Print this page..

తెగుళ్ళ యాజమాన్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలు

ప్రస్తుత సమాజంలో మానవ మనుగడ ముందుకు సాగాలంటే ,వ్యవసాయ సాగు అనేది చాల కీలకమైనది.అలాంటి వ్యవసాయంలో పెరిగే ప్రతి మొక్క ఎందరో ఆకలిని తీర్చడానికి దోహదపడుతుంది.మారుతున్న పర్యావరణ చక్రంలో అనేక వ్యాధి కారకాలు.కీటకాలు మొదలైనవి పంట పెరుగుదలపై ఆటంకంగా మారి,వ్యవసాయ రంగానికి,ఆర్ధికాభివృద్ది,మానవ ఆరోగ్యానికి కీడును కలిగిస్తున్నాయి.కాబట్టి పై సమస్యలను అరికట్టి ,దేశ రక్షణ కొరకు రాబోయే తరాల కొరకు ప్రతి మనిషి నడుంబిగించాల్సిన అవసరం ఉన్నది.
ముఖ్యంగా ,మొక్కల తెగుళ్ళు,వ్యాధుల కారణంగా వ్యవసాయ రంగంలో అనేక పంటలకు నష్టం వాటిల్లుతుంది.అందుకు ప్రజలు,రైతులు విధ్యార్ధులు తెలుసుకోవాల్సిన విషయాలు అలగే వాటినుండి పంటను కాపాడుకొనుటకు ఆచరించాల్సిన జాగ్రత్తలు తెలుసుకుందాం.
తెగుళ్ళ యాజమాన్య సూత్రాలు:
పంటలపై ఆశించే తెగుళ్ళను కొన్ని రకాల పద్ధతుల వలన పూర్తిగా అరికట్టదం లేక నివారించడానికి ,లేదా పూర్తిగా నిర్మూలించడం వీలు కానీ పని.తెగులును పూర్తిగా నిర్మూలించడానికి ఎప్పుడు నివారణ చర్యలు సకాలంలో చేపట్టాలి.ఈ పద్ధతి చాల ఖర్చుతో కూడుకున్నది.ప్రస్థుత పరిస్థితులలో తెగులు నివారణకు బదులుగా,తెగులు యాజామన్య పద్ధతులు సత్ఫలితాలను ఇస్తున్నాయి.దీని వలన పంట నష్టాన్ని కనీస స్థాయికి తగ్గించుకోవచ్చును.
తెగుళ్ళ యాజమాన్యంలో ముఖ్యమైన మూడు సూత్రాలు:
1.తెగులు సోకకుండా తప్పించుకొనుట
2.బహిర్ద్విష్ఠం చేయుట 
3.నిర్మూలించుట లేక నాశనం చేయుట 
1.తెగులు సోకకుండా తప్పించుకొనుట:
ఈ పద్ధతిలో అతిదేయి మరియు వ్యాధి జనకం ఒకదానికొకటి తారసపడకుండా జాగ్రత్త పడడం ముఖ్యమైనది.ఈ క్రింది సూచనలు పాటించి తెగులు సోకకుండా తప్పించుకోవచ్చును.
పంట పండించే  ప్రాంతాన్ని ఎన్నుకొనుట:
చాల రకాల బాక్టీరియా మరియు శిలీంద్రపు తెగుళ్ళ తీవ్రత తడి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది.ఉదా:చిక్కుడులో ఆంథ్రాక్నోస్ తెగులు తడి వాతావరణంలో ఎక్కువగా ఆశిస్తుంది.విత్తనోత్పత్తికి పండించే ఈ పంటను పొడి వాతావరణంలో పండించడం వలన తెగులు సోకకుండా తప్పించవచ్చును.అలాగే సజ్జలో కాటుక తెగులు మరియు ఎర్గాట్ తెగులు పూత సమయంలో ఎక్కువ వర్షం కురిసే సమయంలో తీవ్ర నష్టాన్ని కలుగజేస్తాయి.ఇటువంటి ప్రాంతాలను పంటను పండించడానికి ఎన్నుకోరాదు 
నేలను ఎన్నుకొనుట:
కొన్ని రకాల నేలలు,నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళకు అలవాటైనప్పుడు అటువంటి నేలలో ఈ తెగులు ఆశించే పంటలను పండించరాదు.ఉదా:కందిలో వడలు తెగులు,సజ్జలో కాటుక తెగులు, ఎర్గాట్ తెగులు,వేరు బుడుపెలను కలిగించే నులిపురుగులు మొదలైనవి.ఈ తెగులు సోకే నేలల్లో కొన్ని సంవత్సరాల వరకు ఈ పంటలను పండించడం మానివేసి పంత మార్పిడి పద్ధతి అవలంబించాలి. 
విత్తే సమయం మార్చడం:
విత్తే సమయంలో చాల రకాల తెగుళ్ళలో తెగులు ఉదృతి సమయం మరియు అతిదేయిలో తెగులు తట్టుకోలేని సమయం ఒకటైనప్పుడు ,తెగులు ఉదృతి ఎక్కువగా ఉండి పంట నష్టం అధికంగా ఉంటుంది.విత్తే సమయం మార్చడం వలన తెగులు సోకకుండా పంటను కాపాడవచ్చును.
తెగులు తప్పించుకునే రకాలను ఎనుకొనుట:
వివిధ పంటలలో కొన్ని రకాలు వాటి ప్రత్యేక లక్షణాల వలన తెగులు సోకకుండా తప్పించుకుంటాయి.ఉదా:బఠానిలో తక్కువ కాల పరిమితి గల రకాలు బూడిద తెగులు సోకకుండా తప్పించుకుంటాయి.అలాగే వేరుశనగలో నిటారుగా ఆకులు గల రకాలు బాకు మచ్హ తెగుళ్లను తక్కువగా వస్తాయి..ఈ పంటలు జన్యుపరంగా తెగుళ్ళను తట్టుకునే రకాలు కావు.
విత్తన ఎంపిక:
చాలా రకాలు విత్తనాల ద్వారా ,శాఖీయ ప్రవర్థనం కొరకు వాడే మొక్క భాగాల ద్వారా పొలంలో వ్యాపించి .ఆరోగ్యవంతమైన మొక్కలకు తెగులును కలుగజేస్తాయి.తెగులు లేదని నిర్ధారించిన తర్వాత విత్తనాలను కాని,మొక్కల శాఖీయ భాగాలను గాని ఎన్నుకోవాలి.
2.బహిర్ద్విష్ఠం చేయుట:
తెగులును కలుగజేసే కారకం ఇంతకు ముందు అ తెగులు లేని ప్రాంతాలలోనికి రాకుండా అడ్డుకొనుట ఈ
బహిర్ద్విష్ఠం ఉద్దేశం. బహిర్ద్విష్ఠంలో కొన్ని పద్ధతులు పాటించాలి.
క్వారంటైన్: వ్యాధి జనకాలు ,తెగులు సోకిన ప్రాంతాల నుండి (రాష్ట్రం లేక దేశం) ఇంతకు ముందు ఆ తెగులు లేని ప్రాంతాలకు రాకుండా అరికట్టడాన్ని "క్వారంటైన్" అంటారు.ఒక ప్రాంతంలో తెగులు తీవ్రత అధికంగా ఉండి,విత్తనాల ద్వార లేదా శాఖీయ భాగాల ద్వారా ఇంతకు ముందు తెగులు లేని కొత్త ప్రాంతాలలో వ్యాప్తి చెందే అవకాశం ఉన్నప్పుడు,ప్రభుత్వ పరంగా కొన్ని నియంత్రణ చర్యలు చేపట్టి తెగులు కారకాలను ప్రవేశించకుండా అరికడతారు.ఈ నియంత్రణను "క్వారంటైన్ చట్టం"అంటారు.
ఈ నియంత్రణను పాటించడానికి జాతీయ,అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ,నౌకాశ్రయాలలో సందేహాస్పదంగా ఉండే విత్తనాలను, మొక్కల శాఖీయ భాగాలను పరిశీలించి తెగులు కలుగజేసే కారకాలు లేవని నిర్ధారించిన తరువాత వాటిని ఆ ప్రాంతాలలోనికి అనుమతిస్తారు.  
తనిఖీ మరియు దృవీకరణ:
విత్తనోత్పత్తికి ప్రత్యేకంగా పండించే పంటలను వివిధ దశలలో పరిశీలించి,విత్తనాల ద్వారా వ్యాప్తి  చెందే తెగుళ్ళు లేవని నిర్ధారించిన తరువాతనే వాటిని విత్తనాలుగా వాడటానికి అనుమతిస్తారు.పంట పండించే సమయంలో తెగులు ఆశించిన మొక్కలు గమనించినప్పుడు వాటిని పూర్తిగా నిర్మూలిస్తారు లేక నాశనం చేస్తారు.
విత్తన శుద్ది;
విత్తనాలను మరియు విత్తనాలుగా ఉపయోగించే దుంపలను శాఖీయ భాగాలను మొదలగు వాటిని వేడి గాలి వాయువులతో గాని,రసాయనాలతో గాని శుద్ది చేసి తెగులును కలుగజేసే వ్యాధికారకాలను నశింపజేయాలి.
3.నిర్మూలించుట లేక నాశనం చేయుట ;
తెగులు సోకిన పంటలపై లేదా తెగులు సోకిన ప్రాంతాల నుండి వ్యాధి జనకాలను నిర్మూలించడం అసాధ్యం.తెగులుకు కారకమైన అంతర్నివేశిక సాంద్రతను చాలా వరకు తగ్గించడం వలన పంటకు చెప్పుకోదగ్గ నష్టం కలుగకుండా కాపాడుకోవచ్చును.అంతర్నివేశ సాంద్రత ఈ క్రింద తెలిపిన పద్దతుల ద్వారా తగ్గించవచ్చును.
జీవ నియంత్రణ పద్దతుల ద్వారా;
తెగులును కలుగజేసే కారకాల సంఖ్యను తగ్గించడం, పూర్తిగా నిర్మూలించడం లేక తెగులును కలుగజేసే ప్రక్రియను నెమ్మది చేయడం జీవ నియంత్రణ పద్దతి ముఖ్య ఉద్ధేశం.ఈ పద్దతి ద్వారా తెగులును కలుగజేయుటకు కావాల్సిన అంతర్నివేశకం మొక్కల పై ఏర్పడకుండా నిరోధించడం,వ్యాధి జనకాల తెగులును కలుగజేసే శక్తిని తగ్గించడం జరుగుతుంది .చాల రకాలైన శిలీంద్రాలు మరియు బాక్టీరియాలను జీవ నియంత్రణ పద్దతిలో ఉపయోగించి వివిధ రకాల తెగుళ్ళను అరికట్టడం కాని ,నియంత్రించడం గాని గమనించవచ్చును.
ఉదా;ట్రైకోడర్మా విరిడే ,సూడోమోనాస్.ఫ్లోరిసెన్స్(మార్కెట్లో లభించును.)
పంట మార్పిడి;
ఒకే పంటను ప్రతి సంవత్సరం ఒకే నేలలో పండించడం వలన ఆ పంటను ఆశించి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్ళ ఉదృతి పెరిగి ,నేలల్లో పూర్తిగా వ్యాపించి కొన్ని సంవత్సరాల తరువాత ఆ పంట పండించడానికి పనికి రాకుండా పోతుంది.కాబట్టి రైతు స్థాయిలో ప్రతి సంవత్సరం పంటలను మారుస్తూ సాగు చేయడం వలన తెగులు కారకాలను ,కీటకాలను నిర్మూలించి పంట నష్టాన్ని తగ్గించవచ్చును.
తెగులు సోకిన అవశేషాల నిర్మూలన:
పంట సాగులో ఎక్కడైన వ్యాధి సోకిన మొక్కలు కనబడితే వాటిని వీలైనంతా త్వరగా పంట నుండి నిర్మూలించాలి.లేని ఎడల వాటి బీజాలు ఆరోగ్యమైన మొక్కలపై పడి పంటను పూర్తిగా నష్టపరుస్తాయి.అలాగే పంట కోత తర్వాత కూడా క్రితం వేసిన పంట అవశేషాలు లేకుండా నూతన పంటను సాగుచేయాలి లేని ఎడల క్రితపు వ్యాధి జనకాలు నూతన పంటపై పడి పంట నష్టం కలుగజేస్తాయి.
పైన ప్రతి విషయంలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండటం వలన వ్యవసాయ సాగులో అత్యుత్తమ లాభాన్ని పొందవచ్చును.అలాగే ముఖ్యంగా రైతుస్థాయి ,ఆధికారక స్థాయిలో జాగ్రత్తలు వహించడం అనేది పంట యొక్క  సమ్రక్షణలో కీలకమైనది

రచయిత సమాచారం

జి.శివకుమార్ (వ్యవసాయ పాలిటెక్నిక్) ఎల్.రాంచందర్ (పి.హెచ్ డి)ప్లాంట్ బ్రీడింగ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిధ్యాలయం.-9966395037.