Print this page..

సేంద్రియ సాగు... ఆరోగ్యం బాగు

సేంద్రియ వ్యవసాయం భారత దేశ రైతులకు కొత్త విషయమేమీ కాదు. అనేక వేల సంవత్సరాల నుండి సేంద్రియ పదార్ధాలను ఉపయోగించి ఆరోగ్యకరమైన, అత్యంత నాణ్యమైన ఆహార పదార్థములను ఉత్పత్తి చేసేవారు. కానీ తర్వాత కాలంలో దేశ జనాభా గణనీయంగా పెరగడం వల్ల వారికి అవసరమైన ఆహారపు అవసరాలను తీర్చడానికి అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టడం, దానితో పాటు రసాయనిక ఎరువుల వాడకం మరియు  పురుగు మందులు విచక్షణా రహితంగా పిచికారి చేయడం వల్ల వాతావరణ కాలుష్యం ఎర్పడుతూ వచ్చింది. వాతావరణ కాలుష్యం మరియు వాతావరణ అసమతుల్యతల కారణంగా అనేక ప్రకృతి వైపరీత్యాలు నేడు నిత్యకృత్యమయిన సందర్భాలు చూస్తూనే ఉన్నాము.

అందుచేత ప్రస్తుతం ప్రపంచ దేశాలు సేంద్రియ యవ్యవసాయ ప్రాముఖ్యతను గుర్తించి సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుడుతున్నాయి. కావున ముందుగా సేంద్రియ వ్యవసాయం అంటే ఏమిటో తెలుసుకుందాం...

సేంద్రియ వ్యవసాయం అనగా సహజ సస్యరక్షణ పద్దతులు ఉపయోగించి సక్రమ యాజమాన్య పద్దతులతో పంటలను పండించే విదానం. ఇంకా సులువుగా చెప్పలంటే పర్యావరణ ప్రకృతి వనరుల యాజమాన్యమే సేంద్రియ వ్యవసాయము. ఈ సేంద్రియ వ్యవసాయంనందు ఆరోగ్యకరమయిన ఆహార ఉత్పత్తి, కాలుష్యరహిత వాతావరణం, సమాజ శ్రేయస్సు, నేల ఆరోగ్యం లాంటి విషయాలన్నీ ఇమిడిఉన్నాయి. ఇందులో రసాయనిక ఎరువులు, పురుగుమందులు, కలుపుమందులు, జన్యుమార్పిడి విత్తానాలు మరియు చివరికి రసాయనాలతో విత్తన శుద్ధి చేసినటువంటి విత్తనాలు వాడకం కూడా నిషిద్ధమే. కానీ రసాయనాల వాడకాన్ని పూర్తిగా నిషేదిస్తే ప్రస్తుత పరిస్థితులలో తక్షణమే ఇతర వనరుల ద్వారా రసాయనాల విధిని నిర్వర్తించలేము కావున కొంత మోతాదు వరకు రసాయనాలను వాడవచ్చును. రసాయనాలు కొద్ధి మోతాదులలో ఉపయోగించే మొక్కల నుండి తీసిన పైరిత్రిన్‌, ఫెరమోన్స్‌లలో వాడే లింగాకర్షక రసాయనాలు. శిలీంద్ర నివారణకు ఉపయోగించే గంధకదాతువు, రాగి దాతువుతో తయారయిన బోర్డోమిశ్రమం పరిమితంగా వాడుకోవచ్చు. తీవ్రమైన పరిస్థితులలో ఆమ్ల మరియు క్షార నేలల పునరుద్ధరణకు సున్నం లేదా జిప్సంలను పరిమితంగా వాడుకోవచ్చును అలాగే అత్యవసర పరిస్థితులో సూక్ష్మ పోషకలోపాలు కూడా రసాయనాలతో సరిదిద్దవచ్చును. 

సేంద్రియ వ్యవసాయంలో యాజమాన్యం :

1. సేంద్రియ వ్యవసాయంనందు నేలను ఆవసరమైనంత మేరకు దున్నటం 

2. నేలకోతకు గురికాకుండా జాగ్రత్త పడడం, నేల మరియు నీరును సంరక్షించడం

3. వ్యవసాయంతో పాటు పశుపోషణకు ప్రాధాన్యత ఇవ్వడం 

4. అంతర పంటల సేద్యానికి ప్రాధాన్యత ఇవ్యడం.

5. పంటమార్పిడి పాటించడం, పచ్చిరొట్ట ఎరువులకే ప్రాధాన్యత ఇవ్వడం.

6. వ్యవసాయ వ్యర్ధాలను సమర్ధవంతంగా వినియోగించడం.

7. పూర్తిగా కుళ్ళిన సేంద్రియ ఎరువులు, వర్మికంపోస్టు, గోబర్‌ గ్యాస్‌ వ్యర్ధాలను వాడటం.

8. సాగునీటి సద్వినియోగం - యాజమాన్యము.

9. రసాయనిక మందుల వాడకం పూర్తిగా తగ్గించి సహజవనరుల ద్వారా భూసారం పెంచడం.

10. జీవనియంత్రణ పద్ధతులకు, వృక్షసంబంధ మందుల వాడకానికి ప్రాధాన్యత ఇవ్వడం.

11. పంటకోత తర్వాత కూడా వినియోగదారునికి చేరేవరకు ఉత్పత్తుల నాణ్యత చెడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల దృవీకరణ :

మన దేశంలో సేంద్రియ వ్యవసాయన్ని విస్తృత పరిచేందుకు 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వ సంస్థ అపెడా ప్రారంభించబడింది. ఏదైనా వ్యవసాయ ఉత్పత్తి ఎగుమతి చేయాలంటే వీరినుండి ధృవీకరణ పత్రం, పొంది ఉండాలి. ఏదైనా వ్యవసాయ ఉత్పిత్తి ఎగుమతి చేయాలంటే వీరినుండి ధృవీకరణ పత్రం పొంది ఉండాలి. సేంద్రియ పదార్ధాలను ఉపయోగించి ఉత్పత్తి చేసినట్లు ధృవీకరణ పత్రం ఉంటేనే వినియోగదారుడు కానీ, ఎగుమతిదారుడు కానీ ఎక్కువ ధర పెట్టి కొంటాడు.

ఈ ధృవీకరణ పత్రం పొందాలంటే ఇదివరకు చాలా ప్రయాసలు పడవలసి వచ్చేది. కాని ఈ సమస్య పరిష్కారానికి రైతు ప్రతినిధులతో, స్వచ్చంద సంస్థలతో 2004 లో పూణె కేంద్రంగా ఒక సమాఖ్య ఏర్పడింది. తద్వారా 2005లో అపెడా గుర్తింపు పొందింది.

తర్వాత 2005లో భారత ప్రభుత్వం సేంద్రియ ఉత్పత్తుల పథకం ప్రవేశపెట్టింది. దీనివల్ల రైతులకు కొంతమేర రాయితీలు, వెసులుబాట్లు లభించాయి. ధృవీకరణ పత్రం వ్యక్తిగతంగా కాకుండా రైతు గ్రూపు మొత్తంగా ఇచ్చే పద్ధతి పాటిస్తారు. వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం అవలులో ఉంది. అదేవిధంగా ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ధృవీకరణ పత్రం ఇవ్వడానికి కొన్ని సంస్థలకు అనుమతిని ఇచ్చింది. 

ఫ్రాన్సు, జర్మని సంస్థలు - ఔరంగాబాద్‌ 

స్విట్జర్లాండు - బెంగుళూరు ఢిల్లీ 

నెదర్లాండు - ముంబాయి. 

భారతదేశం - కేరళలోని 'అలువ'

అదేవిధంగా మన రాష్ట్రంలో నెలకొల్పబడిన వేవిక్‌ ఆర్గానిక్‌ సర్టిఫికేట్‌ ఏజెన్సీ (వోకా) ఏప్రిల్‌ 9, 2008వ సంవతర్సంలో అపెడాకి అనుబంధ సంస్థగా రిజిష్టర్‌ చేయడం జరిగింది. ఇది అమెరికా, ఐరోపా దేశాలకు ఎగుమతి చేసే ధృవీకరణ పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. 

సేంద్రియ వ్యవసాయన్ని ఇంకొంత విస్తృత పర్చడానికి, రైతులను గ్రూపులుగా ఏర్పరచి శిక్షణ ఇవ్వడం మరియు వారికి పోత్సహాకాలను ఇవ్వడం కూడా జరిగుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్‌, అర్జెంటైనా, ఇటలీ, అమెరికా దేశాలు సేంద్రియ వ్యవసాయంలో ముందు ఉన్నాయి. 

సేంద్రియ వ్యవసాయం వల్ల లాభాలు:

కాలుష్య నివారణకు దోహదపడుతుంది.
జన్యు మరియు జీవ వైవిధ్యానికి నాంది పలుకుతుంది.
సహజ వనరులు ప్రస్తుత కాలంలో వినియోగించుకోవటమే కాకుండా రాబోయే తరాల వారికి కూడా అందుబాటులో ఉంటాయి.
నేల గుళ్ళబారుతుంది. మురుగు సౌకర్యం ఏర్పడుతుంది. అదేవిధంగా బరువయిన నేలల్లో గాలి వినిమయం, తేమ సమపాళ్ళలో ఉండటం వల్ల ఉష్ణోగ్రత కూడా తగు మోతాదులో ఉంటుంది. తద్వార పంట పెరుగుదల, అధిక దిగుబడులకు దోహదపడుతాయి.
అదేవిధంగా తేలిక నేలల్లో సేంద్రియ పదార్ధం వేయడం ద్వారా నీటి నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది.
సేంద్రియ పదార్ధం నేలలో నీటిని మరియు పోషకాలను పట్టి ఉంచి మొక్కలకు అధిక పాళ్ళలో అందిస్తాయి.
దీని ద్వారా ఉదజనిసూచి తటస్థస్థాయిలో ఉండడం వల్ల మొక్కలకు అన్నిపోషక పదార్ధాలు అందుబాటులోకి వస్తాయి.
నేల భూసారం, ఉత్పాదకత పెరుగుతుంది.
పంట నాణ్యత, ఉత్పత్తులు, నిల్వ గుణం పెరుగుతాయి.
సురక్షిత ఆహారం లబిస్తుంది. అలాగే ఆహారంలోకి విషపదార్ధాలు ప్రవేశించే అవకాశం ఉండదు.
పంట మార్పిడి, అంతర పంటల వల్ల చీడపీడల ఉధృతి తగ్గి రైతు ఆర్ధికంగా బలపడతాడు. 
పర్యావరణ సమతుల్యత క్రమేణా ఏర్పడి పంటలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది.
నేలలో సహజ సిద్ధంగా శిలీంధ్రాలు, నులిపురుగుల ఉధృతి తగ్గుతుంది.
కావున నేలలో సేంద్రియ పదార్ధం ఉంటే పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుచేత ప్రస్తుత కాలంలో సేంద్రియ వ్యవసాయాన్ని సర్వరోగ నివారణిగా పరిగణించవచ్చును.
భారతదేశంలో 65% భూమిలో మెట్టసేద్యం కాబట్టి సాధారణంగా రసాయనాల వాడుక చాలా తక్కువ కాబట్టి ఈప్రాంతాల్లో సేంద్రియ వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించే ఆస్కారం ఉంది.

రచయిత సమాచారం

జె.రవిందర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట భధ్రాద్రి కొత్తగూడెం, ఫోన్‌ : 7319129717, రాకేష్‌. యస్‌, రీసెర్చ్‌ అసోషియేట్‌, నార్మ్‌. జె. కమలాకర్‌, అసోషియేట్‌ ప్రొఫెసర్‌, వ్యవసాయ కళాశాల, వరంగర్‌. వి. వెంకన్న, అసోషియేట్‌ ప్రొఫెసర్‌, వ్యవసాయ కళాశాల, అశ్వారవుపేట.సి.నరేంద్రరెడ్డి - అసోయేట్‌ డీన్‌, వ్యవసాయ కళాశాల, అశ్వారవుపేట భద్రాద్రి కొత్తగూడెం. ఆర్‌. రమేష్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వ్యవసాయ కళాశాల అశ్వారావుపేట.