Print this page..

వేసవిలో నువ్వుల సాగు -మెళకువలు

నువ్వుల పంటను రబీ,వేసవి కాలల్లో ఎక్కువగా పండిస్తున్నారు.ఖరిఫ్,రబీలో వర్షాధారంగా పండించిన పంట కంటే వేసవిలో ఆరుతడి పంటగా వే సుకొన్నప్పుడు చీడ పీడల బెడద తక్కువగా ఉండి,విత్తన నాణ్యత పెరిగి అధిక దిగుబడులు పొందవచ్చును ,వేసవి పంటలో సాధారణంగా 20%-25% తడులు ఇవ్వడం ద్వారా అధిక దిగుబడులకు ఆస్కారం ఉంది .
నువ్వులలో 46%-55% నూనె ,20%-25 ప్రొటీన్లు మాత్రమే కాకుండా విటమిన్లు,అమైనో ఆంలాలు సమృద్దిగా ఉంటాయి.
నేలలు: నువ్వుల పంటకు నీరు నిలిచే ఆంల,క్షార గుణాలు కలిగిన నేలలు పనికిరావు. తేమ నిలిచే తేలికైన నేలలు శ్రేష్టమైనవి .నువ్వుల పంటకు మెత్తని దుక్కి అవసరం.  పొలాన్ని 3-4 సార్లు దున్ని రెండు సార్లు గుంటక తోలి ,చదును చేసి విత్తుకోవాలి.
విత్తన మోతాదు: ఎకరానికి 2.5 కిలోగ్రాముల విత్తనం సరిపోతుంది 
విత్తే పద్దతి: సాదారణంగా రైతులు వితానాన్ని వెదజల్లుతారు .ఈ పద్దితిలో కంటే సాళ్ళల్లో విత్తుకుంటే మంచిది. వరుసల మధ్య 30 సెం.మీ,వరుసలలోఅని మొక్కల మధ్య 15 సెం.మీ దూరం ఉండేలా విత్తుకోవాలి. విత్తేటపుదు విత్తనం సరైన లోతులో పడేవిధంగా చుసుకోవాలి. విత్తనం మొలకెత్తిన 14 రోజులకు ఒత్తుగా ఉన్నచోట మొక్కలను పీకి పలుచన చేసుకోవాలి.
విత్తన శుద్ది: నేల నుంచి సంక్రమించే తెగుళ్ళను నివారించుకోవడానికి కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం/కాప్టాన్ /మాంకోజెబ్ తో విత్తన శుద్ది చేసుకోవాలి 
రకాలు: రాజేశ్వరి మరియు వై.ఎల్.ఎం-66 
రాజేశ్వరి:80 రోజుల పంట కాలం కలిగిన ఈ రకం బూడిద ,కాండం కుళ్ళు  తెగుళ్ళను తట్టుకుంటుంది.ఇది  తెల్ల రంగు విత్తనం 50 శా తం నూనె కలిగి ఉంటుంది .ఎకరానికి 2-3 క్వింటాళ్ళ దిగిబడినిస్తుంది.
వై.ఎల్.ఎం-66:75 రోజుల  పంట కాలం కలిగిన ఈ రకం బూడిద ,ఆకు మచ్చ తెగుళ్ళను తట్టుకుంటుంది.లేత గోదుమ రంగు విత్తనం 50 శాతం నూనె కలిగి ఉంటుంది .ఎకరానికి 4 క్వింటాళ్ళ దిగిబడినిస్తుంది. 
కలుపు యాజమా న్యం: విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు కాని ,పెండిమిథాలిన్ 30% లేదా అల్లాక్లోర్ 50% మందు ఎకరానికి లీటరు చొప్పున పిచికారి చేసుకోవాలి .ఈ కలుపు మందులు కలుపును మొలక దశలోనే నివారిస్తాయి నేల పై పొరల్లో తేమ బాగా ఉన్నప్పుడు కలుపు మందులు సమర్ధవంతంగా పనిచేస్తాయి.విత్తిన 20-25 రోజులప్పుడు గొర్రుతో అంతర కృషి చేయాలి 
సస్య రక్షణ:నువ్వుల పంటను ఆశించే పురుగులలో రసం పీల్చే పురుగులు,ఆకు ముడత ,కాయ తొలుచు పురుగు,బీహారి గొంగళి పురుగులు ముఖ్యమైనవి .తెగుళ్ళలో వేరుకుళ్ళు,కాండం కుళ్ళు తెగులు, ఆకు మచ్చ తెగులు, వెర్రి తెగులు,బూడిద తెగులు ముఖ్యమైనవి. వీటిని సరైన సమయంలో గుర్తించి సస్య రక్షణ చర్యలు చేపట్టాలి. 
పైన పేర్కొన్న చీడ పీడల నివారణ 
రసం పీల్చే పురుగులు: డైమిథోయేట్ 2 మి.లీ లేదా మోనోక్రొటోపాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి తెల్ల నల్లి నివారనకు డైకోఫాల్ 3 మి.లీ లేదా డైమిథోయేట్ 2 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి 
ఆకు ముడత మరియు కాండం తొలుచు పురుగు:క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ లేదా మోనోక్రొటోపాస్ 1.6 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.పురుగు ఆశించిన ఆకులను పురుగులతో సహా ఏరి నాశనం చేయాలి 
గొంగళి పురుగు :ఎసిఫేట్ 1 గ్రా.లేదా క్లోరిపైరిపాస్ 2.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేఅయాలి. గ్రుడ్లు లేదా గొంగళి పురుగులను గమనించిన వెంటనే ఆకులతో సహా ఏరి నాశనం చేయాలి 
వేరుకుళ్ళు కాండం కుళ్ళు తెగులు:
పంట మార్పిడి తప్పకుండా చేయాలి,పంట అవశేషాలను నాశనం చేయాలి. కిలో విత్తనానికి థైరం లేదా  కాఫ్తాన్ లేదా కార్బెండజిం తో విత్తన శుద్ది చేయాలి.కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి 
ఆకు మచ్చ తెగులు:కార్బెండజిం 3 గ్రా.కిలో విత్తనానికి విత్తన శుద్ది చేయాలి.పంట దశలో ఈ తెగులు కనిపించినపుడు కార్బెండజిం 1 గ్రా.లేదా  మాంకొజెబ్ 3 గ్రా.లీటరు నీటికి కలిపి  15 రోజుల వ్యవధిలో2-3 సార్లు పిచికారి చేయలి 
వెర్రి తెగులు: వై.ఎల్.ఎం-66 రకం ఈ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది  .ఈ తెగులు కనిపించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకి తగలబెట్టాలి పైరుపై మిథైల్ డెమటాన్ 1 మి.లీ లేదా డైమితోయేట్ 2 మి.లీ లిటరు నీటికి కలిపి చేయాలి.
బూడిద తెగులు:
నీటిలో కరిగే గంధపు పొడి 3 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
పంట కోత :ఆకులు పసుపు రంగుకు మారినపుడు 75% కాయలు లేత పసుపు రంగుకు వచ్చినపుడు పైరును కోయాలి.కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి.5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో  కొట్టి నూర్పిడి చేయాలి 
నిల్వ చేయుట:  గింజల్లో తేమ సాతం 8 శాతం కి తగ్గే వరకు ఎండలో ఆరబెట్టాలి.  గోనే సంచుల్లో నిల్వ చేయాలి మధ్య మధ్యలో పురుగు పట్టకుండా ఎండలో ఆరబెట్టాలి వేప నూనె 25 మి.లీ లేదా బూడిద 25 గ్రా కిలో విత్తనానికి చొప్పున కలిపినట్లైతే పురుగు పట్టదు. 
ఎగుమతి ప్రాధాన్యత: తెల్ల నువ్వు రకాలను ,పొట్టు తొలగించిన నువ్వు పప్పుకు ఎగుం,అతి ప్రాధాన్యత ఉంటుంది ,ఒకే పరిమాణం గల నాణ్యమైన విత్తనం ,పురుగు మందుల అవశేషాలు లేకుండా ఎగుమతికి అనుకూలంగా ఉంటుంది .


 

రచయిత సమాచారం

ఎన్ అయిషా పర్వీన్ శాస్త్రవేత్త (సస్య ప్రజననం) ఎస్.కె సమీరా శాస్త్రవేత్త (సస్య ప్రజననం) డా .టి భగవత్ ప్రియ శాస్త్రవేత్త (అగ్రానమి) ఎం.జ్యోత్స్న కిరణ్మయి శాస్త్రవేత్త (అగ్రానమి) డా. డి . సంపత్ కుమార్ అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసర్చ్  ప్రాంతీయ వ్యవసాయ పరిషోధన స్థానం -నంధ్యాల