Print this page..

వ్యవసాయంలో కృషీ విజ్ఞాన కేంద్రం యొక్క పాత్ర

వ్యవసాయంలో రైతుల ఆదాయం, ఆనందం, ఆరోగ్యం పెంపొందించడంలో కృషీ విజ్ఞాన కేంద్రం యొక్క పాత్ర

భారతదేశం వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తి పెంచడం మరియు ఆహారభద్రతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తిండి గింజల కొరత తీవ్రస్థాయిలో ఉండేది. దీనికోసం మొదటిగా మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం మరియ నూతన రకాలు, వంగడాల ద్వారా ఉత్పాదకత పెంచడం, నాణ్యమైన విత్తనం, ఎరువులు, నీటి పారుదల మరియు వ్యవసాయ రసాయనాల వాడకాన్ని పెంచడం. కొన్ని పంటలకు మద్ధతు ధరను కల్పించడం వ్యవసాయ పనిముట్లపై రాయితీలన కల్పించడం. ఈ విధమైన వ్యూహాల వల్ల భారతదేశం 1960 సం||లో ఎదుర్కొన్న తీవ్రమైన తిండిగింజల కొరత నుండి బయటపడింది. 

క్రమేపి వ్యవసాయ ఆవిష్కరణలు, నూతన పరిశోధనలు వ్వవసాయ మరియు అనుబంధ రంగాల్లో నిరంతర మార్పులు విస్తరిస్తూ పర్యావరణ సుస్థిరతకు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తి మరియు ఉత్పాదకతను స్థిరంగా పెంచడానికి కీలకంగా మారుతున్నాయి. అందుభాగంగా 1965-2015 వరకు హరిత విప్లవం, నీలి విప్లవం, క్షీర విప్లవం మొదలైన వాటి ద్వారా నేడు భారతదేశ ఆహార ఉత్పత్తిని 3.7 రెట్లు పెరిగింది. ఈ విధంగా భారతదేశం స్వయం సమృద్ధి సాధించి ఆహార, వ్యవసాయ వస్తువులను దిగుమతి చేసుకునే స్టాలు నుండి ఎగుమతి చేసే స్థాయికి చేసుకోవడం జరిగింది.

ఎందుకు రైతు ఆదాయం రెట్టింపు చేయాలి?

రైతు తనంతట తానుగా అభివృద్ధి చెందిన నాడే ప్రభుత్వం చేస్తున్న కృషి నెరవేరుతుంది. కాని పైన పేర్కొన్న లక్ష్యాలు మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం వాడం నాణ్యమైన విత్తనం, రాయితీలు, మద్దతుధర మొదలగునవి రైతుల ఆదాయ అవసరాన్ని స్పష్టంగా గుర్తించలేదు. మరియు రైతుల సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఎటువంటి ప్రత్యక్ష చర్యలను ప్రస్తావించలేదు. అనుభవం ద్వారా కొన్ని సందర్భాల్లో రైతుల ఆదాయాన్ని ఉత్పత్తి పెరుగుదలతో కొలుస్తారు. కాని చాలా సందర్భాల్లో రైతుల ఆదాయాన్ని ఉత్పత్తి పెరుగుదలతో పెద్దగా పెరగలేదు. పైగా రైతు ఆదాయం తగ్గిపోయి దారిద్య్రరేఖ దిగువున ఉన్నది. దేశ వ్యవసాయ భవిష్యత్‌ పై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి రైతుల పరిస్థితులపై ప్రత్యే శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని గ్రహించి భారత ప్రభుత్వం 2016-17 వార్షిక బడ్జెట్‌లో 2022 నాటికి అంటే స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తిచేసుకోబోతున్న భారతావనిలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధానమైన లక్ష్యాలను మన భారత ప్రభుత్వం నిర్ధేశించింది. తదనుగుణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకున్నాయి. కార్యాచరణ ప్రణాళికలో ముఖ్యమైన అంశం వ్యవసాయం నుండి రైతుకు రెటింపు చేసే మార్గాలు..

వ్యవసాయంలో రైతుల ఆదాయాన్ని పెంపొందించే మార్గాలు మరియు కృషీ విజ్ఞానకేంద్రం యొక్క పాత్ర  

  1. అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగుకు మారడం

  2. సమీకృత వ్యవసాయం / మిశ్రమ వ్యవసాయం

  3. వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గించుకోవడం

  4. వ్యవసాయంలో ఉత్పాదకతను / ఉత్పత్తిని పెంచుకోవడం

రైతులు మార్కెటింగ్‌ చేయడానికి అనువుగా వాణజ్య నిబంధనలను మెరుగుపరచడం. రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం.

భారతదేశంలో కృషీవిజ్ఞాన కేంద్రాలు 645 ఉన్నాయి. కె.వి.కెలు విస్తరణ విభాగాలుగా భారత వ్యవసాయ పరిశోధనా మండలి వారి ఆర్థిక సహకారంతో రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయాలు ఎన్‌జిఓలకు ప్రభుత్వ వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారిక పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నాయి. వీటి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో వస్తున్న నూతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన మార్పులను అంచనా వేసి రైతులకు చేరవేయడం అలాగే విత్తనోత్పత్తి చేయడం, ప్రదర్శనా క్షేత్రాలను నిర్వహించడం వివిధ ప్రభుత్వ శాఖల అనుసంధానంతో వ్యవసాయ అనుబంధ రంగాల కార్యక్రమాలను నిర్వహించడం, ముఖ్యంగా రైతులకు, గ్రామీణ యువతలకు, మహిళా రైతులకు నైపుణ్య శిక్షణా తరగతులు నిర్వహించడం తద్వారా కెవికెలు రైతుల ఆదాయం, ఆరోగ్యం, ఆనంతం పెంపొందించడంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. 

వ్యవసాయంలో ఉత్పాదకతను, ఉత్పత్తిని పెంచుకోవడం : 

కృషి విజ్ఞాన కేంద్ర క్షేత్రంలో మేలైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందించడం జరుగుతుంది. ఉత్పత్తి పెరగాలంటే మేలైన విత్తనం ఎంతో అవసరం. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర విశ్వ విద్యాలయం, హైదరాబాద్‌ మరియు భారత వ్యవసాయ పరిశోధనా మండలి న్యూఢిల్లీ వారు నూతన వంగడాలను, రకాలను, హైబ్రీడ్‌లను రూపొందించి విడుదల చేస్తున్నాయి. వీటిని రైతులకు చేరువ చేయడంలోను అలాగే వ్యవసాయ ఉత్పత్తి పెంచడంలోనూ కెవికె ప్రధమ పాత్ర పోషిస్తుంది. రైతులు ఇటువంటి మేలైన విత్తనాలను ఉపయోగించుకొని రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు. కాని విత్తనం ఒక్కటే అధిక దిగుబడిని సాధించలేదు అనే విషయాన్ని గమనించుకోవాలి. మేలైన రకాలతో పాటు అధునాతన శాస్త్రీయ సాంకేతిక యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా ఉత్పత్తి పెరుగుతుంది. కావున ఇట్టి సమగ్ర సమాచారం కోసం వ్యవసాయ విశ్వ విద్యాలయం, ఉద్యాన విశ్వ విద్యాలయం , పశు విజ్ఞాన విశ్వ విద్యాలయం వారు పంచాంగ పుస్తకాన్ని తెలుగులో ప్రచురిస్తున్నారు. ప్రతి రైతు వీటిని కెవికె, ఏరువాక మరియు పరిశోధన కేంద్రాల నుండి పొందవచ్చు. కృషీవలుడు విలువైన సూచనలను ఉపయోగించుకొని అధిక దిగుబడిని సాధించవచ్చు. 

అధిక ఆదాయం ఇచ్చే పంటల సాగుకు మారడం : 

అధిక ఆదాయం ఇచ్చే పంటల సాగుకు మారడం ద్వారా రైతు యొక్క ఆదాయం మెరుగుపడుతుంది. దీని గురించి కెవికెలు రైతు శిక్షణల ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుంది. ఉదా : వరి, పప్పులు, నూనె గింజల సాగు కంటే రైతులకు పండ్లు, కూరగాయలు, చెరకు, సుగంధ ద్రవ్యాల సాగు అధిక ఆదాయాన్ని ఇస్తుంది. అంతే కాకుండా వంట చెరకు, అగ్రోఫారెస్ట్‌ (వెదురు, సరుగుడు, శ్రీగంధం, టేకు) సాగు ద్వారా కూడా లాభాలు పొందవచ్చు. భారతదేశం 40 శాతం వంటచెరకును దిగుమతి చేసుకుంటుంది. 

సమీకృత వ్యవసాయం / మిశ్రమ వ్యవసాయం : 

రైతుల ఆదాయం రెట్టింపు చేసుకోవాలంటే ఒక వ్యవసాయం పై ఆధారపడితే లాభం లేదు. కావున అనుబంధ రంగాలైన పాటి, కోళ్ళు, గొర్రెలు, మేకలు, తేనెటీగలు, పట్టుపురుగులు, పొట్టేళ్ళ పెంపకం కూడా అనుసంధానం చేసుకోవాలి. వాణిజ్య సరళిలో కూడా అధిక లాభాలు గడించవచ్చు. 

సమీకృత వ్యవసాయంలో భాగంగా గిరిజన ఉప ప్రణాళిక కింద గిరిజన రైతులకు మరియు షెడ్యూల్‌ కులాల ఉపప్రణాళిక కింద షెడ్యూల్‌ కులాల రైతులకు ఆదాయం రెట్టింపు చేసే కార్యక్రమాన్ని పురస్కరించుకొని కె.వి.కెలు దత్తతతీసుక్న గ్రామ రైతులకు మేలైన విత్తనం, పాడి, కోళ్ళు, వ్యవసాయ పనిముట్లు, గొర్రెలు, మేకలు మొదలైనవి పంపిణీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అదే గ్రామ రైతులకు యువ రైతులకు, మహిళా రైతులకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా మిశ్రమ వ్యవసాయంతో అధిక ఆదాయం పొందడం ఎలాగో తెలియచేయడం జరుగుతుంది. వీరిని ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్ళి నూతన శాస్త్ర సాంకేతిక పద్ధతులను పరిచం చేయడం కోసం విజ్ఞాన యాత్రలను నిర్వహిస్తున్నారు. 

వ్యవసాయంలో సాగు ఖర్చు తగ్గించుకోవడం : 

ఈ మధ్యకాలంలో సాగు ఖర్చు అధిగమవుతుంది. దీనికి కారణం ద్రవ్యోల్బణం ద్వారా ఉత్పాదకాల ధరలు పెరిగిపోవడం ఒకటైతే పరిజ్ఞాన లేమితో రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు విచక్షణారహితంగా ఖర్చు చేసి వాడడం. దీని ద్వారా రైతుకు అదనపు ఖర్చుపెరగడమేగాక నేల, గాలి, కాలుష్యమవుతున్నాయి. కెవికె వారు రైతులకు ఖర్చు తగ్గించుకునే మార్గాలను శిక్షణ ద్వారా తెలియచేస్తున్నారు. దీనిలో భాగంగా రైతులు వివిధ పంటల్లో పాటించవలసిన నూతన శాస్త్ర సాంకేతిక యాజమాన్య పద్ధతులను అంటే విత్తనశుద్ధి, కలుపు మందుల వాడకం, సమగ్ర ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ, సమగ్ర నీటి యాజమాన్యం, యాంత్రీకరణ, విలువ జోడింపు సమాచార సాంకేతిక విప్లవాన్ని వినియోగించడం.

విత్తన శుద్ధి : 

అతి తక్కువ ఖర్చుతో రైతులు తొలిదశలో పంటలను విత్తనశుద్ధి ద్వారా కాపాడుకోవచ్చును. ఎందుకంటే విత్తనాన్ని పురుగు మందుల, తెగుళ్ళ మందులు, జీవన ఎరువులు, శిలీంద్రాలు వంటి వాటితో విత్తన శుద్ధి చేస్తారు. కాబట్టి దాదాపు తొలిదశలో (30-60 రోజుల వరకు) అశించే పురుగులు, తెగుళ్ళు, శిలీంద్రాలను అరికట్టవచ్చు. 

కలుపు మందుల వాడకం : 

ఇవి 2 రకాలు. విత్తనం మొలకెత్తక ముందు వాడేది మరియు విత్తనం మొలకెత్తిన తరువాత పిచికారి చేసేది. పంటల వారీగా కలుపు మందులు కలవు. నియంత్రించడం చాలా సులభం. అలాగే ఖర్చును తగ్గించుకోవచ్చు.

సమగ్ర ఎరువుల యాజమాన్యం : 

రైతులు రసాయన ఎరువుల బదులు పచ్చిరొట్ట పైరు పెంపకం, పేడ ఎరువులు, వానపాముల ఎరువులు, జీవన ఎరువులు మేకలను, గొర్రెలను మందకట్టడం, కంపోస్ట్‌ ఎరువుల వాడకం భూసార ఆధారిత ఎరువుల వాడకం ద్వారా ఖర్చును తగ్గించుకోవచ్చు. 

సమగ్ర సస్యరక్షణ : 

రైతులు సరైన సమయంలో విత్తడం, అంతర పంటలు, ఎర పంటలు, లింగాకర్షక బుట్టలు, పక్షిస్థావరాలు, జీవ నియంత్రణ, రసాయన పురుగు మందుల పిచికారి అవసరం మేరకే వాడుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవచ్చు. 

సమగ్ర నీటి యాజమాన్యం : 

నీటి వనరులు నానాటికీ తగ్గిపోతున్నాయి. వీటిని సంరక్షించుకొని తక్కువ నీటితో అధిక పంటలను తీసేందుకు డ్రిప్‌, స్ప్రింక్లర్లు, మైక్రో ఫాగర్లు వంటి నూతన సాంకేతికతను వాడుకోవాలి. ఫాంపాండు ద్వారా, ఇంటిపైకప్పు ద్వారా, చెక్‌ డ్యాంల ద్వారా, చెరువు పూడిక తీయడం ద్వారా, వాలుకు అడ్డంగా దున్నడం ద్వారా, కందకాల ద్వారా నీటిని నిల్వ చేసుకొని సమగ్రవంతంగా వాడుకోవచ్చు. అంతేగాక నీటి లభ్యత, కీలక పంట దశల్లో నీరు ఇచ్చి దిగుబడులు తగ్గకుండా చూసుకోవడంపై రైతులకు శిక్షణ / అవగాహన పెంచాలి. 

యాంత్రీకరణ : 

ప్రస్తుత కాలంలో కూలీలు దొరకడం చాలా కష్టం మరియ చాలా ఖర్చు కాబట్టి యాంత్రీకరణ తప్పనిసరవుతుంది. ప్రస్తుత తరుణంలో రైతులకు విత్తనం విత్తడం నుండి విత్తనం తీసే వరకు కావలసిన పనిముట్లు, యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. అధిక ఖరీదు గల యంత్రాలను ప్రభుత్వం వారు కస్టంహైరింగ్‌ కేంద్రాల ద్వారా సమకూర్చడం జరుగుతుంది. వివిధ రకాల యంత్రాల వివరాల కోసం దగ్గర్లోని కెవికెలను ఏరువాక మరియు పరిశోధనా కేంద్రాలను సందర్శించడం ద్వారా తెలుస్తుంది. 

విలువ జోడింపు : 

విలువ జోడింపు అంటే వ్యవసాయ ఉత్పత్తుల విలువను చిన్న చిన్న చర్యల ద్వారా పెంచడం ప్రస్తుతకాలంలో పంట విలువ జోడించడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఉదా : కిలో వడ్లు రూ. 15/-, కిలో బియ్యం రూ. 40-50 లకు అమ్మవచ్చు.

కందులు క్వింటాలుకు 84,000-5,000/-లకు అదే పప్పు చేసి ఒక కిలో ప్యాకెట్‌ లేదా క్వింటాలకు రూ. 8,000-10,000/-లకు లభిస్తుంది. అంటే వడ్లలను బియ్యంగా, కందులను కందిపప్పుగా పల్లీలను నూనెగా, రాగులను, కొర్రలను, సజ్జలను బిస్కెట్లు చేసి అమ్మడం ద్వారా అధిక లాభాలను ఇస్తుంది. 

సమాచార సాంకేతిక విప్లవాన్ని వినియోగించడం :

దీని ద్వారా 21వ శతాబ్దంలో సమాచార సాంకేతిక విప్లవం ద్వారా వ్యవసాయరంగంలో అనేక మార్పులు సంభవించాయి. ఈ సాంకేతికతను రైతు ఉపయోగించుకొని రైతు పండించిన పంటలను అంతర్జాలం ద్వారా ప్రపంచంలో ఎక్కడైనా అనుకున్న ధరకు అమ్ముకునే వీలును కల్పిస్తుంది. ఈ విధంగా రైతులు తమ ఆదాయాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అంతేకాకుండా పంటలను ఆశించిన చీడపీడల గురించి రోగ నిర్ధారణ నూతన శాస్త్ర సాంకేతిక యాజమాన్య  పద్ధతుల గురించి రియల్‌టైమ్‌లో అంటే ఎప్పటికప్పుడు తమ పొలం నుండే లేక ఇంటి నుండే పొందవచ్చు. బారతదేశంలో ఏ మార్కెట్‌లో ఏ ఉత్పత్తి ఎంత ధర ఉందో రైతులు చరవాణిలో పొందే వీలును కల్పిస్తుంది. ఇందుకోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రభుత్వేతర మరియు ప్రైవేటు సంస్థలు అనేక రకాల వెబ్‌సైట్లను, చరవాణి ఆప్‌లను రూపొందించాయి. ఇట్టి సమాచార విప్లవాన్ని రైతులు అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించే దిశగా అడుగులు వేయాలి. వీటి ఉపయోగం కోసం కెవికెలో గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. 

ఉదా : కింద మనం కొన్న సమాచార మార్గాల గురించి తెలుసుకుందాం..

చరవాణి ఆప్‌ల గురించి : భారత ప్రభుత్వంచే తయారుచేయబడిన చరవాణి ఆప్‌లు : కిసాన్‌ సువిధ, కిసాన్‌ మార్కెట్‌, పూసా కృషి, కిసాన్‌ అగ్రిమార్కెట్‌ మొదలగునవి ప్రభుత్వేతర ఆప్‌లు కాల్గుడి, ప్లాంటిక్స్‌ మొదలగునవి. ఈ ఆప్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉచితంగా డౌన్లోడ్‌ చేసుకొని వినియోగించుకోవచ్చు. 

రైతులు మార్కెటింగ్‌ చేయడానికి అనువుగా వాణిజ్య నిబంధనలు మెరుగుపరచడం : 

రైతులు మార్కెటింగ్‌ చేయడానికి అనువుగా వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడం ద్వారా ఎక్కడైనా అనుకున్న ధరకు పంటలను అమ్ముకోవచ్చు.   రైతులకు వ్యవసాయం నుండి వచ్చే ఆదాయం ప్రస్తుతం ధరల మీద ఆధారపడి ఉంది. ప్రస్తుత ధరలు ద్రవ్యోల్బణం రేటు అనుగుణంగా మార్పు చెందుతుంది. రైతులకు మంచి గిట్టుబాటు ధర కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి మండిలో ఇనామ్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైతు పండించిన పంటలకు ఏ మండిలో పాత ధర ఉన్నదో తెలుసుకునే వీలు కల్పించారు. అలాగే రైతు తనకు నచ్చిన ధరకే పంటను అమ్ముకునే వీలును కల్పించారు.  ఇనామ్‌ ద్వారా మధ్యలో దళారి వ్యవస్ధ నిర్మూలించడంలో దోహదపడింది. 

రైతులు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల్లో నైపుణ్యం శిక్షణ తరగతులు : 

కెవికెల్లో నైపుణ్య శిక్షణ తరగతులను రైతులకు యువ మరియు మహిళా రైతులకు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి శిక్షణా తరగతుల ద్వారా వ్యవసాయ మరియు అనుబంధరంగాల్లో వస్తున్న శాస్త్ర, సాంకేతిక యాజమాన్య మార్పులను రైతులకు తెలియచేయడం వల్ల రైతులు మేలైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవడం పురుగు మందులపై ఖర్చు తగ్గించుకోవడం అధిక ఆదాయం ఇచే పంటలను సాగు చేయడం, సమగ్ర నీటి యాజమాన్యంతో రెండు పంటలను తీయడం, సమగ్ర ఎరువుల యాజమాన్యం మరియు పచ్చిరొట్ట సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచుకోవడం, శాస్త్ర, సాంకేతిక సాగు పద్ధతులను అవలంభించడం ద్వారా ఉత్పత్తి పెరగడం అలాగే సాంకేతిక విప్లవాన్ని ఉపయోగించుకోవడం ద్వారా గిట్టుబాటు ధర లభించడం కాబట్టి రైతు ఆదాయం మెరుగు పరచడంలో కెవికెల యొక్క పాత్ర ప్రథమం. 

కృషీ విజ్ఞాన కేంద్రాలు రూతు ఆదాయం రెట్టింపు చేసే అనే కార్యక్రమం క్రింద గ్రామాలను దత్తత తీసుకోవడంతో పాటు ఎల్లవేళలా దత్త గ్రామ రైతుల ఆదాయం రెట్టింపు చేసే మార్గాలను మరియు వనరులను అన్వేషించి వారికి ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నారు. ఆదాయవనరుల మీద ప్రణాళికలను తయారుచేసి మేలైన విత్తనం, పంటల మార్పిడి, పచ్చిరోట్ట ఎరువుల సాగు, నీటి పారుదల, ఎరువులు, పురుగు మందుల విచక్షణా రహిత వాడకాన్ని నియంత్రించి, నూతన శాస్త్ర, సాంకేతిక సాగు పద్ధతుల మీద నైపుణ్య శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి వారి యొక్క ఆదాయం, ఆనందం, ఆరోగ్యం అభివృద్ధి పరచడంతో కెవికెలు క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. 

రచయిత సమాచారం

డా|| శివకృష్ణ కోట విస్తరణ శాస్త్రవేత్త, డా|| యం. రాజేశ్వర నాయక్‌, పోగ్రాం కోఆర్డినేటర్‌, డా|| ఐ. నాగరాజు, డా|| ఐ. తిరుపతి మరియు డా|| ఆర్‌. ఉమారెడ్డి, సహపరిశోధన సంచాలకులు, డా|| వి. రవీంధర్‌ నాయక్‌, ఆర్‌. ఎ.ఆర్‌. ఎస్‌ పొలాస, ఫోన్‌ : 9704646450