Print this page..

గిరిజనుల కల్పవృక్షం: ఇప్ప పూలతో విలువ ఆదారిత ఆహార పదార్థాలు

జల్, జంగల్, జమీన్ నే నమ్ముకొని ప్రకృతితో మమేకమై అడవితల్లి ఒడిలో కొన్ని వందల సంవత్సరాల నుండి జీవనం సాగిస్తున్న ఆదివాసి గిరిజనుల పాలిట ఇప్ప చెట్టు వరంగా వారి  జీవన సంస్కృతిలో ఒక భాగమై ఉన్నది.  ఇప్ప చెట్టు (మధుక ఇండికా) సపోటేసి కుటుంబానికి చెందిన చెట్టు.  ఇప్పచెట్లు ముఖ్యంగా  మైదాన  ప్రాంతాలలో మరియు దక్కన్ పీఠభూమి కొండ ప్రాంతాల్లో విరివిగా పెరుగుతాయి. ఈ చెట్లు ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, చత్తీస్ ఘర్, ఒరిస్సా మరియు మధ్య ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి. కొన్ని వందల సంవత్సరాల నుండి ఇప్ప చెట్టు ఆదివాసీ గిరిజనుల జీవన సంస్కృతిలో ఒక భాగం. ఇప్ప చెట్టు మరియు దాని వివిధ భాగాలు  ఆదివాసీ గిరిజనుల జీవనశైలిలో పలు విధాలుగా విరివిగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ఆదివాసి తెగలయిన రాజ్ గోండ్,  కొలాం, ప్రధాన్,  చెంచు,  లంబాడా తెగలవారు పండుగ సమయాలలో ఇప్ప పువ్వు తో చేసిన పదార్థాలను దేవునికి నైవేద్యంగా వాడుతున్నారు. అంతేకాకుండా  ఆహార భద్రత మరియు  తీవ్రమైన ఎండాకాలంలో  ఇప్ప పూలను నమ్ముకొని  జీవనోపాధి సాగిస్తున్నారు.
ఇప్ప పూల ను ఆంగ్లంలో మహువ అంటారు. ఆకులు రాల్చే అడవి ప్రాంతాలలో  మరియు మైదాన ప్రాంతాలలో ఇప్ప చెట్లు విరివిగా పెరుగుతాయి. మార్చి మరియు ఏప్రిల్ మాసంలో  ఇప్ప చెట్లకు పూలు పూస్తాయి. ఒక చెట్టు నుండి సుమారు గా 80 నుండి 320 కిలోల ఇప్పపూలు 15-20  రోజుల వ్యవధిలో  చెట్టునుండి రాలుతాయి. పూలు రాలే కాలవ్యవధి  భౌగోళిక పరిస్థితులు  మరియు చెట్టు ను బట్టి ఉంటుంది. ఉదయిస్తున్న సూర్యకిరణాల వెలుగు నుంచి వచ్చే వెచ్చని వాతావరణ పరిస్థితులలో చెట్టునుండి ఇప్పపూలు రాలుతాయి. మిగతా ప్రాంతాలలో ఉన్న చెట్ల తో పోల్చి చూసినట్లయితే కొండ ప్రాంతాలు మరియు ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఇప్ప చెట్ల నుండి పూలు తొందరగా రాలుతాయి. గుహలు మరియు లోయ ప్రాంతాలలో ఇప్ప చెట్లకు పూలు ఆలస్యంగా రాలుతాయి.  
ఆదివాసీ గిరిజనులు ఇప్ప చెట్టును కల్పవృక్షంగా భావిస్తారు, ఎందుకనగా ఇప్ప చెట్టు లోని ఔషధ గుణాలు మరియు ఇతర లాభాలు ఉన్నాయి. ఇప్ప చెట్టు మరియు దాని భాగాలను గిరిజనులు పండుగ సమయాలలోనే కాకుండా ఇప్ప పూల ను రోజు వారి ఆహారంలో కూడా తీసుకుంటారు. ఆదివాసీ/గిరిజనులు తాము నివసించే ప్రదేశం మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో 4-6 ఇప్పచెట్లు ఉండేటట్టు చేసుకొని జీవనం సాగిస్తారు. కొన్ని లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల చెట్లు ఉన్నట్లు అంచనా. కలప తో పాటు ఇతర అటవీ ఉత్పత్తుల  అయినటువంటి  పూలు మరియు కాయలు (గింజలు) విభాగంలో ఇప్పపూలు మరియు కాయలు ప్రధానమైనవి.

ఎండిన ఇప్ప పూల నుండి సారా (ఆల్కహాల్) ను తయారు  చేసి పండుగ సమయంలో ఆదివాసీ గిరిజనులు పవిత్రమైన మరియు బలవర్ధకమైన పానీయంగా స్వీకరిస్తారు. ఇప్ప చెట్టు  పూలు, పండ్లు,  కాయలు  మరియు చెట్టు బెరడు మొదలైన వాటికి విశేషమైన ఔషధ గుణాలు ఉంటాయి అని ఆదివాసీ గిరిజనులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే ఇప్పచెట్టు ను కల్పవృక్షం అని  పిలుస్తారు. చెట్టు బెరడు నుండి తయారు చేసినటువంటి డికాషన్ ను పుండ్లకు మరియు దురదకు లేపనంగా వాడుతారు. పంటి చిగుళ్ల నుండి వచ్చే రక్తస్రావం సమస్యను అరికట్టడానికి కూడా బెరడు డికాక్షన్ ను వాడుతారు. బెరడు డికాషన్ కు చక్కెర వ్యాధిని నియంత్రించే గుణం ఉంది అని విశ్వసిస్తారు. ఇప్ప చెట్టు ఆకులు రుచికి వగరుగా ఉంటాయి. కాల్చిన ఇప్ప చెట్టు ఆకుల బూడిదకు  వెన్న లేదా నెయ్యి కలిపి ఆయింట్మెంట్ లాగా చేసి గాయాలకు మరియు పుండ్లకు మందుగా వాడుతారు. ఇప్ప పూలను దగ్గు  మరియు శ్వాసకోశ సమస్యల నివారణ కు మందులాగా వాడుతారు. 
ఇప్పపువ్వు ల ను బ్యాక్టీరియా నాశనం గా కూడా వాడుతారు. ఇప్ప కాయలను పొడిచేసి పాలల్లో కలుపుకొని  పాలిచ్చే తల్లులు తాగడం ద్వారా  పాల ఉత్పత్తి చేసే గ్రంధులు ఉత్ప్రేరకం చెంది  పాలు అధికంగా రావడానికి ఆస్కారం ఉంటుంది.  ఇప్ప కాయల నుండి తీసిన నూనెను వంట నూనెగా మరియు  చర్మ సంబంధ వ్యాధుల కు మందుగా వాడుతారు. నూనె తీసిన ఇప్ప కాయ చెక్కను  పశువుల దాణ లాగా, ఎరువుగా మరియు సబ్బు /డిటర్జెంట్ తయారీ లో వాడుతారు. నూనె తీసిన ఇప్ప కాయ చెక్కను టెన్నిస్ కోర్టు  అభివృద్ధి పరచడానికి  వాడుతారు. ఇప్పచెట్టు  కలపను వివిధ గృహ అవసరాలకు వాడతారు.

 తెలంగాణ గిరిజన కోపరేటివ్ కార్పొరేషన్ కొనుగోలు కేంద్రాల ద్వారా ఆదివాసీ గిరిజనుల నుండి ఎండబెట్టిన ఇప్ప పువ్వులను కిలోకు 10 నుండి 20 రూపాయలు చెల్లించి కొంటున్నారు. కొన్ని అంచనా లెక్కల ప్రకారం సుమారు 100 మెట్రిక్ టన్నుల  ఇప్ప పువ్వు ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి సేకరిస్తున్నట్లు సమాచారం. 
ఇప్ప కాయ నుండి తీసిన నూనె ను వివిధ పంటలలో వంట నూనెగా వాడుతారు. ఇప్ప చెట్టు  కాయలలో సుమారు 45 శాతం నూనె ఉంటుంది.  ఇప్పనూనె  రంగు పేలిపోయిన పసుపు రంగులో ఉంటుంది. ఇప్ప అరిసెలు, ఇప్ప వేపుడు, ఇప్ప గారెలు. పోషక విలువల పరంగా చూసినట్లయితే ఇప్ప పువ్వు యొక్క పోషక విలువలు బియ్యం, ఆపిల్, మామిడి, అరటి, ఎండు ద్రాక్ష వంటి పదార్థాల కన్నా ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. ఇప్ప పువ్వు లో చక్కెరలు మరియు మాంసకృత్తులు కూడా అధికంగా ఉంటాయి. మానవ శరీరానికి కావలసిన అతిముఖ్యమైన ఖనిజ లవణాలయిన క్యాల్షియం, పాస్ఫరస్, ఐరన్ మరియు పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, బీ కాంప్లెక్స్ మరియు విటమిన్ సి ఇప్పపువ్వు లలో అధికంగా ఉంటాయి. 

క్ర. సం.

పోషకాలు

ఇప్ప పూలు

ఎండబెట్టిన ఇప్ప పూలు

1

తేమశాతం

73.6 -79.82 (%, d.b)

19.1-20.0 (%, w.b)

2

మాంసకృత్తులు

1.4

6.67

3

పిండి పదార్థం

22.7

68

4

చక్కెరలు

54.06

--

5

సక్లోజ్

3.43

--

6

కొవ్వు పదార్థం

1.6

0.09

7

ఖనిజలవణాలు

0.7

1.4 -4.36

8

పీచు పదార్థం

--

1.9

9

క్యాల్షియం

45

139

10

పొటాషియం

120

--

11

పాస్పరస్

22

137

12

కెరోటిన్

307

--

13

విటమిన్ సి

40

--

సేకరణ: జాతీయ పొషకాహార సమస్త

ఉమ్మడి  ఆదిలాబాద్  జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు  వివిధ పోషక విలువలతో కూడిన ఆహార పదార్థాలను ఇప్ప పూల తో తయారుచేసుకుని సంవత్సరమంతా తింటున్నారు. సంప్రదాయ వంటకాలు అయినటువంటి  ఇప్ప కుడుములు ( స్టీమ్ బాయిల్డ్ ఇడ్లీ లాంటివి), జొన్న ఇప్ప రొట్టె,  పెనం పైన  వేయించినటువంటి మసాలా ఇప్పపూలు, గోంగూర ఇప్ప పూల తో చేసిన కూర, జొన్నలతో కలిపి చేసిన ఇప్ప సత్తుపిండి, ఇప్ప లడ్డూలు, ఇప్ప జంతికలు, ఇప్ప మురుకులు  మరియు పండుగ సమయాల్లో దేవునికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రేష్టంగా తయారుచేసిన ఇప్ప సారా పవిత్రమైన పానీయంగా సమర్పిస్తారు.
 

ఇప్ప సారా తయారు చేసే విధానం:

తరతరాలుగా ఆదివాసీలు ఇప్పపువ్వు నుండి ఇప్ప సారా ను తయారు చేస్తూ దేవునికి పవిత్ర నైవేద్యంగా సమర్పిస్తున్నారు. కాలక్రమంలో ఇప్ప సారా తయారు చేయడంలో కల్తీ  చేసి గూడెం లలో గుడాంబ గా అమ్మడం  మూలాన ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ ఇప్ప సారా ను తయారు చేసి అమ్మడం నిషేధించినది కావున ఇప్ప సారా ఎవరు తయారు చేయడం లేదు.
ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనుల వర్షాకాలం ప్రారంభంలో చెంచు బీమా దేవుని పెళ్లి ఇప్ప చెట్టు కింద చేసి విత్తనాలు విత్తు తారు. అంతేకాకుండా గ్రామ శివారులోని ఇప్ప చెట్టు కింద శివబోడి పూజ  చేసి గ్రామాన్ని వివిధ దుష్ట శక్తుల నుండి కాపాడి అందరినీ ఆరోగ్యంగా ఉంచాలని ఆ భగవంతుడిని పూజిస్తారు.
ఇప్ప పువ్వు యొక్క పోషక విలువలు, ఆహార భద్రత, గిరిజనుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం  ఇప్ప పువ్వు కు విలువ జోడించి  ఆదివాసి ఆహారాలను ప్రజలందరికీ అందుబాటులో తేవాలనే ముఖ్య ఉద్దేశం తో ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్  శ్రీమతి దివ్య,  ఐ టి డి ఎ. ఉట్నూర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ ఆదిత్య  కృష్ణ  మరియు ప్రజామిత్ర రైతు సహకార సంఘం, ఉట్నూర్, వారు కలిసి కొద్ది మంది గిరిజన మహిళా రైతులను ఆదివాసి భీంబాయి మహిళా సహకార సంఘముగా ఏర్పాటు చేసి, తగిన ఆర్థిక సహాయాన్ని అందించి వారితో “ఆదివాసి ఆహారం” అనే బ్రాండ్  పేరుతో ఇప్ప పువ్వుల కు విలువ జోడించిన వివిధ ఆహార పదార్థాలను తయారు చేసి అమ్ముతున్నారు. కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్ శాస్త్రవేత్తలు కూడా ఆదివాసి మహిళా రైతులకు ట్రైబల్ సబ్ ప్లాన్ (TSP) బహుళార్థక ప్రయోజనాలున్న మిల్లును ఇవ్వడం తో పాటు నాణ్యమైన ఫుడ్ ప్రాసెసింగ్ మెలుకువలు, ఇప్ప పూల పోషక విలువలు మరియు లేబల్లింగ్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం అయినది. ఐటిడిఎ ఉట్నూర్, మరియు  తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ప్రతి సంవత్సరం ఐటిడిఎ  పరిధిలో ఇప్పపువ్వు ఆహార మహోత్సవాన్ని పెద్ద సంఖ్యలో గిరిజనులతో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పపువ్వు ఫుడ్ ఫెస్టివల్ లో  గిరిజన మహిళలు  ఇప్ప పూలతో తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను  ప్రదర్శిస్తున్నారు. సందర్శనకు వచ్చిన ప్రజలు, అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు గిరిజన జీవితంలో ఇప్ప చెట్టు యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటున్నారు. ఇప్ప పప్పు యొక్క పోషక విలువలను గుర్తించిన జిల్లా కలెక్టర్ గారు జిల్లా లో పొషకాహార లోపాలను అధిగమించటానికి మరింతగా ప్రోత్సహిస్తున్నారు.

భీంబాయి ఆదివాసి మహిళా సహకార సంఘము, ఉట్నూర్:

స్థాపించిన సంవత్సరం

2019

సభ్యుల సంఖ్య

35

క్రియాశీల సభ్యుల సంఖ్య

21

ప్రాసెస్ చేయబడిన పరిమాణం

600 Kg

ముడి పదార్థాల ఖర్చు (ప్యాకేజింగ్ ఖర్చుతో సహా):

48000/-

కార్మిక ఛార్జీలు: రూ

18000/-

SKU పరిమాణం

500 g to 1 kg

మొత్తం ఖర్చు:

66000

ఎస్‌కెయుకు ఎంఆర్‌పి: రూ.

400/kg

మొత్తం రాబడి: రూ.

240000

నికర లాభం: రూ.

174000

బి: సి నిష్పత్తి:

3.63:1

రోజుకు సభ్యుల ఆదాయాలు: 

500/-

లాభాల్లో భాగం: 25% భీంబాయి ఆదివాసి మహిళా సహకార సంఘము పేరిట జమ చేస్తున్నారు.
క్రియాశీల సభ్యులందరికీ 15% బోనస్ మరియు మిగిలిన మొత్తం కార్యాచరణ ఖర్చు కోసం ఉపయోగించబడుతుంది

భవిష్యత్తులో భీంబాయి ఆదివాసి సహకార సంఘం నుండి  ఇప్పపూలతో తయారు చేసిన నాన్ ఆల్కహాలిక్  బేవరేజెస్, మిక్సిడ్ ఫ్రూట్ జామ్, జెల్లీ వంటి ప్రాచుర్యం ఉన్న ఆహార పదార్థాలను తయారు చేయడానికి  కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త  పోషాద్రి తగిన సాంకేతిక సహకారాన్ని ఎప్పటికప్పుడు అందిస్తున్నారు.
 

 

రచయిత సమాచారం

ఎ. పోశాద్రి, జి. శివచరణ్, యం. రఘువీర్, యం. సునీల్ కుమార్, వై. ప్రవీణ్ కుమార్ మరియు డా. ఆర్. ఉమారెడ్డి కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్-504002