Print this page..

సేంద్రియ పద్ధతితో రబీలో దోస సాగు

దోస శాస్త్రీయ నామం కుకుమిన్ సటైవస్, ఇది క్యూకర్టిసేసి కుటుంబానికి చెందినది.
కూరదోస అనేది తటస్థ దిన మొక్క మిగిలిన తీగ కూరగాయలతో పోల్చితే దోస చాలా తక్కువ కాలంలోనే వచ్చే పంట. దీన్ని కూరగాయగా వాడటమే కాక పచ్చి ముక్కలు (సలాడ్) గా తీసుకుంటారు. కూరదోసకు వేసవిలో మంచి డిమాండ్ ఉంటుంది. 
వాతావరణం:
వేడి వాతావరణం అనుకూలం. ఉష్ణోగ్రతలోని తేడాల వల్ల ఆడ,మగ. పూల నిష్పత్తిలో చాలా తేడాలు వస్తాయి. ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఎక్కువ మగపూలు వస్తాయి.
నేలలు:
ఒండ్రు నేలల నుండి లోతైన గరప నేలల వరకు అనుకూలం.
రకాలు :
ఇందులో కీరదోస, పచ్చిదోస రెండు రకాలున్నాయి. 
కూరదోస (పప్పుదోస) :
ఆర్.ఎస్.ఎస్.ఎం-1బీ నీటి ఎద్దడిని తట్టుకొని అధిక దిగుబడినిచ్చే రకం. వేసవికి కూడా అనువైనది. 
పంట కాలం :
130-140 రోజులు
దిగుబడి:
60-72 క్వింటాళ్ళు / ఎకరానికి 
పచ్చిదోస రకాలు :  
జపనీస్ లాంగ్ గ్రీన్ :
కాయలు 30-40 సెం.మీ. పొడవు, ఆకుపచ్చగా ఉంటాయి. త్వరగా కోతకు వస్తుంది.
స్టెయిట్ వియిట్ :
కాయలు మధ్యస్థ పొడవుతో ఉండి గుండ్రటి చివరలు కలిగి, మధ్యస్థ ఆకుపచ్చ రంగులో ఉంటాయి. 
కో-2 :
ఆకులు లేత ఆకుపచ్చ రంగులో ఉండి, పూత పూసిన 7-8 రోజులకు కోసి 'సలాడ్' (పచ్చిదోస)గా అదే పూత పూసిన 16 రోజులకు (పసుపు పచ్చ రంగు కాయ ఆకుపచ్చలో కలసిన చారలు ఉంటాయి) కూరదోసగా వాడుకోవచ్చు. కాయలు 60-65 సెం.మా. పొడవుగా మలుపు తిరిగి ఉంటాయి. పంట కాలం 100 రోజులు. పచ్చిదోస దిగుబడి 56 క్వింటాళ్ళు / ఎకరానికి. 
పంట కాలం :
రబీలో అక్టోబరు నుండి నవంబరు చివరి వరకు విత్తుకోవచ్చు. వేసవి పంటగా డిసెంబరు రెండవ మాసం నుండి మార్చి చివరి వరకు కూడా వేసుకోవచ్చు. 
విత్తన మోతాదు :
1.0-1.4 కిలోలు / ఎకరానికి, హైబ్రీడ్ రకాల్లో ఎకరాకు 250 గ్రా. విత్తనం అవసరం. 
విత్తన శుద్ధి :
కిలో విత్తనానికి 5 గ్రా. ట్రైకోడెర్మా విరిడి కలిపి విత్తనశుద్ధి చేయాలి. 
పొలం తయారీ :
ఆధునిక పద్ధతిలో పొలాన్ని బాగా దుక్కి చేసి 3 అడుగుల వెడల్పుతో ఎత్తు బోదెలు చేయాలి. బోదె మధ్యలో గాడి చేసి, ఈ గాడిలో ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు వేయాలి. 
ప్లాస్టిక్ మల్చింగ్ :
బోదెల్లో ఎరువులు వేసి గాడిని మట్టితో నింపిన తరువాత ఇన్ లైన్ డ్రిప్ లేటరల్ పైపుల్ని బోదెల మధ్యలో ఉంచి ఆ తరువాత 30 మైక్రాన్ల మందం గల ప్లాస్టిక్ షీటును ఎత్తుబోదెలపై పరచాలి. ఈ ప్లాస్టిక్ షీట్లను జాగ్రత్తగా వాడుకుంటే రెండు తక్కువ కాలపు పంటలకు ఉపయోగపడుతుంది.
విత్తే విధానం :
రెండు వరుసల మధ్య 1.5-2.5 మీ. దూరం ఉండేటట్లు 80 సెం.మీ వెడల్పు గల కాలువలు తయారు చేయాలి. కాలువలో రెండు పాదుల మధ్య 0.5 (వేసవి), 0.75 (ఖరీఫ్) సెం.మీ. దూరంలో విత్తుకోవాలి.
ఎరువులు :
విత్తిన 25-30 రోజులకు ఆఖరి దుక్కిలో 8-10 టన్నుల పశువుల ఎరువు దఫాలుగా మరలా 45 రోజులకు వేసి నీరు ఇవ్వాలి. ఏ పంటకైనా దుక్కిలో 200-250 కిలోల ఘన జీవామృతం వేయాలి. పంట వేసిన నెల రోజులకు మరో 200-250 కిలోలు ఘనజీవామృతం వేయాలి. భూమిలో తేమ ఉన్నప్పుడు భూమిలో వేసి కలపాలి. 
అంతరకృషి :
కలుపు నివారణకు నెల రోజులకొకసారి మట్టిని గుల్ల చేయాలి. 
నీటి యాజమాన్యం :
గింజలు మొలకెత్తే వరకు నీరు పారించాలి. ఆ తరువాత నేల స్వభావాన్ని, కాలాన్ని బట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరు ఇవ్వాలి. 
కోత, దిగుబడి :
గింజలు విత్తిన 45 రోజులకే కోతకు వస్తుంది. దోసను లేత పసుపు రంగుకు మారినప్పుడు కోయాలి. సలాడ్ కోసం పూత పూసిన 7-8 రోజులకే కోయాలి. వారానికి రెండు సార్లు కోయవచ్చు. 
దిగుబడి :
కీర దోస 28-32 క్వింటాళ్ళు / ఎకరానికి (వేసవి పంట), కూరదోస 60-80 క్వింటాళ్ళు / ఎకరానికి 
సస్యరక్షణ :
పురుగులు నివారణకు చర్యలు
దోస పెంకు పురుగులు : -
5 శాతం వేప గింజల కషాయం లేదా నీమాస్త్రం రెండు సార్లు 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. 
దోసలో రసం పీల్చే పురుగులు :
5 శాతం కానుగ గింజల కషాయాన్ని పిచికారి చేయాలి. జిల్లేడు, వేప, వావిలాకులను 5 కిలోల చొప్పున దంచి 10 లీటర్ల ఆవు మూత్రంలో మరగపెట్టాలి. 100 లీ. నీటిలో కలిపి పిచికారి చేయాలి.
దోస పొట్ల ఆకు పురుగు/ పాము పొడ పురుగు :
పంట పెరుగుదల దశలో రెండు సార్లు 5 శాతం వేప గింజల ద్రావణం లేదా 2 శాతం వేపనూనెను పిచికారి చేయాలి.
దోస పేనుబంక:
దోస పంటపై బూడిదపొడి చల్లాలి. 
పండు ఈగ:
మొగ్గ దశలో రెండు సార్లు 5 శాతం వేప గింజల ద్రావణం లేదా నీమాస్త్రం 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. మొక్క మొదళ్ళలో వేపపిండి 5 కిలోల చొప్పున వేయాలి. . తల్లి ఈగలను ఆకర్షించడానికి మిథైల్ యూజినాల్ ఎరలను పొలంలో అమర్చాలి. 
తెగుళ్ళ నివారణ : 
దోస బూజు తెగులు :
పులిసిన మజ్జిగ + ఇంగువ ద్రావణాన్ని 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేయాలి. 
దోస బూడిద తెగులు :
పంట పెరుగుదల దశలో రెండు సార్లు 6 లీ. పుల్లటి మజ్జిగ 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. దోస పంటపై బూడిద చల్లాలి. 
దోస మొదలు కుళ్లు తెగులు :
ఇంగువ ద్రావణం పిచికారి చేయాలి. 
దోసలో సమగ్ర సస్యరక్షణ :

  • పంట మార్పిడి చేయాలి. (వరిలో)
  • కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
  • విత్తనాన్ని బీజామృతం / బీరక్ష/ పంచగవ్య/ ఎ.ఇ.యంతో శుద్ధి చేయాలి.
  • 100 గ్రా. విత్తనానికి ట్రైకోడెర్మా విరిడి 2 గ్రా. చొప్పున కలిపి విత్తన శుద్ధి చేయాలి. 
  • అల్లిక రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున విడుదల చేయాలి.
  • పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు 5 శాతం వేప గింజల ద్రావణం పిచికారి చేయాలి 

రచయిత సమాచారం

బానోతు రాంబాబు, శివరామకృష్ణా చారి, టీచింగ్ అసోసియేట్, ఏకలవ్య ఆర్గానిక్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్, జింగుర్తి, వికారాబాద్, ఫోన్ : 9701314790, 8008866517