Print this page..

మొక్కల పోషకాలే.... మన పోషకాలు

ఆహారపు చక్రంలో మానవుడు మొక్కలపై తన ఆహారం కోసం ఆధారపడవలసి ఉంటుంది. మానవుడి శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు, జీవరసాయన చర్యలకు ఏవిధంగా పోషకాలు అవసరమో అలాగే మొక్క ఎదుగుదలకు, రసాయన చర్యలకు మరియు ఉత్పాదకతకు కూడా పోషకాల అత్యావశ్యకమైనవి.
ఆవర్తన పట్టిక యందు 118 మూలకాలు గుర్తించబడి ఉన్నప్పటికీ మొక్కలకు 17 మూలకాలు అని నిర్వర్తించే విలక్షణమైన విధుల ఆధారంగా అత్యావశ్యకమైన మూలకాలుగా చెప్పుకోవడం జరిగింది. ఈ 17 మూలకాలు మాత్రమే ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పుకోవడానికి ఒక ప్రాతిపదిక ఉన్నది. దాన్నే మూలకాల ఆవశ్యక సూత్రాలుగా చెప్పుకుంటారు. దీని ఆధారంగా మూలకాలు అని నిర్వర్తించే చర్యలు మరియు వాటి మోతాదు అవసరాన్ని ఆధారంగా చేసుకొని తద్వారా ప్రాధమిక, ద్వితీయ మరియు సూక్ష్మపోషకాలుగా కూడా విభజించడం జరిగింది. 
మూలకాల ఆవశ్యక నియమాలు : 
1.    ఏదైనా మూలకం లోపించినట్లయితే మొక్క యొక్క జీవితచక్రం అసంపూర్తిగా ఉంటుంది. 
2.    ప్రతి యొక్క మూలకం విధి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. 
3.    ఏ ఒక్క మూలకం నిర్వర్తించే విధి మరొక మూలకంతో భర్తీ చేయలేము. 
4.    ఈ మూలకం యొక్క చర్య మొక్క జీవక్రియల్లో ప్రత్యక్షంగా ఉంటడం.
పోషకాల ఆవశ్యక సూత్రాలను అర్థం చేసుకున్నట్లయితే ప్రతి పోషకం ఎంత తక్కువ పరిమాణంగా మొక్కకు అది ఎంత అబసరమో అర్థమవుతుంది. ఆవశ్యక సూత్రాల ఆధారంగా మూలకాలు విభజించబడినతీరు. 
నిర్మాణాత్మక మూలకాలు : కార్భన్‌, హైడ్రోజన్‌, ఆక్సిజన్‌
ఉప నిర్మాణాత్మక మూలకాలు : నైట్రోజన్‌, ఫాస్పరస్‌, సల్ఫర్‌
ఆహార మూలకాలను అదుపుచేసేవి : కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం
సూక్ష్మ పోషకాలు /  ఉత్ప్రేరకాలు : ఇనుము, మాంగనీస్‌, కాపర్‌, జింకు, మాలిబ్డినం, బోరాన్‌, క్లోరిన్‌, నికేన్‌
ప్రయోజనకరమైన మూలకాలు : సోడియం, సిలికాన్‌, అల్యూమినియం
మొక్క ఎదుగుదల మరియు ఉత్పాదకతతో పోషకాల ఆవశ్యకత జీవరసాయనక్రియ
నత్రజని : 

పత్రహరితం, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాలలో ఇది ఒక ఆవశ్వకమైన అంతరంగిక భాగం. ఇది హరిత వర్ణాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఇది భాస్వరం, పొటాషియం మరియు ఇతర పోషకాలను మొక్క సమర్థవంతంగా వినియోగించు కొనుటను దోహదపడుతుంది. కావున ఈ మూలకం లోపించినట్లయితే పైన పేర్కొనబడిన చర్యలన్ని మందగిస్తాయి. 
భా స్వరం
ఇది మాంసకత్తులు, కేంద్రకామ్లాలు, పాస్పోలిపిడ్లు మరియు ఎంజైముల్లో ఒక అంతరంగిక భాగం. అదేవిధంగా భాస్వరం క్రోమోజోముల్లో ఒక భాగం కావున కణవిభజన మరియు మొక్క ఎదుగుదలకు అదేవిధంగా బలమైన వేరువ్యవస్థ ఏర్పడడానికి అవసరం. అంతేకాకుండా అధిక నత్రజని వేయడం వల్ల కలిగే అనర్థాలను అదుపు చేస్తుంది. మొక్కకి కీటకాలు, తెగుళ్ళను తట్టుకునే శక్తిని ఇస్తుంది. 
ముఖ్యంగా పప్పుజాతి పంటల్లో రైజోబియం బాక్టీరియా క్రియాశీలతను పెంచి వేళ్ళలో బుడిపెలు అధికంగా ఏర్పడి తద్వార అధిక నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. 
పొటా షియం
ఇవి మొక్క యొక్క అంగిక భాగం కాకపోయినప్పటికీ ఇది కణద్రవ్యంలో ఉండటం చేత మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని చేకూర్చుతుంది. అదే విధంగా మొక్కలలో జరిగే అనేక చర్యలకు ఉపయోగపడేటటువంటి 60 రకాల ఎంజైములు పనిచేయుటకు దోహదపడుతుంది. 
పొటాషియం పత్ర రంద్రాలు తెరుచుకోవడం మరియు మూసుకోవడంలోనూ, నీటి సంబంధములను సర్దుబాటు చేయడంలోనూ, కాండానికి బాలాన్ని చేకూర్చి పైరువాలి పోకుండా ఉంచడంలోనూ, మొక్క చీడపీడలను తట్టుకొనుటకు కావాల్సిన నిరోధక శక్తిని కల్పించడంలోనూ మరియు ఆకుల్లో తయారైన పిండి పదార్థాలను ఇతరప్రాంతాలకు రవాణా చేయడంలో ప్రధానపాత్ర పోషిస్తుంది.
ద్వితీయ పో షకాలు : 
కాల్షి యం

కణకవచం తయారీకి, కణాల ఉత్పత్తికి మరియు సాగుదల కాల్షియం అవసరం. అంతేకాకుండా విత్తన అభివృద్ధికి, కణాల మధ్య కణకవచాల ద్వారా సాగే ప్రక్రియల్లో కీటక పాత్ర పోషిస్తుంది. కాల్షియం క్రోమోప్రోముల్లో పత్రహరితంలో ఒక ముఖ్యభాగం. ఇది కూడా ఆకుల వర్ణాన్ని ఇవ్వడంలో తోడ్పడుతుంది. 
మెగ్నీ షియం
ఇది మొక్క వివిధ పోషకాలను వినియోగించుకునే ప్రక్రియను నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా నూనె ఏర్పడుటకు మరియు ప్రొటీన్‌ తయారీకి ఇది అత్యంత ఆవశ్యకము.
గంధ కం
దీని ఆవశ్యకత మరియు నిర్వహించు పాత్రలు కొన్ని నత్రజనిని పోలి ఉంటాయి. ఇది అనేక ఎంజైముల తయారీకి కిరణజన్య సంయోగ క్రియ సక్రమంగా జరుపడానికి నత్రజని స్థిరీకరణ జరుగడానికి అలాగే నూనెగింజల పైర్లలో మాంసకృత్తులు, నూనెలు తయారవడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఉల్లి, వెల్లుల్లి ఘాటు రావడానికి మరియు విత్తన తయారీకి ఇది ప్రాధాన్యం.
సూక్ష్మపోష కాలు : 
ఇను ము

ఎంజైముల తయారీకి మొక్కల్లో జరిగే శ్వాసక్రియకు, పత్రహరితం తయారీకి ఉపయోగపడుతుంది. అలాగే మొక్కల్లో జరిగే అన్ని జీవ ప్రక్రియల్లో ఇనుము ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పాత్ర పోషిస్తుంది. 
మాంగ నీసు
ఇది మొక్కల్లో ఇనుము పోషకానికి చేదోడు వాదోడుగా ఉంటూ వివిధ జీవక్రియల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది కిరణజన్య సంయోగక్రియలో నత్రజని జీవక్రియకు అవసరమైన ఎంజైములను ఉత్తేజపరచడంలో ఆస్కార్బిక్‌ ఆమ్లం తయారీలో దోహదపడుతుంది. అంతేకాకుండా మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే ఆక్సిన్‌ మోతాదును నియంత్రించుటలో మాంగనీసు ప్రధాన పాత్ర పోషిస్తుంది.
రా గి 
ఇది విటమిన్ల తయారీలోనూ, ఎంజైముల వ్యవస్థలోనూ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. 
జిం కు : 
పెరుగుదలకు అవసరమయ్యే ఆక్సిన్‌ తయారు కావడానికి నత్రజని, భాస్వరం, మరియు ఇతర పోషకాల సమర్థ వినియోగానికి ఉపయోగపడుతుంది. అలాగే మాంసకృత్తులు మరియు అమైనో ఆమ్లాల తయారీలోనూ జింకు ఉపయోగపడుతుంది. 
బోరా న్‌ : 
ఇది మొక్క కాల్షియం గ్రహించడానికి, గ్రహించడాన్ని దాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి అవసరం. అదేవిధంగా మొక్కల్లో తయారయ్యే ఆహారపదార్థాలు మొక్కలోని అన్ని భాగాలకు చేరవేయడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే మొక్కల్లో కాల్షియం, పొటాషియం నిష్పత్తిని క్రమబద్దీకరిస్తుంది మరియు సంపర్కం, సందీకరణలో అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. 
క్లోరి న్‌ : 
ఇది కణజాలంలో నీటిని పట్టి ఉంచుకోవడానికి మరియు కొన్ని ఎంజైముల చర్య చురుకుగా జరిగేటట్లు చేయడమే కాకుండా పిండిపదార్ధం తయారీ, జీవప్రక్రియలు సక్రమంగా జరిగేటట్లుగా చేస్తుంది.
మా లిబ్డినం : 
మొక్కలు ఇనుమును గ్రహించడానికి మరియు వినియోగించుకోవడానికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఇది నైట్రోజనేజ్‌ అనే ఎంజైములో అంగిక భాగమై ఉండడం వల్ల నత్రజని స్థిరీకరణలో కూడా తోడ్పడుతుంది. 
నికెల్‌ 
ఇది యేరిమేడ్‌ ఎంజైమ్‌ని సక్రియం చేస్తుంది. అదేవిధంగా ఐసోఫామ్‌ గ్లై ఆక్సలేజ్‌ 1ని కూడా ????? చేస్తుంది. ఈ గ్లై ఆక్సలేజ్‌ -1 మిథైల్‌ గ్లై ఆక్సార్‌ని నిర్వీర్యం చేయడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ నికెల్‌ లోపించినట్లయితే మిథైల్‌ గ్లైఆక్సార్‌ వల్ల కలిగే అనర్థాలైనటువంటి కణం విషపూరితం. కణాలు చనిపోవడంలాంటివి జరుగుతాయి. అంతేకాకుండా ఈ నికెల్‌ ఒత్తిడి పరిస్థితుల్లో యాంటిఆక్సిడెంట్‌ చర్యల్లో కూడా పాలు పంచుకుంటుంది. 
పైన పేర్కొన్న విధంగా అన్ని ఆవశ్యకమూలకాలు కూడా తమ తమ ప్రత్యేకమైన విధులను నిర్వర్తిస్తున్నాయి. అదేవిధంగా ఒక మూలకం యొక్క గాఢతతో కూడా ముడిపడి ఉన్నటువంటి పరిస్ధితులను కూడా వివరించడం జరిగింది. కావున అన్ని ఆవశ్యక మూలకాల యొక్క సమతుల్యత కూడా ప్రధానమైన అంశంగా చెప్పుకోవచ్చు.
కావున ఈ విధమైన అన్ని పరిస్థితులు అనుకూలించినప్పుడు మొక్క తన యొక్క జీవరసాయన చర్యలను తగు రీతిలో నిర్వర్తించడం చేత ఉత్పాదకత మరియు ఆవిధంగా ఉత్పత్తి చేయబడిన పదార్థాలు మనకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. కావున సరైన పోషక విలువలు కలిగి ఉన్నటువంటి ఆహారం మనం పొందాలంటే ముందుగా మొక్కకు సరైన మోతాదులో అన్ని పోషకాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

రచయిత సమాచారం

జె. రవీందర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, యస్‌. రాకేష్‌, రీసెర్చ్‌ అసోసియేట్‌, జె. కమలాకర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, వి. వెంకన్న, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, సి. నరేంద్ర రెడ్డి, అసోసియేట్‌ డీన్‌, వ్యవసాయ కళాశాల, అశ్వారావుపేట, ఫోన్‌ : 7319129717