Print this page..

తెలంగాణ నుంచి ఐరోపా దేశాలకు తెలంగాణ విత్తనాలు

వ్యవసాయానికి సంబంధించి ఒక్కసారి మానవ నాగరికతా పరిణామక్రమాన్ని పునరావలోకనం చేసుకుంటే, ఆదిమానవుడి కాలం నుంచి మనిషి ఆహారం కోసం ఎన్ని వేల సంవత్సరాలు ఎంత కష్టపడ్డాడో తెలుస్తుంది. కడుపు నింపుకోవడం కోసం ఆదిమానవులు సంచార జాతులుగా మారి అడవులు కొండలు, పర్వతాలు, కోనలు దాటి సాగించిన జీవనయానం మనకు తెలుసు. అప్పటినుంచి ఎన్నో దశలు దాటి ఒక చోట స్థిరపడి వ్యవసాయం అనే ప్రక్రియతో ఆహారోత్పత్తి చేసుకునే నాగరిక దశలోకి మానవుడు అడుగుపెట్టాడు. అయితే, ఆహారోత్పత్తిలో నాణ్యతను, స్వయం సమృద్ధిని సాధించి, పెరుగుతున్న జనసంఖ్యకు సరిపడే ఆహారాన్ని సమకూర్చుకోవడంలో మాత్రం ఇంకా అతని కృషి విత్తన దశలోనే వుంది.
వ్యవసాయ రంగంలో రైతులు ఆధిక దిగుబడులు సాధించడానికి కావలసిన వివిద ఉత్పాదకాలలో నాణ్యమైన విత్తనం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. నాణ్యమైన విత్తనం దాదాపు 20-25% దిగుబడులను పెంచే అవకాశం ఉంటుంది. అలాంటి నాణ్యమైన విత్తనాన్ని ఉత్పత్తి చేయడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన విత్తన రైతులు పాత్ర ఎంతో కీలకమైనది.

భారత విత్తన పరిశ్రమ :
వ్యవసాయ రంగంలో అధికోత్పత్తి సాధించి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోని, దేశ ఆహార భద్రతను కాపాడుకోవడానికి, నాణ్యమైన విత్తనాలను వాడటం అత్యంతావశ్యకం. ఇందుకు నాణ్యమైన విత్తనాలు సరఫరా ఈ విషయంలో శ్రేష్టమైన క్రమబద్ధీకరణ విధానాలు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తాయి అనేది కూడా అందరు అంగీకరించే సత్యం. పైగా భారత దేశంలో నాణ్యమైన విత్తనోత్పత్తికి విభిన్న వాతావరణాలు ఉష్ణ సమశీతోష్ణ పరిస్థితులు, విత్తన నిల్వకు అనుకూలంగా ఉండే వాతావరణ పరిస్థితులు వుండడం మూలాన, పెద్ద మొత్తంలో దాదాపు అన్ని రకాల పంటల విత్తనోత్పత్తి చేపట్టడం జరుగుతుంది.
విత్తన పరిశ్రమ అనేది వైవిద్యమైన, పోటీతత్వంతో కూడినది, అలాంటి ప్రపంచ విత్తన పరిశ్రమ 2019 లో 4 లక్షల కోట్ల విలువ కలిగి ఉండి, 2025 నాటికి 6 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం కలిగి ఉంది. ఈ తరుణంలో ప్రపంచ దేశాలలో భారత విత్తన పరిశ్రమ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతూ, 2017 సంవత్సరంలో 3.6 బిలియన్ డాలర్లు, 2018 లో 4.1 బిలియన్ డాలర్ల విలువ కలిగి ఉండి, 2024 సంవత్సరానికి 9.1 బిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం కలిగి ఉన్నది. ప్రతుత్తం భారత విత్తన పరిశ్రమ 15 వేల కోట్ల మార్కెట్ ను కలిగి ఉండి, కానీ అంతర్జాతీయ విత్తన చట్టాలు, నిబందనలు మరియు ప్రమాణాలతో పోలిస్తే భారత విత్తన చట్టాలు, విత్తన నాణ్యత నియంత్రణ, విత్తన పరీక్షలలో వత్యాసం ఉండటం వలన, అన్నీ దేశాలకు విత్తన ఎగుమతులు చేయడంలో కొన్ని అవాంతరాలు ఏర్పడి, అంతర్జాతీయ విత్తన వాణిజ్యంలో 2% కన్నా తక్కువ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భారత దేశంలో విత్తన రాష్ట్రం గా చెప్పుకునే తెలంగాణ లో నాణ్యమైన హైబ్రిడ్ విత్తనోత్పత్తికి, విత్తన పరిశ్రమ అభివృద్ధికి మంచి అవకాశాలు, ప్రభుత్వం చేపడుతున్న సీడ్ బౌల్ కార్యక్రమాలు, రాష్ట్రం నుంచి జరిగే విత్తన ఎగుమతులు పరోక్షంగా భారత విత్తన పరిశ్రమ అభివృద్ధికి, అంతర్జాతీయ విత్తన వాణిజ్యంలో భారత విత్తన పరిశ్రమ వాటాను పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

విత్తన అనుబం ధ సంస్థలు:
దేశంలో ఇప్పుడు 26 రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థలతో పాటు 15 రాష్ట్ర విత్తన సంస్థలు, వివిద విత్తన కంపెనీలు విత్తన రంగంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (TSSDC) మరియు తెలంగాణ రాష్ట్ర విత్తన & సేంద్రీయ దృవీకరణ అథారిటీ (TSSOCA) విత్తనోత్పత్తి మరియు విత్తన దృవీకరణలో కీలక పాత్ర పోషిస్తున్నయి. అంతేకాకుండా భారత వ్యవసాయ పరిశోధన మండలి (ICAR), అంతర్జాతీయ వ్యవసాయ పరిశోదన సంస్థ (ICRISAT) మరియు ఇతర ICAR మరియు రాష్ట్ర వ్యవసాయ యూనివర్శిటీ పరిశోధన సంస్థల ద్వారా విత్తనోత్పత్తి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ప్రోస్తహిస్తుంది. ఇంకా ఇతర ఇక్రిశాట్ సంస్థలను విత్తనాలను అభివృద్ధిచేసే దిశగా కేంద్రప్రభుత్వం క్రియాశీల పాత్రను పోషిస్తూ తెలంగాణాతో పాటు అనేక రాష్ట్రాలను ప్రోత్సహిస్తోంది. ఇందుకు గాను ఇష్టా గుర్తింపు పొందిన విత్తన పరీక్ష ల్యాబ్ లను, ఇతర సంస్థలను, ఇండియాలో ముఖ్యంగా తెలంగాణా లో స్థాపించి నాణ్యమైన విత్తనాల సరఫరా అధికోత్పత్తి ద్వారా సాధించే దిశగా అభివృద్ధి చేసేందుకు కూడా కృషి చేయబోతున్నామని సగర్వంగా చెప్పగలుగుతున్నాను.
 

తెలంగాణ రాష్ట్రం విత్తన బాండాగారం:
సీడ్ కాపిటల్ ఒఫ్ ఇండియా గా చెప్పుకునే తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన విత్తనోత్పత్తికి, విత్తన నిల్వకు అనుకూల వాతావరణ పరిస్థితులు, నైపుణ్యం కలిగిన విత్తన రైతులు, మౌలిక సదుపాయాలు కలిగి ఉండడం వలన, దాదాపు 400 జాతీయ & అంతర్జాతీయ స్థాయి విత్తన కంపెనీలు, ప్రాసెసింగ్ ప్లాంట్ లు హైదారాబాద్ చుట్టూ పక్కల నెలకొని ఉన్నాయి. అందువల్ల ఇతర రాష్ట్రాలలో పండిన విత్తనం కూడా హైదరాబాద్ లో ప్రాసెసింగ్ మరియు ప్యాకింగ్ అయ్యి దేశంలోని వివిధ రాష్ట్రాలకు కావలసిన 60% విత్తనాలు సరఫరా చేయడమే కాకుండా, ఇతర దేశాలకు ఎగుమతి చేయడం జరుగుతుంది.
 

యూరోపియస్ విత్తన సమాన అధికారాలు : (EU Equivalence)
అయితే ప్రపంచం మొత్తంలో OECD భాగస్వామ్య దేశాల సమూహం మరియు ఐరోపా దేశాల సామూహం చాలా పెద్దవి. ఈ దేశాలకు విత్తన ఎగుమతులు చేయాలంటే ఆయా దేశాల విత్తన ప్రమాణాలకు అనుగుణంగా ఎగుమతులు చేయాలని అనుకుంటున్న దేశాలలో విత్తనోత్పత్తి మరియు విత్తన పరీక్ష జరిగి ఉండాలి. దీనిని దృష్టిలో ఉంచుకొని 2008 లోనే మన దేశం OECD భాగస్వామ్య దేశంగా చేరింది. ఇలా అంతర్జాతీయ విత్తన దృవీకరణ (OECD) పద్ధతి ద్వారా OECD భాగస్వామ్య దేశాలకు విత్తనాలను ఎగుమతి చేస్తూ వస్తుంది. అయితే యూరోపియన్ దేశాలకు కూడా విత్తన ఎగుమతులు చేయాలంటే ఐరోపా దేశాల విత్తన ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలో విత్తనోత్పత్తి, విత్తన పరీక్ష జరగాలి. ఇలా భారత దేశ విత్తన ప్రమాణాలను అంతర్జాతీయ విత్తన ప్రమాణాలకు అనుగుణంగా మెరుగుపరచి, యూరోపియన్ విత్తన సమాన అధికారాలు సాదించి మన దేశం నుంచి ఐరోపా దేశాలకు కూడా విత్తన ఎగుమతులను ప్రోస్టహించడంలో ఒక ముందడుగు వేసింది. 
 

ఇండియాకు యూరోపియస్ విత్తన సమాన అధికారాలు సాదించడానికి నోడల్ ఆఫీసర్ గా డా. కేశవులు :
గత ఏడాది తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థల డైరెక్టర్ డా. కేశవులును ఇండియాకు యూరోపియన్ సమాన అధికారాలు సాదించడానికి నోడల్ అధికారిగా కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. అప్పటి నుండి ఆయన నేతృత్వంలో భారత విత్తన చట్టం, విత్తనోత్పత్తి, విత్తన పరీక్ష పద్ధతులు, ప్రమాణాలు, పంట రకాల నమోదు, విడుదల పద్దతులను మెరుగు పరచి వాటి గురించి క్లుప్తంగా ఒక డాక్యుమెంటరీ తయారు చేసి 2018 సెప్టెంబర్ లో యూరోపియన్ విత్తన సమాన అధికారాల కోసం యూరోపియన్ కమీ:సన్ కు భారత ప్రభుత్వం ద్వారా దరఖాస్తు పంపించారు.
అనంతరం ఆయన ఆద్వర్యంలో హైదారాబాద్ లో అంటే దక్షిణ ఆసియా లోనే తొలి సారిగా అంతర్జాతీయ ISTA విత్తన సదస్సు జరిగింది. అంతే కాదు స్విట్జర్ లాండ్ లో ఉన్న అంతర్జాతీయ విత్తన ప్రమాణాల సంస్థ (ISTA) ఉపాద్యక్షలుగా దా. కేశవులు ఎంపిక అయ్యారు. ముఖ్యంగా ఈ సదస్సు హైదారాబాద్ లో విజవంతంగా నిర్వహించి తెలంగాణ విత్తన రంగ కీర్తి ని ప్రపంచ నలుమూలలా విస్తరింప చేయడంలో ఆయన కీలక భూమిక పోషించారు. 
అనంతరం ఆయన ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు పర్యటించి తెలంగాన విత్తనాల గొప్పదనం, నాణ్యతను వివరించడంలో మన రాష్ట్రం అంతర్జాతీయంగా విత్తన రంగంలో గుర్తింపుకు నోచుకుంది. ఇలా ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఇప్పుడు మన విత్తనాలను ఐరోపా దేశాలు ఎగుమతి చేసుకునే స్థాయి కి తీసుకవచ్చారు. మన దేశం నుంచి అందులోనూ మన తెలంగాణ నుంచి ఎక్కువ విత్తనాలు ఎగుమతి కానున్నాయి

క్షేత్ర స్థాయి విశ్లేషణ మరియు ఐరోపా విత్తన సమాన అధికారాల సాదన:
అనంతరం యూరోపియన్ కమీషన్ ఈ దరఖాస్తును స్వీకరిస్తూ చట్టపరమైన ప్రాథమిక విశ్లేషణను పూర్తి చేసి క్షేత్ర స్థాయిలో విత్తనోత్పత్తి, విత్తన ప్రమాణాల అమలు తీరుపై ఐర్లాండ్ లో ఉన్నయూరోపియన్ కమీషన్, ఆరోగ్య, భద్రత విభాగం డీజి నాండోర్ పేట్ ఇండియాకు వచ్చి వెళ్లారు. ఆయన మన వద్ద ప్రధానంగా విత్తన చట్టం అమలుతీరు ను పరిశీలించారు. అనంతరం ఐరోపా దేశాలకు మన విత్తనాల ఎగుమతికి పచ్చ జెండా ఊపడంతో ప్రపంచంలోనే మన రాష్టం ఒక విత్తన హబ్ గా మారే దిశాగా అడుగులు పడ్డ టైంది. 

ఐరోపా దేశాలకు విత్తన ఎగుమతి: 
ఐరోపా దేశాలకు ఈ ఏడాది నుంచి మన రాష్ట్ర విత్తనాలు సరఫరా కానున్నాయి. ఐరోపా దేశాల విత్తన ప్రమాణాలకు అనుగుణంగా తెలంగాణలో విత్తనోత్పత్తి జరగడం వలన మన రాష్ట్రం నుంచి ఐరోపా దేశాలకు మన విత్తనాల ఎగుమతికి మార్గం సుగమం అయింది. దీంతో మన రాష్ట్రమే కాదు మన దేశం కూడా విత్తన రంగంలో ఒక ముందడుగు వేసింది. దేశంలోనే విత్తన భాండాగారంగా వెలుగొందాలన్న లక్ష్యంతో తెలంగాణ ఆవిర్భావం నుంచి అడుగులు వేస్తున్న మన రాష్ట్రం ఇందులో కీలక భూమిక పోషించింది. యూరోపియన్ యూనియన్ తో సమాన విత్తన అధికారాలు సాదించే దిశగా మన రాష్ట్రాన్ని అంటే మన దేశాన్ని ముందుకు తీసుకవెళ్తుంది.
 

అంతర్జాతీయ (OECD) విత్తన దృవీకరణ ద్వారా ఎగుమతులు:
2008 సంవత్సరంలో ఇండియా OECD భాగస్వామ్య దేశంగా చేరినా కూడా 2015 వరకు అంతర్జాతీయ (ఓఈసిడి) విత్తన దృవీకరణ పద్ధతి లో ఎలాంటి పురోగతి సాధించలేదు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రం దేశం లోని మొదటి సారిగా ఈ అంతర్జాతీయ విత్తన దృవీకరణను అమలు పరచి, OECD భాగస్వామ్య దేశాలకు తెలంగాణ రాష్ట్రం నుంచి వరి, మొక్కజొన్న,జొన్న, సజ్జ, ప్రొద్దుతిరుగుడు విత్తనాలను ఈజిప్ట్, సూడాన్, ఫిలిపైన్స్, రష్యా, టాంజానియా దేశాలకు తెలంగాణ నుంచి విత్తన ఎగుమతుళు చేయడం జరిగింది.

రచయిత సమాచారం

డాక్టర్ కె.కేశవులు, సంచాలకులు, తెలంగాణ రాష్ట్ర విత్తన మరియు సేంద్రీయ దృవీకరణ అథారిటీ (TSSOCA) & మీనేజింగ్ డైరెక్టర్, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ (TSSDC) (అంతర్జాతీయ విత్తనాల పరీక్ష ప్రమాణాల సంస్థ (ISTA), వైస్ ప్రెసిడెంట్)