Print this page..

కంప్యూటర్ టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు - మానవాళికి చేకూరే ప్రయోజనాలు

గత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ టెక్నాలజీలో అనేక విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి అనడంలో సందేహం లేదు. మానవుని దైనందిన జీవితంలో కంప్యూటర్ ఒక భాగంగా మారింది. ఇదంతా ఎందుకు జరుగుతోంది అని ఆలోచిస్తే ముఖ్యంగా కంప్యూటర్ వినియోగం, వాటి వల్ల మానవాళికి ఉపయోగాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్ లేకుండా ఏ పనినీ మనం చేయలేక పోతున్నాము అనడంలో ఆశ్చర్యము లేదు. అంటే కంప్యూటర్ ప్రాధాన్యత, వాటి వల్ల మానవాళి పొందే ఉపయోగాలు రోజురోజుకి పెరుగుతున్నాయి.

సాంకేతిక రంగంలో అభివృద్ధి :
కంప్యూటర్ రంగంలో టెక్నాలజీ అభివృద్ధి ముఖ్యంగా చెప్పాలంటే రెండు విధాలుగా మనం విభజించవచ్చు. అందులో ఒకటి హార్డ్ వేర్, రెండవది సాఫ్ట్ వేర్. హార్డ్ వేర్ రంగంలో కంప్యూటర్ టెక్నాలజీని పరిశీలిస్తే, ముఖ్యంగా నాలుగు విషయాలని పరిగణలో తీసుకోవాలి. అవి 1. కంప్యూటర్ ధర, 2. కంప్యూటర్ పరిమాణం, 3. నిలువ చేసే సామర్ధ్యము, 4. స్పీడ్ ఆఫ్ ది కంప్యూటర్.

ముందుగా కంప్యూటర్ ధరని పరిశీలిస్తే గతంలో డెభై వేలు ఉన్న పర్సనల్ కంప్యూటర్ ఈ రోజు ఇరవై ఐదు వేలకు వస్తుంది. అంటే 50 శాతం కన్నా తక్కువ ధరకి వస్తోందన్నమాట. ఒకప్పుడు డెస్క్ టాప్ కంప్యూటర్లే ఉండేవి. అంటే ఒకచోట కంప్యూటర్ని ఒక టేబుల్ మీదో, ఒక డెస్క్ మీదో పెట్టుకొని వినియోగించు కోవడం. ఇప్పుడు లాప్ టాప్లు, పామ్ టాట్లు అందుబాటులోకి వచ్చేసాయి. ఇరవై ఐదు వేలకి లాప్ టాప్ కొనుక్కుంటున్నాము అంటే హార్డ్ వేర్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ఒకసారి ఆలోచించండి. దీనివలన ముఖ్యంగా మనం మన వర్కుని ఒకచోట ఉండే చేయవలసిన అవసరం లేదు. లాప్ టాప్ తో ఎక్కడ వున్నా మన వర్క్ ని పూర్తి చేసుకోవచ్చును.

కంప్యూటర్ పరిమాణానికి వస్తే, ఒకప్పుడు టేబుల్ అంతా ఆక్రమించే కంప్యూటర్, ఈ రోజులలో అరచేతిలో కూడా ఇమిడిపోతోందంటే అతిశయోక్తి లేదు. ఈ మధ్య ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్ కూడా మార్కెట్ లోకి వచ్చాయి. ఈ కంప్యూటర్ ని లాప్ టాప్ లాగే మనం ఉపయోగించుకోవచ్చు.

నిలువ చేసే సామర్ధ్యము విషయానికి వస్తే, కంప్యూటర్ లో డేటా భద్రపరచడానికి ఒకప్పుడు హార్డ్ డిస్క్ ని వాడేవాళ్ళము. వాటి కెపాసిటీ కూడా చాలా తక్కువగా ఉండేది. అలాగే మన డేటాని, ఇంకొక చోటికి తీసుకు వెళ్ళాలంటే ప్లాపీలను వాడేవాళ్ళము. వాటి ధర, పరిమాణము ఎక్కువగా ఉండేది. ఆ తరువాత కంపాక్ట్ డిస్క్ లను వాడేవాళ్ళము. వాటి ధర కూడా ఎక్కువగా ఉండేది. నిలువ చేసే సామర్ధ్యము ప్లాపీ కన్నా ఎక్కువగా ఉండేది. ఆ తరువాత పెన్ డ్రైవ్ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధర, చిన్న పరిమాణము, ఎక్కువగా నిలువ చేసే సామర్ధ్యము ఉండటం వలన ఎక్కడికైనా డేటాని, ఇన్ఫర్మేషన్ ని సులభముగా తీసుకొని వెళ్ళడానికి వీలుపడింది.

ఇక చివరి అంశమైన ప్రొసెసింగ్ స్పీడ్. ఇది చాలా ముఖ్యమైన అంశము. ఒకప్పుడు కంప్యూటర్ ఆన్ అయ్యి, ఒక కమాండ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే పదిహేను నిముషాలు పట్టేది. ఒక ప్రోగ్రాంని కంప్యూటర్ లో ఎంటర్ చేసి, ఎగ్జిక్యూట్ చెయ్యాలి అంటే కొన్ని గంటల సమయం వేచి చూడవలసి వచ్చేది. దానికి కారణం ప్రొసెసర్ వేగం. ఈ రోజులలో క్షణ కాలంలో ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాము అంటే హార్డ్ వేర్ టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా రియల్ టైం సిస్టమ్స్ లోను, సాటిలైట్ విధానంలోను, ఆన్లైన్ సిస్టమ్స్ లోను, నిర్ణీతమైన సమయంలో ఆ పని పూర్తి చేయాలి. అలా చేయని పక్షంలో కంప్యూటర్ ఉన్నా ఉపయోగం లేనట్లే. కానీ ఈ నాడు హైస్పీడ్ కంప్యూటర్స్ అందుబాటులోకి వచ్చాక, మానవాళికి అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతున్నాయి అనడంలో సందేహం లేదు.

మరొక ముఖ్యమైన మైలు రాయి ఏమిటంటే టచింగ్ మిషన్స్ కనుగొనడం. ఇది ఒక విప్లవాత్మక మార్పు అని చెప్పవచ్చు. భాష రాయలేని వాళ్ళు, ఈ టచ్ కంప్యూటర్స్ ద్వారా వారికి కావలసిన సమాచారాన్ని ఒక్క బటన్ నొక్కడం ద్వారా పొందగలుగుతున్నారు.

సాఫ్ట్ వేర్ రంగంలో మార్పులు :
ఇక సాఫ్ట్ వేర్ రంగానికి వస్తే, ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు కంప్యూటర్ లో పని చెయ్యాలి అంటే ఎవరూ పెద్ద ఇష్టపడే వారు కాదు. దానికి కారణం కమాండ్స్ గుర్తు పెట్టుకోవడమే. మనకు కావలసిన ఫలితాన్ని కంప్యూటర్ నుంచి రాబట్టాలి అంటే దానికి సంబంధించిన కమాండ్ గుర్తు పెట్టుకుని కీ బోర్డు మీద టైపు చెయ్యాలి. ఇలా కమాండ్స్ గుర్తు పెట్టుకుని వర్క్ చేయాలంటే కష్టతరంగా ఉండేది. అదే డిస్క్ ఆపరేటింగ్ సిస్టం. ఆ తరువాత విండోస్ ఆపరేటింగ్ సిస్టం అందుబాటులోకి వచ్చాక, కంప్యూటర్ వినియోగం బాగా పెరిగింది. దానికి కారణం విండోస్ సిస్టమ్ లో వున్న గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఏ పని అయినా అందులో ఒక చిత్రంగా (ఐకాన్) చూపించడం వలన, మౌతో దాన్ని క్లిక్ చేసి సులభంగా మనకు కావలససిన అప్లికేషన్ ని ఓపెన్ చేసి పనిచేసుకో గలుగుతున్నాము. వీటిని సిస్టమ్ సాఫ్ట్ వేర్ అని అంటారు. అంటే కంప్యూటర్ని ఆపరేట్ చేయడానికి దోహదపడే సాఫ్ట్ వేర్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్ వేర్ ని మనం కొనుగోలు చేసుకొని కంప్యూటర్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తరువాత ఓపెన్ సోర్స్ సాఫ్ట్ వేర్లు అందుబాటులోకి వచ్చాయి. అంటే మనం ఉచితంగా ఈ సాఫ్ట్వేలని పొందవచ్చు. ఉదాహరణకి లినక్సు ఆపరేటింగ్ సిస్టమ్.

ఇక రెండో విధమైన సాఫ్ట్ వేర్ ని అప్లికేషన్ సాఫ్ట్ వేర్ అని అంటాము . కస్టమర్స్ అవసరాలని బట్టి ఈ సాఫ్ట్ వేర్ డెవలప్ చేస్తారు. ఉదాహరణకి బ్యాంకింగ్ రంగంలో చేసే పనులకు వాడే సాఫ్ట్ వేర్ అన్నమాట. ఈ సాఫ్ట్ వేర్ డెవలప్ చేయడానికి వాడే భాషలని ప్రోగ్రామింగ్ లాంగ్వేజస్ అని అంటారు. ఆ కోవకి చెందినవే సి, సి++, ఒరాకిల్, జావా, నెట్ టెక్నాలజీస్. ఇవి కూడా ఒపెన్ సోర్స్ లో దొరకడం వలన కంప్యూటర్ వినియోగం బాగా పెరిగింది.

కమ్యూనికేషన్ రంగంలో మార్పులు :
కంప్యూటర్ టెక్నాలజీని కమ్యూనికేషన్ టెక్నాలజీతో అనుసంధానం చేశాక, ఎన్నో మార్పులు ఈ రంగంలో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అలా ఉద్భవించినదే అంతర్జాలం (ఇంటర్నెట్). ఈరోజు ప్రపంచంలో జరిగే ఏ విషయమైనా మన కళ్ళ ముందు చూడగలుగుతున్నామంటే కంప్యూటర్ టెక్నాలజీలో వచ్చిన అభివృద్ధి వలనే. ఈ అంతర్జాలం మానవాళికి జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆన్లైన్ సిస్టమ్స్, పేపర్ లెస్ ఆఫీస్ అందుబాటులోకి వచ్చాక మనిషి పని చాలా సులభతరం అయ్యింది. ఈ-కామర్స్, ఈ-ప్రొక్యూర్మెంట్, ఈ-ఆఫీస్ అనేవి మనుగడలోకి రావడం వలన, స్టాక్ మార్కెట్ చేయాలన్నా, ఏదైనా వస్తువు కొనాలన్నా, అమ్మాలన్నా చాలా సులభతరం అయింది. చిన్న పిల్లల నుండే ఏ విషయాన్నైనా శోధించాలంటే ఈ అంతర్జాలంలో వున్న సెర్చ్ ఇంజన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఆ విధంగానే వైద్య విధానంలోనూ వ్యవసాయంలోనూ, విద్యారంగంలోనూ, ఒకటి కాదు అన్ని రంగాలలో అంతర్జాలమే ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఉదాహరణకి, ఒకప్పుడు రైలు టిక్కెట్టు ముందుగా రిజర్వు చేయించుకోవాలంటే రైల్వే స్టేషనుకి వెళ్ళి, గంటల సమయం లైనులో నుంచునేవాళ్ళం.  కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. కంప్యూటర్, అంతర్జాలమూ వుంటే ఇంటి నుండే మనం టిక్కెట్టు తీసుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలో జరిగే ప్రతీ వ్యవస్థలోనూ జరిగే టెక్నాలజీ అభివృద్ధిని మనము తెలుసుకోవచ్చు. ఇది శాస్త్రవేత్తలకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఒకప్పుడు విదేశాలలో వున్న మన బంధువులతో, స్నేహితులతో మాట్లాడాలంటే ఎంతో సోమ్ము వెచ్చించే వాళ్ళం. ఇప్పుడు వాట్సయాప్ అనే ప్రోగ్రాము ద్వారా యాహూ మెసెంజర్ ద్వారా గూగుల్ డ్యుయో ద్వారా అంతర్జాలాన్ని ఉపయోగించి, కంప్యూటర్ తో ఉచితంగా మాట్లాడగలుగుతున్నాము. 

సోషల్ మీడియా
ఆ విధంగానే సోషల్ మీడియా నెట్ వర్క్ వ్యవస్థ. మన చిత్రాలను, ఏదైనా సమాచారాన్ని ఎక్కువ మందికి అనుసంధానం చేయడానికి ఎంతో దోహదపడుతున్నాయి. ఆ కోవకు చెందినవే ఫేస్ బుక్, ట్విట్టర్. ఇలా ఎన్నో ఉపయోగాలు అంతర్జాలం వలన మానవాళి లబ్ది పొందుతున్నారు. 
ప్రస్తుతం భారత దేశంలో ఇస్రో వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలలో కంప్యూటర్లను అనుసంధానం చేయటం ద్వారా శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు అవసరమైన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని చేరవేయడంలో, అనేక ఉపగ్రహాలకు వాటి నిర్దేశిత కక్ష్యలోకి పంపిస్తున్నారు. వీటి ద్వారా వాతావరణంలోని మార్పులు, తుఫాను, వరదల తాకిడి మొదలైన అంశాలపై త్వరిత గతిన సమాచారం అందించడానికి వీలవుతుంది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ :
కంప్యూటర్ టెక్నాలజీలో మరొక ప్రధానమైన విభాగం ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) కంప్యూటర్ కి మనిషిలా ఆలోచింపచేసే విజ్ఞానాన్ని అందించి, అవి మనలా పనిచేయడమే ఈ కృత్రిమ మేధస్సు అనేది. వైద్య విభాగంలో శాస్త్రవేత్తలు ఈ ఏ.ఐ. ద్వారా టార్గెట్ క్యాన్సర్ సెల్ ని కనుక్కోవడానికి మరియు డిసీజ్ ఎలిమినేట్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. ఫైనాన్స్, హెవీ ఇండస్ట్రీస్, మిలటరీ, స్పేస్ సైన్స్ ఇలా అన్ని రంగాలలోనూ ఈ ఏ.ఐ.ని వాడుతున్నారు. రోబోటిక్స్ వాడకం అన్ని దేశాలలోనూ గణనీయంగా పెరిగింది. రిమోట్ ఇన్‌స్ట్రక్షన్స్ ద్వారా రోబోటిక్ సర్జరీ కూడా జరిగింది. అంటే ఈ ఫీల్డ్ ఎంతగానో ఉపయోగపడుతోందని చెప్పవచ్చు. అలాగే గూగుల్ డ్రైవర్ లెస్ కార్, ఫోర్ కాస్టింగ్ స్టాక్ మార్కెట్, ఇవన్నీ రిమోట్ కంట్రోల్డ్ సర్జికల్ ప్రొసీజర్స్, అడ్వాన్స్ డ్ వెదర్ మోడలింగ్, స్పీచ్ రికగ్నిషన్, గేమ్ ప్లేయింగ్ లోనూ ఈ ఏ.ఐ. ముఖ్యపాత్ర పోషిస్తున్నది.

మరొక తాజా పరిణామం గురించి చెప్పాలంటే బిగ్ డేటా ఎనలిటిక్స్. పెద్ద పెద్ద డేటా సెట్స్ ని భద్రపరచి వాటిని ఎలా విశ్లేషించాలి అనేది ఈ బి.డి.ఏ. అంతర్జాలం అందుబాటులోకి వచ్చాక, కంప్యూటర్ లో భద్రపరచడానికి అయ్యే ఖర్చు బాగా తగ్గాక, డేటా సైజు ఎక్కువగా పెరిగిపోతోంది. మిలియన్ల కొద్దీ మానవాళి ఈ డేటాని భద్రపరుస్తున్నారు (టెరాబైట్స్, పెటాబైట్స్). ఉదాహరణకు మనము మనకు సంబంధించిన ఫోటోలను, డేటాను, గూగుల్ డ్రైవ్ లోను, ఫేస్ బుక్ లోను భద్రపరచుకుంటున్నాము. 
ఉదాహరణకి అమేజాన్ సూపర్ మార్కెట్లో రోజుకి 15 మిలియన్ కస్టమర్స్ డేటా జనరేట్ అవుతుంది. ఇందులో ఎంతమంది ఎక్కువగా ఏ వస్తువులు కొంటున్నారు, ఏ ప్రాంతంలో ఏ వస్తువు ఎక్కువగా అమ్ముడవుతుంది అనే విషయాన్ని విశ్లేషించడానికి ఈ బీ.డి.ఏ. ఉపయోగపడుతుంది. ప్రతీ ఇన్ఫర్మేషన్ ని డిజిటలైజేషన్ చేయడం వలన ఈ డేటా అనేది బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఈ బి.డి.ఏ. మూడు సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. 
1. వాల్యూమ్ (టెరాబైట్స్, జెటాబైట్స్) 
2. వెలాసిటి (ఎంత స్పీడుగా ట్రాన్స్ఫర్ అవుతుంది) 
3. వెరైటి (డేటాలో స్ట్రక్చర్డ్, అన్ స్ట్రక్చర్డ్)
ముఖ్యంగా ఈ బి.డి.ఏ.ని స్టాక్ మార్కెట్, సోషల్ నెట్ వర్క్ సైట్స్, టెలికమ్ కంపెనీలలోనూ విస్త్రృతంగా వాడుతున్నారు.

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐ.ఓ.టి.)
ఐ.ఓ.టి. అంటే అంతర్జాలంతో మన చుట్టుపక్కల ఉండే వస్తువులను అనుసంధానం చేయడం. అది మీ వెహికిల్ అవ్వవచ్చు, రిఫ్రిజిరేటర్ అవ్వవచ్చు, ఏ.సి. అవ్వవచ్చు, మొబైల్ ఫోన్ అవ్వచ్చు. దీని వలన ఏ వస్తువును అయినా మన అంతర్జాలం ద్వారా నియంత్రించవచ్చు. మొబైల్ ఫోన్లో టి.వి. ఆపరేట్ చేయవచ్చు, లైట్స్ ఆఫ్ చేయవచ్చు. ఉదాహరణకు మన కారుని ఇలా అనుసంధానం చేయడం ద్వారా ఎప్పుడైనా ట్రాఫిక్ లో యాక్సిడెంట్ అయితే, దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి వెంటనే ఇన్ఫర్మేషన్ వెళుతుంది. అందులో మీ కారు నెంబరు, లొకేషన్, పేరు ఈ వివరాలన్నీ అందుబాటులోకి రావడం వలన వెంటనే హాస్పిటల్ సిబ్బంది రావడానికి వీలు ఉంటుంది. 2020 సంవత్సరానికి 50 బిలియన్ వస్తువులు ఈ ఐ.ఓ.టి. కి అనుసంధానం అవుతాయని అంచనా.

క్లౌడ్ కంప్యూటింగ్ 
ఇది శక్తివంతమైన మరియు తరచుగా వాస్తవీకరించిన వనరులను గణించడానికి అంతర్జాలం ద్వారా అందించబడే ఒక సేవా విధానము. అంటే ఒక వ్యక్తి గాని, ఒక సంస్థగాని అంతర్జాలం ద్వారా ఈ సేవలు పొందవచ్చు. అది హార్డ్ వేర్ కావచ్చు, సాఫ్ట్ వేర్ కావచ్చు. ఉదాహరణకు జీమెయిల్ ని మనం ఎక్కడైనా యాక్సిస్ చేస్తున్నాము. అలాగే గూగుల్ డ్రైవ్ లో మన డేటాను భద్రపరచుకుంటున్నాము. ఈ టెక్నాలజీ వలన రిమోట్ వనరులను మనం వాడుకుంటున్నాము. కాబట్టి, డేటా భద్రపరచడానికి, అప్లికేషన్స్ తో పనిచేయడానికి మనం సర్వలను కొనవలసిన అవసరం లేదు. దీని వలన ఎన్నో ఐ.టి. సంస్థలు స్టార్టప్ కం పెనీలుగా పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. తద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడుతున్నాయి. దీని ద్వారా ఒక సంస్థ వెబ్ సైట్ కి సంబంధించిన డేటాని రిమోట్ సర్వర్ లో భద్రపరచుకోగలుగుతుంది. కాకపోతే దీనికి కొంచెం ధనం చెల్లించవలసి ఉంటుంది. అది మనం వాడుకునే విధానం మీద ఆధారపడి ఉంటుంది.

ఇపుడు కొత్తగా వస్తున్న టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజి. ఇది చెప్పుకోవాలంటే ముందుగా బిట్ క్వాయిస్ గురించి చెప్పుకోవాలి. బిట్ క్వాయిన్ ని డిజిటల్ క్రిప్టో కరెన్సీగా చెప్పుకోవచ్చు. అంటే మనం అంతర్జాలంలో ఈ క్వాయిన్స్ మీద పెట్టుబడి పెట్టవచ్చు. అమ్ముకోవచ్చు కూడా. ఈ బ్లాక్ చెయిన్ టెక్నాలజీ అనేది బిట్ క్వాయిన్ విధానంలో వాడే ఒక డేటా నిర్మాణం (డేటా స్ట్రక్చర్). ఇది డిజిటల్ కరెన్సీ ట్రాన్స్ శాక్షన్స్ ఎన్ని చేశామో రికార్డు చేస్తుంది. అంటే ఈ టెక్నాలజీని ఒక డిజిటల్ లెడ్చర్ గా చెప్పుకోవచ్చు. ఇందులో సమాచారాన్ని ఎవరైనా చూడవచ్చు. ఉదాహరణకు మనం ఒక విషయం మీద అప్లికేషన్ పెడితే అది ఎక్కడుందో మనం పరిశీలించవచ్చు. అంటే ఫైలు కదలిక ఎలా ఉందో తెలుసుకోవచ్చు. అలాగే మనం ఒక స్థలం కొనాలనుకుంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మొదటి నుండి (వాటినే అనుబంధ డాక్యుమెంట్లు) ఈ టెక్నాలజీ ద్వారా మనం పొందవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ ఓటింగ్ లోను ఈ టెక్నాలజీని వాడుతున్నారు. మరొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఇందులో పొందుపరచిన సమాచారానికి భద్రత ఎక్కువగా ఉంటుంది.

వ్యవసాయ రంగంలో మార్పులు
ప్రస్తుత కంప్యూటర్ యుగంలో అన్ని రంగాలతో పాటు, వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు వచ్చాయి. దేశ, విదేశాలలో జరిగే పరిశోధనలు, వాటి ఫలితాలు, రైతులకు ఏ విధంగా అందుబాటులోకి వస్తాయి అన్న విషయాన్నీ క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. వ్యవసాయం ఉద్యాన పంటలు, పూల తోటలు, పాడి పరిశ్రమ రంగాలలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం కంప్యూటర్ ద్వారా ప్రతీ ఒక్కరి దగ్గరకు చేరుతోంది. కిసాన్ కాల్ సెంటర్ ద్వారా, కిసాన్ పోర్టల్, ఈ-సలహా ద్వారా రైతుల సమస్యలకు శాస్త్రవేత్తల నుండి సత్వర సమాధానాలు చేరవేయబడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశంగా, అనేక పంటలలో జెన్యు మాపింగ్ వంటి అతి సున్నితమైన పరిశోధనలు జరుగుతున్నాయి. శాస్త్రవేత్తలు ప్రచురించే పరిశోధన వ్యాసాలు, మొదలైనవి కంప్యూటర్ ద్వారా విద్యార్ధులకు, పరిశోధకులకు అందుబాటులోకి వస్తున్నాయి. డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు రానున్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు.

ముగింపు
ఈ టెక్నాలజీలు అన్నీ పరిశీలిస్తే, కంప్యూటర్లు మానవాళికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈ టెక్నాలజీలో వచ్చిన మార్పుల వలన కొన్ని లక్షల మానవాళికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాయి. మనదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా మన భారతీయులే ఈ ఉద్యోగాలలో ప్రధమ స్థానంలో ఉన్నారు. ఇప్పటికీ హార్డ్ వేర్ రంగంలో నిపుణుల కొరత ఎక్కువగానే ఉంది. టెక్నాలజీలో వచ్చే మార్పుల్లో నైపుణ్యం సంపాదిస్తే మన భారతదేశం రాబోయే కాలంలో ప్రధమస్థానంలో ఉంటుందని నిస్సందేహంగా చెప్పవచ్చును.

రచయిత సమాచారం

డా॥ హెచ్. రవిశంకర్, డా|| కె. సుమన్ కళ్యాణి, డా|| ఎస్. కస్తూరి కృష్ణ, ప్రధాన శాస్త్రవేత్తలు, ఐ.సి.ఏ.ఆర్. సి.టి.ఆర్.ఐ., రాజమండ్రి