Print this page..

సంకర వరి విత్తనోత్పత్తి - యాజమాన్యం

వరి భారతదేశపు ప్రధాన ఆహార పంట. పెరుగుతున్న జనాభా సంఖ్యకు, మారుతున్న సామాజిక జీవన పరిస్థితులకు తగినట్లుగా ఆహారం అందించవలెనని సంకర వరి యొక్క ఉత్పత్తి, ఆవశ్యకతను సంతరించుకుంది. ఇదే కాకుండా రైతు యొక్క ఆర్ధిక పరిస్థితిని 15-20 శాతం (సామన్య వరి వంగడాలతో పోల్చిన) మెరుగుపరచే అధిక వరి దిగుబడి ఈ సంకర వరి ఉత్పత్తి ద్వారా చేయవచ్చు. 

ఉత్పత్తి / రకాలు : 

ప్రధానంగా సంకర వరి ఉత్పత్తికి 2 మాతృ రకాల (తల్లి, తండ్రి లేదా ఆడ, మగ రం) అవసరం. 

 1. ఏ రకం తల్లి మొక్క, ఆడ మొక్క, పుంసత్వం లేని రకం, సిఎమ్‌ఎస్‌

 2.  ''ఆర్‌'' రకం, తండ్రి మొక్క, మగ మొక్క, ఫలదీకరణపు రకం

ఇందులో భాగంగా తల్లి లేదా ఆడ మొక్క యొక్క మగ వంధత్వపు కారణం చేత ఈ ''ఏ'' రకం మొక్క ఉత్పత్తి ఇంకొక ఫలవంతమైన పుప్పొడి కలిగిన మైంటైనర్‌ రకంతో సంకరణం చేయును.

 1. ''బి''  రకం లేదా మైంటైనర్‌ అందురు.

ఈ విధంగా సంకరణం చేయగా వచ్చే ఫలవంతం కాని మొదటితరం ఎఫ్‌1 నే ''ఏ'' రకం అంటారు. 

మాతృ రకాలను విత్తడం-నాటడం : 

 1. నారుమడి తయారీ

 2. పూత సమన్వయం

 3. పంట యొక్క మధ్యంతర దూరం

 4. నాటువేయడం

 5. పూత సమయాన్ని సవరించుట

 6. పోటాకును కత్తిరించుట

 7. అనుబంధ పరాగ సంపర్కం

 8. కేళీలను ఏరివేయట

 9. కోత కోయడం

 10.  నూర్పిడి

1. నారుమడి తయారీ : 

నారుమడిని 2-3 సార్లు దమ్ము చేసి, కలుపు, తదితర మొక్కలు లేకుండా 1 మీ. వెడల్పు, 5-10 సెం.మీల ఎత్తు, వీలైనంత పొడవుతో అధికంగా ఉన్న నీటిని తొలగించుటకు, కాలువలను ఏర్పరచాలి. ఒక హెక్టారుకు పొలం నాటుటకు ''ఏ'' రకం 15 కిలోలు, ''ఆర్‌'' రకం 5 కిలోలు విత్తనం అవసరం. విత్తే ముందు విత్తనాలను 24 గంటలు నీటిలో నానబెట్టి, తడి గోనె సంచుల్లో లేదా మండెకట్టి, వెచ్చని నీడప్రదేశంలో ఉంచాలి. ఇలా మొలకెత్తిన విత్తనాలను సమంగా పడేటట్ల్లు విత్తాలి. 

2. పూత సమన్వయం : 

విత్తనోత్పత్తిలో ఇది చాలా ప్రధానమైనది. ఆడ /మగ మాతృరకాల మొక్కలు ఏకకాలంలో పూతకు వచ్చే సమన్వయంపై, సంకరజాతి విత్తనోత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఏక కాలంలో పూతకు వచ్చేందుకు 2 రకాల పద్థతులు అవలంభించవచ్చును. పంటకాలాన్ని బట్టి తదునుగుణంగా తేదీల్లో ఆడ, మగ మొక్కలను విత్తితే అవి ఒకేసారి పూతకు వస్తాయి....

యాజమాన్య పద్ధతులను ఉపయోగించి మాతృరకాలను ఏకకాలంలో పూతకు తీసుకురావచ్చు (నెం 5లో వివరించాము). విత్తనోత్పత్తిలో సాధారణంగా ఆర్‌ రకాన్ని 2-3 సార్లు విత్తాలి. విత్తడానికి మధ్య 3-5 రోజుల వ్యవధి ఉండాలి. 

''ఏ'' రకాన్ని ఒకేసారి విత్తాలి. ''ఏ'' రకం విత్తడానికి రెండవసారి విత్తే ''ఆర్‌'' రకానికి మధ్య, ఈ రెండు రకాల పంటకాలాల్లో ఉన్న తేడాకు సమంగా ఉండాలి. ఉదా: ''ఆర్‌'' రకం పంటకాలం 110 రోజులు, ''ఏ'' రకం పంటకాలం 100 రోజులు.

''ఏ'' రకం 10 రోజులు పంటకాలం తక్కువ ఉంది. కావున రెండవసారి విత్తే ''ఆర్‌'' రకాన్ని ''ఏ'' రకం కన్నా 10 రోజులు ముందుగా విత్తాలి. తద్వారా మాతృరకాలను ఏక కాలంలో పూతకు వచ్చేలా చేసి ''ఏ'' రకానికి కావల్సిన పుప్పొడిని ''ఆర్‌'' రకం పూతకాలమంతా అందచేయును. 

3. ప్రతి బంధకాలు : 

సుమారుగా 50-100 మీ. దూరం వరకు ఇతర వరి రకాల పైర్లను పెంచరాదు. ఎందుకంటే ఇతర వరి రకం పుప్పొడి 3-5 ని||ల కాల వ్యవధిలో 100 మీ. దూరం ప్రయాణం చేసి, దగ్గరలో గల పంటను మిశ్రమం చేయును.

దీన్ని అరికట్టుటకు సంకర వరి విత్తనోత్పత్తి చుట్టూ 10-20 వరుసల్లో మగ రకం మొక్కలను నాటాలి. 

సహజ సిద్ధమైన, కృత్రిమమైన ప్రతిబంధకాలను సుమారుగా 3-5 మీ. ఎత్తులో ఉండాలి.

ప్రతిబంధకాలుగా ఇతర పంటలను (ఉదా :అవిశ) ఉపయోగించి (3-4 మీ. వెడల్పు, 2-3 మీ. ఎత్తు) (ఉదా : అవిశ, మొక్కజొన్న, సజ్జ)

ఇతర వరి రకాల (సహజ సిద్ద విత్తనోత్పత్తి) పంటకాలంలో సుమారు 3-4 వారాలు (21-30) వల్ల పూతకాలంలో తేడా ఉండును. 

4. నాటుట : 

నాటు వేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2-3 దఫాలుగా విత్తిన ''ఆర్‌'' రకం నారును మిశ్రమంగా ''ఏ'' రకంతో స్వచ్ఛతను కోల్పోకుండా  తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో వరుస నిష్పత్తి చాలా ప్రధానమైనది. అంటే ''ఆర్‌'' రకం ''ఏ'' రకాల వరుసల సంఖ్య ఇది 2:6, 2:8, 2:10, 2:12 నిష్పత్తిలో ఉండును. 2:6 అనేది చాలా ఉపయోగకరంఆ ఉండును. అంటే వరుసగా 2 వరుసల ''ఆర్‌'' రకం (అధిక దిగుబడికి) మరియు 6 వరుసల ''ఏ'' రకం నారును నాటుకోవాలి. ఇందులో అతి ముఖ్యమైనది ''ఆర్‌'' రకం, ''ఏ'' రకం మధ్య వరుసల దూరం అది వరుసగా. 2 ''ఆర్‌'' రకం వరుసల మధ్య దూరం 30 సెం.మీ గానూ, ''ఏ'' రకం ''ఏ'' రకానికి మధ్య దూరం 15 సెం.మీ. ఉండేటట్లుగా సరిచూసుకోవాలి. మరియు ''ఆర్‌'', ''ఏ'' రకాల్లోని ఏ మొక్కల్లో ఏ రకంలో అయినా మొక్కకి మొక్కకి మధ్య దూరం 15 సెం.మీ.లుగా వాడాలి. 

ఇలా వరుసగా 2:6 నిష్పత్తిని పాటిస్తూ పొలం మొత్తం నాటువేసుకోవాలి. ఆయా ప్రాంతీయ పరిస్థితులను బట్టి మొక్కకు మొక్కకు మధ్య దూరం 15I15 సెం.మీ మార్పు చేసుకొని 20I20 సెం.మీ. అధిక దిగుబడిని పొందవచ్చు. నాటిన 7 రోజుల్లో ఖాళీగా ఉండే కుదుళ్ళను తిరిగి పూరించాలి. ఈ సమయంలో ''ఏ'', ''ఆర్‌'' రకాలు కలవకుండా జాగ్రత్త వహించాలి. తరువాత మీ ప్రాంతానికి సిఫార్సు చేసిన విధంగా చీడపీడలు, తెగుళ్ళు మరియు కలుపు నిర్మూలన చర్యలను చేపట్టాలి. కలుపును చేతితో గాని, కలుపు సాధనాలతో గాని లేదా కలుపు మందులను ఉపయోగించి పూర్తిగా నిర్మూలించాలి. ఎరువులను కూడా 3 దఫాలుగా  (నాటిన 70 రోజుల్లో, నాటిన 25-30 రోజుల్లో, బాగా పిలకలు వేసిన దశల్లో ) మీ ప్రాంతానికి సిఫార్సు చేసిన విధంగా వాడాలి.

పూతను సవరించుట : 

వాతావరణంలోని మార్పులు మరియు పాటించే యాజమాన్య పద్ధతులు, మాతృరకాలు వేర్వేరు సమయాల్లో పుష్పించుటకు కారణమవుతాయి. పూత ఏకకాలంలో రాని ఎడల దిగుబడి తగ్గి నష్టం వాటిల్లును. ఏదేని మాతృ రకాల్లో వచ్చిన పూతను బట్టి రెండవ మాతృరకం యొక్క పూతను సవరించవలెను. 

మగ మొక్కలో పూత ముందుగా వచ్చేందుకు : 

మగ మొక్కలోని ఉత్పాదక పిలకలు (కంకి) అభివృద్ధి మొదలు అవగానే 1 శాతం ఫాస్ఫేట్‌ ఎరువు ద్రావణాన్ని పిచికారి చేయాలి. మరియు ఎక్కువ  నీరు పొలంలో ఉండేలా చూడాలి.

ఆడ మొక్కలో పూత ఆలస్యం చేయుటకు : 

ఆడ / తల్లి మొక్కలో కంకి అభివృద్ధి చెందే దశలో 2 శాతం యూరియా ద్రావణం పిచికారి చేయాలి. 

తల్లి మొక్కలోని మొదటిగా వచ్చిన కంకులను తీసివేసి ఆలస్యపు దుబ్బులకు (కంకి)పై ద్రావణాన్ని పిచికారి చేయాలి.

పొట్ట కత్తిరించుట : 

పంట చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు ప్రాథమిక పిలక (దుబ్బులను) పట్టుకొని కొడవలి సహాయంతో 2/3వ వంతు భాగం వరకు కత్తిరించాలి. గమనిక : పంటకు ఎండాకు తెగులు లేదా పొడతెగులు సోకిన పొట్టను కత్తిరించకూడదు. ఎందుకంటే తెగులు సోకిన మొక్క నుండి ఆరోగ్యంగా ఉన్న మొక్కని కత్తిరించిన భాగాల ద్వారా వ్యాప్తి చెందును.)

అనుబంధ పరాగ సంపర్కం : 

మగ, ఆడ మొక్కలు పూతకు వచ్చిన తరువాత సుమారుగా 10-15 రోజులు (మాతృ రకాలు పుష్పించే వ్యవధిని బట్టి) పరాగ సంపర్కం జరపాలి. ఈ ప్రక్రియను 1 సెం.మీ. మందం గల తాడుతో ఇద్దరు మనుషులు పట్టుకొని కానీ లేదా ఒక మనిషి చేతి వాటం గల కర్రలను ఉపయోగించి మగ మొక్క కంకులు విరిగిపోకుండా కుదపడం వల్ల జరుపవచ్చు. ఇందుకుగాను ఉదయం పూట 10-11 గం||ల్లో గాలి వీచని ప్రశాంత వాతావరణంలో ఉష్ణోగ్రతను బట్టి పరాగ సంపర్కం జరుపాలి. 

గమనిక : పరాగ సంపర్కం అనేది పంట దిగుబడిని సూచిస్తుంది.

కేళీలను ఏరివేయుట : 

అవసరమైన ఇతర రకాల వరి మొక్కలను కేళీలు అందురు. అధిక స్వచ్ఛతను పొందుటకు వాటిని తొలగించాలి. ''ఆర్‌'' రకం వరుసలో ''ఆర్‌'' రకానికి భిన్నంగా ఉన్న ''ఏ'' రకం వరుసలో ''ఏ'' రకానికి భిన్నంగా ఉన్న ఇతర మొక్కలను గుర్తించి తీసివేయాలి. భిన్నతరం మొక్కలు, ఎత్తులో చిన్నవిగా లేదా పెద్దగా ఆకు ఆకారంలో గాని, పరిమాణంలో గాని, రంగులో గాని వేరుగా ఉండును. 

కేళీలను ఏరి వేసే ముఖ్యమైన దశలు : 

 1. బాగా దుబ్బు పట్టిన దశలో 

 2. పూత దశలో

 3. కోతకు ముందు

కోత కోయుట & నూర్పిడి : 

 1. పంట కోతకు వచ్చే 7-10 రోజుల ముందు పొలాన్ని ఎండకట్టడం

 2. పంట 90 శాతం కంకుల్లో గింజ గట్టిపడి, గడ్డి రంగులోకి మారిన తరువాత 

 3. మొదటిగా ''ఆర్‌'' రకం / మగ మొక్కలను కోసి, నూర్చి ఎండబెట్టాలి.

 4. తదుపరి ''ఏ'' రకం (సంకర వరి గింజలు ఏర్పడిన) మొక్కలను కోసి, నూర్చి ఎండబెట్టాలి.

 5. గింజలో తేమశాతం 12-13 శాతం ఉండేటట్లుగా ఎండబెట్టి శుభ్రపరచి తదుపరి ఆర్‌, ఏ రకాలను వేరు సంచుల్లో ఉంచి విక్రయించాలి. 

రచయిత సమాచారం

పగిడిపాల నాగరాజు, భారతీయ వరి పరిశోధనా సంస్థ, రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ కె. రాజేంద్రప్రసాద్‌, శాస్త్రవేత్త, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, వరంగల్‌, ఫోన్‌ : 9010192629