Print this page..

సేంద్రియ వ్యవసాయంలో మిత్రపురుగుల ప్రాముఖ్యత

వ్యవసాయ పర్యావరణ వ్యవస్థ అనేక జీవసంబంధ కారకాలతో ఎంతో సంక్షిష్టంగా ఉంటుంది. సూక్ష్మ మరియు స్థూల వాతావరణం అనేక మిత్ర మరియు శత్రు పురుగులకు ఆవాసంగా ఉండి ఎప్పుడైతే మిత్రపురుగుల సంఖ్య తగ్గుతుందో అప్పుడు శత్రుపురుగులు విజృంభిస్తాయి కనుక ప్రతి మొక్క రైతు తమ పొలంలో ఉండే పంటను నాశనం చేసే కీటకాలతో పాటు పంటను రక్షించే మిత్ర పురుగులు గురించి కూడా తెలుసుకోవాలి. పంటను నాశనం చేసే కీటకాల పైన వాటిని ఆహారంగా ఉపయోగించుకునే మిత్రపురుగులు జీవిస్తాయి. తమ తమ పొలాల్లో వీటికి రక్షణ, ఆవాసం కలిపించడం ద్వారా లేదా వాటిని పెంచుకొని విడుదల చేయడం ద్వారా రైతులు వీటిని వృద్ధిపరచుకున్నచో అవి రైతుకు ఎనలేని సేవలను అందిస్తాయి. 

రైతులు పొలాల్లో సహజంగా కనిపించే మిత్ర పురుగులు : 

నేలపై గ్రౌండ్‌ బీటల్‌ నివసించే పెంకు పురుగులు : 

ఇవి సాధారణంగా వరి, మొక్కజొన్న, కూరగాయలు, పప్పుదినుసులు వంటి అనేక పంటల్లో నేలపై తిరుగుతూ కనబడతాయి. ఇవి పంటలను ఆశించే పేనుబంక, ఎర్రనల్లి మరియు పచ్చపురుగు, కత్తెర పురుగు, హాని కారక పెంకు పురుగుల పిల్లదశలను ఆహారంగా స్వీకరించి వాటి బారి నుండి పంటను కాపాడతాయి. 

రోవ్‌ బీటిల్‌ : 

వీటి పిల్ల దశలు మరియు వయోజన దశ ఎన్నో రకాలైన పంటను నాశనం చేసే కీటకాలను వేటాడి తింటాయి. ఇవి గుడ్లను, పురుగుల పిల్ల దశలను, కోశస్థ దశలను ఆహారంగా స్వీకరిస్తాయి. 

ఫైర్‌ ప్లై (మిణుగురు పురుగు) : 

వీటి పిల్ల దశలు (గ్రబ్స్‌) మరియు వయోజన (అడల్ట్‌) దశలు పంటకు హాని చేసే కీటకాల పిల్ల దశలను, నత్తలను, మిడతలను ఆహారంగా స్వీకరించి పంటను కాపాడతాయి. 

బ్లిస్టర్‌ బీటిల్‌ : 

వీటి పిల్ల దశలు మిడతలను ఆహారంగా స్వీకరిస్తాయి. అవి మిడతల గుడ్లను పెకళించి వాటిని ఆహారంగా స్వీకరించి పంటను కాపాడతాయి. 

కాక్సినెల్లిడ్‌ బీటిల్స్‌ : 

వీటిని లేడీబర్డ్‌ బీటిల్స్‌ అని కూడా అంటారు. వీటి యొక్క పిల్ల దశలు మరియు వయోజన దశలు చూడడానికి వేరు వేరుగా కనిపిస్తాయి. కాని అవి రెండూ కూడా పంటను ఆశించే తెల్లదోమ, పేనుబంక, తెల్లపేను, పొలుసు పురగు, పచ్చదోమ మరియు అనేక పురుగుల గుడ్లను ఆహారంగా స్వీకరించి పంటను కాపాడి రైతులకు ఎంతో మేలు చేస్తాయి. రైతుసోదరులు వంగ మరియు తీగజాతి కూరగాయ మొక్కల ఆకులను నాశనం చేసే ఎపిలాక్నొ బీటిల్స్‌ నుండి వీటిని వేరుగా గుర్తించే నేర్పును అలవర్చుకోవాలి. ఈ కొక్సినెల్లిడ్‌ బీటిల్స్‌ గ్రబ్స్‌ మరియు పెంకుపురుగు దశలను ఫోటోలో చూసి జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పంటపొలాల్లో గమనించిన అది నారంతరంగా రసంపీల్చే పురుగులను, ఇతర పురుగుల గుడ్లను తింటూ కనిపిస్తాయి. పురుగు మందులు పిచికారీ చేసిన తరువాత వీటి సంఖ్య తగ్గడం కూడా గమనిస్తారు. 

అనిగ్లియస్‌ కార్టోని : 

ఇవి చాలా ఆకర్షణీయంగా ఉండి గ్రబ్స్‌ మరియు పెద్ద పురుగులు పొలుసు పురుగు, పేనుబంక మరియు తెల్లదోమ నుండి క్యాబేజి, కాలిఫ్లవర్‌, వంగ, టమాట, పొద్దుతిరుగుడు, చెఱకు, పొగాకు, చామంతి వంటి అనేక పంటలను కాపాడుతాయి.

ఆక్సినోస్కిమ్నస్‌ పుట్టారుడ్రియాహి : 

గ్రబ్స్‌ మరియు పెద్ద పురుగులు తెల్లదోమను ఆహారంగా స్వీకరించి జామ, ప్రత్తి, దానిమ్మ, కరివేపాకు వంటి పంటలను కాపాడతాయి.

బ్రోమాయిడ్స్‌ సుటురాలిస్‌ : 

ఈ కాక్సినెల్లిడ్‌ కూడా మనం చెరకు, మొక్కజొన్న, వరి, పత్తి, పప్పుదినుసులు, కూరగాయలు వంటి అనేక పంటల్లో రసంపీల్చే పురుగులను తింటూ తిరగడం గమనించవచ్చు. 

చిలోమినిస్‌ సెక్స్‌ మాక్యులేటా : 

ఇది రెక్కలపై ఆకుమచ్చలు కలిగి అన్ని రకాల రసంపీల్చే పురుగులు, ఇతర పురుగుల గుడ్లు మరియు చిన్న చిన్న లార్వాలను తింటూ కనిపిస్తుంది. సాధారణంగా దీన్ని వడ్లచిలక యొక్క గుడ్లను ఆహారంగా పెట్టి ప్రయోగశాలలో పెంచి ఎకరానికి 2000 గ్రబ్స్‌ అంటే పిల్లదశలు లేదా 200 అడల్స్‌ (పెద్ద పెంకు పురుగులు) పొలంలో ఎప్పుడైతే పేనుబంక కనబడుతుందో అప్పుడు వదిలినట్లయితే అవి పేనుబంకతోపాటు అనేక రకాల రసంపీల్చే పురుగులు మరియు అనేకరకాల పురుగుల గుడ్లు నివారిస్తాయి. 

కాక్సినెల్లా సుప్టమ్‌ పంక్టేటా : 

ఇది రెక్కలపై 7 మచ్చలు కలిగి ఉండి పైన చెప్పిన విధంగా సమర్థవంతంగా పనిచేస్తుంది.

కాక్సినెల్లా ట్రాన్స్‌వర్సాలిస్‌ : 

ఇది అడ్డచారలు కలిగి పై వాటి వలె పనిచేస్తుంది.

క్రిప్టోలిమస్‌ మాంట్రోజరి : 

దీన్ని మిలీబగ్‌ అంటే పిండినల్లిని తినేపురుగుని కూడా అంటారు. భారతదేశంలో పెరుగుతున్న పిండినల్లి సమస్యను గుర్తించి ఆస్ట్రేలియా దేశం నుండి తెప్పించుకొన్నాము. ఇది అన్నిపంటలపై ఆశించే పిండినల్లి మరియు పొలుసుపురుగులను సమర్థంగా నిరోదిస్తుంది. ఎక్కువగా ద్రాక్ష రైతులు దీన్ని కొనుగోలు చేసి ఎకరానికి 600 పెద్దపురుగులను ఎగుమతి లక్ష్యంగా పెంచే ద్రాక్షతోటల్లో విడుదల చేస్తున్నారు. 

గుమ్మడిపై ఆశించే పిండినల్లిపై వీటి గ్రబ్స్‌ను పెంచుకొని పెద్దపురుగులను నేరుగా పిండినల్లి ఉన్న మొక్కపై 5-10 విడుదల చేసుకోవచ్చు. ఒక మొక్కపై ఉన్న పిండినల్లిని సమూలంగా తిన్న తరువాత అవి మరొక మొక్కకు చేసి పిండినల్లిని ఆరగించడం మొదలుపెడతాయి. వీటి యొక్క గ్రబ్స్‌ దశ పిండినల్లిని ఆరగించడం మొదలుపెడతాయి. వీటి యొక్క గ్రబ్స్‌ దశ పిండినల్లితో కలసిపోయి గుర్తించడం కష్టమౌతుంది. కాని ప్రతిరోజూ అవి కొంచెం కొంచెంగా పిండినల్లిని నిర్మూలించడం తేలికగా గుర్తించవచ్చు. ఇవేకాక అనేక కాక్సినెల్లిడ్స్‌ రైతుల పొలాల్లో నిరంతరంగా హానికారక కీటకాలను వేటాడుతూనే ఉంటాయి. కనుక వాటిని గుర్తించడం అభ్యసించాలి. 

ఈగజాతి మిత్రపురుగులు : 

ఈగజాతికి చెందిన ఎన్నో మిత్రపురుగుల పిల్ల దశలో అనేక రకాలైన కీటకాలను ఆహారంగా స్వీకరిస్తాయి. సాధారణంగా వీటి వయోజన దశలు చిన్న ఈగ వలె ఉండి పువ్వుల నుండి మకరందాన్ని, పుప్పొడిని ఆహారంగా స్వీకరిస్తాయి. లేడాబర్ట్‌ బీటిల్స్‌ తక్కువగా ఉన్న చోట్ల పేనుబంక, తామర పురుగులు మరియు పొలుసు పురుగులను ఆరగిస్తూ ఇవి కనిపిస్తాయి. వీటిలో ముఖ్యమైనవి. ¬వర్‌ ఫ్లై, రోబర్‌ ఫ్లై, లాంగ్‌ లెగెడ్‌ ఫ్లై, అఫిడ్‌ ఫ్లై, డ్రోసోఫిలిడ్‌ ఫ్లై వీటిలో రోబర్‌ ఫ్లై యొక్క పిల్లదశ మరియు ఈగ దశ రెండూ కూడా కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. డ్రోసోఫిలిడ్‌ ఫ్లై పిండినల్లి, పేనుబంక వంటి వాటిని నిర్మూలిస్తుంది.

నల్లి జాతికి చెందిన మిత్ర పురుగులు : 

మైన్యూట్‌ పైరేట్‌ బగ్‌ యొక్క పిల్ల మరియు వయోజన దశలు తామర పురుగులు, నల్లులు, పేనుబంక, పొలుసు పురుగులు, చిన్న గొంగళి పురుగులు మరియు అనేక పురుగుల గుడ్లను ఆరగిస్తాయి. ప్లాంట్‌ బగ్‌ను సాధారణంగా పాలిహౌస్‌ల్లో పెంచే వంగ, టమాట, తీగజాతి పంటల్లో తెల్లదోమ, పేనుబంక మరియు తామరపురుగులను నియంత్రించడానికి వాడతారు. 

స్టింక్‌ బగ్‌ : 

ఇవి దుర్గందం కలిగి ఉంటాయి. ఇవి గొంగళి పురుగులను ప్రదానంగా మరియు దోమలు, పెంకుపురుగుల పిల్ల దశలను ఆహారంగా స్వీకరిస్తాయి. 

అస్సాసిన్‌ బగ్స్‌ / రెడూ విడ్‌ బగ్స్‌ : 

ఇవి మనకు సాధారణంగా పొలాల్లో కనిపించే మిత్రపురుగులు. ఇవి అనేక రకాల పురుగులను సంహరిస్తాయి. ఇవి వాటి యొక్క పొడవాటి మూతని పురుగుల యొక్క శరీరంలోకి చొప్పించి వాటి యొక్క రసాన్ని పీల్చడం ద్వారా పురుగులను సంహరిస్తాయి.

గొల్ల బామ : 

ఇవి అనేక రకాల పురుగులు అనగా రెక్కల పురుగులు, మిడతలు, దోమలు, జిట్టలు వంటి వాటిని ఆహారంగా తీసుకొని పంటను కాపాడతాయి.

అల్లిక రెక్కల పురుగులు : 

ఈ పురుగు యొక్క పిల్ల దశలు పత్తి, పొగాకు మరియు అనేక రకాల పండ్ల మొక్కల్లో తెల్లదోమ, పేనుబంక మరియు గొంగళి పురుగులను నియంత్రించడానికి ఉపయోగపడతాయి. ఇవి గొంగళి పురుగుల గుడ్లను ఆహారంగా స్వీకరించి పచ్చపురుగు, లద్దెపురుగు, కత్తెర పురుగు, గులాబి రంగు పురుగు వంటి అనేక గొంగళి పురుగుల నుండి పంటను కాపాడతాయి. వీటిని ప్రయోగశాలలో తుట్టు పురుగు యొక్క గుడ్లపై పెంచి ఎకరానికి 4 వేల ప్లి పురుగులను పొలంలో విడుదల చేసినచో సమగ్రసస్యరక్షణలో భాగమవుతాయి.

ఈ అల్లిక రెక్కల పురుగులు పెరిగి పద్దవైన తరువాత వివిధ రంగులు సంతరించుకుంటాయి. ఆకుపచ్చ రంగు అల్లిక రెక్కల పురుగు గుడ్లు సన్నటి కాడలు కలిగి ఉండి తేలికగా గుర్తుపట్టవచ్చు. ఈ రెక్కల పురుగులు మొక్కల మకరందాన్ని ఆహారంగా స్వీకరించి గుడ్లు పెడతాయి. ఈ గుడ్ల నుండి వచ్చే పిల్ల పురుగులు మాత్రం అనేక రకాల పురుగులు మరియు వాటి గుడ్లను ఆహారంగా స్వీకరిస్తాయి. గోధుమ రంగులో ఉండే అల్లిక రెక్కలు పెరుగుట కొంచెం పెద్ద సైజు కలిగి ఉండి పండ్లతోటల్లో మొక్కకు 10-20 పిల్ల పురుగులను వదిలిన అవి అనేక పురుగులను సమర్ధవంతంగా నివారిస్తాయి. 

డ్రాగన్‌ ఫ్లై తూనిగజాతికి చెందిన డ్రాగన్‌ ఫ్లై మరియు డామ్సల్‌ ఫ్లై మొక్క పిల్ల దశలు నీటిలో ఉండే దోమల పిల్ల దశలను, చిన్న చేపలను, కప్ప పిల్లలను ఆహారంగా స్వీకరించి తూనీగలుగా రూపాంతరం చెందుతాయి. ఈ తూనీగలు గాలిలో ఎగురుతూ అనేక గొంగళిపురుగుల రెక్కల దశలను మరియు అనేక రకాల ఎగిరే పురుగులను ఆహారంగా స్వీకరించి మొక్కలను కాపాడతాయి. 

కీచురాళ్ళు (క్రికెట్స్‌) : 

ఇవి అనేక రకాల పురుగులను తినడమే కాక చనిపోయిన జంతు కళేబరాలను కూడా స్వీకరించి పర్యావరణాన్ని శుభ్రపరుస్తాయి. ఇవి వరిపొలాల్లో చనిపోయిన పురుగులను, మిడత గుడ్లను, గొంగళి మరియు రెక్కల పురుగుల కోశస్థ దశలను తిని ఎంతో ఉపయోగపడతాయి. 

పైన చెప్పినవే కాక అనేక రకాల మిత్ర పురుగులు నిరంతరంగా పంటలకు హాని చేసే కీటకాల గుడ్లను, పిల్లదశలను, కోశస్థ దశలను మరియు రెక్కల దశలను ఆహారంగా స్వీకరిస్తూ పంటను సంరక్షిస్తూ ఉంటాయి. ఈ మిత్ర పురుగులే కాక సాలీళ్ళు కూడా రైతులకు ఎంతో ఉపయోగపడతాయి. 

సాలీళ్ళు : 

సాలెపురుగులు హానికారక కీటకాలను వేటాడి తింటాయి. సాలెపురుగులు ఎక్కువగా ఉన్న లేదా విడుదల చేసిన చేలలో కీటకాల జనాభా గణనీయంగా తగ్గిందని శాస్త్రీయంగా నిరూపించబడినది. వరి మరియు అనేక రకాల ఉద్యానవన పంటలు ముఖ్యంగా ఐపిఎల్‌ పండ్ల తోటల్లో వీటిని గణనీయంగా ఉపయోగించారు. సమగ్ర సస్యరక్షణ కొరకు ఈ సాలెపురుగులను సంరక్షించాల్సిన అవసరం ఎంతో ఉంది. పొలాల్లో సాలెపురుగల రక్షణ కొరకు కొన్ని మొక్కలను పెంచడం, సాలీడు గుడ్లను సేకరించి సంరక్షించి చిన్న పిల్లలుగా మారిన తరువాత పొలంలో వదలడం వీటికి ఆశ్రయం ఇవ్వడం కొరకు తేమగా ఉండే మల్చింగ్‌ ఏర్పాటు చేయడం ద్వారా పొలాల్లో వీటి జనాభాను పెంచవచ్చు. ఈ విధంగా సంరక్షంచిన పొలాల్లో సాలెపురుగుల జనాభా పెరిగి అవి పంటలను అనేక రకాల కీటకాలు, దోమపోటు, చీడపీడల నుండి కాపాడతాయి. రైతులు తమ పొలాల్లోనే ఉండి ఎంతో మేలు చేసే మిత్రపురుగుల గురించి క్షుణంగా తెలుసుకొని వాటి సంరక్షణ మరియు వృద్ధి వంటి చర్యలు చేపట్టాలి. మిత్ర పురుగు సమృద్ధిగా ఉన్న పొలాల్లో సహజంగానే చీడపీడలు తక్కువగా ఉంటాయి కనుక ఇవి మానవాళికి మరియు పర్యావరణానికి రక్షక కవచాలుగా ఉపయోగపడుతున్నాయి. 
 

రచయిత సమాచారం

ఈడ్పుగంటి శ్రీలత, జాతీయ మొక్కల ఆరోగ్య యాజమాన్య సంస్థ, రాజేంద్రనగర్‌, ఫోన్‌ : 9010327879.