Print this page..

పెసర మరియు మినుము సాగుకు అనువైన రకాలు - యాజమాన్య పద్దతులు

పప్పుధాన్యాలు రైజోబియం అనే బాక్టీరియా ద్వారా గాలిలోని నత్రజనిని తయారు చేసుకోవటమే కాక భూమిని సారవంతం చేస్తాయి. పప్పుధాన్యాలు కోతకు వచ్చేసరికి చాలా భాగం ఆకులు రాలిపోయి తద్వారా నేలలో సేంద్రీయ పదార్ధం చేరుతుంది. ఆధునిక వ్యవసాయంలో రైతాంగం అధిక పెట్టుబడి పెట్టి వాణిజ్యపరంగా పైర్లను సాగుచేస్తూ అధిక దిగుబడి, ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని పంటమార్పిడి లేకుండా, సేంద్రియ ఎరువులు వాడకుండా పండిస్తున్నారు. దీంతో దిగుబడులు తగ్గడమే కాకుండా ఖర్చులు పెరిగిపోయి భూసారం తగ్గుతుంది. ఇటువంటి పరిస్థితులలో అపరాలను సాగుచేయడం ఎంతో మేలు. ఆంధ్రప్రదేశ్ లో సాగుచేసే అపరాలలో పెసర మరియు మినుము పంటలు ముఖ్యమైనవి. ఈ రెండు పంటలను మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో సాగు చేస్తారు.

పెసర సాగుకు అనువైన రకాలు
డబ్ల్యుజిజి- 42:  
పంటకాలం 55-60 రోజులు, రబీ మరియు వేసవి సాగుకు అనుకూలం. దిగుబడి ఎకరాకు 4-6 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకొంటుంది. గింజలు లావుగా ఉండి మెరుస్తూ ఉంటాయి.
ఐపిఎం 2-14:
మొక్క నిటారుగా పెరిగి ఒకేసారి కోతకు వస్తుంది. పంటకాలం 55-60 రోజులు, రబీ మరియు వేసవి సాగుకు అనుకూలం. దిగుబడి ఎకరాకు 4-6 క్వింటాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకొంటుంది. గింజలు మద్యస్థ లావుగా ఉంటాయి.
టి.ఎం 96-2: 
పంటకాలం 60-65 రోజులు, రబీ మరియు వేసవి సాగుకు అనుకూలం. దిగుబడి ఎకరాకు 4-6 క్వింటాళ్ళు. అధిక తేమను మరియు బూడిద తెగులును తట్టుకొంటుంది. గింజలు లావుగా మెరుస్తుంటాయి. మాగాణి వరికి అనువైనది.
ఎల్.జిజి- 450 :
పంటకాలం 65-70 రోజులు, రబీ మరియు మాగాణిలో వరి తర్వాత అనువైనది. దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు. మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి. గింజలు మెరుస్తూ ఉంటాయి. ఎల్లో మొజాయిక్ తెగుళ్ళును తట్టు కుంటుంది. ఒకేసారి కోతకు వస్తుంది.. పంట కోత సమయంలో వర్షాలు కురిసినా కాయల్లోని గింజలు కొంతవరకు పాడవకుండా ఉంటాయి.
ఎల్.జిజి- 460 :
పంటకాలం 60-65 రోజులు, రబీ మరియు వేసవి సాగుకు అనువైనది. దిగుబడి ఎకరాకు 5-6 క్వింటాళ్ళు. కాయలు గుత్తులు గుత్తులుగా పై భాగం లో వుండి కోయడానికి సులువుగా వుంటుంది. ఒకేసారి కోతకు వస్తుంది. పల్లాకు తెగులును తట్టుకొంటుంది.మొవ్వ కుళ్ళు తెగులును కొంత వరకు తట్టుకుంటుంది. మాగాణి వరికి అనువైనది.
 

మినుము సాగుకు అనువైన రకాలు
ఎల్.బి.జి-787
పంట కాల౦ 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 8-9 క్వి౦టాళ్ళు. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకు౦టు౦ది. పాలిష్ రకం, అన్ని కాలాలకు అనువైన రకం.
ఎల్.బి.జి-752
పంట కాల౦ 75-80 రోజులు. దిగుబడి ఎకరాకు 6-7 క్వి౦టాళ్ళు. పల్లాకు తెగులును కొంత వరకు తట్టుకు౦టు౦ది. పాలిష్ రకం, అన్ని కాలాలకు అనువైన రకం.
టి.బి.జి-104
పంట కాల౦ 70-75 రోజులు. దిగుబడి ఎకరాకు 8-9 క్వి౦టాళ్ళు. పల్లాకు తెగులును తట్టుకు౦టు౦ది. పాలిష్ రకం, అన్ని కాలాలకు అనువైన రకం.
పి.యు-31
పంట కాల౦ 70-75 రోజులు. దిగుబడి ఎకరాకు 5-6 క్వి౦టాళ్ళు. పల్లాకు తెగులును పూర్తిగా తట్టుకు౦టు౦ది. సాదా రకం కాయల మీద నూగు ఉంటుంది.
 

నేలలు :
మురుగు నీరు పోయే వసతి గల, తేమను నిలుపుకోగల భూములు అనువైనవి చౌడు భూములు పనికిరావు.
 

విత్తన మోతాదు : 
పెసర : వరి మాగాణుల్లో 10-12 కిలోలు మరియు మెట్ట ప్రాంతాలకు 6-7 కిలోలు ఎకరానికి సరిపోతాయి.                         
మినుము : వరి మాగాణుల్లో 16కిలోలు మరియు మెట్ట ప్రాంతాలకు 8-10 కిలోలు ఎకరానికి సరిపోతాయి.                         

విత్తే సమయం : 
మెట్ట ప్రాంతాలకు సెప్టెంబర్ - అక్టోబర్ లో విత్తుకోవచ్చు. వరి మాగాణుల్లో నవంబర్ - డిసెంబర్ మొదటి వారంలో విత్తుకోవచ్చు.

విత్తే దూరం :
సాలుకు సాలుకు మధ్య 30 సెం. మీ. మరియు మొక్కకు మొక్కకు మధ్య 10 సెం. మీ. ఉండేలా విత్తుకోవాలి.

ఎరువులు:
ఎకరాకు 8 కిలోల నత్రజని మరియు 20 కిలోలు భాస్వరం ఎరువులను చివరి దుక్కిలోవేయాలి. వరి మాగాణుల్లో ఎరువులు వేయాల్సిన అవసరం లేదు. 2% యూరియా ద్రావణాన్ని పిందె మరియు గింజ కట్టే దశలో పిచికారి చేయడం వల్ల అధిక ఆదాయం పొందవచ్చు.

అంతరకృషి & కలుపుయాజమాన్యం: 
పెసర/మినుము పైరుకు రోజుల వరకు కలుపు బారి నుండి రక్షించుకోవాలి. కలుపు అధికంగా ఉండే భూములలో అయితే విత్తిన వెంటనే పెండిమిథాలిన్ 30% ఎకరాకు 1.0-1.25 లీటర్ల చొప్పున పిచికారి చేయాలి. 20 - 30 రోజుల దశలో గొర్రు/ దంతి ద్వారా అంతర కృషి చేస్తే కలుపు నివారణతో పాటు తేమను కూడా నిలుపుకోవచ్చు. 

అంతర పంటలు :
పెసరను అంతర పంటగా పత్తి, కందిలో వేసుకోవచ్చు. పెసర : పత్తి/ కంది – 3:1

మరియు మినుము కు అనువైన రకాలు - యాజమాన్య పద్దతులు

రచయిత సమాచారం

యస్. నజ్మ, రీసర్చ్ అసోసియేట్ (క్రాప్ ప్రొడక్షన్), జి. ప్రసాద్ బాబు (కో-ఆర్డినేటర్), కె. రాఘవేంద్ర చౌదరి (ఎస్‌.ఎం‌.ఎస్ ఎక్స్టెన్షన్) ఏరువాక కేంద్రం, బనవాసి.