Print this page..

శాస్త్రీయ పద్ధతిలో లిల్లీపూల సాగు

లిల్లీ లేదా నేల సంపంగిని ఇంగ్లీష్‌లో ట్యూబ్‌రోజ్‌, హిందీలో రజనీ గంధ అంటారు. మన దేశంలో పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లలో ఎక్కువగా సాగులో ఉంది. మనరాష్ట్రంలో పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలో సాగుచేస్తున్నారు. పొడవైన కాడలపై తెల్లని సువాసనభరితమైన పూలు ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. వీటిని కట్‌ ఫ్లవర్స్‌గా, విడిపూలుగా, పుష్ప గుచ్చాల తయారీలోనూ ఎక్కువగా వాడతారు. పూవుల నుండి తీసిన నూనెను సుగంధ పరిమళాల తయారీలో వాడతారు.

రకాలు :

పూరేకుల వరుసలను బట్టి సింగిల్స్‌ (ఒక వరుస) సెమీ డబుల్స్‌ (రెండు వరుసలు ), డబుల్స్‌ (రెండు కన్నా ఎక్కువ వరుసలు) అనే రకాలు ఉంటాయి.

 సింగిల్స్‌ : ఉదా : హైదరాబాద్‌ సింగిల్‌, కలకత్తా సింగిల్‌, ప్రజ్వల్‌, శ్రింగార్‌

సెమిడబుల్‌ : అర్క నిరంతర

డబుల్‌ : వైభవ్‌, సువాసిసి, హైదరాబాద్‌ డబుల్‌ ఆకుల అంచుకు ఉండే రంగును బట్టి వేరిగేటెడ్‌ రకాలు కూడా ఉన్నాయి.

రాజ్‌తారేఖ : ఆకుల అంచుల వెంబడి వెండి రంగు చార ఉంటుంది

స్వర్ణ రేఖ : ఆకుల అంచుల వెంబడి బంగారు చార ఉంటుంది

సింగిల్స్‌ రకాలను నూనెల తయారీకి, విడిపూల కొరకు, డబుల్స్‌ రకాలను పుష్పగుచ్చాల తయారీకి, అలంకరణకు వాడుతారు.

వాతావరణం : 

ఇది సమశీతోష్ణ మండల పంట. ఈ పంటకు అధిక ఉష్ణోగ్రత మరియు అతి తక్కువ ఉష్ణోగ్రత రెండూ అనుకూలం కాదు. సూర్యరశ్మి సమృదిద్దగా ఉండాలి. నీడ ఎక్కువగా ఉంటే పూల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా తక్కువ అలాగే 40 డగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా ఎక్కువగా ఉండకూడదు.

నేలలు : 

లీల్లీ సాగుకు అన్ని రకముల నేలలు అనుకూలం. తేలికపాటి ఇసుకతో కూడిన ఒండ్రుమట్టి నేలలు బాగా అనుకూలం. మురుగు నీటి పారుదల వ్యవస్థ ఉండి సేంద్రీయ పదార్థం ఎక్కువగా ఉన్న చౌడు నేలలు కూడా అనుకూలం.

ప్రవర్ధనం : 

దీన్ని దుంపల ద్వారా, విత్తనం ద్వారా ప్రవర్ధనం చేయవచ్చు. కొత్త రకాల వంగడాలను తయారు చేయడానికి మాత్రమే విత్తనాల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. దుంపలకు నిద్రావస్థ ఉండదు. భూమిలో నుండి తీసిన 4-5 వారాల తరువాత నాటుకోవడానికి ఉపయోగించవచ్చు. వాణిజ్య సరళిలో దుంపల ద్వారా మాత్రమే చేస్తారు. 

దుంపలు నాటే సమయం :

మన రాష్ట్రంలో జూలైలో నాటడానికి అనుకూలంగా ఉంటుంది. సెప్టెంబరు తరువాత నాటితే తక్కువ ఉష్ణోగ్రతలవల్ల పంట పెరుగుదల తగ్గి పూల దిగుబడి తగ్గిపోతుంది. 

ప్రధాన పొలంలో నాటడం : 

నాటే ముందు 30-40 సెం.మీ లోతు వరకు దుక్కి చేసి బాగా చివికిన పశువుల ఎరువును ఎకరాకు 10 టన్నుల చొప్పున వేసి బాగా కలియదున్నాలి. నాటే విధానాన్ని బట్టి బోదెలను తయారు చేయడం కాని లేక మడులను తయారు చేయడం కాని నిర్ణయించుకోవాలి. 3-4 సెం.మీ పరిమాణం ఉన్న దుంపలను 6-10 సెం.మీ లోతులో నాటుకోవాలి. నాటేముందు ఏదైనా శిలీంద్ర నాశనులతో విత్తనశుద్ధి చేసుకోవాలి. ఉద్యాన విశ్వవిద్యాలయం వారి పరిశోధనల ప్రకారం సమతుల నారుమడులలో దిగుబడి ఎక్కువగా రావడం గమనించారు.  దుంపలను లోతుగా నాటినట్లయితే పువ్వుకాడ ఆలస్యంగా వస్తుంది.

నాటే దూరం : 

వరుసల మధ్య దూరం 30-20 సెం.మీ., వరుసలోని మొక్కల మధ్య దూరం 20-10 సెం.మీ ఉండేలా చూసుకోవాలి.

ఎరువులు : 

నేల స్వభావాన్ని బట్టి ఎరువుల మోతాదు నిర్ణయించుకోవాలి. సాధారణంగా 80 కిలోల నత్రజని, భాస్వరం, పొటాష్‌లను సిఫార్సు చేయడమైంది. మొత్తం భాస్వరం, పోటాష్‌, 1/3వంతు నత్రజనిని ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. మిగిలిన నత్రజనిని రెండు సమభాగాలుగా చేసి మొక్కనాటిన 60 రోజులు, 90 రోజుల తర్వాత పైపాటుగా అందించాలి.

నీటి యాజమాన్యం : 

దుంపలు నాటిన తరువాత తేలికపాటి తడి ఇవ్వాలి. ఆ తరువాత నిర్ణీత వ్యవధిలో అవసరాన్ని బట్టి నీటి తడులు ఇస్తూ ఉండాలి. మురుగు నీటి వ్యవస్థ సరిగా లేనట్లయితే దుంపకుళ్లు వస్తుంది. సాధారణంగా వేసవిలో 5-6 రోజుల వ్యవధిలో, శీతాకాలం అయితే 10-12 రోజుల వ్యవధిలో నీటి తడి ఇవ్వాలి.

పూలకోత : 

దుంపలు నాటిన 80-100 రోజుల తరువాత పూలు కోతకు వస్తాయి. విడిపూలు కొరకు అయితే కొద్దిగా విచ్చుకున్న పూలను కోసి వెదురు బుట్టలలో ఉంచి మార్కెట్‌కు సరఫరా చేస్తారు. సుగంధ తైలం కొరకు అయితే పూర్తి విచ్చుకున్న పూలను ఉదయం 9గం||లోపే కోసి తరలించాలి. కట్‌ఫ్లవర్స్‌ కొరకు పువ్వుల గెలలో అడుగు భాగంలో ఉన్న ఒకటి లేక రెండు పూవులు విచ్చుకున్న తరువాత కాడను కత్తిరించాలి.

దిగుబడి : 

ఎకరాకు సింగిల్‌ రకాలలో 20-25 క్వింటాళు, డబుల్‌ రకాలలో 1.0 - 1.2 లక్షల పూవుల కాడలు దిగుబడి వస్తుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా రెండవ సంవత్సరంలో కార్శి పంట నుండి కూడా మంచి దిగుబడులు పొందవచ్చు.

రసం పీల్చు పురుగులు :

లిల్లీపూలను తామర పురుగులు, పేనుబంక పురుగులు ఆశిస్తాయి. వీటి నివారణకు డైమిథోయేట్‌ 2 మి.లీ. లేదా క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మొగ్గ తొలుచు పురుగులు : 

వీటి నివారణకు క్వినాల్‌ఫాస్‌ 2 మి.లీ. లేదా కార్బరిల్‌ 3 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

నిమటోడ్స్‌ :

ఫ్యూరడాన్‌ గుళికలు ఎకరానికి 8-10 కిలోలు భూమిలో తడి వున్నపుడు వేసి వీటిని నివారించవచ్చు.

కాండం కుళ్ళు, పూమొగ్గ కుళ్లు :

కార్బండిజిమ్‌ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.


 

రచయిత సమాచారం

డా||యు. పావని (రీసెర్చ్‌ అసోసియేట్‌),  డా|| ఎ. శ్రీనివాస్‌  (ప్రోగ్రాం కో-ఆర్డినేటర్‌),  వి. గోవర్ధనరావు (ఎస్‌ఎంఎస్‌),  డి. మౌనిక (రీసెర్చ్‌ అసోసియేట్‌),  జ్యోతిస్వరూప వడ్లమూడి (రీసెర్చ్‌ అసోసియేట్‌),  కృషి విజ్ఞాన కేంద్రం పందిరిమామిడి.