Print this page..

జన్యుమార్పిడి పంటలు అవసరమే

ప్రపంచ జనాభా 2030 నాటికి 8.5 బిలియన్లు అవుతుందని, 2050 నాటికి 9.7 బిలియన్లు దాటుతుందని అంచనా. మన భారతదేశ పరిస్థితికి వస్తే 135 కోట్ల జనాభాతో చైనాని అధిగమించి అత్యధిక జనాభా కలిగిన దేశంగా నిలుస్తుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి విషయానికి వస్తే 1961వ సంవత్సరంలో 117.7 మిలియన్‌ టన్నుల నుండి 2017 నాటికి 277.4 మిలియన్‌ టన్నులకు పెరిగింది. ఇది 2020 నాటికి 300 మి. టన్నులు దాటాలని అంచనా.

ఈ విధంగా పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుకూలంగా ఆహార పంటలే ముఖ్యంగా వరి, గోధుమ, పప్పు మరియు చిరుధాన్యాల పంటల్లో హరిత విప్లవం ద్వారా పొట్టి మరియు సంకర రకాల రూపకల్పనతో ఉత్పత్తిలో పురోగతిలో సాధించాము. అయినప్పటికీ మన దేశంలో సుమారు 193 మిలియన్‌ జనాభాకు సమీకృత ఆహారం అందని పరిస్థితి. సుమారు 70-80 శాతం మందికి రోజు వారీ శక్తి ఆహారం ద్వారా లభించడం లేదు. 4-7 శాతం మందికి రెండు పూటలా ఆహారం దొరకడంలేదు. 50 శాతం చిన్న పిల్లలకు సమీకృత ఆహారం అందడం లేదు. 30 శాతం నవజాత శిశువులు సరైన బరువుతో పుట్టడంలేదు. 8-10 శాతం గరిణీ స్త్రీలు అనీమియాతో బాధపడుతున్నారు. 50,000 మంది చిన్నారులు సంవత్సరానికి గుడ్డివారవుతున్నారు.

మన దేశంలో వ్యవసాయ రంగ పరిశోధనల్లో ఎంతో ప్రగతి సాధించాము. ఉత్పత్తిలో గణనీయమైన అభివృద్ధి కన్పిస్తుంది. అయినప్పటికీ మన వ్యవసాయం రంగం ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటుంది. ఇప్పటికీ పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలు వర్షాధార వ్యవసాయంలో పురోగతి సాధించవలసి ఉంది. అదేవిధంగా వంగడాల అభివృద్ధిలో కూడా ఇంకా ప్రగతి సాధించాలి. ముఖ్యంగా ప్రధాన పంటల్లో అన్ని చీడపీడలకు అనుకూల పరిస్థితులను తట్టుకునే శక్తి ఉండడంలేదు. వివిధ పంటల్లో పురుగుల ద్వారా 33 శాతం తెగుళ్ళు ఆశించడం ద్వారా 26 శాతం ఇతర కారణాలచే సుమారు 6 శాతం వరకు దిగుబడుల్లో నష్టం వాటిల్లుతుంది. వాతావరణంలో మార్పులు, బెట్ట, వరదలు కూడా దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. జనాభా పెరుగుతుంది కానీ భూమి విస్తీర్ణం పెరగడంలేదు. ఇంకా పైపెచ్చు తగ్గుతోంది కూడా......

అంతేకాకుండా పురుగులు, తెగుళ్ళు మరియు కలుపు నివారణ మందుల విస్తృత వినియోగం ద్వారా పర్యావరణానికి హాని కలుగుతుంది. ఈ పరిస్థితుల్లో జీవ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వ్యవసాయ రంగంలో కొన్ని అవరోధాలను సులువుగా అధిగమించవచ్చు. ఉదాహరణకు : ప్రకృతిలో మనకు కావలసిన జీవ వైవిధ్యం లేనప్పుడు, ఒకవేళ ఉన్నా అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో సహజ పద్ధతిలో జన్యువును ప్రవేశపెట్టలేని పరిస్థితుల్లో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను మొక్కల్లోనికి ప్రవేశపెట్టాల్సిన పరిస్థితుల్లో అంటే నూనెగంజల్లో నూనెనాణ్యత, ధాన్యాలు మరియు పండ్ల నిల్వ, పోషకాలను పెంచడం, నత్రజని స్థిరీకరణ మొదలైనవి.

జీవసాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏ జీవి నుండైనా (మొక్కలు, జంతువులు, బ్యాక్టీరియా, ఫంగస్‌ మొదలైనవి) మనకు కావలసిన జన్యువును గుర్తించి, గ్రహించి మనం అభివృద్ధి చేయవలసిన మొక్క లేక వంగడంలోనికి ప్రవేశపెట్టవచ్చు. ప్రస్తుతం ఈ జీవ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 దేశాల్లో 29 పంటల్లో జన్యుమార్పిడి వంగడాలను రూపొందించారు. ప్రధానంగా 4 రకాల జన్యుమార్పిడి వంగడాలను రూపొందించారు. అవి ఏమిటంటే ..

1. గ్లైఫోసేట్‌ అనే కలుపు నాశినిని తట్టుకునే రకాలు

2. మొక్కల్లోనే పురుగుకు సహజంగా హాని కలుగచేసే పదార్థాలు తయారయ్యే రకాలు

3. పై రెండు లక్షణాలు కలగలిసిన రకాలు

4. వైరస్‌లను తట్టుకునే రకాలు

ముఖ్యంగా సోయాచిక్కుడులో లుపునాశినిని తట్టుకునే రకాలను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో విరివిగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. తరువాతి స్థానంలో మొక్కజొన్న ఉంది. మొక్కజొన్నలో పురుగులను తట్టుకునే శక్తి కలిగిన జన్యుమార్పిడి వంగడాలు రూపొందించారు. అదేవిధంగా ఆవ పంటలో నూనె నాణ్యత, పత్తిలో వివిధ గొంగళి పురుగులను తట్టుకునే జన్యుమార్పిడి రకాలను విడుదల చేశారు.

2017 సంవత్సరం నాటికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 15 శాతం పంట విస్తీర్ణం జన్యు మార్పిడి వంగడాలు ఆక్రమించుకున్నాయి. భారతదేశ విషయానికొస్తే మనదేశం కేవలం జన్యుమార్పిడి ప్రత్తి పంట సాగుకు మాత్రమే విస్తృత పరిశీలన తరువాతే అనుమతి ఇవ్వడం జరిగింది. 2002-03 సంవత్సరాల నుండే మన దేశంలో జన్యుమార్పిడి ప్రత్తిని సాగుచేస్తూ ప్రపంచంలో జన్యు మార్పిడి పంటల విస్తీర్ణంలో 4వ స్థానంలో ఉన్నాము. మన రైతాంగం మోన్‌శాంటో కంపెనీ సాంకేతిక పరిజ్ఞానంతో విడుదల చేయబడిన రకాలను త్వరగా అందిపుచ్చుకున్నారు.

ప్రస్తుతం 99 శాతం పత్తి విస్తీర్ణంలో బిటి రకాలే సాగు చేయబడుతున్నాయి. మన దేశంలో జన్యుమార్పిడి పత్తి రకాల వినియోగం ద్వారా పురుగు మందుల వినియోగంలో గణనీయమైన తగ్గుదల (46-26 శాతం) గమనించడం జరిగింది. పత్తిలో 2002-04 సంవత్సరాలలో 9180 మిలియన్‌ రూపాయలను పురుగు మందుల కొనుగోలుకు వినియోగిస్తే అది బాగా తగ్గి, 2010 నాటికి 1100 మిలియన్‌ రూపాయలుగా నమోదు చేయబడింది. పత్తిలో జీవసాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి జన్యుమార్పిడి వంగడాలను రూపొందించి వినియోగించినప్పటికీ గత 2-3 సంవత్సరాలుగా గులాబీ రంగు కాయ తొలుచు పురుగు ప్రత్తి పంటకు తీవ్రనష్టం కలుగచేస్తోంది. ఇప్పుడు సాగులో ఉన్న బిటి రకాలు ఆశించిన స్థాయిలో పురుగులను నిరోదించలేక పోతున్నాయి. అందువల్ల సరికొత్త బిటి జన్యువులు, ఇతర జన్యువులను గుర్తించి 2-3 కంటే ఎక్కువ జన్యువులను ఒకే రకంలో చొప్పించాలి.

మన భారతదేశంలో సుమారు 30 పరిశోధనా స్థానాలు దాదాపు 20 రకాల పంటలపై వివిధ చీడపీడలను తట్టుకునే జన్యువులను గుర్తించి పంటల్లో ప్రవేశ పెట్టడంపై పరిశోధనలను జరుపుతున్నాయి. తదునుగుణంగా ఆయా పంటల్లో జన్యుమార్పిడి రకం రూపొందించి దాదాపు దశాబ్ధాలు గడచి వివిధ పరీక్షలు / పరిశోధనల్లో నెగ్గి, ఆమోదం పొంది సురక్షితమైన మరియు పోషక విలువలు పెంపొందించి రూపొందించినట్లుగా గుర్తించడం జరిగింది. ఒకవేళ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదం పొంది విడుదల చేయబడినట్లయితే ఆవ పంటలో ధారా - మస్టర్డ్‌ - 11 (డియమ్‌హెచ్‌-11) రకం మన దేశంలో విడుదల చేయబోయే రెండవ జన్యుమార్పిడి పంట మరియు మొదటి ఆహార పంట అవుతుంది.

అదే విధంగా వంగ పంటలో కూడా కాయతొలిచే పురుగును తట్టుకునే జన్యుమార్పిడి రకాలు జిఇఎసి ఆమోదం పొంది భద్రత కారణాల వల్ల విడుదల కాలేదు.

మనదేశంలో జన్యుమార్పిడి పంటలపై అపోహలు/భయాలు :

ముఖ్యంగా జన్యు మార్పిడి ఆహార పంటల ఉత్పత్తుల వినియోగంపై ప్రజల్లో కొన్ని అపోహలు ఉన్నాయి. అవి ముఖ్యంగా వీటిలో వినియోగించే జన్యువుల వల్ల మానవాళికి ఏవైనా ఎలర్జీలు రావచ్చు అని, ఈ జన్యుమార్పిడి పంటలను రూపొందించే క్రమంలో ఉపయోగించే నిరోధక జన్యువులు మన శరీరంలోని జన్యువులతో మార్పు చెంది, రూపాంతరం చెంది హాని కలిగించవచ్చునని, ఈ నూతనంగా చొప్పించిన జన్యువులు ఆహార చక్రంలోకి వస్తాయని, ఈ జన్యుమార్పిడి పంటలు ఇతర దగ్గరలో ఉన్న సాధారణ రకాలతో సంయోగం చెందే అవకాశం ఉండడం మొదలైనవి.

ఆహార జన్యుమార్పిడి పంటల వినియోగానికి అవరోధాలు :

అంతేకాక జన్యుమార్పిడి పంటల వినియోగంపై శాస్త్రవేత్తలకు, పర్యావరణ పరిరక్షకులకు మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. శాస్త్రవేత్తలు కూడా జన్యుమార్పిడి పంటల ఉపయోగాలపై ప్రజలకు సరైన అవగాహన కల్పించలేకపోవడం మరియు రైతుల ఆత్మహత్యలు, జీవాల మరణాలు, పంట నష్టాలపై తప్పుడు నివేదికలు మరియు ప్రచారం కూడా మనదేశంలో జన్యుమార్పిడి పంటల వినియోగానికి అవరోధాలు మారుతున్నాయి.

అవరోధాలు అధిగమించడానికి మరియు క్షేమంగా జన్యుమార్పిడి పంటలు వినియోగించడానికి చర్యలు :

ఆహార చక్రంలో లేని పంటల్లో జన్యమార్పిడి చేయడం ఉదా: వంట చెరకు, ప్రత్తి జాతులు మరియు పశుగ్రాస పంటలు

విదేశాలకు ఎగుమతి చేసే పంటలు అంటే బాసుమతి బియ్యం, సుగంధ ద్రవ్యాలు, తేయాకు మరియు మామిడి మొదలైన పంటల్లో జన్యుమార్పిడి చేయకుండా ఉండడం.

పర పరాగసంపర్కం చేందే పంటల్లో కూడా జన్యుమార్పిడి చేయకుండా ఉండడం.

జన్యు వైవిధ్య ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో ఈ జన్యుమార్పిడి పంటలను ఉపయోగించకపోడం. ఉదా : ఈశాన్య భారత దేశం లోని పర్వత సానువుల్లో వరి, మొక్కజొన్న పంటలకు జీవవైవిధ్యం గుర్తించారు.

భౌగోళిక సూచికలుగా గుర్తించిన ప్రదేశాల్లో కూడా జన్యుమార్పిడి పంటలను సాగుచేయకుండా ఉండడం.

సేంద్రియ వ్యవసాయానికి గుర్తించిన ప్రాంతాల్లో కూడా ఈ పంటలు వినియోగించకుండా ఉండడం.

ఔషధ విలువలు ఉన్న పంటల్లో జన్యుపరమైన మార్పులు చేయకుండా ఉండడం మొదలైనవి.

జన్యుమార్పిడి పంటల మూల్యాంకనం, ఉపయోగాలు మరియు ప్రమాదాల అంచనాలకు ఒక పారదర్శకమైన విధి విధానాలను రూపొందించి అమలు చేయడం చాలా అవసరం. జన్యుమార్పిడి పంటలపై ప్రజలకు, విధానకర్తలకు, ప్రచార సాధనాల వారికి అవగాహన కల్పించి, వీటి ఉపయోగాలు వివరించి సందేహాలు తీర్చాలి.

అంతే కాకుండా ఒక కేంద్రీకృత విధివిధానాల సంస్థను ఏక గవాక్ష విధానంలో పనిచేసే విధంగా ఏర్పాటు చేయడం ద్వారా వ్యవస్తీకృత లోపాలను చాలా వరకు అధిగమించవచ్చు. ఈ సంస్థకు అనుబంధంగా ఒక సమీక్ష / పరిశోధనలను ఏర్పాటు చేసి చట్టపరమైన అధికారాలను కూడా ఇవ్వడం ద్వారా చట్టాలను అతిక్రమించే వారిని గుర్తించి శిక్షించడం సులువవుతుంది.

ఈ విధంగా తగు విధి విధానాలను అనుసరించి జన్యుమార్పిడి పంటలను సాగుచేసుకొని పురోగతి సాధించవచ్చు.

రచయిత సమాచారం

ఎమ్‌. సుధారాణి, ప్రిన్సిపల్‌ సైంటిస్టు, సి.హెచ్‌. రాణి, సైంటిస్టు, వై. సతీష్‌, సీనియర్‌ సైంటిస్టు, డా|| ఎన్‌.వి.వి.ఎస్‌.డి ప్రసాద్‌, ప్రిన్సిపల్‌ సైంటిస్టు, డా|| ఎస్‌. రత్నకుమారి, లాం, గుంటూరు, ఫోన్‌ : 9849624664