Print this page..

వరి హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో మెళకువలు.

తెలంగాణ రాష్ట్రంలో 44 లక్షల ఎకరాలలో సాగవుతున్న ప్రధాన ఆహారపు పంట "వరి" .ముఖ్యంగా తెలంగాణ జిల్లాలలో కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా పండిస్తారు. ఈ జిల్లాల్లో రబీ కాలంలో హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సంకర వరి విత్తనోత్పత్తికి మరియు సాధారణ రకాల వరి విత్తనోత్పత్తికి చాలా అంశాలలో విభిన్నత ఉంటుంది
మన రాష్ట్రంలో రబీ కాలంలో అనుకూల వాతవరణం ఉండటం వల్ల వరి ఎక్కువ విస్తీర్ణంలో సాగులో ఉంది. వరి హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేపట్టాలంటే సాగులో కొన్ని మెళకువలు అనుసరిస్తే అధిక దిగుబడులు పొందవచ్చును.

విత్తే సమయం :
వరి హైబ్రిడ్ విత్తనోత్పత్తికి నవంబర్ 15 నుండి డిసెంబర్ చివరి వరకు ఆడ మరియు మగ జనకములను విత్తుట అనుకూలం.

విత్తన మోతాదు:
ఎకరానికి 6 కిలోలు ఆడ రకం విత్తనాలు అలాగే 3 కిలోల మగ రకం విత్తనాలు సరిపోతాయి.

వేర్పాటు దూరం:
విత్తనాల జన్యుస్వచ్ఛత కాపాడుటకు వరి వంగడాల నుండి సుమారు 100మీ. వేర్పాటు దూరంలో సంకర వరి విత్తనోత్పత్తి పొలం ఉండే విధంగా నాటుకోవాలి. వేర్పాటు దూరం వీలు కాని పక్షంలో విత్తనోత్పత్తి పొలం చుట్టూ సుమారు 2మీ.ఎత్తు వరకూ పాలీథీన్ షీట్స్ అమర్చుకోవాలి.

నారుమడి పెంపకం :
చాలా జాగ్రత్తగా ఆడ మరియు మగ విత్తనాలు కలపకుండా చాలా వేరువేరుగా నారు పెంచాలి. ముఖ్యంగా వరిలో హైబ్రిడ్ విత్తనోత్పత్తి దిగుబడి ,సాగుచేసిన ఆడ మరియు మగ రకాల పూత సమన్వయంపై ఎక్కువగా అధారపడి ఉంటుంది. కావున ఆడ మరియు మగ రకాల పంట కాలంలోని వ్యత్యాసాన్ని బట్టి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ,ఆలస్యంగా వచ్చు రకం విత్తనాల్ని ముందుగా నారు పోసుకోవాలి. అలాగే మగ రకం యొక్క విత్తనాలను 3 రోజుల వ్యవధిలో మూడు దఫాలుగా విడి విడిగా విత్తుకోవాలి. ఇలా విత్తనాల్ని విత్తడం వల్ల పూత సమయంలో ఎక్కువ రోజులు పుప్పొడి అందుబాటులో ఉండటం వల్ల గింజలు బాగా వచ్చి .గింజ దిగుబడి పెరుగుతుంది.
అలాగే రెండవ దఫా విత్తిన మగ రకము ,ఆడ రకము పూత సమయం కలిసేటట్లు ఆయా రకాల పంట కాలాన్ని బట్టి చాలా జాగ్రత్తగా విత్తాలి. విత్తనాలు మొలకెత్తిన తర్వాత ఎత్తుగా చదును చేసిన నారుమడిపై వెదజల్లుకోవాలి. సిఫార్సు మేరకు ఎరువులు వేసి ఆరోగ్యంగా పెంచుకోవాలి.

నారు నాటడం:
ఆడ మరియు మగ మొక్కలు వరుసలలో వేరు వేరుగా నాటుకోవాలి.ముఖ్యంగా వరిలో ఆడ మరియు మగ వరుసల నిష్పత్తి మొక్కల లక్షణాల్ని బట్టి 6:2 లేదా 8:2, 10:2 గా ఉంటుంది. ఆడ వరుసల్ని 6 వరుసలుగా అలాగే మగ వరుసల 2 వరుసల నిష్పత్తిలో నాటుకోవాలి.
రబిలో 25-35 రోజులుగల నారు నాటుటకు అనుకూలం. ముఖ్యంగా ఆడ మరియు మగ (రెండవ దఫా విత్తిన ) ఒక వయస్సులో నారు ఉండే విధంగా నాటడం ద్వారా పూత సమన్వయం బాగా వచ్చును. లేదంటే లేత నారు నాటుట ద్వారా త్వరగా పూతకు రావడం వల్ల సమన్వయ లోటుతో దిగుబడి బాగా తగ్గును. కాబట్టి ఆడ మరియు మగ రకాల్ని విత్తిన సమయాల్ని దృష్టిలో ఉంచుకొని దానికి అనుగుణంగా వేరువేరుగా ఒకే లోతులో (2-3 సెం.మీ) నాట్లు వేయాలి.
నాటేటప్పుడు మగ వరుసల మధ్యలో 6 ఆడ వరుసలు నాటుటకు వీలుగా 125 సెం.మీ వదిలి వేయాలి ,మగ వరుసల్ని రెండు 30సెం.మీ వదిలి వేయాలి. అలాగే మొక్కకు మొక్కకు మధ్య 15సెం.మీ ఉండేటట్లు కుదురుకు 2-3 మొక్కలు నాటాలి.మూడు దఫాలుగా ప్రతి యొక్క వరుసలో విత్తిన నారును నాటాలి.
మొదట విత్తిన నారును -మొదటి పూసకు ,రెండవ సారి విత్తిన  నారును రెండవ పూసకు,అఖరి దఫా విత్తిన నారును మూడవ దఫా మూడవ పూసకు వరుసగా నాటాలి. పొలం చుట్టు విత్తనోత్పత్తి కొరకు మగ వరుసలు వచ్చేలాగా నాటుకోవాలి. 
జంట మగ వరుసల మధ్య ఆరు ఆడ వరుసల్ని 15సెం.మీ*15సెం.మీ సూరంలో నాటుకోవాలి. వీటి రెండింటి (ఆడ*మగ) మధ్య 25సెం.మీ దూరం ఉండే విధంగా నాటాలి.

కేళీల ఏరివేత :
వరి పంటలో జన్యు స్వచ్ఛత గల హైబ్రిడ్ విత్తనాల్ని ఉత్పత్తి చేయాలంటే కేళీల ఏరివేత పకడ్బందీగా అమలుచేయాలి.
వివిధ దశల్లో అంటే కేళీల్ని శాఖీయ దశ (మొక్క,ఆకుల యొక్క భాహ్య లక్షణాలు), అలాగే పూత దశలో (పంట కాలంలో తేడా, వెన్ను బయటకు వచ్చే విధానం,వెన్ను లక్షణాలు ,పుప్పొడి మరియు కీలాగ్రము రంగు), పక్వ దశలో (ఆడ మొక్కల్లో గింజ శాతం,గింజ రంగు,గింజ ఆకారం) జాగ్రత్తగా గుర్తించి తీసివేయాలి .

పూత సమయాన్ని గుర్తించుట:
కొన్నిసార్లు ఆడ మరియు మగ రకాల పంట కాలంలో వ్యత్యాసాన్ని బట్టి విత్తనాల్ని వేరు వేరు సమయాల్లో నాటినప్పటికి వాతావరణంలో మార్పులు అలాగే యాజమాన్య పద్దతుల వల్ల పూత సమన్వయం కోల్పోవును. పూత కాలాన్ని బట్టి వెన్ను ఏర్పడే దశను నిర్ధారించవచ్చును. పూత వరిలో చూసినట్లైతే అంకురం దశ నుండి 30 రోజుల తర్వాతా పూత వచ్చును. వరిలో పుష్పాల్ని ఒకేసారి పుష్పించే విధంగా చేయాలంటే ఆడ,మగ రకాల పంటకాలాన్ని బట్టి 60రోజుల ముందు నుండి వెన్ను ఏర్పడే దశలలో వ్యత్యసాన్ని బట్టి కొన్ని సహాయక చర్యలు నిర్వహించాలి. అంకురం దశను గుర్తించాలంటే బాగా పొడవుగా పెరిగినా ప్రాథమిక పిలకను గుర్తించి,ఎక్కడైతే కాండం వేరుతో కలుస్తుందో అక్కడికి కత్తిరించాలి. కాండన్ని నిట్టనిలువుగా అడుగు భాగం నుండి పిలక పైభాగం వరకు కత్తిరించాలి. కణుపు పై భాగాన్ని విప్పి పరిశీలిస్తే కంకి వృద్ది చెందుటను గమనించవచ్చును.
ముఖ్యంగా సవరణ చర్యలు కంకి ఏర్పడు దశల్ని గమనించి వ్యత్యాసం గుర్తించి చేపట్టాలి. ఆడ మరియు మగ మొక్కల్ని ఆలస్యంగా పుష్పించేటట్లు చేయుటకు 2 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారి చేయాలి.అదే విధంగా త్వరగా పుష్పించుటకు 1శాతం ఫాస్ఫేట్ ఎరువును పిచికారి చేయుట, వరుసలలో దొక్కుడు వంటివి పాటించాలి. మగ వరుసలు త్వరగా పూత వచ్చుటకు పొలంలో నిండుగా నీరు ఉండాలి. పూత సమయాల్లో వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంటే ముందుగా వచ్చిన కంకుల్ని పొలం నుండి పీకి వేయాలి. 

పోటాకును కత్తిరించుట:
చిరుపొట్ట దశలో పోటాకు ప్రాథమిక  దుబ్బులు కత్తిరించాలి.ఇలా కత్తిరించడం వల్ల పరాగరేణువులు స్వేచ్చగా కదిలి అధిక శాతంలో ఏర్పడి పుప్పొడి వ్యాప్తి చెంది అధిక విత్తనోత్పత్తి దోహదపడును. ముఖ్యంగా పోటాకును 2/3 వ భాగం కత్తిరించాలి. తెగులు అనగా బాక్టీరియా ఎండు తెగులు లేదా పాముపొడ తెగులు ఆశించిన పొలంలో పోటాకును కత్తిరించిన తర్వాతనే వ్యాధి సోకిన పోటాకును కత్తిరించాలి.పోటాకు సన్నగా చిన్నగా ఉన్న ఆడ రకాలలో పోటాకు కత్తిరించనవసరం లేదు .

జిఎ3 -జిబ్బరెలిక్ ఆమ్లము  పిచికారి చేయుట :
జిఏ3(జిబ్బరెలిక్ ఆమ్లము)మొక్క పనితీరు విత్తనోత్పత్తిలో ముఖ్యంగా ఆడ మొక్కల వెన్నులు పోటాకు నుండి పూర్తిగా బయటకు రావడానికి,కీలాగ్రము పువ్వు నుండి ఎక్కువ బయటకు వచ్చుటకు మరియు పువ్వు చాలా సమయం పుప్పొడి ఉండుటకు జిబ్బరెలిక్ ఆమ్లం పిచికారి చేయాలి.
జిబ్బరెలిక్ ఆమ్లం హైబ్రిడ్ విత్తనోత్పత్తి క్షేత్రంలో(జిబ్బరెలిక్ ఆమ్లం) జిఏ3 రెండు సార్లు పిచికారి చేయాలి. 5-10 శాతం వెన్నులు బయటకి వచ్చిన దశలో మొదటి సారి ఎకరాకు 12గ్రా. పిచికారి చేయాలి. ఆ తర్వాత రెండు రోజులకు లేదా 35-40:శాతం కంకులు వెలువడిన దశలో ఎకరాకు 8గ్రా. రెండవ దఫా పిచికారి చేయాలి. ఈ జిబ్బరెలిక్ ఆమ్లం నీటిలో కరగదు కాబట్టి 1గ్రా.కి 25మి.లీ 70శాతం ఆల్కాహల్లో కలిపి కరిగిన తర్వాత మందు ద్రావణం తయారు చేసుకోవాలి. దీనిని 15 లీటర్ల చొప్పున కలిపి వాడుకోవాలి.

పరపరాగ సంపర్కాన్ని పెంపొందించుటకు:
పరపరాగ సంపర్కం పెంపొందించుటకు హైబ్రిడ్ విత్తనోత్పత్తిలో తాడులాగుట లేదా కర్రలతో లాగుట మగ మొక్కల్ని ఊపుట వల్ల అధిక పుప్పొడి ఆడ మొక్కలపై పడి పరపరాగ సంపర్కం జరుగును. వెన్నులు 30-40శాతం బయటకు వచ్చినప్పుడు అనుబంధ సంపర్కం చర్యను ఉందయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మధ్యలో 30 నిమిషాల వ్యవధిలో రోజుకు 3-4 సార్లు సుమారు 7-10 రోజుల పాటు చేయాలి. పుప్పొడి రేణువులు ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు తొందరగా, మబ్బు, చలి వాతావరణం ఉన్నప్పుడు ఆలస్యంగా రావడం జరుగుతుంది.
కలుపు మరియు పోషక యాజమాన్యం ,సస్యరక్షణ చర్యలు సాధారణ వరి పంటకు మాధిరిగానే చేయాలి. తెగుళ్ళు సోకని గింజల్ని సేకరించి విత్తాలి .లేదంటే తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన పంటను తెగుళ్ళ బారి నుండి రక్షించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా అగ్గితెగులు,పండాకు తెగులు, పాముపొడ తెగులు, కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించిన పంట నుండి విత్తనాలు సేకరించరాదు.

పంట కోత:
వెన్నులో 90శాతం గింజలు పక్వానికి వచ్చినప్పుడు పంట కోతలు చేపట్టాలి. ఆడ వరుసల నుండి వచ్చిన విత్తనాలను హైబ్రిడ్ విత్తనాలుగా సేకరించాలి. ముందుగా మగ వరుసల్ని కోసి వేరు చేయాలి. ఆ తర్వాత ఆడ వరుసల్ని జాగ్రత్తగా పరిశీలించి మగ మొక్కలు లేవని నిర్ధారించాలి. ఆడ వరుసలలో కంకులు కోసి నూర్పిడి చేసి గింజల్ని శుభ్రపరచి తేమ శాతం 12-13 శాతం వరకూ ఆరబెట్టాలి.

రచయిత సమాచారం

యస్ .శ్రీకాంత్ ఎజి.పాలిటెక్నిక్, ఎల్.రాంచందర్.పి.హెచ్.డి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిధ్యాలయం.