి కాదు. మెట్ట ప్రాంతాల్లో, ఖరీఫ్‍ మరియు రబీ కాలాల్లో దీన్ని ప్రధాన పంటగా లేదా చిరుధాన్యాలైన సామ, రాగి మరియు సజ్జలతో లేదా వేరుశనగ మొదలైన పంటలలో అంతర పంటగా సాగుచేస్తారు.

అంతర పంటలు:

వెర్రి నువ్వులు , అలసంద (4:2), రాగి (1:1) మరియు వేరుశనగ (6:3) మొదలైన పంటలతో అంతర పంటగా సాగుచేస్తారు.

విత్తు సమయం:

ఖరీఫ్‍ పంటగా జూలై నెల మధ్య నుండి ఆగష్ట్ మొదటి వారం వరకు విత్తుకోవటానికి అనుకూలం అదే రబీ పంటగా సెప్టెంబర్ నెల అనుకూలమైనది.

ఆంధ్ర ప్రదేశ్ కు అనువైన రకాలు:

జె న్ యెస్- 9, బి న్ యెస్ -2, బి న్ యెస్ -10, జి ఏ - 10 ,ఉత్కల్ నైజర్ - 150 అనువైన రకాలు.

విత్తన మోతాదు మరియు విత్తే దూరం:

ప్రధాన పంటగా సాగు చేసుకోవటానికి ఒక హెక్టారుకు సుమారు 5 కిలోల విత్తనం అవసరం అవుతుంది. సాళ్ళ మధ్య ఎడం 30 సెం.మీ. మరియు   మొక్కలు మధ్య 10 సెం.మీ. వుండేల నాటలి.

విత్తన శుద్ధి:

విత్తన సంరక్షణ కొరకు విత్తనం నాటే ముందు కిలో విత్తనాన్ని 5 గ్రాముల కార్బండజిమ్ తో కానీ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా విరిడి మిశ్రమం తో కానీ శుభ్రపరుచుకోవాలి. భాస్వరాన్ని వృధ్ధి చేసే బాక్టీరియా మిశ్రమాలైన అజోస్పిరుల్లం లేదా అజాటోబాక్టర్ 10 గ్రాములను కిలో విత్తనానికి కలిపి నాటుకుంటే అధిక దిగుబడి పొందవచ్చును.

విత్తుకునే పధ్ధతి:

సాధారణంగా విత్తనాన్ని వెద చల్లుతారు కానీ, నాగలి వెనుక లేదా విత్తనాన్ని నాటే పరికరాన్ని ఉపయోగించి వరుసల్లో నాటుకున్నట్లైతే మంచిది.  విత్తనం చిన్నగా ఉంటుంది కావున ఇసుకతో కానీ లేదా పెంట మిశ్రమంతో కానీ లేదా బూడిదతో కానీ కలిపి చల్లుకుంటే పొలంలో హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా విత్తబడుతుంది.

 

పలుచన చేయడం:

సాధారణంగా హెక్టారుకు సుమారు ౩ లక్షల మొక్కలు ఉండేలా చూసుకోవాలి. అందుకొరకు విత్తిన రెండు వారల తరువాత లేదా మొక్కలు 8 నుండి 10 సెంటీ మీటర్ల ఎత్తు పెరిగిన తరువాత ఆరోగ్యంగా లేని అనవసరపు మొక్కలను పీకి వేయాలి. ఇలా చేయటం వలన మిగిలిన మొక్కలు ఏపుగా పెరగటమే కాకుండా మొక్కల మధ్య నీరు మరియు ఇతర అవసరాల కోసం పోటీ తక్కువగా ఉంటుంది.

ఎరువులు యాజమాన్యము:

ఆంధ్ర ప్రదేశ్ లో అయితే సుమారు 5 టన్నుల పశువుల పెంట మరియు 10 కిలోల నత్రజని ఎరువులను విత్తే సమయంలో వేసుకోవాలి. హెక్టారుకు 20 నుండి 30 కిలోల సల్ఫర్ ను వేసుకోవటం వలన పంట దిగుబడి మరియు నూనె దిగుబడి కూడా వృద్ధి చెందుతాయి.

అంతర కృషి - కలుపు యాజమాన్యము: 

విత్తనాన్ని నాటిన 15 నుండి 20 రోజులకు మొదటసారి కలుపు తీయాలి. మొదటి కలుపు తీత పూర్తయిన 15 రోజుల తరువాత రెండవసారి కలుపు తీయటం మంచిది. ఈ పంటలో  కస్కూట అనే కలుపు మొక్కలు సాధారణం. వీటి నివారణకు 10 శాతం లవణ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి.

తెగుళ్ళ నియంత్రణ:

తీవ్రమైన తెగుళ్ళు మరియు వ్యాధులు గమనించబడనందున, మొక్కల రక్షణ చర్యలు అంతగ అవసరం వుండదు. ముఖ్యమైన రోగాలైన  సెర్కొస్పోర లీఫ్ స్పాట్ మరియు కస్కుటా కనిపించినపుడు ఈ విధంగ పంట ను రక్షించుకోవచ్చు.

  • సెర్కొస్పోర లీఫ్ స్పాట్: విత్తనాన్ని థైరం (0.2%) + బేవస్టిన్ (0.1%) తో విత్తన శుద్ధి చేయాలి లేదా థైరం (0.2%) + డైతెన్ ఎం 45 (0.25%) రెండు సార్లు ఆకు పై పిచికారి చెయాలి.

  • కస్కుటా:  విత్తడానికి ముందు ఉప్పునీరు ద్రావణంలో కుస్కటా విత్తనాన్ని వుంచాలి. ఫ్లూ క్లొరాలిన్ (1 కిలో ఎ. ఐ. / హెక్టారుకు) విత్తడానికి ముందు నేలలో వేయాలి  లేదా పెండిమెథాలిన్ (1 కిలో ఎ. ఐ. / హెక్టారుకు) ఆకు పై పిచికారి చెయాలి.

పంట కోత దశ:

నాటిన 95 నుండి 105 రోజులకు పంట కోతకు వస్తుంది. మొక్కల ఆకులు ఎండి పోయి, పూలు ముదురు కాఫీ రంగులోకి లేదా ముదురు నల్లని రంగులోకి మారిన దశలో పంటను కోసుకోవాలి.

పంట నూర్పిడి: 

పంటను కోసుకున్న తరువాత కుప్పలుగా ఉంచి ఒక వారం రోజుల పాటు ఎండనివ్వాలి. తరువాత మొక్కలను కర్రలతో కొట్టటం ద్వారా మొక్కల నుండి గింజలను వేరుచేయాలి.

తేనెటీగ పరాగసంపర్కం - అదనపు ఆదాయం: 

ఈ పంట మొక్కలు పరపరాగ సంపర్కాన్ని కలిగి వుంటుంది అందువల్ల  పంటతో పాటుగా తేనెటీగల పెంపకం కూడా చేపట్టటం ద్వారా పంట దిగుబడి 15 నుండి 20 శాతం  పెంచుకోవటమే కాకుండా తేనె ద్వారా సుమారు హెక్టారుకు 1500 రూపాయల అదనపు ఆదాయాన్ని కూడా ఆర్జించవచ్చు.

పంట దిగుబడి: 

ప్రధాన పంటగా 350-450 కిలోలు హెక్టారుకు, అంతర పంటగా ఐతె - 150-200 కిలోలు హెక్టారుకు పంట దిగుబడి వస్తుంది

 

రచయిత సమాచారం

పుష్ప హెఛ్ డి, ఉషాకిరణ్ బి, జవహర్ లాల్ భారతీయ నూనెగింజల పరిషొధన సంస్థ, హైదరాబాద్