Print this page..

వరి మాగాణుల్లో జొన్న సాగు

భారత దేశంలో ముఖ్యమైన ఆహార ధాన్యా పంటలలో జొన్న ఒకటి. జొన్నపంటను ఆహార దాన్యముగా, పశుగ్రాస పంటగా మరియు జీవ ఇంధన పంటగా సాగు చేసుకోవచ్చును. జొన్నసాగు విస్తీర్ణత గత సంవత్సారలతో పోల్చిచూసినట్లైయితే గణనీయంగా తగ్గింది. 1970 లో భారత దేశంలో జొన్న సాగు విస్తీర్ణత 18.6 మిలియన్ హెక్టార్లు ఉండగా ప్రస్తుతం 2016-17 గాను కేవలం 6.07 మిలియన్ హెక్టార్లుగా నమోదు అయినది. జొన్న ఉత్పత్తి 4.67 మిలియన్ టన్నులు మరియు ఉత్పాదకత 697 కిలో/హె గా ఉన్నది. తద్వారా క్షీణించిన విస్తీర్ణత జొన్న సాగుకై కొత్త సాంకేతిక కొరకు ఆన్వేషణను తప్పనిసరి చేసింది.

వివిధ రకాల పంటల వ్యవస్థలకు దారితీసే మట్టి మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా ఆంధ్రప్రదేశ్ లో వైవిధ్య పంట సరళిని అనుసరిస్తున్నారు. అందులో ముఖ్యమైనవి వరి తర్వాత అపరాల సాగు, వరి తర్వాత మొక్కజొన్న సాగు, నీటి వసతి మెండుగా ఉన్న ప్రాంతాలలో వరి తర్వాత వరి అని చెప్పవచ్చును.

అత్యల్ప వర్షపాత ప్రాంతాలైన కర్నూలు జిల్లాలోని నల్లరేగడి నేలకు జొన్న ఎంతో బాగా అనువైనపంట. ఇక్కడ ముఖ్యంగా రైతులు మాఘీ జొన్నగా సెప్టెంబర్ రెండో పక్షము నుండి అక్టోబర్ రెండో పక్షము వరకు జొన్న ను విత్తుకుంటారు. మాఘీ జొన్న ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు (53,300 హె), గుంటూరు (34,400 హె), అనంతపురం (22,900 హె)మరియు కడప (12,200 హె) జిల్లాల్లో విస్తారంగా సాగు చేస్తున్నారు.

ఖరీఫ్ ఆగస్టు మాసంలో నారు నాటిన వరి పంట డిసెంబర్ మాసంలో కోతకు వస్తుంది. వరి కోత కోసిన తర్వాత అపరాల సాగు లేదా మొక్కజొన్న సాగు (నీటి వసతి వున్న రైతులు) చేస్తారు, అదే విధంగా జొన్నను కూడా వరి మాగాణుల్లో నేలను దున్నకుండా నేరుగా సాగు చేయవచ్చును (జీరో టిల్లేజి పద్దతిలో). వరి మాగాణుల్లో నేలను దున్నకుండా (జీరో టిల్లేజి) పద్ధతిలో జొన్నను సాగు చేసుకోవచ్చును. మొక్కజొన్న పంటతో పోల్చితే జొన్నపంటకు నీటి అవసరం తక్కువ.

జొన్నపంటకు ఆయ్యే ఎరువుల మోతాదు మరియు వాటి ఖర్చు మొక్కజొన్నతో పోల్చితే తక్కువ. అందువలన రైతులు జొన్నపంటను వరి మాగాణుల్లో సాగు చేయడానికి ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. రానున్న కాలంలో వరి మాగాణుల్లో జొన్న విస్తిర్ణత పెరిగే అవకాశం మెరుగ్గా ఉందని చెప్పవచ్చును.
గత 5 నుండి 8 సంవత్సరాలుగా రైతులు వరి మాగాణి జొన్నను నేలను దున్నకుండా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా సి.ఎస్.హెచ్ 16, కావేరి రకము, మహాలక్ష్మి 296, యం 35-1 వంటి అధిక దిగుబడిని ఇచ్చే సంకర రకాలను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే పొట్టి తెల్ల జొన్న రకం ఎపిజె - 5 కూడా వరి మాగాణి కి అనువైనదిగా గుర్తించడం జరిగింది.

సి.ఎస్.హెచ్ 16: పంట కాలం 110 రోజులు, పొడవు మధస్థంగా ఉండటం వలన పడిపోకుండా ఉంటుంది. బూజూ మరియు ఆకు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. పశువులకు సులభంగా జీరమయ్యే పశుగ్రాసం. వరి మాగాణుల్లో హెక్టారుకు 8 నుండి 8.5 టన్నుల గింజ దిగుబడి మరియు 11.5 నుండి 13.7 టనుల పశుగ్రాసం పొందవచ్చును.
కావేరి 8383: వరి మాగాణుల్లో హెక్టారుకు 7 నుండి 7.5 టన్నుల గింజ దిగుబడి మరియు 10.5 నుండి 13.0 టన్నుల పశుగ్రాసం పొందవచ్చును.
మహాలక్ష్మి 296: వరి మాగాణుల్లో హెక్టారుకు 7 నుండి 8.5 టన్నుల గింజ దిగుబడి మరియు 13.5 నుండి 14.0 టన్నుల పశుగ్రాసం పొందవచ్చును.
ఎన్ టిజె - 5: పొట్టి తెల్ల జొన్నరకంగింజలు తెల్లగా , నంద్యా ,పడిపోదు బెట్టను తట్టుకుంటుంది ,మెరుస్తుంటాయి వ్యవసాయ పరిశోధనా స్థానం నుండి ఇటీవలే విడుదలైన రకం.
యం 35-1: పంట కాలం 115 నుండి 120 రోజులు, బూజూ మరియు ఆకు మచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది. గింజలు మరియు చొప్ప నాణ్యంగా ఉంటాయి. వరి మాగాణుల్లో హెక్టారుకు 4 నుండి 5.5 టన్నుల గింజ దిగుబడి మరియు 10 నుండి 11 టన్నుల పశుగ్రాసం పొందవచ్చును.

విత్తు సమయం:

ఖరీఫ్ వరి పంట కోత కోసిన తర్వాత డిసెంబర్ మాసంలో నేలను దున్నకుండా నేరుగా (జీరో తిల్లేజ్) జొన్న విత్తనాని విత్తుకోవాలి. వరి తర్వాత మిగిలిన అవశేష నేల తేమను జొన్న ఉపయోగించుకుంటుంది. అవసరం అయితే ఒకటి లేదా రెండు తడులు అందించాలి.

విత్తన మోతాదు మరియు విత్తడం : 

జొన్న విత్తనాని వరి సాళ్ళలో 4 నుండి 6 సెం.మీ లోతులో దిల్లింగ్ పద్ధతి ద్వారా రంధ్రం చేసుకొని విత్తుకోవాలి. ఒక రంధ్రం లో 2 లేదా 3 గింజలు పెట్టుకోవాలి. ఈ రకంగా హెక్టారుకు 8 నుండి 10 కిలోల విత్తనం అవసరమౌతుంది.

విత్తే దూరం మరియు విత్తన శుద్ధి :

వరుసల మధ్య 40 సెం.మీ, వరుసలో మొక్కల మధ్య 15 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. ఒక కిలో విత్తనానికి 14 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ మరియు 3 గ్రా. కార్బెండజిం ను కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

ఎరువుల వాడకం :

మామూలుగా రైతులు వరి మాగాణుల్లో ఎరువులను ఎక్కువ మోతాదులో వేస్తుంటారు. వరి మాగాణి జొన్నకు విత్తనం విత్తుకునే సమయంలో హెక్టారుకు 40 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం మరియు 40 కిలోల పోటాష్ ఎరువులను కలుపుకొని ఆ మిశ్రమాని ప్రతి రంధ్రం లో 6 నుండి 8 సెం.మీ లోతులో వేసుకోవాలి.
జొన్న పంటను విత్తుకున్న 30 రోజుల తర్వాత మొదటి తడి ఇచ్చే ముందు హెక్టారుకు 40 కిలోల నత్రజని, ఎరువును ప్రతి మొక్కకు సమానంగా అందించాలి.

నీటి యాజమాన్యం:

వరిమాగాణిలో సాగుచేసే జొన్నపంటకు కేవలం ఒకటి లేదా రెండు తడులు సరిపోతాయి. మొదటిది జొన్నవిత్తిన 30 రోజులకు మరియు అవసరమైతేనే రెండవది 60 రోజులకు ఇవ్వాలి.

కలుపు యాజమాన్యం:

వరి మాగాణుల్లో (జీరో తిల్లేజ్) గడ్డి జాతి మరియు వెడల్పాకు జాతి కలుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ కలుపు సమస్యను అధిగమించడానికి హెక్టారుకు 0.5 లీటరు పారాక్వాట్ తో పాటుగా 0.5 కిలో అట్రాజిన్ మందును 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై విత్తిన ఒక రోజు తర్వాత లేదా మరుసటి రోజున పిచికారి చేసుకోవాలి. తద్వారా విత్తిన 20-25 రోజుల వరకు ఎలాంటి కలుపు సమస్య రాదు.

జొన్న పంటలో ప్రధానంగా ఆశించే చీడపీడలలో కత్తెర పురుగు, మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగు, గింజ బూజు తెగులు మరియు నల్ల కాండము కుళ్ళు తెగులు ముఖ్యమైనవి .

కత్తెర పురుగు:

ఈ మధ్యకాలం లో కత్తెరపురుగు మొక్కజొన్నతో పాటు జొన్న పంటను కూడా ఆశించడం జరిగింది. దీని నివారణకు 20-30 రోజుల దశలో 5% వేపగింజ కాషాయాన్ని లేదా అజాడిరెక్టిన్ 1500 పి.పి.ఎం. అనే మందులను ఒక లీటరు నీటికి 5 మి.లీ. మందును కలిపి పిచికారి చేయాలి. 40-50 రోజుల దశలో విషపు ఎర (10 కిలోల తవుడు మరియు 2 కిలోల బెల్లం ను 2-3 లీటర్ల నీటిలో 24 గంటలు నానబెట్టి దీనికి 100 గ్రాముల ధయోడికార్బ్, పిచికారి చేసే 30 నిమిషాల ముందు కలుపుకోవాలి) లేదా స్పైనోసాడ్ అను మందును లీటరు నీటికి 0.3 మీ.లీ. లేదా క్లోరంట్రాలినిప్రోల్ 18.5% ఎస్ సి లీటరు నీటికి 0.3 మి.లీ. కలిపి 10-15 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి.

మొవ్వు తొలుచు ఈగ :

విత్తనం మొలకెత్తిన రోజు నుండి 30 రోజుల వరకు మాత్రమే ఈ పురుగు ఆశిస్తుంది. పురుగు ఆశించిన మొవ్వు ఎండిపోయి చనిపోతుంది. మొవ్వుని లాగినప్పుడు సులువుగా వచ్చి కుళ్ళిపోయిన వాసన కలిగి ఉంటుంది. పిలకలు అధికంగా వస్తాయి. దీని నివారణకు ఖరీఫ్ లో పండించే జొన్నని జూలై 15 లోపే విత్తాలి. ఆలస్యంగా విత్తనం వేయవలసివస్తే, విత్తనమోతాదును పెంచుకోవాలి. కార్బోఫ్యురాన్ 3 జి గుళికలను మీటరు సాలుకు 2 గ్రాముల వంతున విత్తేటప్పుడు సాళ్ళల్లో వేయాలి లేదా థయోడికార్బ్ 75 WP 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి మొక్క మొలచిన 7, 14 మరియు 21 రోజుల్లో పిచికారి చేయాలి.

కాండం తొలచు పురుగు:

ఈ పురుగు పైరును 30 రోజుల తర్వాత నుండి పంట కోసేవరకు ఆశిస్తుంది. ఆకుల పై గుండ్రని వరుస రంధ్రాలు ఏర్పడుతాయి. తెల్లకంకి ఏర్పడుతుంది. కాండాన్ని చీల్చి చూస్తే ఎర్రని కణజాలం కనపడుతుంది. దీని నివారణకు వితిన 35-40 రోజులలోపు ఎకరానికి 4 కిలోల కార్బోఫ్యురాన్ గుళికలను కాండపు సుడుల్లో వేయాలి.
పేనుబంక: దీని నివారణకు డైమిథోఎట్ లేదా మిథైల్ డెమటాన్ అనే మందుని ఒక లీటరు నీటికి 2 మి. లీ. కలిపి పిచికారి చేయాలి.

గింజ బూజు తెగులు:

ఈ తెగులు వర్షాకాలంలో అధికంగా కనిపిస్తుంది. గింజలపై బూజు కనిపిస్తుంది. పూత మరియు గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం అధికంగా ఉంటుంది. దీని నివారణకు ఒక లీటరు నీటికి 0.5 మి. లీ. ప్రోపియోకొనజోల్డ్ మందును కలిపి పిచికారి చేయాలి. పంటకోత ఆలస్యం చేయకుండా, గింజ క్రింది భాగంలో నల్లని చార ఏర్పడినప్పుడు కంకులను కోయాలి.

నల్ల కాండము కుళ్ళు తెగులు:

లేత మొక్కలలో నేల దగ్గర ఉన్న కాండం రంగు కోల్పోయి, మొక్కలు వాడి ఎండిపోతాయి. తాలు గింజలతో కంకులు త్వరగా పక్వానికి వస్తాయి. కాండం లోపల డొల్లగా మారి విరిగిపోతాయి. దీని నివారణకు కాఫాన్/కార్బెండజిమ్ కిలో విత్తనానికి 3 గ్రా. కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

సస్యరక్షణలో మంచి ఫలితాలు పొందాలంటే ఒక ఎకరాకు 200 లీటర్లు నీటితో సిఫార్సు చేయబడిన మోతాదులో క్రిమి నాశక/ శీలింద్ర నాశక మందులను కలిపి ద్రావణాన్ని పిచికారి చేయవలసిన అవసరంవుంటుంది.

పంటకోత:

కంకి క్రింద వరుసలో వున్న గింజలు ఆకుపచ్చరంగు నుండి తెల్లగా మారి గింజలోనున్న పాలు ఎండి పోయి పిండిగా మారినపుడు, గింజ క్రింద భాగంలో నల్లటి చార ఏర్పడిన తర్వాత పంట కోయాలి.

“అవశేష నేల తేమ ప్రయోజనాన్ని పొందడం, తగ్గిన నేల తయారీ ఖర్చు, మేలైన రకాల ఎంపిక, పరిమిత నీటిపారుదల మరియు కలుపు నిర్వహణ - వరి మాగాణిలో జొన్నసాగు-ఒక నమూనా మార్పు.”

రచయిత సమాచారం

టి. భాగవతప్రియ, ఎస్.కె. సమీర, ఎస్. అయిషా పర్వీన్, డి. సంపత్ కుమార్ - ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నంద్యాల