Print this page..

యాసంగి వరిలో ఎరువులు మరియు కలుపు యాజమాన్యం

తెలంగాణ రాష్ట్రంలో వరి ప్రధానమైన  ఆహారపు పంట.యాసంగిలో సాధారణ వరిసాగు 6లక్షల హెక్టార్ల వరకు ఉంటుంది.కానీ వానాకాలంలో విస్తారంగా కురిసిన వర్షాల కారణంగా జలవనరులు సమృద్దిగా ఉండి,వరి సాగు విస్తీర్ణం సాధారణ స్థాయి కంటే ఎక్కువయ్యే అవకాశం ఉంది.వరిలో సమర్ధవంతమైన ఎరువుల మరియు ప్రణాళికాబద్ధమైన కలుపు యాజమాన్య పద్దతులను అనుసరిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చును.
ఎరువుల యాజామన్యం:
పశువుల ఎరువు,కంపోస్ట్  మరియు కోళ్ళ ఎరువు వంటి సేంద్రీయ ఎరువులను ,రసాయనిక ఎరువులతో కలిపి వాడినట్లైతే భూసారాన్ని కాపాడుకోవడమే కాకుండా 20-25 శాతం వరకు నత్రజనిని కూడా  ఆదా చేయవచ్చును.భూసారాన్ని బట్టి ఎరువుల మోతాదును నిర్ణయించి నత్రజని,భాస్వరం,మరియు పోటాషియం ఎరువులను సమతుల్యంగా వాడాలి.
ఉత్తర ,మధ్య,దక్షిణ తెలంగాణలో నత్రజని 48-60కిలోలు,భాస్వరం 24కిలోలు,పొటాషియం 16కిలోలు ఒక ఎకారిని వాడాలి. 
సిఫార్సు చేసిన పోషకాల మోతాదు భూసారం పంటకాలం,రకాల కాలపరిమితి మరియు యాజమాన్య పద్ధతులను బట్టి కొంత మారుతుంది.
నత్రజని ఎరువులను కాంప్లెక్స్ ఎరువుల రూపంలో కాని యూరియా రూపంలో కాని వాడవచ్చును.ప్రస్తుతం మార్కెట్లో వేపతో పూయబడిన యూరియా అందుబాటులో ఉంటుంది.ఇది మొక్కలకు నెమ్మదిగా అంది 5-10శాతం వినియోగ సామర్ధ్యం ఎక్కువ అవుతుంది.కాబట్టి రైతులు అవసరం మేరకే వాడాలి.ఈ యూరియాను ఎక్కువగా వాడటం వల్ల వరి పంటలో రోగాలు ఎక్కువ రావడమే కాకుండా వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు పైరు ఎత్తు ఎక్కువగా పెరిగి పడిపోతుంది.
స్వల్పకాలిక రకాలకు నత్రజనిని మూడు సమభాగాలుగా చేసి,పొలంలో నీరు తీసివేసి బురద పదునులో దమ్ముచేసే సమయంలో పిలకలువేసే దశలో మరియు అంకురం తొడిగే దశలో మరియు సమానంగా వెదజల్లి 36-48 గంటల తర్వాత పలుచగా నీరుపెట్టాలి. 
మధ్య మరియు దీర్ఘకాలిక రకాలకు నాలుగు దఫాలుగా 15-20రోజులకు ఒకసారి నత్రజనిని వేయాలి.నత్రజనిని చివరి దఫా అంకురం తొడిగే దశలో వేయాలి.ఆ తర్వాత వేయకూడదు.
మొత్తం భాస్వరపు ఎరువును ఆఖరి దమ్ములోనే వేయాలి.చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నేలలో భాస్వరం ఉన్నప్పటికి దాని లభ్యత తగ్గుతుంది.కావున చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఉత్తర తెలంగాణ జిల్లాలలో సిఫార్సు చేసిన మోతాదుతోపాటు అదనంగా 1/3 వ వంతు వేసుకోవాలి.
పొటాష్ ఎరువులను రేగడి నేలలో అయితే పూర్తిగా ఒకేసారి అఖరి దమ్ములో సగభాగం ,అంకురం ఏర్పడే దశలో మిగతా సగ భాగాన్ని వేయాలి. 
కలుపు యాజామాన్యం:
నాటు వేసిన వరి పొలంలో వాడదగిన కలుపు మందులు /ఎకరాకు.
నాటిన 3-5 రోజుల లోపు వాడతగిన కలుపు మందులు:
బుటాక్లోర్ 1-1.5 లీటర్లు లేదా 
ప్రిటిలాక్లోర్ 500-600 మి.లీ లేదా
ఆక్సాడయార్జిల్ 35-40గ్రాములు లేదా
బెన్ సల్ఫ్యూరాన్ మిథైల్ (0.6%)+ప్రిటిలాక్లోర్(6.0%)4కిలోలు గుళికలు లేదా 
పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ +ప్రిటిలాక్లోర్ (6.15)4 కిలోలు గుళికలు 
ఈ మందులలో ఏదో ఒక దానిని 20కిలోల ఇసుకలో కలుపుకొని పొలమంతా సమానంగా పడేటట్లు చల్లుకోవాలి.
నాటిన 8-10 రోజుల లోపు వాడతగిన కలుపు మందులు:
పైరజోసల్ఫ్యూరాన్ ఇథైల్ 80-100గ్రాములు 
20కిలోల ఇసుకలో కలుపుకొని పొలమంతా సమానంగా వెదజల్లాలి.
నాటిన 15-20  రోజుల లోపు వాడతగిన కలుపు మందులు:
గడ్డి జాతి కలుపు నివారణకు:
సైహలోఫాప్ -పి-బ్యుటైల్ 250-300మి.లీ లేదా 
ఫినాక్సిప్రాప్-పి-ఇథైల్ 250-300మి.లీ లేదా 
మెట్ సల్ఫ్యూరాన్ మిథైల్+క్లోరి మ్యురాన్ ఇథైల్ 8గ్రాములు లేదా 
పెనాక్సులం +సైహలోఫాప్ బ్యుటైల్ 1.6-1.8 మి.లీ 
గడ్డి జాతి మరియు వెడల్పాకు కలుపు నివారణ :
బిస్ పైరిబాక్ సోడియం 100 మి.లీ 
ఈ మందులలో ఏదో ఒకదానిని 200మి.లీ నీటిలో కలుపుకొని పొలమంతా సమానంగా పిచికారి చేయాలి. 
25-30రోజులకు వాడతగిన మందులు:
వెడల్పాకు కలుపు నివారణకు 
2,4 -డిఫోడియంసాల్ట్  500-600గ్రా.లేదా 
2,4-డి ఇథైల్ ఎస్టర్ 1.25-1.50లీ
నీటిలో ఏదో ఒక మందును 200లీటర్ల నీటిలో కలిపి పొలమంతా సమానంగా పిచికారి చేయాలి.
ఈ కలుపు మందులను పిచికారి చేసే ముందు పొలంలోని నీటిని పూర్తిగా తీసివేయాలి.పిచికారి చేసిన 2రోజుల వరకు నీరు పెట్టకూడదు.ఆ తర్వాతనే పొలానికి నీరుపెట్టాలి.
ఈ విధంగా మేలైన యాజమాన్య పద్దతులను రైతాంగం పాటిస్తే ,ఈ యాసంగిలో అధిక దిగుబడులు సాధించవచ్చును.

రచయిత సమాచారం

డా.నాగ భూషణం,డా.ఆర్ శ్రవణ్ కుమార్ ,డా.కె రాజేంద్ర ప్రసాద్ .డా.బి సతీష్ చంద్ర ,డా .కె రుక్మిణిదేవి,డా.మాలతి,డా పి జగన్మోహన్ రావ్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం -వరంగల్.