Print this page..

ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణకై కేంద్రం శ్రద్ద , కేంద్ర పరిశీలన బృందంతో వ్యవసాయ శాఖా మంత్రి-నిరంజన్‌ రెడ్డి ,రాష్ట్రంలో సాగుపై సమాలోచనలు

తెలంగాణలో ఆయిల్‌ పామ్‌ సాగు ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలు మాత్రమే కొనసాగుతుంది. నేడు ఆయిల్‌ ప్రాముఖ్యత పెరగడంతో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణ పెంచుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. భారత పంట నూనెల పరిశ్రమ అమెరికా, చైనా, బ్రెజిల్‌ నాలుగు అతిపెద్ద పరిశ్రమల్లో ఆయిల్‌ పామ్‌ పరిశ్రమ ఒకటిగా నిలిచింది. వంట నూనెల విభాగంలో అత్యంత తక్కువ ధరకు లభించడం వల్ల భారతదేశంలో ఆయిల్‌ పామ్‌ వాడకం ఎక్కువవుతుంది. తద్వారా సాగు విస్తరణను పెంచుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. నేడు రైతాంగం ఈ సాగుపై అంతగా దృష్టి సారించకపోవడంతో మనరాష్ట్రంలో సాగు అంతపెద్దగా చేపట్టలేకపోతున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అశ్వరావుపేట ప్రాంతంలో ఈ సాగు ఎక్కువగా ఉంది. ఆయిల్‌ పామ్‌ మార్కెట్‌ కూడా ఈ ప్రాంతంలోనే ఉండడంతో రైతులు ఎక్కువగా దృష్టిసారించడం జరిగిందని చెప్పవచ్చు. 

ప్రభుత్వం ఈ సాగుపై సబ్సిడీ ఇస్తూ రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నప్పటికీ అంతపెద్దగా లాభాలు రాకపోవడంతో రైతులు ఈ సాగుపై దృష్టి సారించడంలేదు. సన్న చిన్నకారు రైతాంగం ఈ పంట సాగుపై ఆసక్తే చూపడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తే రైతులు ఈ సాగుపై ఆసక్తి కనబరచనున్నారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరమైన నీటితో 3 ఎకరాల ఆయిల్‌ పామ్‌ పంటను సాగుచేయవచ్చు. ఇతర పంటలకంటే ఆయిల్‌ పామ్‌ సాగు చాలా తేలికైన సాగు. అంతర పంటల సాగుతో కంచె పంటగా వెదురు, శ్రీగంధం మొక్కలు పెంచడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ పంటకు చీడ, పీడలు, కోతులు, రాళ్ళవాన, దొంగల బెడద తక్కువగా ఉండడం మరియు రైతులు పండించిన పంటకు ఆయిల్‌ పామ్‌ కంపెనీల ద్వారా కొనుగోలు జరుపబడుతూ ప్రతినెలా లాభదాయకమైన ఆదాయం పొందే విధానం ఈ సాగు ఉంటుంది. 30 సం|| వరకు నిరంతర ఆదాయాన్ని రైతులకు అందిస్తుంది. మరియు పర్యావరణానికి మేలు కలుగచేస్తుంది. భారతదేశ జనాభాకు 21 మిలియన్‌ టన్నుల వంటనూనెల అవసరం కాగా కేవలం 7 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి అవుతుంది. మిగిలిన 15 మిలియన్ల నూనెను రూ. 75 వేల కోట్లు వెచ్చించి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. మొత్తం  దిగుమతుల్లో ఆయిల్‌ పామ్‌ 60 శాతంగా ఉంటుంది. 

నేడు అత్యధిక డిమాండ్‌ కలిగిన ఈ పంట రైతులకు మంచి ఆదాయాన్ని సమకూర్చనుంది. బహుళవార్షిక పంటల్లో కెల్లా ఆయిల్‌ పామ్‌ ఒకటి. ఒక్కసారి ఈ పంటను నాటితే సుమారు 30 సం|| వరకు నిరంతరం ఆదాయాన్ని పొందవచ్చు. ఎకరాకు 18-20 టన్నుల దిగుబడి పొందవచ్చు. నీటివసతి తక్కువ గల ప్రాంతాల్లో ఈ పంట అనుకూలం. రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడిని ఆశించేందుకు అనువైన పంట. దీనిపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ ఉద్యానశాఖ రైతులకు ప్రోత్సాహాన్ని అందిస్తుంది. మార్కెట్‌ ధరలను సైతం రైతులకు అందుబాటులోకి తీసుకొస్తూ రైతులకు పెట్టుబడి సహాయాన్ని అందచేస్తుంది. ఇప్పటి వరకు కొంత మంది రైతులు మాత్రమే ఈ సాగును చేపట్టడం జరుగుతుందని రానున్న రోజుల్లో అన్ని రంగాల రైతాంగానికి ఈ సాగు విధానంపై అవగాహన కల్పించి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే విధంగా ప్రభుత్వం దృష్టి సారించింది. 

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల సమాలోచనలు : 

తెలంగాణ రాష్ట్రం ఆయిల్‌ పామ్‌ సాగుకు అనువైనదని గుర్తించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా విరివిగా ఆయిల్‌ పామ్‌ సాగు చేపట్టేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వ ప్రతినిధుల కమిటీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో సమాలోచన చేపట్టారు. రానున్న రోజుల్లో ఆయిల్‌ పామ్‌ వినియోగం పెరుగుతుందని దేశ, రాష్ట్రాల ప్రజలకు సరిపడా వినియోగ వస్తువులను అందిచాల్సిన బాధ్యత ఇరు ప్రభుత్వాలపై ఉందని భవిష్యత్‌ తరాలకు సరిపడా ఉత్పత్తులు అందించాలంటే సరైన నిర్ణయాలే తీసుకోవలసిన ఆవస్యకత ఉందని దీనికి తెలంగాణ రాష్ట్రం నుండే అడుగులు పడాలని భావించారు. ఉద్యానవన శాఖ ద్వారా విరివిగా ఆయిల్‌ పామ్‌ సాగు చేసేందుకు పూర్తిస్థాయిలో బాధ్యతలను ఇవ్వనుంది. ఇప్పటికే ఆయిల్‌ పామ్‌ దిగుమతిలో అత్యధికంగా ఖర్చుచేస్తున్నామని దీన్ని క్రమంగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆయిల్‌ పామ్‌ సాగుపై ప్రత్యేక దృష్టి సారించిందని రైతులకు పంటసాగుపై అవగాహనతో పాటు ప్రభుత్వ సహకారం అందిస్తుందని దీనికి రాష్ట్రాలు సహకరించాలని తద్వారా ప్రజలకు నిత్యవసరాలను అందించినవాళ్ళం అవుతామని రానున్న రోజల్లో భవి'్యత్‌ తరాలకు సులభతరం అయ్యే విధంగా ఈ సాగు విధానానికి రూపకల్పన చేపట్టాలని ఈ సమావేశం అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశీలన కమిటీ చైర్మన్‌ డా|| బి.యంసి రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సి. పార్దసారధి, ఉద్యానవన శాఖ సంచాలకులు ఎల్‌. వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

రచయిత సమాచారం

అగ్రిక్లినిక్‌ డెస్క్