Print this page..

ఆహారంలో పాలపదార్థాల విశిష్టత

సమతుల్య ఆహారం అనగానే అందులో సమపాళ్ళలో గింజధాన్యాలు, పప్పుధాన్యాలు, పండ్లు & కూరగాయలు, పాలపదార్థాలు, మాంసం మరియు నూనె, చక్కెర పదార్థాలు ఉండడం. బిడ్డ పుట్టినప్పటి నుండి మనం అందించే ఆహారం తల్లి పాలు, పాలు, పాల పదార్థాలు ఆరోగ్యాన్ని క్రమబద్ధీకరించడంలో  రోగ నిరోధక శక్తి పెంచడంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. 

పాలు : 

అందరూ పుట్టీ పుట్టగానే తమ ఆకలిని అమ్మపాలతోనే తీర్చుకుంటారు. అలాంటి పాలలో పోషకాలు అన్నీ ఇన్నీ కావు. అలాగే ఆవుపాలు, గేదెపాలు మనిషి ఆరోగ్యానికి ఎంత అవసరమో కూడా మనకు తెలుసు. ప్రస్తుతం డాక్టర్లు కూడా ప్రతి ఒక్కరు రోజూ పాలు తాగాలని సూచిస్తున్నారు. 

పోషకాలు : 

పాలలో కార్బోహైడ్రేట్లు, విటమిన్‌ ఎ, బి2, బి12, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. 

ఆరోగ్య లాభాలు : 

పాలలో ఉండే కాల్షియం, ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కండరాలకు బలం కలుగుతుంది. రోజూ కనీసం గ్లాసు పాలు తాగడం వల్ల తక్షణ శక్తి లభించడమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. 

జున్ను : 

ఆవు లేదా గేదె దూడను ప్రసవించాక, మొదటి కొన్ని రోజులు ఇచ్చే పాలను జున్ను పాలు అంటారు. జున్ను పాలను మరిగిస్తున్నప్పుడు చక్కెర లేదా బెల్లం వేసి తయారు చేసే జున్నును పిల్లలు, పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు. 

పోషకాలు : 

జున్నులో ప్రోటీన్లు, విటమిన్‌-ఎ, విటమిన్‌-డి, విటమిన్‌-ఇ వంటి విటమిన్లు, కాల్షియం వంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. 

ఆరోగ్య లాభాలు : 

మామూలు పాలలో కంటే జున్ను పాలలో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. జున్ను రోగనిరోధకశక్తిని, జీర్ణశక్తిని పెంచుతుంది. కండరాల పెరుగుదలకు, ఎముకల ధారుడ్యానికి జున్ను చాలా మంచిది. 

పన్నీర్‌ : 

పన్నీర్‌ను ఎక్కువగా దక్షిణ ఆసియా దేశాల్లోనే ఉపయోగిస్తారు. దీన్ని ఎక్కువగా కూరల్లో, చిరుతిళ్ళు, మిఠాయిల తయారీలో వాడతారు. ముఖ్యంగా ఇండియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లో బాగా వాడతారు. పెరుగు అలవాటులేని వారు పన్నీర్‌ను తమ ఆహారంలో తీసుకోవడం మంచిది. 

పోషకాలు : 

పన్నీర్‌లో ప్రొటీన్లు, స్వల్పంగా కొవ్వులు, విటమిన్‌-ఎ, విటమిన్‌-డి, విటమిన్‌-ఇ, కాల్షియం, సోడియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు : 

పన్నీర్‌ ఎముకలను, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కండరాలకు, ఎముకలకు బలం ఇస్తుంది. ఉదర క్యాన్సర్‌, రొమ్ము క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.

పెరుగు : 

పాలతో తయారయ్యే ఈ పెరుగును అన్ని దేశాల్లోనూ ఉపయోగిస్తారు. తెలుగు వారికి ఈ పెరుగు మరీ ముఖ్యం. ఎన్ని రకాల కూరలతో తిన్నా చివరికి పెరుగు లేకపోతే పెద్ద వెలితేనని చెప్పాలి. అలాంటి పెరుగుతో ఎన్నో లాభాలున్నాయి. కూరల్లో వేయడానికి టమాటాలు లేనప్పుడు పుల్లటి పెరుగును వేసుకుంటే వంట రుచిగా ఉంటుంది. 

పోషకాలు : 

పెరుగులో కూడా పాలలో ఉండే ప్రొటీన్లు, విటమిన్లు ఖనిజ లవణాలతో పాటు జీర్ణకోశానికి మేలు చేసే బ్యాక్టీరియా ఉంటుంది. 

ఆరోగ్య లాభాలు : 

పెరుగు తినడం వల్ల ఉదర సంబంధ సమస్యలు తగ్గుతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. కండరాలకు, ఎముకలకు దారుఢ్యం పెరుగుతుంది. అలసట, నిద్రలేమి వంటి సమస్యలు తొలగుతాయి. 

మజ్జిగ : 

పెరుగును చిలికి బాగా నీళ్ళు చేర్చి తయారు చేసే మజ్జిగ వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించే సాంప్రదాయ పానీయం. చాలా సమస్యలకు విరుగుడుగా మజ్జిగ తీసుకోవాలని సాంప్రదాయ ఆయుర్వేద వైద్యులు సూచిస్తుంటారు. 

పోషకాలు : 

పాలు, పెరుగుల్లో ఉండే పోషకాలన్నీ మజ్జిగలోనూ ఉంటాయి. 

ఆరోగ్య లాభాలు : 

కడుపు ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలతో బాధపడే వారికి మజ్జిక చాలా మేలు చేస్తుంది. మజ్జిగ వల్ల అలసట తొలుగుతుంది. తక్షణ శక్తి కలుగుతుంది. డీహైడ్రేషన్‌ నుండి ఉపశమనం కలుగుతుంది. 

వెన్న : 

ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చాక పాల నుండి నేరుగా యంత్రాల ద్వారా వెన్నతీస్తున్నారు. ఇది వరకటి కాలంలో మజ్జిక చిలికి వెన్న తీసేవారు. వెన్నను చిన్న పిల్లలు ఇష్టంగా తింటారు.వెన్నను మిఠాయిలు, చిరుతిళ్ళ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. 

పోషకాలు : 

కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్‌-ఎ, విటమిన్‌-డి, విటమిన్‌-ఇ వంటి విటమిన్లు, కాల్షియం వంటి ఖనిజలవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు : 

వెన్నలోని కొవ్వు, విటమిన్లు చిన్నారుల మెదడు పనితీరును, జీర్ణశక్తిని పెంచుతాయి. కంటి చూపును మెరుగుపరుస్తాయి. కండరాలు, ఎముకల ఎదుగుదలకు దోహదపడతాయి. శారీరక శ్రమకు కావలసిన శక్తినిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. 

నెయ్యి : 

వెన్నను మరిగిస్తే నెయ్యి తయారవుతుంది. నెయ్యి శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది. అలాగే దీన్ని వివిధ రకాల వంటకాల్లో లేదా నేరుగానూ వాడతారు. దాదాపు అన్ని రకాల స్వీట్స్‌లో నెయ్యిని ఉపయోగిస్తారు.

పోషకాలు : 

నెయ్యిలో కూడా కొవ్వులు, ప్రోటీన్లు, విటమిన్లు-ఎ, విటమిన్‌-ఇ వంటి విటమిన్లు, కాల్షియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు : 

నెయ్యి తక్షణ శక్తినిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. అకాల వార్థక్యాన్ని నివారిస్తుంది. నెయ్యిలోని ఒమేగా-3 ఫ్యాటీయాసిడ్స్‌ చెడు కొలస్ట్రాల్‌ను తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. 
 

రచయిత సమాచారం

డా|| యం. భవ్యమంజరి, డా|| ఆర్‌విటి. బాలాజీపాయక్‌, శ్రీ మాలోత్‌ మోహన్‌, డా|| బి.వి. రాజ్‌కుమార్‌, డా|| యం. శ్వేత, పి. విజయ్‌ కుమార్‌, డా|| డి. విజయలక్ష్మి. కృషీ విజ్ఞాన కేంద్రం, రుద్రూరు, నిజామాబాద్‌.