Print this page..

వ్యవసాయ వ్యర్థాల సమర్థ వినియోగం

మన దేశంలో ఏటా 3000 మిలియన్‌ టన్నుల సేంద్రీయ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నట్లు అంచనా. దీనిలో 340 మిలియన్‌ టన్నులు వ్యవసాయ వ్యర్ధాలు. వ్యవసాయ వ్యర్ధాలు రైతుకు అతి చేరువలో ఉచితంగా లభించే సేంద్రీయ సంపద అని చెప్పుకోవచ్చు. పంట అవశేషమంటే మొక్కలో ఉపయోగం లేని భాగం లేదా పంట కోసిన తరువాత మిగిలే మోళ్ళు లేదా చెత్తా, చెదారం అని అర్ధం. కానీ ప్రస్తుత కాలంలో సేంద్రీయ వ్యవసాయానికి పెరుగుతున్న ఆదరణ చూసాక భవిష్యత్తులో పంట అవశేషాలకు, పంట ఉత్పత్తుల కంటే ఎక్కువ డిమాండ్‌ పెరిగేలా ఉంది. అంతేకాకుండా ఈ వ్యవసాయ వ్యర్థాలు భూసార పరిరక్షణకు, సుస్థిర వ్యవసాయానికి మూలాధారం అనడంలో అతిశయోక్తి లేదు.

ఈ మధ్యకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ యాంత్రీకరణ, విపరీతమైన కూలీల కొరత ద్వారా పంట కోత అనంతరం మిగిలిన పంట వ్యర్థాలలో లభించే పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాష్‌ గంధకాలను పొలంలో తగులబెట్టకుండా సేంద్రియ పదార్థంగా ఉపయోగించవచ్చు. సేంద్రీయ ఎరువుల వాడకం తగ్గించి రసాయనిక ఎరువులను ఎక్కువగా వాడడం వల్ల పంట ఉత్పత్తుల నాణ్యత తగ్గడం, చీడపీడల ఉధృతి పెరగడమే కాకుండా నేల, నీరు, వాతావరణ కాలుష్యం కూడా పెరుగుతున్నది. ప్రస్తుతానికి అధిక దిగుబడులు సాధించడమే కాకుండా భవిష్యత్తులో పది కాలాల పాటు నేల భౌతిక, రసాయనిక, జీవ సంబంధమైన వాతావరణాన్ని మార్చకుండా నేల ఆరోగ్యాన్ని, నేల సారాన్ని కాపాడుకోవాలంటే సేంద్రియ పదార్థం ప్రాధాన్యత తెలుసుకోవలసిందే. పంటలు బాగా పండడానికి సారవంతమైన నేల ఉండాలి.

భూసారాన్ని పెంచడం పెద్ద కష్టతరమైన పనికాదు. అప్పటికప్పుడు నత్రజని, భాస్వరం, పొటాష్‌ పోషకాలనందించే రసాయనిక ఎరువులు వేస్తే నేలలో పోషకాల స్థాయి తాత్కాలికంగా పెరుగుతుంది. అంతమాత్రాన అధిక దిగుబడులు సాధించగలం అంటే అది తాత్కాలికం. కొన్ని సంవత్సరాల తరువాత నేల కాలుష్యం జరిగి దిగుబడులు గణనీయంగా తగ్గుతాయి. దీనికి కారణం నేల ఆరోగ్యం క్షీణించడమే. భూసారాన్ని కాపాడుకుంటూ సుస్థిర దిగుబడులు సాధించాలంటే సారవంతమైన నేలతో పాటు దాని భౌతిక, రసాయనిక, జీవసంబంధమైన లక్షణాలు అనుకూలంగా ఉండాలి. ఈ లక్షణాలన్ని అనుకూలంగా ఉండాలంటే నేలలో తగినంత సేంద్రియ పదార్థం ఉండాలి. దీనివల్ల బరువు నేలలు గుల్లబారి వేర్లు బాగా పెరగడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఇసుక నేలలో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధం చేసి నీటిని గ్రహించి ఆ తేమను ఎక్కువ కాలం పట్టి వుంచే శక్తి పెరగడానికి దోహదం చేస్తుంది. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే శక్తిని పెంచుతుంది. నేలకు జీవాన్నిచ్చే సూక్ష్మజీవుల చర్యను పెంచి నేలలోని పోషకాలను మొక్కలు గ్రహించేందుకు తోడ్పడుతుంది.

వర్షాధారిత ప్రాంతంగా చలామణి అవుతున్న కార్వాంగా గ్రామం, తెల్కపల్లి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో లావణ్య అనే మహిళా రైతు తన భర్త రమణ రెడ్డి సహకారంతో వ్యవసాయ వ్యర్థాలను సమర్ధవంతంగా వినియోగించుకొని రసాయనిక వ్యవసాయం నుండి సేంద్రియ వ్యవసాయంకు మారి, అధిక దిగుబడులను సాధించడంతో పాటు తాను పండించిన పంటకు విలువ జోడింపు చేసి ఇతర రైతులకు ఆదర్శప్రాయంగా నిలిచింది. ఈ రైతు 15 సంవత్సరాల క్రిందట రసాయనాల ద్వారా వ్యవసాయం చేసి తీవ్రంగా నష్టాలకు గురై తమ వద్ద గల 10 ఎకరాల పొలాన్ని అమ్ముకోవడం జరిగింది. కాని వ్యవసాయంలో వచ్చిన నష్టంతో బాధపడకుండా వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి కృషి విజ్ఞాన కేంద్రం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం, పాలెం, వ్యవసాయ శాఖ వారి నాన్‌పెస్టిసైడ్‌ మేనేజ్‌మెంట్‌, పొలం బడి కార్యక్రమాలతో పాటు గ్రామ భారతి అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో 2002 నుండి ప్రతి సంవత్సరం ఒక ఎకరాన్ని సేంద్రియ వ్యవసాయంగా మార్చుకొని తనకు గల 30 ఎకరాల పొలంను పూర్తి స్థాయి సేంద్రియ వ్యవసాయ ప్రదర్శనా క్షేత్రంగా మార్చుకున్నారు.

అంతేకాకుండా తాము అమ్ముకున్న 10 ఎకరాల పొలాన్ని తిరిగి 35 లక్షలు వెచ్చించి కొనుగోలు చేయడం జరిగింది. ఈ విధంగా తమకు గల 30 ఎకరాల పొలంలో పత్తి, వరి, మిరప, కంది మరియు అంతర పంటలుగా పెసర, ఆవాలు, ధనియాలు, మెంతులు, గోధుమలు, నువ్వులతో మిశ్రమ వ్యవసాయంగా సాగు చేస్తున్నారు. ఈ సేంద్రియ వ్యవసాయంలోకి మారినప్పుడు మొదటి మూడు సంవత్సరాలు దిగుబడి కొంతవరకు తగ్గినా, తరువాత కాలంలో సమస్యలను అధిగమించారు. అంతే కాకుండా రసాయనిక వ్యవసాయంతో పోల్చినప్పుడు పెట్టుబడి 80 శాతం వరకు తగ్గినా పండిన పంటను వెంటనే అమ్ముకోకుండా సేంద్రియ ఉత్పత్తులుగా విలువ జోడింపు చేసుకొని మంచి లాభాలను గడించారు.

వరి, కంది, మిర్చి, పెసర, ఆవాలు, ధనియాలు, మెంతులు, గోధుమలు, నువ్వులను ప్రాసెసింగ్‌ చేసి సేంద్రియ ఉత్పత్తులను లావణ్య బ్రాండ్‌తో వినియోగదారులకు ప్రత్యక్షంగా అమ్మడం జరిగింది. అదేవిధంగా పత్తిలో తనకు వచ్చిన 180 క్వింటాళ్ళ దిగుబడిని తమిళనాడుకు చెందిన వేవర్స్‌ సోసైటీకి ఎలాంటి మధ్యవర్తులు లేకుండా సేంద్రియ దృవీకరణ ద్వారా తన ప్రత్తిని అమ్మడం జరిగింది.

మిర్చి పంటలో హర్ష అనే దేశీ విత్తన రకాన్ని నాగపూర్‌కు చెందిన రైతు దగ్గర 2 కిలోల మిర్చి తీసుకొని దానిని సొంతంగా విత్తనం తయారు చేసుకొని, విత్తన మార్పిడి చేసి గత 12 సంవత్సరాలుగా అదే విత్తనాన్ని ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ప్రస్తుతం ఎకరాకు 25 నుండి 30 క్వింటాళ్ళ దిగుబడిని సాధించారు. ఈ సంవత్సరం మిర్చిలో విపరీతంగా చీడపీడలు సంక్రమించడంతో వేస్ట్‌ డీకంపోజర్‌ను వాడి పంటను కాపాడుకున్నారు. ఈ వేస్ట్‌ డీకంపోజర్‌ను ట్రైకోడెర్మాతో పాటు డ్రిప్‌, స్ప్రింక్లర్ల ద్వారా నేలకు పంట కాలంలో ఐదు సార్లు ఇవ్వడం జరిగింది.

వ్యర్ధ పదార్థాల నిర్వహణ :

ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాలైన పశువుల పేడ, పశువుల మేత తరువాత తొక్కిన గడ్డి, మల మూత్రాలు, చెత్త వ్యర్థాలు, పశువుల ఎరువు, ఆహారంగా ఉపయోగపడని ఆముదం, వేప, కానుగ పిండి చెక్కలు, కంది పొట్టు, పంట కాలంలో రాలే ఆకులు, భూమిలో మిగిలిపోయే వేర్లు, పంట తీసుకున్న తరువాత మిగిలే మోడులు, కాడలతో పాటు పంట కోసిన అనంతరం లభించే వరిగడ్డి, పత్తి, కంది కట్టెను కంపోస్ట్‌ ఎరువుగా మార్చుకోవడానికి వేస్ట్‌ డీకంపోజర్‌ను వాడటం జరిగింది. వేస్ట్‌ డీకంపోజర్‌ వాడడం వల్ల పంటల నుంచి వచ్చిన ఘన వ్యర్ధ పదార్ధాలను విచ్ఛిన్నం చేసి త్వరితగతిన ఎరువుగా తయారు చేయడానికి ఉపయోగపడింది. పంట ఉత్పత్తుల నుంచి వచ్చిన వ్యర్ధ పదార్థాలను గుంతలలో వేసుకొని మరియు కుప్పలుగా వేసుకొని పంట కోసిన తరువాత మిగిలి ఉన్న కొయ్య కాళ్ళపై వేస్ట్‌ డీకంపోజర్‌ను పిచికారీ చేసి ఎరువుగా మార్చుకోవడం జరిగింది. 200 లీటర్ల వేస్ట్‌ డీకంపోజర్‌ మిశ్రమాన్ని ఒక ఎకరం నేలకి నీటితో పాటుగా పెట్టడం వల్ల నేలలో వానపాములు మరియు పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెందాయి. తరువాత వ్యవసాయ వ్యర్ధాలను పొరలు, పొరలుగా నింపుకుంటూ పేడనీటిని చిలకరిస్తూ గుంత పైవరకు వ్యర్ధాలతో నింపుకోవాలి.

15 రోజుల వరకు నీటిని చిలకరిస్తూ వ్యర్ధాలను పైకి కిందకు తిరగదోడినట్లయితే చాలా వరకు అందులో ఉన్న వేడి బయటకు వెళ్ళి వ్యర్ధాలు పాక్షికంగా కుళ్ళుతాయి. ఒక ఘణ పరిమాణం గల గుంతలో ఒక టన్ను చెత్త పడుతుంది. గుంతపై వరిగడ్డి లేదా గోనెసంచులు పరచి నీటిని చిలకరిస్తూ తేమ వుండేలా చూసుకోవాలి. వ్యర్థాలను బట్టి సుమారు 1-2 నెలల కాలంలో మంచి నాణ్యమైన కంపోస్టు ఎరువు తయారవుతుంది. ఈ ఎరువును తీసుకొని నీడలో ఆరబెట్టి సంచుల్లో నింపుకొని పెట్టుకోవాలి. పూర్తిగా తయారైన కంపోస్టు నల్లగా, తేలికగా ఉంటుంది. ఏ విధమైన చెడు వాసన ఉండదు. వీటిని ఉపయోగించుకొని బెడ్‌లను, వ్యర్థాలను పెంచుకుంటూ ఎక్కువ పరిమాణంలో కంపోస్టు తయారు చేసుకోవడం జరిగింది. ఈ పద్ధతి ద్వారా కంపోస్టు తయారు చేసుకోవడం చాలా సులభం, ఖర్చు కూడా తగ్గుతుంది.

నేల ఉత్పాదకతకు కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. అన్ని రకాల పోషకాలతో పాటు పలు రకాలు ఎంజైమ్‌లు, హార్మోన్లు, అమైనో ఆమ్లాలు తయారై మొక్కలు చురుకుగా పెరగడానికి తోడ్పడతాయి. నేలలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెంది నేల సహజసిద్ధమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది. వేస్ట్‌ డీకంపోజర్‌ను పిచికారీ చేసి వ్యర్ధ పదార్థాలను కాల్చకుండా సులువుగా ఎరువుగా మార్చుకోవడం వల్ల సాగు ఖర్చు తగ్గింది.ఈ పద్ధతిలో ముఖ్యంగా రైతులు గమనించవలసిన విషయమేమిటంటే వేస్ట్‌ డీకంపోజర్‌ను వాడినప్పుడు, కంపోస్టింగ్‌ చేసే ప్రక్రియ కాలం మొత్తం విచ్ఛిన్నకర వ్యర్ధ పదార్థాల్లో తేమ 60 శాతం ఉండునట్లు చూసుకోవాలి.

అంతేకాకుండా అందుబాటులో ఉన్న ఘన, ద్రవవ్యర్ధ పదార్థాలతో జీవామృతం, నీమాస్త్రం, అగ్నాస్త్రం, దశపర్ణ కషాయం, వేప కషాయం, గోబాణం, కలబంద, తులసి కషాయం తయారు చేసుకొని చీడపీడలను తగ్గించుకోవడంతో పాటు నేల సారవంతాన్ని పెంచుకోవడం జరిగింది. ఈ పై రకాల సేంద్రీయ వ్యర్ధాలలో వ్యవసాయ వ్యర్ధాలనేవి రైతులకు అతి చేరువలో సులభంగా లభించే సేంద్రియ సంపద. అయితే వీటిని వివిధ రకాల ఘన, ద్రవ వ్యర్ధ నిర్వహణ పద్ధతుల ద్వారా నాణ్యమైన సేంద్రియ ఎరువును తయారు చేసుకుని మొక్కకు అందించినట్లయితే భూసార పరిరక్షణతో పాటు సుస్థిర వ్యవసాయం సాధ్యమవుతుంది.

మొత్తం పొలంలో తన 3 ఎకరాల వరి పంటలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి ఆర్‌.యన్‌.ఆర్‌ 15048 రకాన్ని సాగు చేయడం ద్వారా ఎకరానికి 43 క్వింటాళ్ళ దిగుబడి సాధించాడు. ఈ వరి ధాన్యాన్ని బియ్యంగా ప్రాసెసింగ్‌ చేసుకొని వినియోగదారులకు క్వింటా బియ్యాన్ని రూ. 5,000/- ప్రత్యక్షంగా అమ్మడం వల్ల రూ. 1,50,000/- ఆదాయం లభించింది. దీనికోసం ఎకరానికైన సాగు మరియు ప్రాసెసింగ్‌ ఖర్చు రూ. 22,000/-

మొత్తం పొలంలో తన 15 ఎకరాల పత్తి పంటలో నాన్‌బిటి సంజీవని రకాన్ని సాగు చేయడం ద్వారా ఎకరానికి 10 క్వింటాళ్ళ దిగుబడి సాధించాడు. ఈ పత్తిని తమిళనాడు మర్చంటైల్‌ సొసైటీకి క్వింటా పత్తిని రూ. 5,000/- ప్రత్యక్షంగా అమ్మడం వల్ల ఎకరానికి రూ. 50,000/- ఆదాయం లభించింది. దీనికోసం ఎకరానికైన సాగు మరియు ప్రాసెసింగ్‌ ఖర్చు రూ. 12,000/-

మొత్తం పొలంలో తన 4 ఎకరాల మిర్చి పంటలో హర్ష రకాన్ని సాగు చేయడం ద్వారా ఎకరానికి 36 క్వింటాళ్ళ దిగుబడి సాధించాడు. క్వింటా మిర్చిని రూ. 20,000/- అమ్మడం వల్ల ఎకరానికి రూ. 7,20,000/- ఆదాయం లభించింది. దీనికోసమైన సాగు ఖర్చు రూ. 18,000/-

మొత్తం పొలంలో తన 4 ఎకరాల కంది పంటలో పి.ఆర్‌.జి 100 రకాన్ని సాగు చేయడం ద్వారా ఎకరానికి 8 క్వింటాళ్ళ దిగుబడి సాధించాడు. ఈ కందిని క్వింటా రూ. 12,000 /- ప్రత్యక్షంగా అమ్మడం వలన ఎకరానికి రూ. 96,000/- ఆదాయం లభించింది. దీనికోసమైన సాగు ఖర్చు రూ. 6,000/-

అంతేకాకుండా మిర్చి పంటలో అంతరపంటలుగా సాగుచేసిన పెసర, మినుము, దనియాలు, నువ్వులు, గోధుమల ద్వారా అదనంగా రూ. 3200 /- ఆదాయం లభించింది. దీనికైన సాగు ఖర్చు రూ. 1,800/-

ఆదాయ, వ్యయాల వివరాలు (సరాసరిన ఒక పంట ఒక ఎకరానికి) :

1. వరి (ఆర్‌.యన్‌.ఆర్‌ 15048)

ఎ) విలువ ఆధారిత ఉత్పత్తుల రూ. 1,50,000/- (5000 క్వి. బియ్యం) ఆదాయం

బి) సాగు, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌ ఖర్చు రూ. 22,000/-

సి) నిఖర ఆదాయం రూ. 1,28,000/-

2. ప్రత్తి (సంజీవని నాన్‌ బి.టి)

ఎ) దిగుబడి (10 క్విం.) ద్వారా ఆదాయం రూ. 50,000/-

బి) సాగు, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌ ఖర్చు రూ. 12,000/-

సి) నిఖర ఆదాయం రూ. 38,000/-

3. మిర్చి (హర్ష రకం)

ఎ) దిగుబడి (36 క్విం.) ద్వారా ఆదాయం రూ. 7,20,000/-

బి) సాగు, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌ ఖర్చు రూ. 18,000/-

సి) నిఖర ఆదాయం రూ. 7,02,000/-

4. కంది (పి.ఆర్‌.జి 100)

ఎ) దిగుబడి (8 క్విం.) ద్వారా ఆదాయం రూ. 96,000/-

బి) సాగు, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌ ఖర్చు రూ. 6,000/-

సి) నిఖర ఆదాయం రూ. 90,000/-

5. అంతర పంటలు

ఎ) దిగుబడి ద్వారా ఆదాయం రూ. 5,000/-

బి) సాగు, ప్రాసెసింగ్‌, ప్యాకేజింగ్‌ ఖర్చు రూ. 1,800/-

సి) నిఖర ఆదాయం రూ. 3,200/-

సేంద్రియ వ్యవసాయం ద్వారా

4 ఎకరాలలో ఆదాయం రూ. 10,21,000/-

ఖర్చులు రూ. 59,800/-

నికర ఆదాయం రూ. 9,61,200/-

ఈ విధంగా కార్వాంగా గ్రామం, తెలకపల్లి మండలం, నాగర్‌కర్నూలు జిల్లాకు చెందిన శ్రీమతి లావణ్య అనే మహిళా రైతు సేంద్రియ వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధిస్తూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

రచయిత సమాచారం

డా|| పి.ప్రశాంత్‌, యం. రాజశేఖర్‌, డా|| యమ్‌. జగన్‌మోహన్‌ రెడ్డి, డా. వి. లక్ష్మీ నారాయణమ్మ కృషి విజ్ఞాన కేంద్రం, నాగర్‌ కర్నూల్‌ మరియు ఎలక్ట్రానిక్‌ వింగ్‌, ఎ.ఆర్‌.ఐ, రాజేంద్రనగర్‌, ఫోన్‌ : 9553153149