Print this page..

టమాట సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు

ఆంధ్రప్రదేశ్‌లో టమాట సుమారుగా 55,632 హెక్టార్లలో సాగుచేయబడుతూ 46,43,665 దిగుబడినిస్తుంది. కాని  సగటు ఉత్పాదకత ఎకరానికి 11 టన్నులు దిగుబడిని మాత్రమే సాధిస్తున్నారు. దీనికి గల కారణాలు సరైన సమయంలో నాటుకోకపోవడం, మేలైన వంగడాలను లేదా సంకర జాతి రకాలను ఎంపిక చేసుకోలేకపోవడం మరియు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించకపోవడం. ఈ టమాటా పంటను మూడు కాలాల్లో అంటే వర్షాకాలం, శీతాకాలం మరియు వేసవికాలాల్లో కూడా ఈ పంటను పండించుకోవచ్చు. కాబట్టి అధిక దిగుబడులు సాధించాలంటే ఈ కింది సూచించిన మెళకువులను పాటించాలి. 

వాతావరణం : 

టమాట పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లోనూ సాగుచేయవచ్చు. అది శీతాకాలం అనుకూలం. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతానికి తట్టుకోలేదు. 

నేలలు :

బాగా నీరు ఇంకే బరువైన గరపనేలలు ఈ పంటకు అనుకూలం. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లోనూ పంటగా కూడా సాగు చేయవచ్చు. శీతాకాలంలో దీన్ని ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేల లాంటి వివిధ రకాల నేలల్లో సాగుచేయవచ్చు. మురుగు నీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంటకు అనుకూలం కాదు. 

నాటే సమయం : 

వర్షాకాలంలో జూన్‌-జూలైలో, శీతాకాలంలో అక్టోబరు-నవంబరులో, వేసవిలో జనవరి-ఫిబ్రవరిలో నాటుకోవచ్చు. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాలు ఖరీఫ్‌ మరియు వేసవి సాగుకు అనుకూలం కాదు. 

రకాలు-అనుకూలత : 

వర్షాధార పంటకు: ఖరీఫ్‌లో ముందుగా వేసుకోడానికి అర్కమేఘాలి, పూసా ఎర్లీడ్వార్ఫ్‌, అలాగే ఖరీలో ఆలస్యంగా వేసుకోడానికి పూసారూబీ, అర్కవికాస్‌ రకాలు అనుకూలం. 

శీతాకాలానికి : పూసారూబీ, పూసాఎర్లీడ్వార్ఫ్‌, అర్క వికాస్‌, అర్క సౌరబ్‌. 

వేసవి పంటకు : మారుతమ్‌, పికెయమ్‌-1, అర్క వికాస్‌, అర్క సౌరభ్‌ మరియు అర్క అభీద్‌ రకాలు అనుకూలం .

సంకరజాతి రకాలు : అర్క రక్షక్‌, అర్క సామ్రాట్‌, అర్కా వర్ధస్‌, అర్కా విశాల్‌, రూపాలి, రష్మి, నవీన్‌, మీనాక్షి, అన్నపూర్ణ, యుఎస్‌-618, సిరి, లక్ష్మి, యు.ఎస్‌. -440, అభిలాప్‌, శుభం. 

నేల తయారీ: 3-4 సార్లు దున్ని చదును చేయాలి. వర్షాకాలం పంటకు 60 సెం.మీ. దూరంలో బోదెలు చేసుకోవాలి.

విత్తన మోతాదు : 

ఎకరాకు సూటి రకాలకు 200 గ్రా. సంకరజాతి రకాలకు 60-80 గ్రా. విత్తనం కావాలి. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్‌తో లేదా 3 గ్రా. మెటలాక్సిల్‌తో, 2 గంటల తర్వాత 4 గ్రా. ట్రైకోడెర్మా కల్చర్‌తోను విత్తనశుద్ధి చేయాలి. వేసవిలో రసంపీల్చు పురుగుల బెడద తట్టుకునే విధంగా ఇమిడాక్లోప్రిడ్‌ 5 గ్రా., కిలో విత్తనానికి పట్టించి ఆ తరువాత శిలీంధ్ర నాశనులతో విత్తనశుద్ధి చేయాలి. 

నారుపోయటం : 

ఎకరం పొలంలో నాటడానికి 4I1 చ.మీ. విస్తీర్ణం గల, ''6'' ఎత్తైన 8 నుండి 10 నారుమళ్ళు తోటను తయారు చేయాలి. నారుకుళ్ళు తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా లీటరు నీటికి 3 గ్రా. కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ లేదా 0.5 శాతం బోర్డోమిశ్రమంతో నారుమళ్ళను శుద్ధి చేయాలి (100 లీ. మందు ద్రావణం 40 చ.మీ. నారుమడికి) విత్తే ముందు విత్తనాలను 600 సెల్సియస్‌ వేడి నీటిలో 5-10 నిమిషాల సేపు ఉంచి తీయాలి. నారుమడిలో 10 సెం.మీ. ఎడంతో వరుసల్లో 1-1.5 సెం.మీ. లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే రోజ్‌ క్యాన్‌తో నీటిని చల్లి వరిగడ్డితో నారుమళ్ళను కప్పాలి. విత్తనాలు మొలకెత్తిన వెంటనే (7-10 రోజులకు మల్చింగ్‌గా వేసిన వరిగడ్డి లేదా పాలిథీన్‌ షీట్‌ తీసివేయాలి. 2-3 వారాల వయసులో నారుకుళ్ళు తెగులు రాకుండా కాపర ఆక్సీక్లోరైడ్‌ (2.5 గ్రా./లీ) పిచికారీ చేయాలి. 3 వారాల వయసుగల నారుమడికి రసంపీల్చే పురుగుల నుండి రక్షణకు కార్బోప్యూరాన్‌ 3 జి. గుళికలు 40 చ.మీ. నారుమడికి 100 గ్రా. చొప్పున వేసి నీటి తడి ఇవ్వాలి. నారుమడిని పీకడానికి 2-3 రోజులకు ముందుగా లీటరు నీటికి 2 మి.లీ. డైమిథోయేట్‌ + 1 గ్రా. కార్బండిజమ్‌ను కలిపి నారుమడిపై పిచికారీ చేయాలి. నారుమడిలో మొక్కలు ధ ఢపడటానికి గింజ విత్తిన 21-25 రోజుల మధ్య రోజు విడిచి రోజు నీరు కట్టాలి. 21-25 రోజుల వయసు ఉండి 3-4 ఆకులు గల మొక్కల్ని నాటుకోవాలి. సాధ్యమైనంత వరకు 30 రోజులు మించిన ముదురు నారును నాటరాదు.

ఆధునిక పద్ధతుల్లో నారు పెంచే విధానం : 

ప్రోట్రేలలో టమాట నారు పెంపకం : 

ప్రస్తుతం హైబ్రిడ్‌ విత్తనం రేటు ఎక్కువ మరియు నారుమడిలో పెంచడం ద్వారా నారుకుళ్ళు తెగులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి రైతు సోదరలు ఆధునిక పద్ధతిలో ట్రేలలో నారు పెంచడం ద్వారా ఆరోగ్యవంతమైన నారును పెంచుకోవచ్చును. దీనికి వానపాముల ఎరువు 2 భాగాలు మరియు కొబ్బరి పొట్టు ఒక భాగాన్ని వేసి ట్రేలలో నింపిన తరువాత అందులో విత్తనాన్ని నాటుకోవాలి.

నాటటం,

వర్షాకాలంలో 60I45 సెం.మీ. శీతాకాలంలో 60I60 సెం.మీ. వేసవిలో 45I30 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. 

ఎరువులు : 

చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. నాటేటప్పుడు ఎకరాకు 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్‌ఫాస్ఫేట్‌) మరియు 24 కిలోల పొటాష్‌ నిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ వేయాలి. 48-60 కిలోల నత్రజనిని 3 సమ పాళ్ళుగా చేసి, నాటిన 30, 45 మరియు 60 వ రోజున పైపాటుగా వేసి బోదెలు ఎగదోయాలి. పూత దశలో లీటరు నీటకి 20 గ్రా. యూరియాను కలిపి పిచికారీ చేస్తే 15-20 శాతం దిగుబడి పెరుగుతుంది. నాటే ముందు ఎకరాకు 8-12 కిలోల చొప్పున బోరాక్స్‌ వేసినట్లయితే పండ్లు పగలకుండా ఉంటాయి. ఎకరానికి 10 కిలోల చొప్పున జింకు సల్ఫేట్‌ వేసినట్లయితే జింకు లోపం రాకుండా ఉంటుంది.నాటిన తర్వాత 30, 45 రోజులకు లీటరు నీటకి 5 గ్రా. జింకు సల్ఫేట్‌ను కలిపి పిచికారీ చేసినట్లయితే 2004 దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ఎకరాకు 400 మి.గ్రా. 2,4-డి మందును 200 లీటర్ల నీటికి కలిగి మి.లీ. ప్లానోఫిక్స్‌ 4.0 లీ. నీటిలో కలిపి పిచికారీ చేస్తే పూత, పిందె నిలిచి ఎండాకాలంలో మంచి దిగుబడి వస్తుంది. 

కలుపు నివారణ, అంతరకృషి : 

కలుపు నివారణకు ఎకరాకు పెండిమిథాలిస్‌ 1.0 లీ. (తేలిక నేలలు) 190 (బరువు నేలలు) 200 లీటర్ల నీటిలో కలిపి నాటిన 48 గంటలలోపు తడినేలపై పిచికారీ చేయాలి. మెట్రిబుజింక మందును 300 గ్రా. మోతాదులో నాటిన 15 రోజులకు 200 లీటర్ల నీటిలో కలిపి వరుసల మద్య పిచాకిరి చేయాలి. నాటిన 30, 35 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకషి చేయాలి. పొలంలో కలుపు లేకుండా మొదటి నాలుగు వారాల్లో అంతర కృషి చేయాలి. మొక్కలు ఎదిగిన తరువాత వాటిని కదిలించకూడదు. 

పొడవుగా పెరిగే హైబ్రిడ్‌ మొక్కలకు మరియు మామూలు రకాలకు కూడా కర్రలను పాతి ఊతం ఊతమివ్వడం వల్ల మంచి పరిమాణం గల కాయలు ఏర్పడతాయి. అంతేకాక కాయలు నేలకు తగిలి చెడిపోకుండా కాపాడవచ్చు. వేసవి టమాట పంటకు ఎండ తీవ్రత తగ్గించుటకు ప్రతి 2-3 వరుసల టమాటాకు రెండు వరుసలు మొక్కజొన్న పంటను ఉత్తర దక్షిణ దిశలో విత్తుకోవాలి. 

నీటి యాజమాన్యం : 

భూమిలో తేమనుబట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరుకట్టాలి. వేసవిలో ప్రతి 5-6 రోజులకు ఒకసారి తడి అవసరం ఉంటుంది. డ్రిప్‌ పద్ధతిలో నీటిని అందించినట్లయితే మంచి దిగుబడులు పొందవచ్చు. 

ఊతం ఇవ్వడం : 

టమాట మొక్కలను వెదురు బొంగులు, జిఐ వైర్ల సాయంతో ఏర్పరచిన ట్రెల్లీస్‌ పైకి పురికొస సాయంతో పాకించడం వల్ల బాగా గాలి, వెలుతురు తగిలి తెగుళ్ళ బెడద తగ్గించవచ్చు. అంతే కాకుండా కాయలు నేలకు తగలవు కాబట్టి కాయకుళ్ళు తగ్గి మంచి నాణ్యమైన అధిక దిగుబడి పొందవచ్చు. 

సస్యరక్షణ : 

పురుగులు : 

కాయతొలుచు పురుగు : 

లేత ఆకులను, కొమ్మలను తినివేస్తుంది. కోత దశలో కాయలను తొలిచి నాశనం చేస్తుంది. దీని నివారణకు ఎరపంటగా బంతిని వేసుకోవాలి. (ఒక వరుస బంతి మొక్కలు ప్రతి 16 వరుసలకు) టమాటా కంటే బంతి నారును 20 రోజుల ముందుగా నాటుకోవాలి. ట్రైకోగ్రామా బదనికలను ఎకరాకు 20,000 చొప్పున విడుదల చేయాలి. ఎకరాకు 4 చొప్పున లింగాకర్షణ బుట్టలను పెట్టాలి. నాటిన 28, 35 రోజులకు ప్లూబెండమైడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. యన్‌.పి.వి. వైరస్‌ ఎకరానికి 250 లార్వాలకు సమానమైన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలను ఉంచాలి. ఆశించిన పురుగుకు సంబంధించిన బాగా ఎదిగిన క్రిములను ఏరి నాశనం చేయాలి. క్రిమి సంహారక మందులను పిచికారీ చేయుటకు ముందు కాయలను కోయాలి. 

పచ్చదోమ : 

ఆకుల అడుగుభాగం నుండి రసాన్ని పీల్చటం వల్ల, ఆకుల చివర్లు పసుపుపచ్చగా మారి క్రమేపి ఆకు అంతా ఎర్రబడి చివరగా ఆకులు ముడుచుకొని దోనెలలాగా కనిపిస్తాయి. దీని నివారణకు డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమటాన్‌ 2 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. రబ్బరు పురుగు : 

కాయతొలుచు పురుగువలెనే పంటను నాశనం చేస్తుంది. పురుగుల చివరి దశలో నివారణకు విషపు ఎరలను పెట్టాలి. (10 కి. తవుడు + 1 లీ. క్లోరిపైరిఫాస్‌ + 1 కిలో బెల్లం తగినంత నీటికి కలిపి పొకం చేసి పులియ పెట్టినది). ఈ పురుగు నివారణకు కాయతొలుచు పురుగుకు చెప్పబడిన సమగ్ర సస్యరక్షణ చర్యలను పాటించాలి. 

తెగుళ్ళు :

నారుకుళ్ళు తెగులు : 

ఈ తెగులు ఆశించడం వల్ల, నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి నారు గుంపులు, గుంపులుగా చనిపోతుంది. విత్తటానికి ముందు తప్పనిసరిగా 3 గ్రా. ధైరం లేదా మాంకోజెబ్‌ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి లేదా ట్రైకోడెర్మా విరిడి అనే జీవ శిలీంద్రనాశినిని 4 గ్రా. 1 కిలో విత్తనానికి కలిపి నారు పోయాలి. నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు తడపాలి.) 

ఆకుమాడు తెగులు (ఎర్లీ బ్లెట్‌) : 

ఆకుల మీద, కాండం మీద మరియు కాయల మీద గోధుమ రంగుతో కూడిన ముచ్చలు ఏర్పడి, క్రమేణా ఆకులు మాడి, ఎండిపోతాయి. మొక్క దశలో ఎప్పుడైనా ఆశించవచ్చు. తేమ ఉన్న చల్లని వాతావరణంలో మరియు ఖరీఫ్‌ సీజనులో ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు 3 గ్రా. కాప్టాన్‌ లేదా 

మాంకోజెబ్‌ లేదా క్లోరోథలోనిల్‌ 2 గ్రా. లేదా ప్రొఫికొనజోల్‌ 1 మి.లీ. మందును లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధితో 3 లేక 4 సార్లు పిచికారీ చేయాలి.

వడలు తెగులు (బాక్టీరియల్‌ విల్ట్‌) : 

మొక్క అడుగు భాగంలోని ఆకులు పసుపు రంగుకు మారి, తొడిమతోసహా రాలి, తరువాత మొక్క వడలిపోయి, చనిపోతుంది. దీని నివారణకు బలమైన మొక్కల నుండి విత్తనాలను ఎన్నుకోవాలి. తెగులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తెగులును తట్టుకునే బిటి-1 వంటి రకాలను ఎన్నుకోవాలి. నేల ఉదజని 3.6 నుండి 5 వరకు ఉన్న ఆమ్ల భూముల్లో ఈ తెగులు ఎక్కువగా ఉంటుంది. పంట మార్పిడి పద్ధతిని అవలంభించాలి.

ఆకుముడత వైరస్‌ : 

ఆకులు చిన్నగా మారి ముడుచుకుపోతాయి. మొక్క ఎదుగుదల తగ్గి పూత, కాత బాగా తగ్గుతుంది. ఇది తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెల్లదోమను అరికట్టడం ద్వారా తెగులు వ్యాప్తిని నివారించవచ్చు. అంతర్వాహిక కీటక నాశనులు ఆయిన ఇమిడాక్లోప్రిడ్‌ 0.3 మి.లీ. లేదా ఫిప్రోనిల్‌ 2 మి.లీ. లేదా థయోమిథాక్సామ్‌ 0.2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. 

వైరస్‌ తెగులు (టోబాకో మొజాయిక్‌) : 

తెగులు సోకిన మొక్కల ఆకుల మీద, అక్కడక్కడ పసుపు పచ్చ మచ్చలు ఏర్పడి, ఆకులు ముడుచుకొని, మొక్క గిడసబారి ఎండిపోతుంది. ఆకులు పెళుసుగా తయారవుతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చేసే రసం పీల్చే పురుగుల (పేనుబంక) నివారణకు అంతర్వాహిక కీటక నాశనులను పిచికారీ చేయాలి. 

టమాటా స్పాటెడ్‌ విల్ట్‌ వైరస్‌ : 

టమాట చిగురాకుల పైభాగంలో ఈనెలు గోధుమ వర్ణంకు మారి, ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడి, మాడిపోతాయి. మొక్కలు గిడసబారి, పూత పిందె పట్టక ఎండిపోతాయి. దీని నివారణకు తెగులు ఆశించిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెగులును వ్యాప్తి చెందించే తొమర పురుగుల నివారణకు డైమిథోయేట్‌ లేదా మిథైల్‌ డెమటాన్‌ 2 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నారుమడిలో మడికి 250 గ్రా. మరియు నాటిన 10వ రోజున ఎకరాకు 10 కిలోల కార్బోఫ్యూరాన్‌ 3 గుళికలు వాడి పంటను ఈ వైరస్‌ తెగులు నుండి కాపాడుకోవచ్చు. 

టమాటాలో సమగ్ర సస్యరక్షణ : 

ఫ్రెంచి చిక్కుడు (బిన్నీస్‌) పంటతో పంటమార్పిడి చేస్తే బాక్టీరియా ఎండు తెగులు కొంత వరకు తగ్గుతుంది.

ఆవాలు, బంతి మరియు ధాన్యపు పంటలతో పంటమార్పిడి చేయడం వల్ల నులి పురుగుల ఉధతి తగ్గుతుంది. కిలో విత్తనానికి ముందుగా 3 గ్రా. ధైరాం ఆ తర్వాత 8 గ్రా.ల ట్రైకోడెర్మాకల్చలో విత్తనశుద్ధి చేయాలి. వేసవిలో దుక్కులు లోతుగా దున్నడం వల్ల నేలలో ఉన్న నిద్రావస్థ దశలోని పురుగులు నివారించబడతాయి. 

ట్రైకోడెర్మా కల్చరు (ఒక కిలో కల్చరు 10 కిలోల వేపపిండి I 90 కిలోల పశువుల ఎరువుతో కలపి) దుక్కిలో వేసుకోవాలి. 

పొలం చుట్టూ జొన్న లేదా సజ్జ పంటను అడ్డుపంటగా వేయడం వల్ల రసం పీల్చు పురుగుల ఉదుతి టమాటాలో ఆకు ఎండుతెగులు / వైరస్‌ తెగులు కొంత వరకు తగ్గుతుంది. 

పొలంలో అక్కడక్కడ వేసిన ఆముదం మొక్కలపై ఉన్న గ్రుడ్ల సముదాయాలను, అప్పుడే పొదగబడిన పిల్లపురుగులను ఏరినాశనం చేయాలి. . పొలంలో అక్కడక్కడ ఎకరాకు 4 చొప్పున పసుపు రంగు పూసిన రేకులకు ఆముదం/ గ్రీజ్‌ పూసి పెట్టాలి. 

తెల్లదోమలు వీటికి ఆకర్షింపబడి అతుక్కుంటాయి. 

ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలు పెట్టి శనగపచ్చపురుగు మరియు రబ్బరు పురుగుల యొక్క ఉనికిని గమనించాలి. ఎరపంటగా బంతి మొక్కలను 1:16 నిష్పత్తిలో (ఒక బంతి వరుసకు 16 టమాట వరుసలు చొప్పున) వేసుకోవాలి 

 45 రోజుల బంతి నారును 25 రోజుల టమాట నారును దీనికోసం నాటుకోవాలి. 

పూత దశకు ముందుగా ఎకరాకు 20,000 చొప్పున ట్రైకోగ్రామా బదనికలను వారానికి ఒకసారి చొప్పున 6 వారాలు విడుదల చేయాలి. 

250 లార్వాలకు సమానమైన వైరస్‌ ద్రావణాన్ని (పొగాకు లద్దె పురుగుకు యస్‌.ఎన్‌.పి.వి., శనగ పచ్చ పురుగుకు హెచ్‌.ఎన్‌.పి.వి.) రెండ్లు సార్లు 10 రోజుల వ్యవధితో సాయంత్రం వేళల్లో పిచికారీ చేయాలి. 

ఆశించిన పురుగును నిర్ణయించి తగిన వైరస్‌ను ఎంపిక చేసుకోవాలి. 

పొలంలో ఎకరానికి 20 చొప్పున పక్షిస్థావరాలను ఏర్పాటు చేయాలి. 

మొక్క పెరుగుదల దశలో నాటిన 30 రోజుల నుండి పూత వరకు 5 శాతం వేప గింజల కషాయాన్ని (5 కిలోల వేపగింజలపప్పు 100 లీటర్ల నీటిలో) 15 రోజుల తేడాతో పిచికారీ చేయాలి. 

బాక్టీరియా ఎండు తెగులు ఉన్న చోట్ల ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్‌ పొడిని నాటడానికి ముందు భూమిలో కలిసేలా వేయాలి. బాక్టీరియా తెగులు నివారణకు నాటే ముందు నారును 100 పి.పి.యమ్‌. (100 మి.గ్రా. లీటరు నీటికి) స్ట్రెప్టోసైక్లిన్‌ ద్రావణంలో ముంచి నాటాలి. రసం పీల్చే పురుగుల నివారణకు డైమిథోయేట్‌ లీటరు నీటికి 2 మి.లీ. చొప్పున పూత సమయం నుండి పిచికారీ చేయాలి.

రచయిత సమాచారం

డా|| ఎన్‌.సత్తిబాబు (ఉద్యాన విభాగము), డా|| ఈ.చంద్రాయుడు (సమన్వయకర్త), డా|| ఎన్‌.రాజ్‌ కుమార్‌, డా|| డి.ఉమామహేశ్వర రావు ,డా|| పి.బి.ప్రదీప్‌ కుమార్‌ మరియు డా|| జి.మానస కృషీ విజ్ఞాన కేంద్రం, కొండెంపూడి, ఫోన్‌ : 9010619130