Print this page..

వ్యవసాయంలో శ్రమను మరియు ఖర్చును తగ్గించే చక్రాల దంతులు

వ్యవసాయాభివృద్ధి కొరకు సాంకేతిక పరిజ్ఞానం యొక్క తోడ్పాటు రోజు రోజుకూ పెరుగుతోంది. అయితే ఒకప్పుడు సాంకేతిక పనిముట్లు వినియోగించటానికి వెచ్చించే ఖర్చు అధికంగా ఉండేది. అందువల్ల శారీరక సామర్థ్యంతోనే ప్రధానంగా పనులను నిర్వహించడంలో మార్పులు పెద్దగా రాలేదు. రానురాను వ్యవసాయ పనుల్లో సహకరించే యంత్రాలు తక్కువ ఖర్చుతో తయారు చేయడంతో రైతులకు కొంత సౌలభ్యత ఏర్పడింది. ముఖ్యంగా మనదేశంలో స్త్రీలు వ్యవసాయ పనుల్లో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. వీటిలో భూమి సిద్ధం చేయడం, విత్తనాలు చల్లటం, కలుపు తీయటం, కోత కోయటం, పంటను మోపుగ కట్టటం, మోపులు మోయడం, నుర్చడం, ఒలవడం, తూర్పూర పట్టడం, రుబ్బడం, విసరడం మొదలగు పనులు చేస్తారు.

ఈ పనులన్నీ ఎక్కువ సేపు నడుమును సుమారు 600 వరకు వంచి పని చేయవలసి వస్తుంది. దీని వల్ల గుండె ఒత్తిడికి గురై నిమిషానికి సుమారు 148 సార్లు వేగంగా కొట్టుకోవడం జరుగుతుంది. అదే విశ్రాంతిగా ఉన్నట్లయితే నిమిషానికి 78 సార్లు మాత్రమే కొట్టుకుంటుంది. ముఖ్యంగా కలుపుతీసేటప్పుడు అయితే మోకాలు మడిచికూర్చుని, పాదాల పై బరువు ఆన్చి రోజంతా పని చేయవలసి వస్తుంది. ఈ పని వల్ల గుండె నిమిషానికి 113 సార్లు కొట్టుకుంటుంది. కండరాలపై అధిక బరువు వేయడం వల్ల, కండరాల పై అధిక ఒత్తిడి కలుగుతుంది. కండరాలు నొప్పికి గురి అవుతాయి, కండరాలు దెబ్బతినడమే కాక పని చేయడం కష్టతరమౌతుంది. పనుల్లో సాంకేతిక పరికరాలు విని యోగిస్తే యాంత్రిక సామర్ద్యం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. శరీరాన్ని సమర్దవంతంగా వాడట మంటే తక్కువ శారీరక శక్తి వినియోగంతో ఎక్కువ పనిని ఎక్కువ సేపు చేయగలగడం. అందులో భాగంగా కలుపు తీసే పరికరాలలో చక్రాల దంతులు వాడటం వల్ల కలిగే ఉపయోగాలను తెలుసుకుందాం.

చక్రాల దంతులు : 

కలుపు తీయుటకు చక్రాల దంతులు వాడటం వల్ల మహిళల యొక్క శ్రమను మరియు కండరాలపై పడే ఒత్తిడిని తగ్గించవచ్చును. ఈ పరికరం 2-2.5 సెం.మీ లోతు వరకు నేలలో చొచ్చుకొనిపోతుంది. ఇది ఒక రోజులో 2 నుండి 2.5 ఎకరాల కలుపు తీయడానికి ఉపయోగపడుతుంది  మరియు ఒకే వ్యక్తి చేత నిర్వహిచబడుతుంది. ప్రధానగా పొలంలో పంటలు వేసిన తరువాత చిన్న మొలక వచ్చినప్పటినుంచి సుమారు నెల రోజుల వరకు ఈ పరికరాన్ని ఉపయోగించవచ్చు. అంతేకాక, చిన్న మరియు సన్నకారు రైతులు కలుపు తీయుటకు కూలీలకు వెచ్చించే ఖర్చును కూడా మనం ఆదా చేయవచ్చు. మామూలుగా శనగ, వేరుశనగ, కూరగాయల పంటల్లో 4 నుంచి 5 సార్లు కూలీల ద్వారా ఎకరాకు 10 మంది చొప్పున ప్రతిసారి కలుపు తీయటం జరుగుతుంది. ఒక కూలీకి రూ. 150/- చొప్పున 10 మంది 4 సార్లు కలుపు తీయటం ద్వారా రూ. 6,000/- దాకా ఖర్చు పెట్టడం జరుగుతోంది. అదే చక్రాల దంతులు, ఇద్దరు మనుషులు రూ.150/- చొప్పున 4 సార్లు వాడటం వలన రూ.1,200/- మాత్రమే ఖర్చు అవుతుంది. ఈ పరికరం యొక్క ధర రూ. 1,800/-. ఈ పరికరం కషి విజ్ఞాన కేంద్రం, యాగంటిపల్లె  ఆధ్వర్యాన కర్నూలు జిల్లా, బనగానపల్లి మండలంలోని పండ్లాపురం, నందవరం, పసుపల, యర్రగుడి గ్రామాల్లో మరియు బేతంచెర్ల మండలంలోని హెచ్‌. కొట్టాల, ఆర్‌.ఎస్‌ రంగాపురం, గూటుపల్లి, రెహమానపురం, ఎంబాయ్‌, అంబాపురం గ్రామాల్లోని రైతులు మరియు  రైతు మహిళలు వాడటం జరుగుతోంది. హెచ్‌. కొట్టాల గ్రామంలో ఈ చక్రాల దంతులను పంచాయితీ కార్యాలయంనందు రిజిస్టర్‌ ఉంచి ఒక పంట కాలానికి సుమారు 45-50 ఎకరాల వరకు చక్రాల దంతులతో కలుపును తీసుకోవటం ద్వారా ఎకరాకు రూ. 2,800/- అంటే 50 ఎకరాలకు గాను రూ.1,40,000/- ఆదా చేయటం జరుగుతోంది. ఈ పరికరం అన్ని కూరగాయల పంటల్లోనూ మరియు వరుసకు వరుసకు మధ్య తక్కువ దూరం ఉండే పంటలకు అదునుగా ఉంటుంది.

రచయిత సమాచారం

పి. నాగార్జున రెడ్డి, సైంటిస్ట్‌ (అగ్రికల్చర్‌ ఎక్సెటెన్షన్‌), కె.వి.కె యాగంటిపల్లి, ఫోన్‌ : 9494625339 కె. లక్ష్మి ప్రియ, పోగ్రాం అసిస్టెంట్‌ (గృహ విజ్ఞానం), కె.వి.కె యాగంటిపల్లి, ఫోన్‌ :9441192765 జి. ధనలక్ష్మి, సీనియర్‌ సైంటిస్ట్‌ & హెడ్‌, కె.వి.కె యాగంటిపల్లి, ఫోన్‌ :9440607424