Print this page..

కోళ్ళ సంవత్సరికపు పంచాంగం/క్యాలెండరు

సంవత్సరం పొడవునా వివిధ మాసాల్లో కోళ్ళను పెంచుకునే రైతులు ఆచరించవలసిన పద్ధతులు నెలవారీగా కింద పేర్కొనబడ్డాయి. కోళ్ళ పోషక రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాలకు, పరిస్థితులకు అనుకూలంగా పాటించగలరు మరియు ముందు జాగ్రత్తలు తీసుకుని ఆర్థికముగా నష్టము రాకుండా చుసుకోనగలరు.

జనవరి :డిసెంబరులో తగ్గిన బ్రాయిలర్ ధరలు, గుడ్ల ధరలు ఈ నెలలో బాగా పెరుగుతాయి. బ్రాయిలర్ కోడి పిల్లలు, లేయర్ కోడి పిల్లల ధరలు తక్కువగా ఉంటాయి. పైగా వెంటనే లభిస్తాయి. అందుకని కోడి పిల్లలను తెచ్చి పెంపకం చేపడితే బ్రాయిలర్ కోళ్ళు ఫిబ్రవరిలో కోతకు తయారయి మంచి రేట్లోస్తాయి. గుడ్లకు కూడా ఇప్పుడు గిరాకి బాగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు మొదలగు వాటిలో భోజనాలకిస్తున్న స్కాలర్షిప్పులను పెంచాయి. దాని ప్రకారం మెనూను కూడా మార్చి కోడి మాంసం, గుడ్ల వినియోగాన్ని పెంచాయి. వీటి కనుగుణంగా కోళ్ళ పరిశ్రమ రంగం ఉత్పత్తుల్ని పెంచాల్సిన అవసరం ఉంది. అందుకిది అనువైన సమయం. గుడ్ల కోళ్ళతో ప్రారంభించటానికి జనవరి నుంచి ఏప్రిల్ వరకు మంచి సమయం. ఇలా చేస్తే, రాబోయే శీతాకాలంలో గుడ్లుబాగా వచ్చి అధిక ధరలతో లాభాలొస్తాయి.

ఫిబ్రవరి : ఫిబ్రవరి మాసంలో కూడా చలి ఎక్కువగా ఉంటుంది. చలి నుంచి కోళ్ళను, కోడి పిల్లలను రక్షించాలి. కొందరు గోనెపట్టాలు, తడికలు షెడ్ల పక్క కట్టారు. ఇది మంచి పద్దతే. అయితే షెడ్లలో గాలి, వెలుతురు లేకుండా చేయరాదు. గుడ్లు పెట్టే కోళ్ళను ప్రారంభించడానికి, అలాగే కొత్తగా గుడ్లు పెట్టే కోళ్ళ ఫారం పెట్టేవారికి, కోడి పిల్లలను తీసుకురావటానికిది మంచి సమయం. అలా అయితే రాబోయే చలికాలంలో గుడ్లు ఎక్కువగా వచ్చి, అప్పుడుండే గిరాకి వలన లాభాలెక్కువగా వస్తాయి. కోళ్ళలో షెడ్యూలు ప్రకారం వివిధ రోగ నిరోధక టీకాలు వేయించడం ముఖ్యం.

మార్చి : ఇప్పుడు కోళ్ళ పరిశ్రమ రైతుల నుండి పరిశ్రమదారుల చేతులలోకి వెళ్ళింది. అందువలన కోళ్ళ ఫారాల్లో కోళ్ళు వేలు, లక్షల సంఖ్యలో ఉంటున్నాయి. ఇలాంటి పెద్ద ఫారాలే కోళ్ళ పరిశ్రమలో అప్పుడప్పుడూ వచ్చే మేత ధరలలో పెరుగుదల, బ్రాయిలర్ కోళ్ళు, గుడ్ల ధరలలో తగ్గుదలను తట్టుకుని లాభాలు గడిస్తున్నాయి. చిన్న సంఖ్యలో కోళ్ళను పెంచేవారు వీటిని తట్టుకోలేక ఫారాన్ని మూసివేస్తున్నారు. ఇదేగాక పిల్లల్నుత్పత్తి చేసే హెచరీ కంపెనీలు కొన్ని వెర్టికల్ ఇంటెగ్రేటెడ్ పద్దతిలో కోళ్ళ పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నాయి. దీంట్లో కోడి పిల్లల సరఫరా నుండి బ్రాయిలర్ కోళ్ళ అమ్మకం వరకు, అలాగే లేయర్ కోళ్ళలో గుడ్ల సేకరణ, అమ్మకం, రోగాలకు టీకాలు వేయుట, ముక్కులు కత్తిరించుట, దాణా సరఫరా మొదలగునవన్నీ ఈ కంపెనీలే నిర్వహిస్తాయి. ఈ పద్ధతి ఇటు కోడి పిల్లల సరఫరా కంపెనీలకు, అటు కోళ్ళ పెంపకదారులకూ లాభదాయకమే.

ఏప్రిల్ : ఈ నెలలో ఎండవేడిమి ఎక్కువగా ఉంటుంది. షెడ్డులో చల్లదనానికి షెడ్డుపై స్ప్రింక్లర్లనమర్చటం, షెడ్డు పక్కల గోనెపట్టాలు, తడికెలు కట్టి నీళ్ళు చల్లడం, షెడ్డు లోపల ఫ్యాన్లు, కూలర్లు మొదలగునవి అమర్చటం చేయాలి. పరిశుభ్రమైన నీరు ఎల్లవేళలా లభ్యమయ్యేలా అమర్చాలి. మేతలో విటమిన్లు, ఖనిజలవణాలు సరిపడా ఉండాలి. వేడి వాతావరణంలో కోళ్ళ పెరుగుదల, గుడ్ల ఉత్పత్తి తగ్గుతాయి. దీనితోపాటు వినియోగదారుల నుండి గిరాకి తగ్గి బ్రాయిలర్, గుడ్ల ధరలు కూడా తగ్గుతాయి. కోళ్ళ షెడ్డులో పారిశుద్ధ్యం చాలా ముఖ్యం. లేదా కోళ్ళు వ్యాధులకు లోనయ్యే అవకాశముంది.

మే : మే నెలలో వేడి ఎక్కువగా ఉంటుంది. వడగాలులు కూడా వీస్తాయి. వీటి నుంచి కోళ్ళకు రక్షణ ఆవశ్యకం. వడ దెబ్బకు ఒక్కొక్కసారి కోళ్ళు పెద్ద సంఖ్యలో మరణిస్తుంటాయి. కొందరు ఫ్యాన్లు, కూలర్లే గాక ఎయిర్ కండిషనింగ్ గూడా చేయిస్తున్నారు. ఇలాంటి పద్ధతుల్లో మేలైన కోళ్ళు, గుడ్లు ఉత్పత్తయ్యి ఎగుమతులకవకాశాలు గూడా ఉంటాయి. అలాగే లాభదాయకమైన కోళ్ళ పరిశ్రమలో యంత్రాల వినియోగం తప్పనిసరి. మేత సరఫరా, నీటి సరఫరా, గుడ్ల సేకరణ మొదలగునవన్నీ యంత్రాలతో చేస్తే నాణ్యమైన ఉత్పత్తులు రావడమే కాకుండా, కూలి ఖర్చులు తగ్గి, ఉత్పత్తి ఖర్చులు తగ్గుతాయి. అయితే యాంత్రీకరణకు మొదట్లో పెట్టుబడి ఖర్చు ఎక్కువగా ఉంటుంది. వేసవిలో గుడ్లు త్వరగా చెడిపోతాయి. వెంటనే మార్కెట్టుకు పంపటం, లేదా చల్లని ప్రదేశాల్లో గాని, కోల్డు స్టోరేజిలో గాని నిలువ ఉంచడం చేయాలి.

జూన్ : ఈ నెలలో వర్షాకాలం మొదలవుతుంది. కోళ్ళ షెడ్డులో తేమ లేకుండా చూడాలి. వ్యాధి నిరోధక టీకాలు పశువైద్యులు, కోడి పిల్లల నందించే హ్యచరీల సూచనల మేరకు వేయించాలి. తక్కువ ఖర్చుతో అన్ని పోషకాలు ఉన్న కోళ్ళ మేత తయారీ, వాడకంలో సంబంధిత నిపుణుల సూచనల్ని పాటించాలి. తద్వారా అధిక లాభాల్ని పొందవచ్చు. ఎందుకంటే కోళ్ళ పరిశ్రమలో 70 శాతం ఖర్చు మేతపైనే ఉంటుంది. గ్రామాల్లో రైతులు పెరటి కోళ్ళను పెంచవచ్చు. దీనికి వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ అనే రకాలున్నాయి. మామూలు దేశీయ కోళ్ళు సంవత్సరానికి 80 వరకూ గుడ్లు పెడితే, ఇవి 180 వరకూ గుడ్లు పెట్టాయి. పైగా త్వరగా పెరిగి మాంసానికి కూడా పనికొస్తాయి. రాజేంద్రనగర్లోని కోళ్ళ పరిశోధన సంస్థలు ఈ కోడి పిల్లల్ని అందిస్తున్నాయి.

జూలై : ఈ నెలలో వర్షాలెక్కువగా ఉంటాయి. తుపానులు కూడా వస్తుంటాయి. వీటి నుంచి కోళ్ళ ఫారాల్ని రక్షించాలి. షెడ్లలోకి ఈదురుగాలులు రాకుండా చూడాలి. షెడ్డు చుట్టూ చెట్లుంటే వర్షాకాలంలో ఈదురుగాలుల్ని, చలి కాలంలో చలిగాలుల్ని, వేసవిలో వడగాలుల్ని ఆపుతాయి. వేసవిలో షెడ్డులో చల్లదనాన్ని కల్గిస్తాయి. అలాంటి చెట్లు నాటడానికిది అనువైన సమయం. బ్రాయిలర్ కోడి పిల్లలను బ్యాచీలుగా చేపట్టారు. ఫారం సామర్థ్యాన్ని బట్టి వారానికో, పదిహేను రోజులకో, నెలకో ఒకబ్యాచి ప్రారంభిస్తారు. కోళ్ళన్నింటిని ఒక్కసారే తీసివేసి కొంత విరామమిచ్చి మళ్ళీ బ్యాచి ప్రారంభించడం మంచి యాజమాన్య పద్దతి. గుడ్లు పెట్టే కోళ్ళలో కూడా చాలావరకు ఈ పద్దతినే పాటించాలి.

ఆగస్టు : నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ నుండి సెప్టెంబరు వరకు వర్షాకాలముంటుంది. ఈ కాలంలో వ్యాధుల కవకాశాలెక్కువ. అది గమనించి వ్యాధి నిరోధక చర్యల్ని పశువైద్యులు, కోడి పిల్లల్ని సరఫరా చేసే హ్యాచరీల సూచనల మేర చేపట్టాలి. షెడ్డులోకి వర్షం, తేమ, ఈదురుగాలులు రాకూడదు. లేదా కోళ్ళలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. అవసరమయితే విటమిన్లు, ఖనిజలవణాల్ని పెంచాలి. అలాగే సిసి కెమెరాలను ప్రతిషెడ్డులో ఏర్పాటు చేసి మేనేజరు తన కార్యాలయం నుండి పరిశీలించవచ్చు. అప్పుడు అవసరమైన చర్యలు వెంటనే తీసుకునే వీలుంటుంది. కోళ్ళలో అమ్మకపు ధరలు ఒక పద్ధతి ప్రకారం పెరుగుతాయి. తగ్గుతాయి. వాటిని గమనిస్తూ ఉండాలి. తమిళనాడులో నామక్కల్లోని నెక్ గుడ్ల ధరలు నిర్ణయిస్తుంది. అలాగే తమిళనాడులోని పల్లడం బ్రాయిలర్స్ అసోసియేషన్ బ్రాయిలర్ అమ్మకాల ధరల్ని నిర్ణయిస్తుంది. ఈ ధరలు ఫారం గేటు దగ్గర నుండి వినియోగదారులకు చేరేవరకు వివిధ దశల్లో ఉంటాయి. వీటినే పేపర్ రేట్లు అంటారు. కోళ్ళ ఉత్పత్తిదారులు వీటిని గమనిస్తూ ఉండాలి.

సెప్టెంబరు : ఈ నెలలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. వ్యాధి నిరోధక చర్యలు, షెడ్డులో పారిశుధ్యం, తేమ లేకుండడం చాలా ముఖ్యం. వర్షాకాలంలో బ్రాయిలర్ కోళ్సు, గుడ్ల ధరలు వేసవి కాలంలో లాగా తగ్గకుండా, శీతాకాలంలో లాగా పెరగకుండా ఒకే స్థాయిలో ఉంటాయి. కోళ్ళ ఉత్పత్తిదారులు దాన్ని గమనించి బ్రాయిలర్ బ్యాచీలను చేపట్టడం చేయాలి. గుడ్లు పెట్టే కోళ్ళలో కూడా వాటి దశను బట్టి తగు చర్యలు తీసుకోవాలి. లాభదాయకమైన కోళ్ళ పరిశ్రమకు సరైన యాజమాన్యం అవసరం. అలాగే సంవత్సరం పొడవునా అమలు చేసే ప్రణాళికల్ని ముందే తయారు చేసుకోవాలి. వీలైతే కంప్యూటర్లను అమర్చుకోవాలి. స్థానికంగా లభిస్తున్న పదార్థాలతో తక్కువ ఖర్చుతో దాణా తయారు చేసుకునే వీలు కూడా కంప్యూటర్ల ద్వారా లభిస్తుంది.

అక్టోబరు : ఇప్పుడు కోడి మాంసానికి, కోడిగుడ్లకు గిరాకి బాగా ఉంటుంది. ధరలు పెరిగి, లాభాలెక్కువగా ఉంటాయి. రాబోయే చలికాలంలో వీటికి గిరాకీ పెరిగి, ధరలింకా పెరిగే అవకాశముంది. కోళ్ళ ఫారాలు పెట్టాలనుకునే వాళ్ళకిది మంచి సమయం. ముఖ్యంగా బ్రాయిలర్ కోళ్ళలోను, గుడ్లు, మాంసం కోసం పెరటి కోళ్ళ రకాలైన వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ కోడిపిల్లలతో కోళ్ళ పెంపకం చేపట్టవచ్చు. అలాగే ఇప్పటికే నడుస్తున్న ఫారాల్లో బ్యాచీలను బట్టి బ్రాయిలర్, లేయర్ కోడి పిల్లలను తెచ్చుకోవచ్చు. అవసరమైతే రాబోయే నెలలకు ఇప్పుడే ఆర్డరు ఇచ్చి బుక్ చేసుకోవచ్చు.

నవంబరు : గుడ్లు పెట్టే కోళ్ళలో, కోడిపిల్లలను తేవడానికిది మంచి సమయం. ఇప్పుడు మరణాల శాతం తక్కువగా ఉంటుంది. వేసవికల్లా పెరిగి అప్పటి ఉష్ణోగ్రతకు తట్టుకుంటాయి. అయితే కోడి పిల్లల షెడ్డులో బ్రూడర్లను ఉంచి సరైన వేడి సమకూర్చాలి. మేత కూడా సరైనదివ్వాలి. అప్పుడవి త్వరగా పెరిగి, వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి. బ్రాయిలర్ కోడి పిల్లలను ఇప్పుడు తెస్తే డిసెంబరు, జనవరి నెలల్లో అమ్మకానికొచ్చి మంచి ధర లభిస్తుంది. పైగా అప్పుడు మార్కెట్టులో గిరాకీ కూడా ఎక్కువగా ఉంటుంది. పెరటి కోళ్ళ అయిన వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ కోళ్ళ పెంపకాన్ని ప్రారంభించడానికిది అనువైన సమయం.

డిసెంబరు : నవంబరు ఆఖర్లో బ్రాయిలర్ కోళ్ళ ధరలు బాగా తగ్గుతాయి. కోడి గుడ్ల ధరలు కూడా కొద్దిగా తగ్గుతాయి. అయితే డిసెంబరు ఆఖరు కల్లా ధరలు మళ్ళీ పుంజుకుంటాయి. కానీ ఇలా ప్రతి సంవత్సరం జరగదు. మామూలుగా శీతాకాలమైన డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు ధరలు ఎక్కువగా ఉంటాయి. కోళ్ళలో వ్యాధులు సోకకుండా నిర్ణీత షెడ్యూలు ప్రకారం టీకామందులు వేయించాలి. అలాగే పారిశుద్ధ్యం పాటించాలి. వీటితోపాటు జీవ భద్రత చర్యలు తప్పకుండా తీసుకోవాలి. బర్డ్ ఫ్లూ వ్యాధి కవకాశం లేకుండా చుట్టు పక్కల ఉన్న ఫారాల పరిస్థితి గమనిస్తూ ఉండాలి. ఒక్కోసారి వలస పక్షులు కూడా వచ్చి ఈ వ్యాధిని తెస్తుంటాయి. అలాంటి వాటికి అవకాశం లేకుండా, ఫారం చుట్టూ నీటి నిల్వలు, మేతలభ్యత లేకుండా చేయాలి.

రచయిత సమాచారం

డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాదికారి, కడప.