Print this page..

ఉల్లి సాగు - సస్యరక్షణ చర్యలు


 అందరికి నిత్యవసరమైన కూరగాయ పంట ఉల్లి గుండెజబ్బుకి దివ్యఔషధంగా , శరిరంలో కొలెష్ట్రాల్ ను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది,అందుకే  తల్లి చేయలేని మేలు ఉల్లి 
చేస్తుందంటారు . అందులో ఉన్న శక్తి వంతమైన ఆహారనిలువలు అటువంటివి  మరి .
విత్తే సమయం: 
ఉల్లి మూడు కాలాల్లో సాగుచేయవచ్చు ఖరీఫ్ లో జూన్-జులై నుండి అక్టోబర్-నవంబర్ వరకు , రబీ కాలంలో నవంబర్-డిసెంబర్ నుండి ఏప్రిల్ వరకు సాగుచేస్తారు . వేసవి పంటగా అయితే        జనవరి - ఫిబ్రవరి నెలలో నాటవచ్చు వాతవరణంలో పెద్దగా మార్పులేని ప్రాంతాల్లో ఎదుగుదల  బాగుంటుంది .
 నేలలు: 
నీరు నిలువని సారవంతమైన మెరక నేలలు అనుకూలం .ఉప్పు , చౌడు , క్షారత్వం  మరియు నీరు నిలువ ఉండే నేలలు పనికిరావు.
విత్తన మోత్తదు: ఎకరాకు 3-4 కిలోల విత్తనం సరిపోతుంది 
నారు  పెంచటం మరియు నాటడం : నేలను బాగా దున్ని120 సెం, మీ వెడల్పు ,3 మీ పోడవుగల ఎత్తైన నారుమళ్లను తయారు చేసుకోవాలి. 2-2.5 కిలోల విత్తనాన్ని 200-250 చ .మీ .ల నారు మడిలో పెంచిన  నారు ఒక ఎకరాలో  నాటడానికి సరిపొతుంది 
 నారు నాటడానికి  2-3 సార్లు దుక్కి దున్నిన  పొలాన్ని చదును చేయాలి . బోదెలు 30 సెం .మీ ఎడంలో చేసి బోదెకు రెండు వైపులా నాటుకోవాలి   . నారుపోసుకునె ముందు విత్తనశుద్ది చేసుకోవాలి , కిలో విత్తనాన్ని 3 గ్రా . కాప్టాన్ /థైరం ను కలిపి నారు మడిలో విత్తనాన్ని  పలుచగా వరుసల్లో పోయాలి . సుమారు 30-45 రోజుల వయసు గల నారు నాటుటకు అనుకూలంగా ఉంటుంది . 
నారును 1%  బోర్డో మిశ్రమంలొ ముంచి నాటడం వల్ల నారు కుళ్ళు సోకకుండా ఉంటుంది  
కలుపు నివారణ మరి యు  ఎరువుల యాజమాన్యం : 
ఉల్లి నారు నాటిన 2,3 రోజుల్లో తేమ ఉన్నపుడు ఆక్సిఫ్లోరొఫిన్ 23.5% 200 మి.లి ను 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. నాటిన 30,45 రోజుల మధ్య మరల కలుపుతీసి మట్టిని ఎగదోయాలి .   ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువుతో బాటు 60-80 కిలోల నత్రజని , 24-32 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులు వేయాలి . నత్రజని రెండు ధఫాలుగా అంటే నాటినపుడు మరియు నాటిన 30 రోజుల తర్వాత వేసుకోవాలి నత్రజనితో పాటు , పొటాష్ ను కూడా రెండు ధఫాలుగా  వేసుకుంటే గడ్డ బాగా ఊరుతుంది 
నీటి యాజమాన్యం :
నాటిన 60 రోజుల వరకు 12-15 రోజుల వ్యవదిలో 4-5 తడులు ఇవ్వాలి .గడ్డ ఊరే దశలో 6-7 రోజుల వ్యవదిలో  7-8 తడులు ఇవ్వాలి . కోతకు 15 రోజుల ముందుగా నీరు కట్టుట ఆపాలి 
సస్యరక్షణ చర్యలు : 
తామర పురుగులు : ఇవి ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేయడం వల్ల తెల్లటి మచ్చలు ఏర్పడతాయి ఆకులపై , కాడలపై ఊదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి . వీటి నివారణకు  డైమిథోయెట్  (లేదా) ఫిప్రొనిల్ 2 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారి చేయాలి . తామర పురుగులకు ఆశ్రయమిచ్చె వెల్లులి . క్యాబేజి ,టమట , దోస వంటి పంటలను సాగు చేయరాదు .   
బల్బ్ మైట్(నల్లి): నల్లి అశించిన ఉల్లి గడ్ద పెరుగుదల ఆగిపోయి కుళ్ళిపోతాయి పురుగు సోకిన గడ్దల నుండి ప్రక్కనున్న ఆరోగ్యవంతమైన మొక్కలకు వ్యాపిస్తుంది  . వీటి నివారణకు స్పైరో మెసిఫిన్ 0.75 మి.లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .
ఆకుమచ్చ తెగులు : వాతావరణంలో తేమ ఎకువైనపుడు తెగులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది . ఈ తెగులు ఆశించడం వలన ఆకులపై . ఊదారంగు మచ్చలు ఏర్పడి . ఆకులు ఏండిపోతాయి దీని నివారణకు కార్బండిజం మరియు మాంకోజెబ్ కలిపిన  మందును 2 గ్రా . చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి .  
సమగ్ర సస్యరక్షణ చర్యలు: 
ఉల్లి పంటను ధాన్యపు పంటతో పంట మార్పిడి చేయాలి . 
ఎకరాకు 80 కిలోల చొప్పున వేప పిండిని వేయడం వల్ల నులిపురుగులు మరియు నేలలో ఉన్న శిలింధ్రాలు  నాశనం చేయబడతాయి.
తామర పురుగు నివారణకు జెట్ నాజిల్ పంపుతో నీటిని చల్లాలి 
పెరుగుదల దశలో పురుగుల నివారణకు 5% వేప గింజల ద్రావణాన్ని పిచికారి చేయాలి 
పంటకోత- ఆరబెట్టుట :కోతకు 10 రోజుల ముందుగా  నీళ్ళు కట్టడం ఆపేయాలి . గడ్డకు  2.5 సెం .మీ.కాడ ఉంచి కోయాలి. గడ్డలు  తవ్విన తర్వాత వీటిని ఒక వరుసలో ఉంచి ఆరబెట్టాలి . 50%  ఆకులు పొలంలో రాలిన తర్వాత   గడ్డలు తవ్వితే నిలువ చేయడంలో కలిగే నష్టాన్ని అరికట్టవచ్చు.    

రచయిత సమాచారం

డాక్టర్ . ఎన్. నవీన్ కూమార్ , సీనియర్ శాస్త్రవేత్త మరియు సమన్వయకర్త ఏరువాక కేంద్రం నిజామాబాద్ బి . మంజు భార్గవి . శాస్త్రవేత్త , ఏరువాక కేంద్రం నిజామాబాద్